పౌర్ణమి నించీ అమావాస్య దాకా - 1

అమెరికాలో బయల్దేరడం కార్తీకపౌర్ణమినాడే బయల్దేరినా, భారతదేశపు గడ్డపై అడుగు పెట్టేటప్పటికి కృష్ణ విదియ వచ్చేసింది. ఒక చేతిలో కేశవరెడ్డి మునెమ్మ, మరో చేతిలో అమిష్ ఓతాఫ్ది వాయుపుత్రాస్ పట్టుకుని విమానమెక్కాను గానీ ఏదీ చదవబుద్ధి కాలేదు. అలాగని నిద్రా పట్టలేదు. ఫ్రంక్ ఫర్టులో దిగేసరికి ఎక్కడి నిస్త్రాణాను. జెడ్ టెర్మినల్లో కాస్త ప్రశాంతంగా ఉన్న ఓ మూల చూసుకుని, నాలుగు సీట్ల మీద కాళ్ళు చాపుకుని హాయిగా ఓ రెండు గంటలు నిద్రపోయాను, సీట్ల మధ్యన కరావలంబనములు పెట్టని ఆ దిజైనరుని మనసులోనే అభినందిస్తూ.

లేచాక అవసరమైన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఓ నాలుగు మైళ్ళు నడిచి బొంబాయి ఫ్లైటు ద్వారాన్ని చేరుకున్నాను. ఆ విమానాశ్రయం వాళ్ళు అటు తిప్పి ఇటు తిప్పి అంత దూరం నడిపించారు గానీ, నేను చేరుకున్న చోటు బయల్దేరిన చోటుకి కూతవేటు దూరంలోనే ఉన్నదని నా అనుమానం. ఎనీవే, కాస్త సేదతీరి ఉండడంతో ఈ సారి ఫ్లైట్లో మూడ్ బానే ఉండి, మునెమ్మ మొత్తమూ, వాయుపుత్రాస్ ఓ వంద పేజీలూ చదివేసి, Planes సినిమా చూశాను. కాస్త కునుకు పట్టిందో లేదు, విమానపు కుదుపుతో బొంబాయిలో దిగామని అర్ధమయింది.

బయటికొచ్చి ఇక సామాన్లకోసం వెయిటింగు. చాలా ఇరుకైన స్థలం, విపరీతమైన రద్దీ. ఈ విషయంలో మాత్రం మనవాళ్ళని బాగు చెయ్యలేం. అదేమి ఆత్రమో అర్ధం కాదు. ఎనీవే. ఆ సామాన్లు అంత తొందరగా ఊడి పడవని అర్ధమయింది. కనీసం అక్కడ ఒక కాఫీ/టీ అమ్మే స్టాలు కూడ లేదు. వాడి పుణ్యమాని కనీసం టయిలెట్ల వసతినిచ్చారు. ఒక మూలగా చతికిల పడి చోద్యం చూస్తున్నా. నా పక్కన ఇంచుమించుగా నా వయసే ఉన్న ఇంకొకాయన చతికిల పడ్డారు. ఇద్దరం పిచ్చాపాటీ కొనసాగించాము. ఆయన ఉద్యోగం నేవీలో. ఐతే, ప్రవృత్తి బాడీ బిల్డింగ్ లో జాతీయ స్థాయి కోచ్. బుడపెస్టులో జరిగిన ఒక అంతర్జాతీయ పోటీకి భారతీయ యువకుల దళాన్ని తీసుకెళ్ళి తిరిగి వస్తున్నారట. అప్పుడు గమనించాను, అతనికి కనుసన్నల్లో మసలుతున్న ఐదారుగురు యువకుల్ని, మంచి అవయస్వ స్ఫుటత్వంతో మెరుస్తున్నారు. మొత్తం ఎనిమిది మెడళ్ళు సాధించారుట. భారత్ లో క్రికెట్ తప్ప ఇంకే క్రీడా రాణించక పోవడమూ, అప్పటికింకా చల్లారని సచిన్ మేనియా, అయినా వివిధ క్రీడల్లో మంచి ప్రతిభని చూపుతున్న నేటి తరపు యువకుల ఆత్మ విశ్వాసమూ - ఇలాంటి విషయాలు ముచ్చటించుకున్నాం కాసేపు.

విమానం దిగి మేం బయటికి వచ్చాక అక్షరాలా రెండు గంటల తరవాత నా సామాన్లు ఊడి పడ్డాయి. ఇంకా ఓ వంద మందిదాకా ప్రయాణికులు వారివారి సామాన్ల కోసం చూస్తున్నారు అప్పటికి. బతుకు జీవుడా అని బయటికి నడిచాను. కస్టంసువారేమీ కష్టపెట్టలేదు. సాధారణ ప్రీపెయిడు టేక్సీ దగ్గర పొడుగాటి క్యూ ఉంది. ఇటుపక్క ప్రైవేటు కంపెనీల కిటికీల దగ్గర క్యూలేదు. మేరులో బుకింగ్ చేశాను. అంతా ఎఫిషియెంట్ గా జరిగింది. డ్రైవరు కుర్రవాడే. యూపీ అబ్బాయి. ఐదేళ్ళుగా బొంబాయిలో టేక్సీ నడుపుతున్నాడట. మాహిం సీ లింక్ అబ్బుర పరిచింది అంత చీకట్లోనూ. నేవీనగర్లో ఒకసారి దారి తప్పాము గానీ, నేవీ గార్డుల పుణ్యమాని త్వరగానే గమ్యస్థానం చేరుకున్నాను. సుమారు 28 కిలో మీటర్ల ప్రయాణానికి సరిగ్గా గంట సమయమూ, వెయ్యి రూపాయల ఖర్చూ అయింది. తెల్లారి అయిదింటికి TIFRలో మా అన్నా వదినల ఫ్లేటుకి చేరుకున్నా. కిటికీలో, అప్పుడప్పుడే తెల్లబడుతున్న ఆకాశంలో అస్తమిస్తున్న కృష్ణవిదియ చంద్రుడు!





మా అన్నయ్య ఓ గిద్దెడు మంచి కాఫీ ఇచ్చాడు. అది చప్పరిస్తూ ఆయనతో ఓ రెండు గంటలు కబుర్లాడి, ఆయన్ని ఐఐటీకి సాగనంపి పడి నాలుగ్గంటలు నిద్రపోయాను.

Comments

సీరియలా? మీ గిద్దెడు కాఫీ వరకు భారత ప్రయాణం బాగనే ఉంది. మరి ఇండియానా మజాకా!
Unknown said…
mee 'karavalambulu' naku bhale navvu teppinchayi.. chudsandi handrests lekapothe yentha baguntundo 'himabala- yeduguru marugujjula' typelo kurchillo nidurabovachunu... :P
Chandu S said…
మీకు గిద్దెడు కాఫీ, మాకు మాత్రం ఈ కాస్తేనా?
నారయణ స్వామి గారు !ఏది ఏమైనా మీకు చక్కటి అనుభూతులు దొంతర్లుగా దొంతర్లుగా వచ్చి ఉంటాయని నాప్రగాడనమ్మకం.....మణి వడ్లమాని
Kottapali said…
అబ్బే వాయిదాలు పెట్టను లేండి, త్వరగానే రాసేస్తాను. అసలే నాకు మతి మరిపు భయం కూడాను.
Anonymous said…
మీరు రాజమండ్రి వెళ్ళారని, అక్కడ ఓ ఏంజీసీ వాళ్ళని అడ్డుపెట్టుకుని ఓ యాభై మంది బుఱ్ఱలు టోకుగా తిన్నారని అభిగ్న వర్గాల బోగట్టా
Vasu said…
బావుంది.

అదే అనుకుంటున్నా ..ఫేస్బుక్ ఫోటోలు సరే, వివరంగా ఎవరెవరిని కలిసారో ఏమేం (సాహితీ చర్చలు) చేసారో ఎప్పుడు పెడతారా అని చూస్తున్నా ..
Ennela said…
బాగు బాగు బహు బాగు ..మీరు 20 డాలర్లు అని లెక్కెయ్యకుండా వెయ్యి రూపాయలన్నారు...హహహహహ్