Ozymandias - ఓజిమాండియస్

ఎప్పుడో అరుదుగా ఎవరో ఒక గొప్పవారి ఆదరణ ఒక్కోసారి మనకి అయాచితంగా అవ్యాజంగా లభిస్తూ ఉంటుంది. అది మనకి గొప్ప ఆనందదాయకమూ అవుతుంది. అట్లాంటిది - ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, సుమారు ఇరవై మంది గొప్ప ప్రతిభావంతులు, సృజనశక్తి చిప్పిల్లే కవిరాజులు, ఛందస్సు మీద పట్టున్న పండితులు, తెలుగుభాషని సదా ఉపాసించే భాషా ప్రేమికులు - ఈ అంతర్జాలంలో ఒకచోట చేరి, నేను ఏమీ చేతకానివాణ్ణయినా అధ్యక్ష పీఠం మీద కూర్చోబెట్టి, తెలుగుతల్లికి ఛందో పద్యకుసుమాలతో పూజచేసే మహదవకాశాన్ని నాకిచ్చి నా నెత్తిన పాలు పోశారు. అప్పట్లో జాలసీమల్లో తీక్ష్ణ సాహిత్య వెలుగుల్ని ప్రసరిస్తూ ఉన్న పొద్దు పత్రిక ఆధ్వర్యంలో ఈ వేడుక పలుమార్లు జరిగింది కానీ, 2009 ఉగాది సందర్భంగా జరిగిన కవి సమ్మేళనం ఇవ్వాళ్ళ ప్రత్యేకంగా గుర్తొచ్చింది.

కొద్ది సేపటి కింద ఫేస్బుక్కులో సాహిత్యం గుంపులో వంకాయల శివరామకృష్ణరావు గారు పి.బి. షెల్లీ కవీంద్రుని ఒజిమాండియాస్ ఖండికని ప్రస్తావించారు. అది చదవగానే, అలనాటి సభలో ఈ ఆంగ్ల పద్యానికి మనవారు చేసిన చక్కటి ఛందోబద్ధమైన అనువాదాలు గుర్తుకొచ్చినాయి. పాత రికార్డులన్నీ వెతికి కాసేపు ఆ తేనె జల్లుల్లో తడిసి వచ్చాను. మీరు కూడా రుచిచూస్తారని  .. 

Ozymandias by PB Shelley

I met a traveler from an antique land
Who said: Two vast and trunkless legs of stone
Stand in the desert. Near them, on the sand,
Half sunk, a shattered visage lies, whose frown
And wrinkled lip, and sneer of cold command,
Tell that its sculptor well those passions read
Which yet survive, stamped on these lifeless things,
The hand that mocked them and the heart that fed; (mocked = imitated, reproduced)
And on the pedestal these words appear:
"My name is Ozymandias, king of kings:
Look on my works, ye Mighty, and despair!"
Nothing beside remains. Round the decay
Of that colossal wreck, boundless and bare
The lone and level sands stretch far away.


ఒక పురాతనదేశ యాత్రికుడు వచ్చి
చెప్పిపోయెను నాకొక చిత్ర కథను:

అది ఒక యెడారి, మధ్యలో కదలలేని
మొండెమూడిన పెను రాతిబండ కాళ్ళు;
ఇసుకలో కూరుకొని ప్రక్కనే పడున్న
శకలిత ప్రతిమ ; మోముపై వికట భృకుటి,
పెదవి చిటిలింపు, తడిలేని మదపు చూపు
బ్రతికియున్నవి నిర్జీవ వస్తుతతితిని
అచ్చు గ్రుద్దిన రీతి నాహాహ! గుండె
లోతులెంతగ చదివెనో! చేతితో వి
డంబనము జేసె మనసార దాని శిల్పి.

చప్రముపయి నిటుల శిలాక్షరములుండె,

"రాజ రాజాధిరాజ, మార్తాండ తేజ
ఓజిమాండియస్ నామధేయుండ నేను
దిక్సమాశ్లిష్ట మద్భుజాదిష్ట సృష్టి
ఇదియె చూడుడు గుండెలు చెదరిపోవ"

చుట్టుప్రక్కల ఏముంది చూచుటకు ? శి
థిలములయిన ఆ  జీర్ణరాశులను జుట్టి
ఒక మహాశూన్య  నిర్జనానంత సుసమ
సైకతస్థలి  దూరాల దాక పరచి

- కామేశ్వర రావు భైరవభట్ల తెలుగు పద్యం


* * *

ప్రాక్కాలదేశాలబాటసారి నొకనిఁ గలసితి నతఁడిట్లు తెలిపె నాకు—
ఖండితోర్ధ్వార్ధమై ఘనవిశాలంబైన పదమాత్రమౌ శిల్పభాగ మొకటి
నిలచె నెడారిలో నికటోర్విపై భిన్నమస్తకం బిసుకచే న్యస్త మొకటి
కర్కశామర్షంపు కర్కమౌ యపహాస భంగాధరభ్రూనివాసమైన

కవళిక లమరము లగుచుఁ గరుగకుండఁ
జెక్కఁబడిన ముఖపు రీతి సెప్పె శిల్పి
రాగభావానుభావానురాగతతుల
గతుల మనసులో మనసుతోఁ గనిన విధము

"ఓజిమాండీయాసు రాజాధిరాజును కనుడు నా కార్యాలఁ ఘనతరములఁ
గని విభ్రమముతోడఁ గనులు పెద్దవి చేసి యాశ్చర్యపడకుంటె నడుగుడయ్య"
యని నమ్మకము గర్వమును తొణికిసలాడఁ పల్కెనా యనినట్లు ఫలకమందుఁ
జెక్కఁబడ్డట్టివై శిలపుటక్కరములు స్పష్టీకరించును ప్రౌఢిమలను

మనిషి కాలప్రకృతిఁ దాటి మసలడనుచుఁ
గేవలానంతసైకతఖిలతలములు
కప్పి కబళించి వేయఁగ ఖ్యాతులన్ని
కాలశైథిల్యగతినొంది కానఁబడవు
 - రాఘవ వాగ్విలాసము

Comments

MaLLee okasaaraa buuvana vijayaanni gurtu chEsinanduku nenarlu adhyakshaa :)
తృష్ణ said…
very nice translation..thanks for sharing.
Rendu anuvaadaalu chaala chakkaga unnayi.panchukunnanduku dhanyavaadaalu
Chandra Latha said…
ధన్యవాదాలు.
మా బడి పద్యాల్లో నాకెంతో ఇష్టమైనదీ ... నా మంచి జ్ఞాపకాల్లో సున్నితమైనదీ...
మీరు ఈ విధాన మరల పచ్చపరిచారు!
కారే రాజులు రాజ్యముల్ బొందరే ఏరీ వారేరీ...
అవునండీ..పోతనంత పురాతనమైనదీ .. షెల్లీ అంత విశ్వవ్యాపితమైనదీ... ఎప్పటికీ మన బుర్రలకెక్కనిదీ...:-)