ఎనార్బరులో ఉండగా ఒక స్నేహితురాలిని డాన్సు క్లాసునించి తీసుకెళ్ళడానికి మొదటిసారి మా గురువుగారింటికి వెళ్ళాను. వారింటి ముందు గదిలో నేర్పిస్తారామె. నేను కారు దిగి ఇంటి వేపు నడుస్తున్నాను. పెద్ద కిటికీ లోంచి క్లాసు కనిపిస్తోంది. ముగ్గురు అమ్మాయిలు (పెద్ద వాళ్ళే, పిల్లలు కారు) మూడు కాలాల్లో ఒక నాట్టడవు చేస్తున్నారు. ఆ దృశ్యం ఎంతో బాగుంది. అక్కడే ఆగిపోయి క్లాసు ముగిసే దాకా ఒక పది నిమిషాలు చూస్తుండి పోయాను. టీచరు గారు క్లాసు ముగించి ఇంటి తలుపు తియ్యగానే, నా మొదటి ప్రశ్న "మీరు పురుషులకి కూడా నేర్పిస్తారా?" .. ఆ క్షణంలో నా వయసూ, ఉద్యోగం, సంఘంలో నా పరువూ, ఇవేవీ నాకు గుర్తు రాలేదు. ఇది నేను చెయ్యలేనేమో అనే సందేహమే కలగలేదు. ఆ తరవాత .. సుమారు ఆరు నెలలకి కలిగింది సందేహం, ఉత్సాహంతో మొదలెట్టాను గానీ, కొనసాగించగలనా అని.
ఆర్నెల్ల తరవాత భయం పుట్టే సంఘటన ఏవిటంటే అలరిప్పు ఎదురైంది. అలరిప్పు సాంప్రదాయ భరతనాట్యంలో మొట్టమొదటి అంశం., మూడు, మూడున్నర నిమిషాలు ఉంటుంది. చూడ్డానికి చాలా సింపుల్‌గా అనిపిస్తుంది కానీ చాలా కష్టమని వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. ఒక మనిషి అలరిప్పు ఎలా చేశారో చూసి ఆ మనిషి నాట్య కౌశలం అంచనా వేసెయ్యొచ్చు. అప్పటిదాకా ఏదో ఆడుతూ పాడుతూ లాగించేశాను, కానీ అలరిప్పుతో ఆ రోజులు చెల్లిపోయాయి. ఇంక ఖచ్చితంగా సాధన చెయ్యక తప్పలేదు. అలా ఒక రెణ్ణెల్లు కష్టపడ్డాను. ప్రతి వారమూ ఇంక మానేస్తా అనుకునే వాణ్ణి. ఆ తరవాత అకస్మాత్తుగా అలరిప్పు చెయ్యడం సులభం ఐపోలేదు గానీ, కష్టపడి సాధన చెయ్యటంలోని ఆనందం అనుభమయ్యింది. అంశం పూర్తి కాగానే రొప్పుతూ కూలబడిపోకుండా అలరిప్పు ఒక మాదిరిగా చెయ్యటానికి నాకు ఆర్నెల్లు పట్టింది. పర్ఫెక్టుగా చెయ్యటం .. పదేళ్ళ తరవాత ఇంకా సాధన చేస్తూనే ఉన్నాను.
మా గురువుగారు మాధవి మార్సియా మై. శ్వేతజాతి అమెరికను దేశస్తురాలు. సుమారు పాతికేళ్ళ వయసులో భారతీయ కళలపట్ల ఆకర్షితురాలై, అనేక కష్టాలకోర్చి చెన్నై చేరుకుని, రుక్మిణీదేవి గారి కళాక్షేత్ర నాట్య విద్యాలయంలో చేరి శిక్షణ పొందారు. అటుపైన మరి కొన్ని సంవత్సరాలు ఆనంది రామచంద్రన్ వంటి సీనియర్ గురువుల వద్ద విద్యకి పదును పెట్టుకున్నారు. సాధారణంగా భారతదేశంలో నాట్యవిద్య నేర్చేవారు పదేళ్ళ వయసు లోపు మొదలు పెడతారు. తాను కూడా పెద్దయినాక నేర్చుకోవడం వల్లనో ఏమో, మా గురువుగారికి పెద్దైన శిష్యులకి నేర్పించడంలో ఒక ప్రత్యేకమైన నేర్పున్నది. అంతకు మించి విపరీతమైన ఓపిక (ఇది బహుశ అందరు నాట్యాచార్యులకీ తప్పనిదేమో). అదేకాక మా గురువుగారు నాకు మంచి స్నేహితులయ్యారు. తన దగ్గిరకి వచ్చే విద్యార్ధులందరికీ ఆమె సరి సమానంగానే ప్రేమాభిమానాలు ఇస్తూ ఉన్నా నేనంటే కొంత ప్రత్యేక అభిమానం ఉందనుకుంటున్నాను. బహుశా ఒక్కణ్ణే మగ విద్యార్ధిని, అందరికంటే వయసులో పెద్దవాణ్ణీ కావటం వల్ల కావచ్చు. ఏదేమైనా, నేను నీరస పడ్డప్పుడు తానే మరి కొంత ఓపిక వహించి, నన్ను ఉత్సాహ పరిచి మళ్ళీ లేపి నిలబెట్టారు. ఒక్క మాట చెప్పాలంటే .. ఆమె నా గురువు కాకపోయి ఉంటే నేను నాట్యంలో ఇంత దూరం కొనసాగే వాణ్ణి కాదేమో. అటువంటి గురువుగారు దొరకటం నా అదృష్టం. అందుకనే కొన్నేళ్ళ కిందట ఏనార్బరు నగరాన్నించి దూరంగా నా నివాసం మారినా, వారానికోసారి రానూపోనూ నూటఇరవై మైళ్ళు ప్రయాణించి మా గురువుగారి దగ్గరే శిష్యరికం కొనసాగిస్తున్నాను. ఇదికాక మా నాట్యాభ్యాసానికి, ప్రదర్శనలకి కుటుంబ సభ్యులు, మిత్రులు ఇచ్చే ప్రోత్సాహం పెట్టని కోట.
కళాకారులకి పంకాలూ విసనకర్రలూ వెర్రి తలలు వేస్తున్న రోజులివి. నిజానికి కళాకారుని ప్రతిభ క్షణికమే. ఒక అంశాన్ని చేసినప్పుడు అప్పుడు రక్తి కట్టిందా లేదా అనేదే ప్రధానం. ఈ పరీక్ష , ఈ అనుభూతి ఎప్పుడూ నిత్యనూతనమే. అందుకని కళాకారుడెప్పుడూ ఈ అంశం, ఈ కళ నా సొంతమేలే అని ఉపేక్ష వహించే వీలులేదు . కళని నిలబెట్టుకోవాలి అంటే నిరంతర సాధన కొనసాగవలసిందే. రెండేళ్ళు సాధన చేసి శంకరాభరణం వర్ణాన్ని అలవరచుకున్నాను. అచ్చమైన కళాక్షేత్ర సాంప్రదాయానికి ప్రతీక ఇది. ఎప్పుడో వందేళ్ళ కిందట ఏ మీనాక్షీసుందరం పిళ్ళై గారో రూపొందించిన కోరియోగ్రఫీ. తంజావూర్ బృహదీశ్వరుడు నాయకుడు. రేపు తొలి ప్రదర్శన. చాన్నాళ్ళ తరవాత వేదిక మీద ఆడుతున్నాం. చూద్దాం, ఎన్నాళ్ళు ఆడిస్తాడో!
Comments
ఎంతైనా మిమ్మల్ని మెచ్చుకుని తీరాలి మాష్టారు....
బ్రేక్ ఏ లెగ్ ;)
మీలో ఈ కళ గురించి ఎప్పుడూ చెప్పలేదే!
తెలుగు ఛందస్సులూ, అలంకారాలూ పద్యాలూ, ప్రబంధాలూ వంటివాటిలోనే ఒక ప్రవాసంధ్రునికి ఇంత అభిమానమూ, అభిరుచీనా అని ఆశ్చర్యపోయాము మిమ్మల్ని కలిసినప్పుడు. అటువంటిది నాట్యకళ.. పెద్దయ్యాక నేర్చుకుని ప్రదర్శన ఇచ్చే స్థాయికి ఎదగడం.. కలలో కూడా సంభవమా అనిపిస్తుంది.
ఆ భరతముని ఆశీస్సులు మీకు లభించి, మీ ప్రదర్శన దిగ్విజయంగా జరాగాలని మనసారా కోరుకుంటూ,
భానుమతి మంథా.
మంథా భాఉమతి.
మీ రేపటి ప్రదర్శన విజయవంతం కావాలని, ముందు ముందు మీరెన్నోనృత్య ప్రదర్శనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
తర్వాతరువాత ఇంట్రెస్ట్ పోయింది .
కూచిపూడి కాకుండా భారత నాట్యం నేర్చుకోడానికి ఏదైనా కారణం ఉందా ??
మీ బ్లాగ్ వల్ల ఇన్స్పైర్ అయ్యి, నాట్యం కాకపోయినా , ఒక ఇన్స్ట్రుమెంట్ అయితే మొదలు పెట్టా నేర్చుకోవడం.
మీ నాట్య ప్రదర్శన కి శుభాకంక్షలు .. ఫొటోస్ పెట్టండి ..
i am still in search of a guru :( u got lucky man
విజయవాడ లో హోటెల్ నారాయణ స్వామి రుచి కి , ఈ నారాయణ స్వామి అభిరుచి కి .... వహవ్వా !!
రాంప్రసాద్
Very inspiring post. Thanks a lot for sharing your experiences!
All the Best
Suresh Peddaraju
ఆసక్తి..పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించరు.
మీ ప్రదర్శన ద్విగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాను.
ఇందూ..all the best to you also.
మీ పట్టుదలకి, నాట్యం మీద మీ ఆసక్తికి అభినందనలు.
రేపటి మీ ప్రదర్సన మీకు సంతృప్తి కరం గా, విజయవంత మవాలని ఆకాంక్షిస్తున్నాను.
కొత్తపాళీ కి జయహో.
అన్నట్టు ఇవ్వాళ్టి ప్రదర్శన నా సోలో కాదు, నా తోటి విద్యార్ధులు ఇద్దరు అమ్మాయిలూ, మా గురువుగారూ కూడ చేస్తున్నారు.
ఇంతకు మునుపోసారి చెప్పినట్టు మా ట్రూపుకి ప్రదర్శనల విడియో తీయించుకోవటంలో లక్కు అంతగా పనిచెయ్యడం లేదు. చూద్దాం ఇవాళ ఎలా వస్తుందో.
@ గిరి - నీ పట్టుదల మట్టుకు ఏమైనా సామాన్యమా? పదిమందిలో తెలుగుబ్లాగుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా నిన్నూ, నీ పద్యరచనా ప్రస్థానాన్నీ తల్చుకుంటూ ఉంటాను.
@Vasu - నేర్చుకోడం మొదలు పెట్టినప్పుడు ఇవన్నీ ఆలోచించలేదు. ఈమధ్యన మిత్రులు సంధ్యశ్రీ ఆత్మకూరి ప్రోద్బలంతో కొద్దిగా కూచిపూడి సాధన చేశాను కానీ జోడుగుర్రాల సవారీ అంత మంచిది కాదనిపించింది.
@మధురవాణి - పట్టు విడవకండి. Keep that flame alive.
@ ఇందు - Hope you come to the show today. Am so glad you started dancing again.
మరొక్కసారి అందరికీ మనసారా నెనర్లు.
మీలా వయోపరిమితి లేకుండా నాట్యం నేర్చుకోవడమే ..గొప్ప,అరుదైన విషయం. అభినందనలు.
మీ నృత్య ప్రదర్శన విజయవంతంగా జరగాలని కోరుకుంటూ..
I have known a different facet of you today. I wish you all the best. I am sure you will do it.
with very best regards
Yourself and your other partners in the program of yesterday have done a great performance!
Keep it up
cheers
zilebi.
"చూద్దాం, ఎన్నాళ్ళు ఆడిస్తాడో!"
--- అవును మన పని ఆడటమే....మిగిలిందంతా వాడి పనే... :)
సొంతడబ్బా కొంత భరించవలె మీరు ఇప్పుడు - నలభై దాటాక, అనగా గత మూణ్ణాలుగేళ్ళ నుంచి విపరీతపు బుద్ధులొస్తున్నై నాకైతే!
గ్లాస్ బ్లోయింగ్, ఆర్చరీ, పాటరీ, పెయింటింగు, షూటింగు - ఇలా అన్నిట్లో కాలెట్టేసి విపరీతమైన బిజీగా ఉన్నా.....బ్లాగులో పెయింటింగొక్కటే కనిపిస్తోంది కానీ, మిగిలినవి బోల్డున్నై....
ఘటం, పేరిణి నృత్యం మిగిలిపోయినై - వాటిల్లో కూడా తగ్గ మాష్టారు దొరగ్గానే దూరెయ్యటమే
మాగంటి వంశీమోహన్ - మీ పెయింటింగ్ విశ్వరూపం చూస్తున్నాం కదా. మీలో ముచ్చట గొలిపే విషయం ఏ ప్రక్రియని ఎంచుకున్నా దానిలో 110% లీనమై పని చేస్తుంటారు. అభినందనలు. మిగతా వ్యాపకాలను గురించి కూడ రాయండి మీ అనుభవాలు. ముఖ్యంగా ఆర్చరీ ..
మీ ప్రజ్ఞ బహుముఖీనం.
pedda vallaku mi area lo classical dance nerpataniki hourly entha tisukuntaaru koncham cheptara..
maa pedda paapa ku nerpudaam ani chustunnamu. villu cheppe rate kasta kangaaru puttela untenu.
mimmalni adugudam ani dairyam chestunnanu.
kottapali at gmail dot com