తెలుగు కథల్లో క్లిషేలు - 3 (ఆఖరు)

1990లలోనూ తరవాత కొంతకాలమూ తెలుగు కథల్లో రాజ్యమేలిన మరో టాపిక్ సీమ ఫేక్షనిజం.

నేను చదివిన చాలా కథలు ఫేక్షనిస్టు దగ్గర పని చేసే ఒక ఛోటా అసిస్టెంటు దృష్టి కోణం నించో, లేక పల్లెలో ఉంటున్న చిరుద్యోగి ఎవరో ఒకరు, ఫేక్షనిజంతో నేరుగా సంబంధం లేనివారు (బడి పంతులు, పోస్టు మాస్టరు, ఇత్యాది) అయిన పాత్ర దృష్టి నించో చెప్పినట్టుగా ఉన్నాయి. ఈ కథ చెప్పే పాత్రకి ఫేక్షనిస్టు ఎందుకు ఆ పని చేస్తున్నాడో నిజంగా తెలియదు, బహుళజాతి వాణిజ్య సంస్థలు చేసే రాజకీయ కుట్రలు సాధారణ సొడాబండి మనిషికి అర్ధం కానట్టే. కానీ అర్ధం కాని వాడు కానట్టు ఉండడు కదా. అతని సిద్ధాంతాలేవో అతనికి ఉంటాయి. ఆ సిద్ధాంతాల్లో ఫేక్షనిస్టుకి ఒక నిర్దిష్ట స్వరూపం ఉంటుంది. వర్మ సినిమాల్లో కనిపించే మాఫియా బాస్కీ ఈ ఫేక్షనిస్టు స్వరూపానికీ ఆట్టే తేడా కనబడదు. అట్లా మూసపోసినట్టుగా ఉంటాయి ఈ పాత్రలు. ఇక మిగతా కథ అంతా చచ్చిపోతున్న, చంపబడుతున్న అమాయకులైన ఫేక్షను సైనికుల గురించి ఆరాటమే, నాశనమైపోతున్న పల్లె శాంతి గురించే.

అసలు నిజం ఏవిటంటే సీమలో ఫేక్షను యుద్ధాలు యుగాలనుంచీ ఉన్నాయి. గడియారం రామకృష్ణశర్మగారి ఆత్మకథలో తెలుస్తుంది. పరమశ్రోత్రియమైన వారి పండిత కుటుంబము కూడా 20వ శతాబ్ది తొలిరోజుల్లో ఈ ఎడతగని యుద్ధాల్లో ఒక పాత్రగా ఉండి ఆ నిమిత్తమై ప్రత్యేకంగా సైనికుల్ని పోషిస్తూ ఉండేవారని. అంటే ఇది కొత్తగా చొచ్చుకు వచ్చిన ఘటన కాదు, గ్లోబలైజేషన్ లాగా. ఐతే కొత్తగా జరుగుతున్నదేమిటంటే, ఒక మోస్తరుగా ఇవి ప్రస్తుత సమకాలీన రాజకీయాలకి ఒక అంతర్భాగంగా తయారయినాయి. ఐతే కథ రాసేవారికి ఆయా పార్టీల చారిత్రక నేపథ్యం గానీ, వారివారి స్వంత వ్యక్తిత్వ బలాలు (వాళ్ళూ మనుషులే కదా) - బలహీనతలుగాని తెలియవు. నేరుగా దాన్ని సమకాలీన రాజకీయ నేపథ్యంలో నిలిపి బేరీజు వేసి ప్రశ్నించే ఆలోచనకానీ ధైర్యం కానీ ఉన్నట్టు కనబడదు. అంచేత ఆ కథలూ ఆ పాత్రలూ ఒక నేపథ్యంలేని వేక్యూములో ఆధారం లేని కీలుబొమ్మల్లా వేళ్ళాడుతుంటాయి.

చివరిగా సాఫ్టువేరు జీవితాలు.
ఒక పక్క సరళ ఆర్ధిక విధానాలు, మరొక పక్క మన (అప్ప్పటి) హైటెక్కు ముఖ్యమంత్రి, ఇంకోపక్క పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన బీపీవో కంపెనీలు, వాటి నీడనే మొలిచిన వందలకొద్దీ ఇంజనీరింగ్ కాలేజీలు. ఇవన్నీ కలిసి మన సమాజంలో ఒక కొత్త వర్గాన్ని సృష్టించాయి. అదే సాఫ్టువేరు వర్గం. మన మధ్యతరగతికి అప్పటి వరకూ ఆర్ధిక లక్ష్యం - కుదిరితే ఒక గవర్నమెంటుద్యోగం, అది కుదరకపోతే కనీసం ఒక బేంకుద్యోగం - ఈ రెంటిలో ఏదో ఒకటి వస్తే జీవితం సెటిలయినట్టే. ఇంజనీరింగు, మెడిసిన్ వంటి వృత్తి విద్యలమీద మనవారి దృష్టి ఎక్కువగా ఉండేది కాదు. ఎంత పెద్దదైనా ప్రవేటు కంపెనీలో ఉద్యోగం అంటే అది అస్థిరత్వానికి చిహ్నంగా ఉండేది.

90లలో ఈ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పెద్ద ఆఫీసరుకి నెలజీతం పదిహేను - ఇరవైవేలు ఉండగా, సాఫ్టువేరు, బీపీవో కంపెనీల్లో మొదలు జీతమే ముప్ఫై వేలు, అనుభవజ్ఞులకి లక్ష దాకా నెలజీతం. ఈ పరిణామం అనేక విధాలుగా మన సామాజిక సౌధాన్ని కుదిపేసింది. ఎట్లాగైనా సరే ఆ సాఫ్టువేరు పల్లకీ ఎక్కెయ్యాలనే యువత ఆశయం ఒక పక్కన. నా కొడుకు/కూతురు/అల్లుడు/కోడలు ఈ రంగంలో స్థిరపడితే ఈ జన్మకి ఒక లాటరీ తగిలినట్టే అని భావించే మధ్యతరగతి తల్లిదండ్రుల ఆశా ఇంకో పక్కన. ఈ వ్యాపార వొరవడిని పూర్తిగా వొంట పట్టించుకోకుండానే మరో బిల్ గేట్స్ అయిపోదామని ఉరకలెత్తే నయా పెట్టుబడిదారుల దురాశ ఒక పక్కన. వెల్లివిరుస్తున్న ఈ వ్యక్తి ఆదాయగంగాప్రవాహాన్ని ఎట్లాగైనా సరే తమ గల్లాపెట్టేల్లోకి మళ్ళించాలని వ్యాపార భగీరథుల కన్సూమరిస్టిక్ జింగోయిజం మరొక పక్కన. ఇన్ని మాటలెందుకు, ఒక్క దెబ్బతో మధ్యతరగతి స్వరూపమే మారిపోయింది - పనిమనిషికిచ్చే జీతం దగ్గిర్నించి, పిల్లలు చదివే స్కూలునించి, నడిపే కారు, ఏడాదేడాది తీసుకునే వెకేషన్ స్పాటు వరకూ.

సాఫ్టువేరు జీవితం అంటే మితిమీరిన డబ్బు. డబ్బెక్కువ అయ్యేప్పటికి కోరికలెక్కువ కావడం. ఓ ఆస్తులు పోగు చెయ్యడం. తల్లిదండ్రుల్ని పట్టించుకోక పోవడం. భార్యాభర్తల మధ్యలో పొరపొచ్చాలు, కుటుంబ వ్యవస్థ ఛిద్రం కావడం. యువత పట్టపగ్గాలు లేకుండా పబ్బుల్లో పడి తాగి తందనాలాడ్డం - మొత్తానికి సాఫ్టువేరు జీవితాల చిత్రణ ఎలా ఉంటుందంటే, ఎడ్గర్ ఏలెన్ పో కథ ఒకటుందిలే. అందులో హీరో విలాసవంతమైన జీవితం కోసం తన ఆత్మని సైతానుకి తాకట్టు పెడతాడు. అలాగే, ఈ సాఫ్టువేరు పాత్రలు పైకి ఎన్ని భోగాలు అనుభవిస్తున్నట్టు కనిపిస్తున్నా లోలోపల తమ ఆత్మల్ని సాఫ్టువేరనే సైతానుకి అమ్ముకున్న వాళ్ళే - వీళ్ళు శాశ్వతంగా సుఖంగా వుండలేరు - అనేలాంటి శాపంతో కూడిన తీర్మానం ఒకటి కనిపిస్తూంటుంది. అంతే తప్ప మంచేవిటి, చెడేవిటి, ఈ రెండిట్లో ఏది జరిగినా దానికి వెనక ఉన్న సామాజిక, ఆర్ధిక, రాజకీయ మూలాలేవిటి - ఏది వ్యక్తిగతం, ఏది సంస్థాగతం - ఇటువంటి వివేచన కానీ విశ్లేషణకానీ కనబడదు. ఒక విధంగా అభ్యుదయవాదం, అభ్యుదయభావం అంటే డబ్బుండడాన్ని వ్యతిరేకించడం లాగా కనబడుతోంది. చేతులో కొంచెం డబ్బు ఆడుతోంది, కాస్త భోగాన్ని అనుభవిస్తున్నారు ఎవరైనా అంటే, వాళ్ళు కచ్చితంగా ఏదో ఒక నైతిక పతనానికి దారితీసే వాళ్ళో, లేక ఏదో తెలీని దుఖంతో లోలోపల కుమిలిపోయేవాళ్ళు అయుండాల్సిందే. ఈ నేపథ్యంలోనే పనిలో పనిగా తరాల అంతరాల్ని చిత్రించడం కూడా బాగా కనిపిస్తోంది. కథలో ఒక రిటైరైన వర్గం (తాత), నడివయసు వర్గం (తండ్రి), యువవర్గం (కొడుకు). కథ రాసే రచయిత నడివయసు వర్గానికి చెంది ఉంటాడు. దాంతో ఎప్పుడూ యువవర్గానికి న్యాయం జరిగినట్టు నాకైతే అనిపించలేదు, పాత్ర చిత్రణలో, నిజాయితీలో. ఎప్పుడూ ఈ వర్గం స్వార్ధ పూరితమైనదిగానూ, పెద్దవారి పట్ల వినయమూ ప్రేమా లేనిదిగానూ, చిత్రించబడుతూ వస్తున్నది.

నేను ఈ మూడు వ్యాసాలూ ఎందుకు రాశాను అని కొందరు మిత్రులు (ఆప్యాయంగానే) ప్రశ్నించారు. ఈ వ్యాసాలు చదివి కథలు రాస్తున్నవారు తమ పద్ధతుల్ని మార్చేసుకుంటారని నాకేమీ భ్రమలేదు. కానీ బ్లాగరులలో సాహిత్యం పట్ల కొత్త ఇష్టాన్ని అభివృద్ధి చేసుకుంటున్న రచయితలూ పాఠకులూ చాలా మంది కనిపిస్తున్నారు. ముఖ్యంగా యువతీయువకులు - తమ కథల్ని తామే రాసుకుంటున్నారు. కొత్తపుంతలు తొక్కుతున్నారు. వారికోసమే నేనీ వ్యాసాలు రాశాను. మూడు నాలుగు కొత్త మోడలు సెల్ ఫోనులు మార్కెట్లోకి వచ్చినాయంటే, మన స్నేహితులు పదిమందీ ఒకానొక మోడలుని సిఫారసు చేస్తే మన మనసు కూడా దానివేపే మొగ్గుతుంది. అలాగే సాహిత్యరంగంలో కూడా, ఇవ్వాళ్టి ట్రెండు ఇదే, ఇవే అభ్యుదయ రచనలు అని శాసించే శక్తులు కొన్ని ఉన్నాయి. (ఎప్పుడూ ఉంటాయి కూడా. అవి ఉండడం సమస్య కాదు.) కానీ ఆ ట్రెండ్సుని గుడ్డిగా నమ్మేయడం కాకుండా, మనం చదివేది ఎలా చదువుతున్నాం, రాసేది ఎందుకు రాస్తున్నాం అని జనాలు ఆలోచిస్తారనే ఆశతో, ఆ ఆలోచన రగల్చడానికి చిన్న వత్తిలాగా ఈ వ్యాసాలు ఉపయోగపడతాయనే ఆశతో ఇవి రాశాను.
***

నేను ఉదహరించిన క్లిషేలని ధిక్కరిస్తూ వచ్చిన కొన్ని మంచి కథలు గుర్తొచ్చాయి ఈ వ్యాసం రాస్తుండగానే. వాటి జాబితా ఇదిగో:

ప్రయోగం - వోల్గా
వివాహాన్ని గురించి, స్త్రీ పురుష సంబంధాల్ని గురించి స్పష్టమైన అభిప్రాయాలున్న యువతి కథ. దీన్నించి పురుషులు, స్త్రీలు కూడా నేర్చుకోవలసింది చాలా ఉంది.

జ్ఞాతం - వివినమూర్తి
తరాల అంతరాలు, సాఫ్టువేరు జీవితాలు, అభ్యుదయం-స్వార్ధం ఘర్షణ - వీటన్నిటి మధ్య నలుగుతున్న నాలుగు జీవితాలు .. సంక్లిష్టమైన సమీకరణాల్ని ఆర్ద్రతతో చర్చించిన మంచి కథ

వీరనారి - సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి
ఫేక్షనిజం నేపథ్యంలో అమరవీరుని భార్య వీరపత్ని, మళ్ళీ తన కొడుకుని వీరుణ్ణి చేసి అదే (తనదికాని) యుద్ధానికి బలి చేసి వీరమాతగా ఎదగాలనే వత్తిడిని ధిక్కరించిన వీరనారి కథ.

టైటానిక్ - సురేష్ బాబు
సరళ ఆర్ధిక విధానాలు ఎలా క్రమబద్ధంగా లీగల్‌గా ఒక పెద్ద ప్రభుత్వ కంపెనీని ముంచేశాయి అని మంచి శిల్పంతో చిత్రించిన కథ.

గేటెడ్ కమ్యూనిటీ - అక్కిరాజు భట్టిప్రోలు
ఇరవయ్యేళ్ల తరవాత కలుసుకున్న బాల్య మిత్రుల మధ్య తెరుచుకోని గేటు- వారి ఆర్ధిక స్థితిలోని తేడా.

Comments

చాలా బావుందండీ. ప్రతీ వ్యాసంలోనూ ఒక్కో మెరుపు రాస్తూ వచ్చారు. ఈ వ్యాసంలో నాకు కనిపించిన మెరుపు సాఫ్ట్వేర్ కథల గురించి రాసినది.

బావుంది...మీ వ్యాసావళి, దాని వెనుకున్న ఉద్దేశమూనూ!
Indian Minerva said…
"చేతులో కొంచెం డబ్బు ఆడుతోంది, కాస్త భోగాన్ని అనుభవిస్తున్నారు ఎవరైనా అంటే, వాళ్ళు కచ్చితంగా ఏదో ఒక నైతిక పతనానికి దారితీసే వాళ్ళో, లేక ఏదో తెలీని దుఖంతో లోలోపల కుమిలిపోయేవాళ్ళు అయుండాల్సిందే"

నిజమేనండోయ్. ఇదంతా రచయిత ఎవర్నో ఓదార్చడానికి ఇంకెవర్నో un-popular చెయ్యడంలో భాగం.

ఆ ఎడ్గారు గారి కధపేరుకూడా చెప్పేద్దురూ. కుదిరినప్పుడు చదువుతాం కదా.
ఇదీ, దీని ముందరి రెండు వ్యాసాలూ కూడా చదివేను.వర్తమాన కథ గురించి ఇంత పదునైన విశ్లేషణ ఇటీవలి కాలంలో ఎవరూ చేయ లేదు.
Anonymous said…
తెలుగు కథల్లో క్లిషేల గురించిన మీ పరిశీలన ఆసక్తికరంగా ఉంది.

కానీ నాకో చిన్న సందేహం. 90ల తొలినాళ్ళ వరకూ వచ్చిన కథల్లో అలాంటి పరిస్థితి ఉన్నా అనంతర కాలంలో తెలుగు కథ కొంచెమయినా మెరుగు పడలేడంటారా? నిజానికి 90ల తర్వాత నేను పెద్దగా చదివినదేదీ లేదు.. అందువల్ల నా ప్రశ్న అజ్ఞాన పూర్వకం కూడా,.. కానీ మరీ మీరు చెప్పినంత భయంకరంగా ఉందా అని...!

నవలల్లో ఫిక్షన్ రచయితల హవా నడిచినా... కథల్లో వామపక్ష భావజాల రచయితల ఆధిక్యమే నేటికీ కొనసాగుతోందనిపిస్తుంది నాకు, అందుకే ఇతివృత్తాల్లో వైవిధ్యం వచ్చినా ఆయా సమస్యలను పరిశీలించే దృక్పధాల్లో విస్తృతి పెరగలేదేమో అనుకుంటా.

మరొక్క విషయం... సెజ్‌లు కానీయండి, పారిశ్రామిక విధానం కానీయండి, సాఫ్ట్‌వేర్ కానీయండి... ప్రభుత్వాల విధానాలు సాధారణ ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్నవి చాలా తక్కువ. అలాంటప్పుడు ఇలాంటి క్లిషేలని సాహిత్యంలో కొంత ఎక్కువే అయినా భరించడంలో తప్పు లేదేమో.

ఆఖరిగా... మీరు చెప్పిన క్లిషేలను అధిగమించిన కొన్ని రచనలు అని కోట్ చేశారు చూశారూ... వోల్గా, వివినమూర్తి, సన్నపురెడ్డి, అక్కిరాజు... వీళ్ళంతా సుదీర్ఘ కాలం నుంచి పదునుగా రాస్తున్న వాళ్ళే. వాళ్ళ భావ శబలత బలంగా ఉన్నందునే ఆ గాఢతకు కారణం అనుకుంటా.

పైగా... ఆధునిక తెలుగు సమాజంలో సాహిత్యం ప్రాధాన్యత ఎంతకు పడిపోయినదో తెలీనిదేమీ కాదు కదా, సినిమా తప్ప మరో కళా రూపం ఏదయినా బతికే పరిస్థితులున్నాయా. అలాంటప్పుడు నాణ్యత కలిగిన రచనలు ఎడారుల్లో ఒయాసిస్సులే. అందువల్ల... కొంత అసహనం కలిగినా... ఇబ్బంది పడినా... భరించాల్సిందేనేమో. ఏమంటారు?
Kottapali said…
ఆ. సౌమ్య, నెనర్లు
Indyan Minerva, I think Poe's story is called "Don't bet the devil your head"
జోగారావు మాస్టారు, అతిశయోక్తికన్నా ఎక్కువైన మాట శలవిచ్చారు. నెనర్లు.
puranapandaphani sai గారు, మీ వ్యాఖ్య చదివి కొంచెం గజిబిజి పడ్డాను. మీరు నన్నేమి ప్రశ్న అడిగారో అర్ధం కాలేదు.
Please let me know if I could clarify any point. Thanks.
Vasu said…
"ఈ సాఫ్టువేరు పాత్రలు పైకి ఎన్ని భోగాలు అనుభవిస్తున్నట్టు కనిపిస్తున్నా లోలోపల తమ ఆత్మల్ని సాఫ్టువేరనే సైతానుకి అమ్ముకున్న వాళ్ళే - వీళ్ళు శాశ్వతంగా సుఖంగా వుండలేరు - అనేలాంటి శాపంతో కూడిన తీర్మానం ఒకటి కనిపిస్తూంటుంది"

Spot on
Vasu said…
గుడ్ వన్ .
గుడ్డుకి ఈక: ఆఖరు క్లిషే కి ఉపోద్ఘాతం ఎక్కువైనట్టుంది అనగా సాఫ్టువేరు జీవితాల కథల కంటే కూడా సాఫ్ట్వేర్ వర్గం ఎలా వచ్చింది అని వివరించడానికి ఎక్కువ రియల్ ఎస్టేట్ కేటాయించారు ..సంపాదకీయం లా :)
Zilebi said…
>>>ఈ వ్యక్తి ఆదాయగంగాప్రవాహాన్ని ఎట్లాగైనా సరే తమ గల్లాపెట్టేల్లోకి మళ్ళించాలని వ్యాపార భగీరథుల కన్సూమరిస్టిక్ జింగోయిజం >>>

చప్పట్లోయ్, చప్పట్లు!

మన బ్లాగ్ లోకం లో బొందలపాటి వారు 'e'యువతరం కి చెందిన వారిలా వున్నారు. ఒక సాఫ్టువేరు ఇంజనీరు కథ ఆంగ్లం లోను, తెలుగు లోను విలక్షం aగా రాసి.(మీరన్న మూస కి విరుద్ధం గా, యువత వైపు నించి రాసి)

మంచి విశ్లేషణ.

చీర్స్
జిలేబి.
తెలుగుయాంకి said…
క్లిషే కత్తుల గాయాలగూర్చి మా బాగా వివరించారు.
Anonymous said…
thank you sir for introducing such a concept with beautiful narration.
మీ బ్లాగ్ కి రావడం ఇదే మొదటిసారి. తెలుగు కథల్లో క్లిషేలు -అన్నీ చదివాను. చాలా బాగా రాసారండి.
గోపి said…

ఈ క్రింది కథల లంకెలు ఎవరి దగ్గర అయినా ఉన్నాయా? వుంటే పంచుకోగలరు..........
-------------------------
ప్రయోగం - వోల్గా
వివాహాన్ని గురించి, స్త్రీ పురుష సంబంధాల్ని గురించి స్పష్టమైన అభిప్రాయాలున్న యువతి కథ. దీన్నించి పురుషులు, స్త్రీలు కూడా నేర్చుకోవలసింది చాలా ఉంది.

జ్ఞాతం - వివినమూర్తి
తరాల అంతరాలు, సాఫ్టువేరు జీవితాలు, అభ్యుదయం-స్వార్ధం ఘర్షణ - వీటన్నిటి మధ్య నలుగుతున్న నాలుగు జీవితాలు .. సంక్లిష్టమైన సమీకరణాల్ని ఆర్ద్రతతో చర్చించిన మంచి కథ

వీరనారి - సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి
ఫేక్షనిజం నేపథ్యంలో అమరవీరుని భార్య వీరపత్ని, మళ్ళీ తన కొడుకుని వీరుణ్ణి చేసి అదే (తనదికాని) యుద్ధానికి బలి చేసి వీరమాతగా ఎదగాలనే వత్తిడిని ధిక్కరించిన వీరనారి కథ.

టైటానిక్ - సురేష్ బాబు
సరళ ఆర్ధిక విధానాలు ఎలా క్రమబద్ధంగా లీగల్‌గా ఒక పెద్ద ప్రభుత్వ కంపెనీని ముంచేశాయి అని మంచి శిల్పంతో చిత్రించిన కథ.

గేటెడ్ కమ్యూనిటీ - అక్కిరాజు భట్టిప్రోలు
ఇరవయ్యేళ్ల తరవాత కలుసుకున్న బాల్య మిత్రుల మధ్య తెరుచుకోని గేటు- వారి ఆర్ధిక స్థితిలోని తేడా.
Anonymous said…
Great article. Another example I can think - all rich people are bad, they try to exploit poor (obviously very good) people.