Subscribe:

Pages

Thursday, January 26, 2012

అలివేణి ఎందు చెయ్‌వు

ఈ టపా తేజస్వి గారి కోసం.

కర్నాటక సంగీతంలో త్రిమూర్తులుగా ప్రసిద్ధికెక్కిన త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రుల వార్ల తరవాత ఎన్నదగిన వాగ్గేయకారుడు స్వాతి తిరునాళ్ అనే బిరుదు కలిగిన కులశేఖర మహారాజు. ఈయన ట్రావంకూరు సంస్థానాధీశుడు. బహు భాషావేత్త. సర్వకళా కోవిదుడు. తమ కులదైవం పద్మనాభస్వామిని ఉద్దేశిస్తూ పద్మనాభ అనే ముద్రతో సంస్కృతంలోనూ, సంస్కృతం మళయాళం రంగరించిన మణిప్రవాళం అనే మిశ్రమభాషలోనూ అనేక కృతులు రచించాడు. హిందుస్తానీ భాషా, సంగీతము బాగా తెలిసినవాడు. హిందీ భాషలో అనేక భజనలూ కృతులూ రచించాడు, హిందుస్తానీ రాగాలని బాగా తన రచనల్లో ఉపయోగించాడు. పైన చెప్పిన త్రిమూర్తులు కృతులు మాత్రమే రాశారు, కానీ ఈయన స్పృశించని సంగీతరచనా ప్రక్రియ లేదేమో - వర్ణం, తిల్లానా, పదం, జావళీ - అన్ని రకాల పాటలనూ రాశాడీయన. కామవర్ధని రాగంలో సారసాక్ష పరిపాలయ, చారుకేశిలో కృపయా పాలయ శౌరే, సింహేంద్రమధ్యమంలో రామరామ గుణసీమ, మాయామాళవగౌళలో దేవదేవ కలయామి - అన్నీ అద్భుతమైన కృతులు, ఆయా రాగాల లోతుల్ని తడిమి రసాన్ని శ్రోతలకందించే చేదలు - కచేరీలలో ప్రధాన అంశంగా విపులంగా పాడేందుకు గాయకులు వీటిని ఎన్నుకుంటూ ఉంటారు. అంతే కాదు, అల్లాటప్పా గాయకులు స్వాతి తిరునాళ్ కృతులని సంబాళించలేరు. గాయకుల మనోధర్మానికీ పటుత్వానికీ గట్టి పరీక్ష పెడతాయి ఈయన కృతులు.

ఐతే ఇవన్నీ ఒకెత్తు. ఆయన రాసిన ఈ చిన్న పదం ఇంకో యెత్తు.

అలివేణి ఎందు చెయ్‌వు హంద జ్ఞానిని, మానిని.
కురంజి రాగం మిశ్రచాపు తాళం
ఇది మణిప్రవాళమనే సంస్కృత మళయాళ మిశ్రమభాష. అంచేత సాహిత్యం నాకు పూర్తిగా అర్ధం కాలేదు. నా ఖర్మకాలి, నాకు అందుబాటులో ఉన్న మళయాళీలెవరూ ఇటువంటి అభిరుచి ఉన్న వారు కాదు. సరే పోనివ్వండి, అయినా పాటలో తగినంత సంస్కృతం ఉన్నది గదా, దాన్నిబట్టి కొంచెం ఎక్స్‌ట్రాపొలేట్ చేసుకుంటే పోలేదా. నాకేమనిపించిందంటే అభిసారిక అయిన నాయిక. తుమ్మెద రెక్కల్లాంటి నల్లటి జుట్టుకలది. అభిమానవతి. అయ్యవారింకా రాలేదు. ఏమిచెయ్యాలో పాలుపోక విరహవేదన పడుతోంది. ఒక పక్కన ఆకాశంలో చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు. ఇంకోపక్కన మలయమారుతం మంద్రంగా వీవెన వీస్తున్నది. కానీ కోమలాంగికి ఇవేమీ పట్టటం లేదు. తన సుందరుడు, త్రిలోక సుందరుడు, సాక్షాత్తు పద్మనాభస్వామే - వస్తున్నాడా అని చెంపకు చారెడేసి కళ్ళేసుకుని ఎదురుచూస్తోంది. ఆయనలేక ఇవన్నీ ఉండి ఏమి ప్రయోజనం? ఆమె భాగ్యవతి. అయ్యవారు వేంచేశారు. సారసాక్షుణ్ణి కూడి కౌగిలిలో కరిగిపోయింది. (ఈ భాష బాగా అర్ధమయిన మిత్రులెవరన్నా సరైన అర్ధం చెబితే బహుబాగు!)

అయిందా, సాహిత్యం సంగతి అది. ఇక సంగీతానికి వస్తే కురంజి రాగం. కురంజి, లేదా కురవంజి అని తమిళదేశంలో ఒక తెగవారు. ఈ జాతి ఆడవారు సోది చెబుతుంటారు. నీలగిరుల (ఊటీ) ప్రాంతంలో సంచార జీవితం గడుపుతుంటారు. బహుశా వారి జానపద సంగీత వాఙ్మయాలనుండి ఈ రాగం ఉద్భవించి ఉండచ్చు. నీలగిరుల్లో పూసే ఓ పువ్వుని కూడా కురింజి అని పిలుస్తారు. ఈ రాగం పెద్దగా ప్రశస్తి కలిగింది కాదు. ఏదో ఒక చిన్నకారు రాగం. చిన్న చిన్న పదాలకీ వాటికీ వాడుతుంటారు. స-ని-స అనే వక్ర ప్రయోగం దీని లక్షణాన్ని సొగసుగా పట్టిస్తుంది. కింది ని దగ్గర్నించి మధ్య ద వరకూ మాత్రమే ఉంటాయి సంచారాలు. అంత ఇరుకైన రాగమన్న మాట, సంచారానికి ప్రస్తారానికి పెద్దగా తావులేదు. కానీ, దాని దుంపతెగ, పాడ్డం మొదలు పెడితే ఎంత సొగసుగా ఉంటుందో. సాహిత్యమంటే నాలుగు పదాలు, సంగీతమంటే ఏడు స్వరాలు, ఆ నాలుక్కీ, ఈ యేడుకీ ఏదో ఒక ముడి వేసేశాం, పాట తయారైపోయింది అన్నట్టు కాకుండా, ఆ సాహిత్యం, ఆ మృదువైన పదాల పొందికలో ఒద్దికగా తొంగి చూస్తున్న ముగ్ధ శృంగారం, ఆ సరసమైన భావం - దానికి తగిన సంగీతం. సంగీత సాహిత్యాలు తమతమ అస్తిత్వాల్ని విడిచి ఆత్మల్లో నించీ గాఢంగా పెనవేసుకున్నట్టుగా. అటుపైన అక్కడ ఉన్న భావం, రసం - ఆ నాయిక ఎలాంటిది, నాయకుడు ఎలాంటివాడు, చుట్టుతా ప్రకృతి ఎలా ఉన్నది, ఆవిడ మనోభావాలెలా ఉన్నాయి, కడకి ఆవిడ ఎలా తనస్వామిలో ఆత్మైక్యమయింది .. ఇదంతా కళ్ళకి కట్టినట్టు, చెవుల ద్వారా మనసు పొరల్లోకి ఇంకేటట్టు ప్రతీ మూర్చన వంపుతోనూ, స్వరాల వరుసల మెలికతోనూ సున్నితంగా నొక్కి చెబుతూ. అదీ రసానుభూతి. అదీ రససిద్ధి.

సంగీత సాహిత్యాల అద్భుతమైన సమ్మేళనం ఈ చిన్న పదం .. అలివేణి ఎందు చెయ్‌వు.


చిత్ర ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గానం సినిమాలో సుశీల అపరిచితమైన గాత్రం కే వీ నారాయణస్వామి, నాకు అభిమాన వెర్షను.

8 comments:

Tejaswi said...

You made my day sir. Thank you, Thank you... Thank you for the post.

Tejaswi said...

స్వామిగారూ, నాకు మాత్రం చిత్రగారి వెర్షనే బాగా నచ్చుతుందండి. చెవుల్లో అమృతం పోసినట్లు ఉంటుంది.

మీరు అపరిచత గాత్రం అనుకుంటున్నది కూడా చిత్రదేనండి. నారాయణస్వామి అనే పేరు చూసి మొదట మీరే పాడారేమోననుకున్నాను. ఈ కేవీ నారాయణస్వామిగారి గురించి నాకు తెలియదు.

మరోసారి ధన్యవాదాలు.

గిరి said...

మహానుభావుడు ఆయన. తెలుగులో కూడా కృతులు వ్రాసారు..

గిరి said...

మణిప్రవాళం అంటే రెండుభాషలు కలిసిన కవిత్వానికి దేనికైనా వర్తిస్తుంది

puranapandaphani said...

మణిప్రవాళం అనేది మిశ్రమ భాష కాదు... అదొక శైలి. మణులూ, ప్రవాళాలూ కలిసినట్టు రెండు భాషల పదాలు కలగలిపి రాసే శైలి. సాధారణంగా ఆ రెంటిలో ఒకటి సంస్కృతం ఉంటుంది.

గిరి said...

చిత్రపాడిన కృత్యారంభంలో వచ్చే వేణునాదం నాపాలి శ్రీరామా ను (త్యాగరాజకృతి, శంకరాభరణరాగం) గుర్తు తేవడంలేదూ. తీరా చూస్తే కురంజికి శంకరాభరణానికి ఉన్న అపత్యానుబంధము తేలింది.

Narayanaswamy S. said...

@గిరి, త్యాగరాజస్వామి అనేక కృతుల్ని సంగీత బోధనకి, కొత్తగా సాధన చేస్తున్న విద్యార్ధులకి అనువుగా ఉండేట్టు రచించారు. సరే ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు, దివ్యనామ సంకీర్తనలు ఉండనే ఉన్నాయి. వీటన్నిటిలో ఆయన సంగీత విశ్వరూపం ప్రదర్శించకుండా బాలరాముడి తప్పటడుగుల్లాంటి ముద్దైన చిన్న చిన్న మూర్చనలతో కూర్చారు. అవును, వొట్టి స్వరాల ప్రకారం చూస్తే కురింజి శంకరాభరణమే, కానీ ఆలాపన చేసినప్పుడు పాడే పద్ధతిలో, ప్రయోగాల్లో చాలా తేడా వస్తుంది. కానీ స్వరాల పొందిక వల్ల పోలికలు మాత్రం కనిపిస్తూనే ఉంటాయి, మన తాతయ్య పోలికలు మన మనవరాలి మొహంలో కనబ్డ్డట్టు.

రాఘవ said...

నారాయణస్వామిగారూ, చిన్న సవరణ... స్వాతి తిరుణాళ్ రామ వర్మ ఆయన పేరు. ఆయన కులశేఖర వంశానికి చెందిన రాజు.