వయోమింగులో ఎల్కుల దర్శనం

వయోమింగ్ రాష్ట్రపు ఆగ్నేయ మూలలో రెందు పెద్ద జాతీయ పార్కులున్నాయి. అందులో చిన్నది టీటాన్ పార్కు. రాకీ పర్వత శ్రేణిలోని ఒక భాగం ఇక్కడ ఉన్నది. పర్వత శిఖరాలు అన్ని కాలాల్లోనూ తలపై మంచుటోపీతో అలరారుతుంటాయి. ఇక చలికాలంలో మంచు కురవడం మొదలైనాక ఆ సొగసు వేరే చెప్పాలా?


దక్షిణాన్నించి జాతీయ రహదారి 189 పట్టుకుని ఉత్తరానికి డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే దారిలో చిన్న చిన్న ఊళ్ళు. ప్రతీ ఊరి మొదట్లోనూ ఒక చిన్న సూచిక - ఊరి పేరు: బాండ్యురాంట్, జనాభా: 72, సముద్రతలానికి ఎత్తు: 7238 అడుగులు. దారిలో మేము చూసిన అతి పెద్ద జనాభా 220 :) గమ్యం కన్నా ప్రయాణమే ముఖ్యం అని వొప్పుకోవటానికి ఈ ప్రయాణం ఒక ప్రబల కారణం. డ్రైవు చేస్తున్నంత సేపూ విండ్ షీల్డులోంచి ప్రకృతి దృశ్యాలు అదేదో జానపద కథలో దుష్ట అప్సరసల్లాగా హొయలు వొలకబోస్తూ మన దృష్టిని రోడ్డు మీదినించి మరల్చెయ్యడానికి శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉంటాయి. కొండలోయల్లో ప్రయాణిస్తున్నప్పుడు గలగలలాడే సెలయేరు మనతోటే పదిమైళ్ళ పాటు పరిగెట్టుకొస్తుంది, విడిచిపెట్టలేని చిన్ననాటి స్నేహితుళ్ళా. దారిలో చాలా చోట్ల - ఇక్కడ జింకలు వస్తాయి, ఇక్కడ ఇతర వన్యమృగాలు రోడ్డు దాటతాయి - లాంటి సూచికలు కనిపించాయిగానీ ఆ చుట్టూపక్కల ఏవిధమైన ప్రాణులూ కనబళ్ళేదు.

జాక్సన్ అనే ఊరు టీటాన్ పార్కుకి అంచున పర్వతశ్రేణి పాదతలంలో లోయలో స్థిరపడింది. ఎటు చూసినా కొన్ని వందల అడుగుల ఎత్తున, మంచుతో నిండిన కొండ శిఖరాలు. దూరంగా ఇంకా గంభీరంగా కనబడే మంచు పర్వత శ్రేణి. ఊరి మధ్యలో కారు పార్కుచేసి, ఒక కాఫీ కొనుక్కుని తాగుతూ పర్యాటక కేంద్రానికి వెళ్ళాం. అది జాతీయ పార్కుల సంస్థ వారు నడుపుతున్నది. టీటాన్ పార్కులో ప్రధానంగా కనబడే అనేక జంతువుల పక్షుల బొమ్మలు నమూనాలు ఉన్నాయి. చాలా సమాచారం కూడా ఉంది. ఐతే మమ్మల్ని ఆకర్షించినది ఎల్క్ జింకల్ని చూడ్డానికి స్లేయ్ ప్రయాణం. వెంటనే టిక్కెట్లు కొనుక్కున్నాం. అక్కడ బాగా చలిగా ఉంటుంది జాగ్రత్త అని వాళ్ళు హెచ్చరించడం మంచిదైంది. కారులోనించి చలినివారణ కవచాలన్నీ తీసి ధరించి తయారయ్యాము.

సమాచార కేంద్రం నించి బస్సులో అక్కడికి సుమారు ఒక మైలు దూరంలో ఉన్న చోటీకి తీసుకు వెళ్ళారు. అక్కడ రెండేసి గుర్రాలు పూంచిన స్లేయ్ బళ్ళు ఉన్నాయి. బండి మన ట్రాక్టర్ల వెనకాల ఉండే ట్రెయిలర్ బండిలా ఉంది. లోపల, రెండు గోడల్ని ఆనుకునీ బెంచీలు ఉన్నాయి. ఒక్కో బండిలోనూ సుమారు ఇరవైమంది పడతారు. మా బండి నిండగానే మా సారధి రయన్ గుర్రాల్ని అదిలించాడు. ఆ గుర్రాలు కవలల్లా ఉన్నాయి. ఎత్తుగా బలిష్ఠంగా, ఒక్కోటీ ఒక్కో చిన్న ఏనుగంత ఉంది. అంత పెద్ద గుర్రాల్ని నేనెప్పుడూ చూళ్ళేదు. ఇరవైమంది మనుషులు ఎక్కిన ఆ స్లేయ్ బండిని సునాయాసంగా లాక్కుపోయాయి.

ఈ ఎడ్వెంచరుకి సరిగ్గా తగినట్టుగా ఉంది వాతావరణం. ఉష్ణోగ్రత సుమారు పది డిగ్రీల ఫారెణీట్. కళ్ళు బైర్లు కమ్మేటంత ప్రకాశంతో వెలుగుతూ భానుడు. గాలి దేవుడు స్థిమితంగా ఉన్నాడు. ఐనా ఊరు దాటి ఆ బయలులోకి పోయేటప్పటికి విపరీతమైన చలి. ముక్కులో తేమకూడా గడ్డకట్టేటంత చలి. బయలులో నేలమీద సుమారు నాలుగైదు అంగుళాల మంచు. మేం బండి ఎక్కిన చోటి నించీ మరీ దూరం వెళ్ళాల్సిన అవసరం లేకపోయింది. సుమారు ఇరవై ముప్పై ఎల్క్ జింకలు కొంతమేర ఎడమెడంగా పరుచుకుని కాళ్ళ మీద పడుకుని ఉన్నాయి. ఇవన్నీ మగ జింకలు. వాటికి ఇంకో వంద గజాల అవతల ఆడ జింకలు, పిల్లల మంద కొంచెం గుమిగూడి ఉన్నది. ఈ లోయ, సుమారు మూడు వేల ఎకరాల స్థలం ఎల్క్ జింకల అభయారణ్యం. ఇవి వేసవిలో ఇంకా బాగా ఉత్తరాదిన ఉంటాయి. చలికాలం బలపడే కొద్దీ దక్షిణానికి వలస వస్తుంటాయి తిండి వెతుక్కుంటూ. ఈ లోయలో ఇక్కడి చుట్టుపక్కల అన్ని ప్రదేశాలకంటే తక్కువ మంచి పడుతుందిట. కొన్ని వేల ఏళ్ళుగా ఈ జింకలు ఈ లోయలోకి చలికాలంలో వలసవస్తున్నాయి. జాతీయ పార్కు సంస్థ ఏర్పడిన నేపథ్యంలో ఈ లోయలోనే ఈ అభయారణ్యాన్ని ఏర్పాటు చేశారు.

మా సారధి రయన్ ఈ జింకల్ని గురించీ, ఈ ప్రాంతపు పర్యావరణ వలయాన్ని గురించీ, ఇక్కడి వన్యప్రాణుల సమతుల్యతని సంరక్షించడానికి వాళ్ళు ఏమేం పనులు చేస్తున్నారో చాలా వివరాలు చెప్పాడు. మగ జింకల మందకి దగ్గరగా స్లేయ్ బండిని నిలిపి ఉంచాడు. పార్కు నియమాల ప్రకారం ఎవరూ బండి దిగడానికి లేదు. అవి వన్యమృగాలే అయినా కొంతవరకూ ఈ స్లెయ్ బళ్ళు చూడ్డానికి అలవాటు పడినట్టున్నాయి బెదిరి పారిపోలేదు. వాటి మానానికి అవి అలా మంచులోనే ముడుచుకుని కూర్చున్నాయి ఆ సూర్యకాంతిలో తపస్సు చేస్తున్న ఋషుల్లాగా. మధ్య మధ్యలో వాటిల్లో ఒకటి లేచి, అటూ ఇటూ పచార్లు చేసి ముందు కాళ్ళతో మంచుని తవ్వి ఆ మంచు అడుగున్న ఉన్న లేత గడ్డిని కొరికి తింటున్నది. మంచుని దాటి పైకి ఉన్న గడ్డి అంతా ఎండిపోయి ఉన్నది. వీటికి ఆ ఎండుగడ్డి పనికిరాదట. ఎంత చలికాలమైనా, ఎంత మంచు పడినా అవి నేల దొరికే దాకా ఆ మంచుని తవ్వి లేత గడ్డినే తింటాయి. ఆ మందకి దగ్గర్లో సుమారు ఒక ఇరవై నిమిషాలు నిలిపి ఉంచాడు బండిని. చాలా ఫొటోలు తీశాను, చలికి వేళ్ళు కొంకర్లు పోతున్నా. గబగబా ఓ నాలుగు ఫొటోలు తియ్యడం, గ్లవ్వులు తొడుక్కుని మళ్ళీ వేళ్ళు వెచ్చబరుచుకోవడం. అక్కణ్ణించి కదిలి ఆ మంద చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి తిరిగి వచ్చాం. దారి పొడుగునా రయన్ ఏవో కబుర్లు చెబుతూనే ఉన్నాడు. స్లేయ్ దిగి, స్లేయ్ తోనూ, గుర్రాలతోనూ ఫొటోలు తీసుకున్నాం. ఇదొక మరపురాని అనుభవం.

మధ్యాన్న భోజనమయ్యాక ఊరు చూడ్డానికి బయల్దేరాం. ఇంతకు మునుపు పడిన మంచు గట్టి పడిపోయి వీధిలో చాలా జాగ్రత్తగా నడవాల్సిన పరిస్థితి. ఊరి మధ్యలో ఒక చిన్న పార్కు. పార్కుకి నాలుగు ప్రవేశ మార్గాల్లోనూ ఒక్కొక్క ఆర్చి. ఆ ఆర్చి దేనితో కట్టారో తెలుసునా - రాలి పడిన ఎల్క్ జింకల కొమ్ములతో! ఊరు చిన్నదే గానీ ఎన్నెన్నో రకరకాల షాపులు. మామూలుగా సావనీర్లు జ్ఞాపికలు అమ్మేవి కొన్ని అయితే, అద్భుతమైన కళాఖండాలు ప్రదర్శించి అమ్మే గేలరీలు చాలా ఉన్నాయి. ఒక గేలరీలో పోతపోసిన కంచు బొమ్మలు - కదం తొక్కుతున్న గుర్రం మీద విధినిర్వహణకి బయల్దేరిన షెరిఫ్ బొమ్మ - ఎంత అద్భుతంగా ఉన్నదో. అలా ఒక డజను షాపులు గేలరీలు చూసేప్పటికి నాలుగయింది. కొండల మధ్య ప్రదేశం కదా, సూర్యుడస్తమించాడు. చలి చిక్కబడింది. కారెక్కి తిరుగు ముఖం పట్టాము.

ఆ కొండదారిని తిరిగొస్తుంటే - పొద్దున్న వచ్చిన దారే కదా, కానీ వ్యతిరేక దిశలో వెళ్తూ ఉంటే, అందులోనూ అస్తమిస్తూన్న సూర్యుడితో దోబూచులాడుతూ - సరికొత్త అందాలు. కనబడుతూన్న చిన్న ఊళ్ళు - పొద్దున వచ్చిన దారి ఇదే - అని ధృవపరుస్తున్నా, కళ్ళ ముందు పరుచుకున్న ప్రకృతి దృశ్యాలు మాత్రం పూర్తిగా వేరే దృశ్యాన్ని చూస్తున్న అనుభూతిని కలిగించాయి.