కందిరీగలు కలగాపులగం

పుస్తకాలు ఓ వ్యసనం. కొనడమూ, చదవడమూ, రెండూనూ.

చదివే వ్యసనం చిన్నప్పటినించీ ఉన్నదే. చేతిలో డబ్బులాడ్డం మొదలైనాక అబ్బింది కొనే వ్యసనం. పుస్తకాలు దొంతర్లుగానూ, గుట్టలుగానూ పేరుకుంటూ ఉన్నాయి. కొన్ని కొన్నిటిని బొత్తికి అడుగున పెట్టేస్తూ ఉంటా - అవి రిటైరయి ఖాళీగా కూర్చున్నాక చదువుకోడానికి. ఇప్పుటికిప్పుడు హడావుడిగా చదివేసే బాపతు కాదు - కవిత్రయభారతం సవ్యాఖ్యానం ఇరవై సంపుటాలు, డాంటే ఇన్ఫెర్నో, షేక్స్‌పియరు సాహిత్య సర్వస్వం, నోబెలు సాహిత్య పురస్కార గ్రహీతల కొన్ని రచనల సంకలనం. ఇంకొన్ని ఉంటాయ్ - కొనంగానే చదివెయ్యాలి అని తొందరపెట్టేస్తాయ్. ఆ రోజుల్లో హేరీపాటర్ శ్రేఢి, పులిట్జరో మేన్‌బుకరో గెల్చిన నవల్లు అప్పుడప్పుడూ, లేదా అకస్మాత్తుగా ఒకరచయిత పేరు మారుమోగిపోతూ ఉంటుంది - ఇహ అలాంటప్పుడు అది కొని చదివితే గాని ప్రాణం నిలవదు. ఇంకొన్ని ఉంటాయ్ - ఇవి నిత్యపారాయణ గ్రంధాలు. వీటిని గురించి ఇదివరకు చాలా చోట్ల రాసుకున్నాను - శ్రీపాద కథలు, అమరావతికథలు, నారాయణరావు నవల - వీటిల్లో ఏదో ఒకదాన్ని కొన్నిపేజీలైనా ప్రతిరోజూ స్పృశిస్తూ ఉంటా.

ఈ పఠన వ్యసనం ఇన్నేళ్ళుగా నిరాఘాటంగా సాగిపోతూనే వస్తున్నది, జీవితంలో ఎన్ని మార్పులు జరిగినా. ఒకేసారి నాలుగైదు పుస్తకాలు - అంటే రోజులోని వివిధ సమయాల్లో వేర్వేరు పుస్తకాలన్న మాట - చదివిన సందర్భాలున్నాయి. నెలకి పదికి తక్కువ కాకుండా పుస్తకాలు చదివి ముగిస్తూ ఉండేవాణ్ణి. ఇంత విరివిగా చదువుతూ ఉండడం వల్ల, చదవడానికి ఎంచుకునే పుస్తకం మంచిదా గొప్పదా చచ్చుదా అని పెద్ద ఆలోచన ఉండేది కాదు - చేతికి దొరికిన పుస్తకమల్లా చదివెయ్యడమే. అఫ్కోర్సు చదువుతున్నప్పుడు ఎలాగా ఒక బేరీజు వేసుకుంటామనుకోండి. అట్లాంటిది ఈ మధ్యన జీవితం ఎంత బిజీ అయిపోయిందంటే అసలు పుస్తకం పట్టుకుందామంటే వెసులుబాటు కావట్లా. చదువు ఇంత గగనమైపోయేటప్పటికి ఆ చదివేది ఆ కొద్దిసమయంలోనూ చాలా తృప్తినివ్వాలి అని ఆశించే అత్యాశ ఎక్కువైపోయింది. (ఈ ముందటి వాక్యం ఏంటో కొంచెం గజిబిజిగా వచ్చింది, కవిహృదయం అర్ధమయింది గదా). ఏ కథ పట్టుకున్నా ఒక పట్టాన నచ్చడంలా. గుడ్డుకి ఈకల పీకడం, శల్యపరీక్షలు చెయ్యడం ఎక్కువైపోయింది. వెరసి చదువుతున్న రచనలో ఏ మాత్రం అపశ్రుతి దొర్లినట్టున్నా ఇదివరకులా తట్టుకుని క్షమించేసి ముందుకు సాగలేకపోతున్నా. అప్పటికప్పుడు ఆ సదరు రచయితని - శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలో సుత్తివీరభద్దర్రావు లెవెల్లో - ఓ నాలుగు తిట్లు తిట్టుకోవడం .. రాచయితేగనక ఎదురుగా ఉంటే ఓ నాలుగు పీకుదాం అన్నంత కోపం కూడ వస్తోంది.

నవల్లకి దూరంగా ఉంటూ వస్తున్న నేను, ఈ మధ్యన రేడియోలో ఎక్కడ విన్నా Ann Pratchet గారి సరికొత్త నవల State of Wonder గురించి ఊ ఊదరగొడుతూ ఉంటే, కాబోలునని భ్రమసి పుస్తకం కొని తెచ్చి మొదలు పెట్టాను. నాయనా - ఎందుకు కొన్నానురా బాబూ అనిపిస్తోంది, ఇంకా యాభై పేజీలు కూడా కాలేదు, ప్రతి పది పేజీలకీ నా బీపీ ఓ పది పాయింట్లు పెరిగిపోతోంది. మొదట తిక్క పుట్టించేది ఆ వచన శైలి - ఆ ముఖ్యపాత్ర మనోభావాలని చిత్రించేటందుకు వాడిన ఒక దుర్భరమైన దగ్గుమందులాంటి తీపితో నిండిన ఒక గొంతు. ఆపైన ఆ పోలికలు - ప్రతీదానికీ as if ... as if అనుకుంటూ. నాకు కంపరం ఎత్తిపోయింది. అదయిందా .. ఇక ఈ ముఖ్యపాత్ర సంగతి చూడండి. ఆమె పేరు మెరీనా సింగ్. తండ్రి భారతీయుడు. ఆయన గ్రాడ్యువేటు విద్యార్ధిగా మిన్నెసోటాలో ఉండగా ఒక తెల్ల అమెరికను స్త్రీని పెళ్ళాడగా వారికి పుట్టిన కూతురీమె. ఆ తండ్రిగారు కాస్తా తన పీహెచ్‌డీ ముగించుకుని ఈ తెల్లపెళ్ళానికి డైవోర్సు ఇచ్చేసి తన స్వస్థలమైన కలకత్తాకి తిరిగి వెళ్ళిపోయి అక్కడ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉద్యోగం చేస్తూ అక్కడ తన తల్లిదండ్రులు చూపించిన భారతీయ వనితని పెళ్ళిచేసుకుని సుఖంగా ఉన్నాడు. అయ్యా, ఇక్కడ నాకొహ సందేహం - కలకత్తాలో సింగుల్ని చూశారా? ఏమోలే ఉన్నారేమో, మా విజయవాడలోనే ఆటోషాపులు నడిపే సర్దార్జీలు ఉండగాలేనిది, కలకత్తా మహానగరంలో ఒకటో అరో సింగులు ఉండకపోయారా? పోనీయండి. సరే అదయిందా? ఈ ఇండియన్ ప్రొఫెసరుగారుట, సదరు విడాకులీయబడిన పూర్వభార్యగారినీ, సదరు కూతుర్నీ మూడేళ్ళకోసారి వేసవిలో రెండు మూడూ నెల్లకోసం కలకత్తా రప్పించి, తన యూనివర్సిటీకి దగ్గర్లోనే ఒక ఎపార్టుమెంటు అద్దెకి తీసుకుని అక్కడ ఉంచి, ఎక్కడా తన భారతీయ కుటంబంతో కలవకుండా, వాళ్ళకి అనుమానం రాకుండా అలా నడుపుకొస్తూ ఉండేవాట్ట. ఓకే, ఇది కూడా మింగుడు పడిందా మీకు - ఇహ లాష్టండుఫైనలు - మన హీరోయిన్నుగారు ఇప్పుడు నలభై దాటిన వయసులో తన పది పన్నెండేళ్ళ వయసు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ - కలకత్తా వీధుల్లో తిరుగుతూంటే చుట్టుతా గందరగోళంగా వినిపిస్తున్న హిందీ సంభాషణల గందరగోళం ఆమెని అలలా ముంచెత్తడం గుర్తొచ్చిందట .. కలకత్తా వీధుల్లో .. హిందీ సంభాషణలు!! వాచిపోయింది!

ఆ పుస్తకం హార్డు బైందుకావడంతో బతికిపోయింది. ఈ పాటికి చింపి పోగులు పెట్టి ఉందును.

Comments

మురళి said…
కొన్ని కొన్నిటిని బొత్తికి అడుగున పెట్టేస్తూ ఉంటా - అవి రిటైరయి ఖాళీగా కూర్చున్నాక చదువుకోడానికి. :)) Same pinch!!
Anonymous said…
>> ఆ పుస్తకం హార్డు బైందుకావడంతో బతికిపోయింది. ఈ పాటికి చింపి పోగులు పెట్టి ఉందును.

LOL. Methinks you did not tear it because you paid for it. ;-)
మురళిగారు, మీ రిటైర్మెంటు లిస్టులో ఏమేం పుస్తకాలున్నాయో తెలుసుకోవాలని ఉంది.

Anon - could be :)
Anonymous said…
విపరీతంగా చదవడం కొన్నాళ్లు నేనూ చేశాను. ఇప్పుడు పోల్చుకుంటే కాస్త తక్కువే చదువుతున్నాను. కానీ మీకొచ్చిన కోపం మాత్రం రావట్లేదు.
మన హీరోయిన్నుగారు ఇప్పుడు నలభై దాటిన వయసులో తన పది పన్నెండేళ్ళ వయసు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ - కలకత్తా వీధుల్లో తిరుగుతూంటే చుట్టుతా గందరగోళంగా వినిపిస్తున్న హిందీ సంభాషణల గందరగోళం ఆమెని అలలా ముంచెత్తడం గుర్తొచ్చిందట .. కలకత్తా వీధుల్లో .. హిందీ సంభాషణలు!! వాచిపోయింది!
:)
అసలు అంత తెలియని వాడు ఇండియా గురించి రాయడమెందుకో
శ్రీ said…
మన భాషల గురించి సరిగ్గా తెలిసినట్టులేదు.
Vasu said…
చదువు ఇంత గగనమైపోయేటప్పటికి ఆ చదివేది ఆ కొద్దిసమయంలోనూ చాలా తృప్తినివ్వాలి అని ఆశించే అత్యాశ ఎక్కువైపోయింది.

నేను పట్టుమని ఇరవై తెలుగు పుస్తకాలూ కూడా చదివి ఉండను నాకే ఇలా అనిపిస్తే.. నెలకి పది చదివే మీకు.. ఎలా ఉందో ఊహించ గలను.
ఏదో సామెత గుర్తొచ్చింది కలకత్తా సింగుగారి కూతురి కథ వింటే. వెతికి మరీ చదువుతానుండండి నేను కూడా! చూసారా ఓ పుస్తకాన్ని మీకు తెలియకుండా మీరే ప్రమోట్ చేసేసారు. :)
అర్ధమవుతోందా అని మీరు అడిగిన వాక్యమే చాలా అర్ధవంతంగా ఉంది.

>>> చదువు ఇంత గగనమైపోయేటప్పటికి ఆ చదివేది ఆ కొద్దిసమయంలోనూ చాలా తృప్తినివ్వాలి అని ఆశించే అత్యాశ ఎక్కువైపోయింది.
pi said…
Somebody says I am picky. :P
chavera said…
కలకత్తాలో అయిదేళ్ళు ఉద్యోగ రీత్యా ఉన్నాను.
బెంగాలి తో పాటు హిందీ కూడా బాగా వాడుకలో ఉంది. కలకత్తా 1911 వరకు దేశ రాజదాని .
దేశవిభజన సమయములో కొందరు సింగులు కలకత్తా లో నివాసం ఏర్పరుచుకున్నారు.
ముఖ్యంగా నిజాయితీగల సిక్కు టాక్సీ నడిపేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు.
.
sameeksha maatram chaalaa baagundi.
రసజ్ఞ said…
కొన్ని కొన్నిటిని బొత్తికి అడుగున పెట్టేస్తూ ఉంటా - అవి రిటైరయి ఖాళీగా కూర్చున్నాక చదువుకోడానికి. రిటైరుమెంటు ప్లానింగ్ అనమాట! మరీ మీ అంత అయితే కాదు కాని, నేను అలా కాలేజీ నించి ఇంటికెళ్ళాక ఇప్పటికీ వారానికొక పుస్తకం చదువుతా! చదువు ఇంత గగనమైపోయేటప్పటికి ఆ చదివేది ఆ కొద్దిసమయంలోనూ చాలా తృప్తినివ్వాలి అని ఆశించే అత్యాశ ఎక్కువైపోయింది. నాకు కూడా! బాగా రాసారండీ.
@ రసజ్ఞ, అవును మరి. నేను కూడబెట్టుకున్న (కుంటున్న) ఆస్తి అవేగా మరి!