ప్రపంచం భారతాన్ని ఎలాచూస్తోంది

ది ఎకానమిస్ట్ (The Economist) పత్రికలో భారత్‌లో అవినీతి గురించి ఒక చిన్న నివేదిక చదివాను. మన పత్రికల్లో ఇతర మీడియాలో గత కొన్ని నెలలుగా పెచ్చుమీరుతున్న అవినీతిని గురించి రేగుతున్న హోరుకి ఆల్రెడీ చెవులు దిబ్బెళ్ళు పడిపోయినా, విదేశీయులు దీన్ని ఎలా చూస్తున్నారా అని ఆసక్తిగా చదివాను. పోయినేడు కామన్వెల్త్ గేమ్స్ అప్పటినించీ ఇది రేగుతున్నదే, 2జి విషయంలో పతాకస్థాయికి చేరుకుంది. అయినా మన మీడియాకి ఆత్రమెక్కువలే, గోరంతని కొండంతలు చేస్తారు, దాన్ని పట్టుకుని ప్రతిపక్ష పార్టీలు తందనానా ఆహి అని వంతపాడి మరికాస్త రక్తి కట్టిస్తారు, ఆ మాటకొస్తే ఆ మాత్రం అవినీతి లేణిదెక్కడ అనుకున్నా.

ఈ నివేదిక కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. అసలు ఆ రిపోర్టింగ్ దృష్టే వేరుగా ఉంది. అవినీతి, అమ్మ బాబోయ్ అవినీతి, హమ్మయ్యో హింత అవినీతే అని బుగ్గలు నొక్కుకోవటమూ, గుండెలుబాదుకోవటమూ చెయ్యకుండా వ్యాపారమ్మీద, ముఖ్యంగా అంతర్జాతీయ వ్యాపారసంబంధాల మీద ఈ అవినీతి ముద్ర ఎలా పడుతున్నది? 16 ఆసియా దేశాల వాణిజ్య వాతావరణాన్ని బేరీజువెయ్యగా, భారత్ అందులో కిందనించి నాలుగోస్థానంలో ఉందిట. చైనా వియత్నాములకంటే ధ్వాన్నంగా ఉండటమే అవమానకరం అనుకుంటే అష్టదరిద్రాలకి ఆలవాలమైన కాంబోడియాతో సమానంగా ఉన్నాముట మనం. భారత్ అంటే ఎవరో కాదు, మనమే. ఎట్లాగూ గణాంకాలు మొదలెట్టాం కాబట్టి ఇంకో రెండు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా కంపెనీల అధిష్ఠానాల సర్వేలో గత అయిదేళ్ళల్లో భారత్ పరువు ప్రతిష్ఠలు సగానికి సగం పడిపోయాయిట. 2008తో పోలిస్తే 2009లో విదేశీ మదుపు (FDI) 33 శాతం తగ్గింది. మనవంతు మదుపు చైనాలో జరిగిన మదుపులో నాలుగోవంతు కూడ లేదు.

ఇదంతా అవినీతి మూలంగానేనా? మనదేశంలో మీడియాకి స్వేఛ్ఛ ఉంది, వేరే పనేమీ లేదు కాబట్టి ఇట్లాంటి కుళ్ళుతున్న శవాల్ని తవ్వి తియ్యడమే మన మీడియాకి పని కాబట్టి, భారత్‌లో ఇలాంటి విషయాల గురించి పెద్ద యెత్తున రభస జరుగుతుంది. అదే చైనాలో ప్రభుత్వం కనుసన్న చేస్తే తప్ప, మీడియా కాదు, వాడీ బాబు కాదు, ఎవ్వడూ నోరు మెదపడానికి లేదు. అక్కడ అవినీతి లేదంటే నమ్మేసేందుకు ఎవడూ చెవులో కాలీఫ్లవర్లు పెట్టుకు కూర్చోలేదు.

ఐతే చిన్నపిల్లల ఆటల్లో అవతలవాడూ తొండి చేసినా ఏమీ అనని రిఫరీ మనం తొండి చేసినప్పుడు మాత్రం పెనాల్టీ వేస్తే గోల చేసినట్టుగా ఉంటుంది. ఏది ఏమైనా ఈ అవినీతి మూలంగా విదేశీ వ్యాపారాలు వెనుకంజ వేస్తున్నాయనేది విస్మరించలేని నిజం. గత ఇరవయ్యేళ్ళలో మారి పోయిన ప్రపంచంలో, మారుతున్న భారతీయ ఆర్ధిక వ్యవస్థలో ఇప్పుడు నన్ను ముట్టుకోకు నామాలకాకి అని ముక్కు మూసుకుని కూర్చోవడం కూడా సాధ్యపడే పని కాదు. మన కంపెనీలు విదేశాల్లో వ్యాపారాలు చెయ్యాలి, విదేశి కంపెనీలు మన దేశంలోనూ చెయ్యాలి. అంచేత ఈ అవినీతి భూతాన్ని ఏ సీసాలోనో పట్టి బంధించగల రాజకీయ మంత్రగాడు కావాలి.

పైగా పలువురు విదేశీ సీయీవోల నోట పొక్కుతున్న మాట - ఎక్కడన్నా లంచమిస్తే మన పని తొరగా జరుగుతుంది. కానీ భారత్‌లో లంచానికి లంచం ఇచ్చాక కూడా మన పని జరుగుతుందని నమ్మకం లేదు. అంటే .. మదుపుకి రక్షణ లేదు!

అయ్యా, అదీ సంగతి.

తాజా కలం: ఈ టపా అంతా రాసేశాక ఇవ్వాళ్ళ పలు బ్లాగుల్లో చూశాను, వృద్ధ కృద్ధ యోధుడు అన్నా హజారే అవినీతి పై సమరశంఖం పూరిస్తున్నారని. బ్లాగరులందరం కలిసి ఆయన ప్రయత్నానికి మద్దతుగా ఏమన్నా చెయ్యలేమా?

Comments

అన్నాకి మన మద్దతు ఎలాగూ వుంటుందనుకోండి. అంతకుమించి ఏం చెయ్యగలమంటారు (విరాళాలు కాకుండా)?
pi said…
To support Anna Hazare I fasted on 5th. There are plenty of petitions online. Visit my Facebook page, I've links to them.
బాబు said…
16 దేశాలగ్గాను, భారత్ మెదటి నాలుగు స్థానాల్లో ఉండి దేశంలో ఇంత అవినీతి ఉన్నా ఫరవాలేదా !
మన కన్నా చైనాలో అవినీతి ఎక్కువగా ఉందని అనందపడదామా!
విదేశీ సీఈఓ ల దగ్గర లంచాలు తీసుకుని పనులు చేస్తే ప్రపంచం భారతాన్ని బ్రహ్మాండంగా చూస్తుందా..!
బాబు, పాయింటే! :)
Anonymous said…
"ఎక్కడన్నా లంచమిస్తే మన పని తొరగా జరుగుతుంది. కానీ భారత్‌లో లంచానికి లంచం ఇచ్చాక కూడా మన పని జరుగుతుందని నమ్మకం లేదు."

అదే మనదేశంలో గుజరాత్ కి, మిగతా రాష్ట్రాలకీ తేడా.
లంచం ఇస్తే ఖచ్చితంగా పని జరుగుతుందని ఒకింత గర్వంగానే చెప్పుకుంటారు వాళ్ళు.
బహుశా అందుకే మిగిలిన రాష్ట్రాలకంటే గుజరాత్ వెలిగిపోతుందేమో?
తార said…
మాష్టారు, మీరు మరీ ఖంగారు పడకండి,
విదేశీ మితృల చూపు కొద్దిగా వంకర, ఎకనామిస్ట్, ET, FT పెద్దగ నమ్మలేము, వాడికి ఏవో లాలూచీలు ఉంటాయి, ఈ సర్వే ఈ ప్రతిపాదికన చేసారో మొత్తం డేటా ఇవ్వమనండి మాట్లడరు, ఎక్కువ విదేశీయులు భారత దేశం అంటే భయానక పేద దేశం అనో, లేదా ఇక్కడ కేవలం దళితులు మాత్రమే పేదవారనో, లేదా ఈ మధ్య కొత్తగా అవినీతి మీద పడ్డారు, ఏదో ఒక దేశానికి అనుకూలంగా జరిగే ప్రచారంలో ఇదొక భాగం, అవినీతి ఇంత పెద్ద ఎత్తున లేదు, అవినీతి ఉండే పద్దతీ ఇది కాదు, ఇలాంటివి ఎక్కువగా నమ్మకండి :), ఇవి అంత పెద్ద చెత్త రాతలు.

కొద్దిగా లేటుగా కామెటూ రాస్తున్నా
తారగారు, your comment, though late, is most welcome.
పాశ్చాత్య వార్తాకథనాల వక్రదృష్టి నాకు సుపరిచితమే. నాకు కంగారేమీలేదు. ఈ విషయాన్ని గురించి ఒక చిన్న ఆలోచన పంచుకోవాలని తప్ప, అంతకంటే వాళ్ళేదో మన దేశాన్ని అన్నారని ఆవేశమేమీ లేదు :)
కాకపోతే గమనించ వలసింది ఏంటంటే పాశ్చాత్య వార్తా కథనాలు, ముఖ్యంగా అమెరికన్ మీడియా - చైనా కథనాలని ఎలా చెబుతుంటాయి, ఇండియా కథనాలని ఎలా చెబుతుంటాయి - ఈ తేడా నాకు చాలా ఆసక్తిగా ఉంటుంది. భారతీయ వాణిజ్య సంఘాలు గాని, దౌత్య కార్యాలయం కాని ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకున్నట్టు కనబడదు. పట్టించుకోకపోవడం వల్ల భారతీయ ఆర్ధిక వ్యవస్థకి కొంతైనా నష్టం జరుగుతున్నదని నేను అనుకుంటున్నా.
Anonymous said…
గారు వద్దండి, తార అని పిలవండి చాలు.

ఇలాంటి పేపరు కుట్రలు మనకి కొత్తేమీ కాదు కదా, 4 నవలలు చదివి పెద్ద శాస్త్రవేత్తలాగా తేల్చి పడేసే గొప్ప విలేఖరులు మన దగ్గిర ఎంతమంది లేరు? కమ్యూనిష్టు పత్రికలు ఏమైనా చేయగలుగుతున్నాయా? ఇవి కేవలం ప్రజల్లో భయం, వ్యతిరేక భావన రేకెత్తించడానికి తప్ప, ఇంక దేనికీ ఉపయోగపడవు, మనకి పర్లేదు కానీ, చైనాలో మీడియా, మన మీద విష్యం చిమ్మడమే పనిగా పెట్టుకున్నది, మీకు తెలుసో లెదో, చైనాలో ప్రజలకి మనం అంటే విపరీతమైన ద్వేషం, ఎంత అంటే, పాకిస్తాన్ ప్రజలకి కుడా అంత ద్వేషం లేదు, కారణం ఈ మీడియానే., మరి అప్పుడు చైనా కంపెనీలు మన దేశంలో వ్యాపారం చెయ్యడం లేదా?

ఇక విషయానికి వస్తే, కంపెనీలు సాధారణంగా, సొంత సర్వేలు, కంసల్టెంట్స్ ని నియమీంచుకోవడం గట్రా సొంతగా, సీక్రెట్టుగా చేసుకుంటాయి, అవి వాటిపైన ఆధారపడతాయి తప్ప, వీటిమీద కాదు, కావున నష్టం చాలా నామమాత్రమే. పూర్వం ఐతే ఇవి పనిచేసేవేమో కానీ, ఇప్పుడు కుదరదు లోకం చిన్నది అయ్యింది కదా.

ఇక మన జనాలు ఏమైనా చెయ్యాలి అంటే వాళ్ళకి కాస్ట్లీ బహుమతులు ఇచ్చుకోవాలి, అంత శ్రద్దే ఉంటే ముందు రోడ్లు అన్నా సరిగ్గా వేస్తారు కదా

తార