కబుర్లు - ఖర ఉగాది

అందరికీ కొత్త ఏడాది శుభాకాంక్షలు.

కొత్త సంవత్సరం పేరు ఖర అని తెలిసిన దగ్గర్నుండీ ఏవిట్రా ఈ పేరు కమామిషు అని బుర్ర గోక్కున్నా. కడివెడైననేమి ఖరము పాలు అని వేమన పద్యం తెలుసుగదా! అంటే గాడిద అన్న మాట. ఖరదూషణులని ఇద్దరు రాక్షసులున్నారు రామాయణంలో. శూర్పణఖ అన్నదమ్ములు. శ్రీరాముడు వారిని సంహరించాడు కాబట్టి ఖరహరుడు, ఖరాంతకుడు అని పేరు పొందాడు. ఆయనకి ఇష్టమైన రాగంగా ఖరహరప్రియరాగం ప్రసిద్ధికెక్కింది. ఖర అంటే పదునైన, వాడిగల అని కూడా అర్ధమున్నదిట. ఈ ఖరవత్సరం శ్రీకరమై అన్నిరకాల అవరోధాలను అశుభాలను వాడిగా ఛేదిస్తూ వడిగా వేడిగా మీమీ లక్ష్యాలదగ్గరకు మిమ్మల్ని చేర్చాలని నా శుభాకాంక్షలు.

మార్చి ఇరవై నించీ వసంతారంభం అని లెక్క. మరి తెలుగు ఉగాది కూడా వచ్చేసింది కాబట్టి మరి నిజ్జంగా వసంతం వచ్చెయ్యాలి గద! గత వారంలో పూర్తిగా మూడు రోజులపాటు పగటి ఉష్ణోగ్రత యాభైలతో దోబూచులాడుతుంటే, అవునుగామోసు అని నమ్మెయ్యడానికి రెడీ అయిపోయాను. నా అమాయకత్వాన్ని పటాపంచలు చేసి వాస్తవాన్ని పరిచయం చేస్తూ ఇవ్వాళ్ళ ఓ బుట్టెడు మంచు కురిసింది.

లిబియాలో స్వాతంత్ర్య సమరజ్వాలలు రగులుతూనే ఉన్నాయి, నేటో విమానదాడులు ఆ అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. గద్దాఫీ వారుణాస్త్రాలు పెద్దగా పని చేస్తున్నట్టు లేదు. టూనీసియాలోనూ, ఈజిప్టులోనూ డిక్టేటర్లకి ఉద్వాసన చెప్పే ప్రక్రియ (ఉద్యమం? విప్లవం?) కొంతలోకొంత శాంతియుతంగా జరిగింది కాని, బహ్రేన్ సౌదీలలో ఉద్యమాన్ని డబ్బుతో కొనేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎటొచ్చీ లిబియా, యెమెన్ మాత్రం రగులుతున్నాయి. కాష్టం నించి చుట్టముట్టించుకునే అవకాశవాదిలాగా లిబియా చమురు బయటికి ప్రవహించట్లేదని చమురు కంపెనీలన్నీ పెట్రోలు ధరని ఆకాశానికెత్తేసి లాభాలు దండుకుంటున్నాయి. వాలువీధి రేపనేది లేనట్టు నింగికి పాకుతోంది.

ఉగాది అనగానే తెలుగు నాట కవిసమ్మేళనాలు జరపడం సాంప్రదాయం. పొద్దు జాలపత్రిక వారి చొరవతో 2008లో సర్వధారి ఉగాదికి మొదటిసారి జాలకవిసమ్మేళనం జరిగింది. 2009లో విరోధి ఉగాదికి అది ఒక కొత్త వరవడిగా ఎదిగి, 2010 వికృతి ఉగాదితో సాంప్రదాయంగా పరిణమించింది. తెలుగు బ్లాగుల ఆవిర్భావంతో జరిగిన ఒక శుభపరిణామమిది. యువమిత్రుడు బ్లాగాడిస్తా రవి అధ్యక్షతన శ్రీఖర ఉగాదికి కూడా విద్వత్కవిసభ సలక్షణంగా అలంకారయుతంగా నవరసభరితంగా జరిగిన తార్కాణాలు కనిపిస్తున్నాయి. బహుశా ఇవ్వాళ్టితో మొదలెట్టి ఆ సభ విశేషాల్ని పొద్దులో ప్రచురిస్తారు. పద్యకవిత్వం మీద ఆసక్తి ఉన్నవారు తప్పక చదవండి.

Comments

రవి said…
అంతా బావుందండి కానీ, "యువమిత్రుడు" లో యువ - కాస్త ఇబ్బంది పెడుతూంది. :))
SRRao said…
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు

- శి. రా. రావు
ఉగాది ఊసులు
http://sirakadambam.blogspot.com/2011/04/blog-post_04.html
రవి said…
ఇదుగోండి పొద్దు లంకెలు.
౧. http://poddu.net/?q=node/807
౨. http://poddu.net/?q=node/808
జయ said…
మీకు ఉగాది శుభాకాంక్షలండి. మరి ఉగాది పచ్చడి చేసుకున్నారా. మీకు వేపపువ్వు దొరుకుతుందా. మరి మామిడాకులో. ఇంటిముందు ముగ్గేసుకుంటారా. ఏ ఇంగ్లీషోడొ తొక్కేస్తాడేమో. జాగ్రత్తగా చూసుకోండి.
స్పందించిన అందరికీ నెనర్లు.
రవి, మీరు యువకులే :)
రావు గారు, జయగారు, మీక్కూడా శుభాకాంక్షలు.
అంతగా సాంప్రదాయాలు పాటించటం లేదండీ. దానికితోడు నిన్న ముహూర్తం బాగున్నట్టు మంచు వాన కురిసింది.