రచయిత రచన భాష

ప్రతి కళలోనూ కళాకారుడికి కొన్ని పనిముట్లు ఉంటాయి. చిత్రకారుడికి కుంచెలూ కేన్వాసు, శిల్పికి ఉలి సుత్తి. రచయితకి కూడా ఉన్నై పాత రోజుల్లో అయితే గంటాలు, భూర్జపత్రాలు, తరవాత ఇంకు పెన్నులు కాయితాలు, ఈ రోజుల్లో అయితే కంప్యూటర్లు.

అసలు సరుకంతా ముడిపదార్ధంలో ఉన్నది. శిల్పికి చెక్కనో శిలనో ఎలాగో రచయితకి భాష అలాగు.

ఐతే ఒక మౌలికమైన భేదం లేకపోలేదు. రచయితకి ముడి సరుకైన భాష, శిలలాగానో కేన్వాసులాగానో ప్రాణం లేనిది కాదు, అది సజీవమైనది. చరిత్రని పొట్టనిండా నింపుకుని సంస్కృతిని సాంప్రదాయాన్ని వేళ్ళకొసల్లో కనుకొలుకుల్లో తొణికిస్తూ ఉంటుంది. తన జాతి చైతన్యంతో అది నవనవలాడుతూ ఉంటుంది ఎప్పుడూ. భాషతో వ్యవహారం ఆషామాషీ కాదెప్పుడూ.

ఇలా సజీవమైన ముడిసరుకుతో కుస్తీ పట్టే రచయితని చూస్తే నాకు చెవులుకుట్టే వాళ్ళూ, పచ్చబొట్టు పొడిచేవాళ్ళూ గుర్తొస్తారు. పచ్చబొట్టు పొడిచేవాడు అసమర్ధుడైతే, వాడి ముడిసరుకునైన నేను వాడి చేతిలో నరకం చూస్తాను గద! ఆ బాధలో వాడీ గొంతునులిమి చంపెయ్యలేక పోవచ్చును గానీ కుయ్యో మొర్రో అని మొత్తుకుంటాను గద! అటూఇటూ మెలికలు తిరుగుతాను గద! ఇంతా చేసి చివరికి ఆ పచ్చబొట్టు నానాకంగాళీ అవకతవగ్గా తయారవుతుందని వేరే చెప్పాలా? ఆ మచ్చని - మనకి నచ్చనిదైనా - చెరిపేసుకోలేను గద!

అసమర్ధుడైన రచయితచేతిలో భాష కూడా ఇలాంటి పాట్లే పడుతుంది. విజ్ఞుడైన రచయిత భాష పట్ల గౌరవంగా ఉంటాడు. ప్రాణానికి జీవానికి మనమిచ్చే ఒక మౌలికమైన గౌరవమది. జ్ఞాన నిధులైన పండితులకిచ్చే గౌరవమది. అది తెలిసి మసలుకునే రచయితని భాష కరుణిస్తుంది, ప్రేమిస్తుంది. ఒకే క్షణంలో తల్లీ ప్రేయసీ కూడా అవుతుంది. ఆ కరుణలో ప్రేమలో తడిసి పునీతుడైన రచయిత ఆ భాషకి నగిషీలు చెక్కి అందాలు అద్దుతాడు.

Comments

చాలారోజులకు కనిపించారు..
మీరు చెప్పిన మాటలన్నీ అక్షరసత్యాలే.కాని ముందు ముందు మీరు చెప్పిన రచయిత, రచన, భాష .. ఆశించడం అడియాసే అవుతుందేమో. ఇందాకే ప్రసీద టపా చదివాను. అసలు భాషని ఇంత దారుణంగా చిత్రవధ చేస్తున్నారే అనిపిస్తుంది. ఈరోజు వస్తున్న రచనలు చూస్తే కోపం వస్తుంది రాసిన వాళ్లమీద కంటే వాటిని ప్రచురించి, కొండొకచో ప్రముఖ రచయితలు అని బిరుదులు ఇస్తున్నారే అని. ఆపాత మధురాలు అనుకుని పాత పాటలు విన్నట్టుగా ఆపాత రచనలు అనుకుని పాత పుస్తకాలే చదవాలి కొనుక్కోవాలేమో. అవి ఎక్కడ దొరుకుతాయి అంటే ఆదివారంనాడు ఫుట్ పాత్ మీద...
Anonymous said…
:)
ramesh said…
బాగా చెప్పారు.
నాకు ఒక సందేహం - భాష, తల్లీ, ప్రేయసీ అవుతుంది; కరుణ, ప్రేమ చూపిస్తుంది ఆన్నారు చివరి పేరా లో. ఎందుకండీ, ఇలా బంధానికొక ప్రత్యేకత, పదం - అమ్మ ప్రేమకేమి కొదవ, ప్రేయసి కరుణకేమి లోపం?
చేసే పనులలో బంధానికో ప్రత్యేకత ఉండొచ్చేమో కాని (భోజ్యేషు మాతా........) , చూపే ప్రేమ, కరుణ లో కూడానా?
@ Ramesh మంచి ప్రశ్నే. మీరు చెప్పిన వాదం ఒప్పుకున్నాను. కాకపోతే ఇలా జనాంతికంగా మాట్లాడుకునేప్పుడు ఒక భావనని సులభంగా కన్వే చేసేందుకు అలాంటి స్టీరియోటైప్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను.
మాలతి said…
మంచి విషయం వెలుగులోకి తెచ్చేరు మరోసారి. కథలూ, కాకరకాయలూ రాసేవారూ, రాయాలని ఉత్సాహపడుతున్నవారూ మరోసారి ఈ సంగతి మననం చేసుకుంటే బాగుండు.
కొత్త పాళీ గారు,

చాలా బాగుంది.. నాకు రచనల్లోనే కాదు.. సినిమా, టీవీ లాంటి మాధ్యమాల్లో కూడా భాష సరిగ్గా లేకపోతే ముళ్ల మీద కూర్చున్నట్టు గా ..గుండె పట్టేసినట్టు గా ఉంటుంది.
ప్రస్తుతం అవసరమైన గీతోపదేశం చేసారు సర్. ధన్యవాదాలు..
ఆలోచన గొప్పదే...అందుకనే చాలా ఐడియలిస్టిగ్గా ఉంది. బహుశా అది అవసరంకూడా కాబోలు. గీసేప్రతొక్కరూ చిత్రకారుడు కానట్టే రాసే ప్రతొక్కరూ రచయితా కాలేరు. రచయిత అవడం ఒక ప్రాసెస్, సమర్థవంతమైన రచయిత, భాషను మలిచే రచయిత అవడం కొందరికే సాధ్యమయ్యే గమ్యం. అంతమాత్రానా రాసేవాళ్ళందరూ మానేసుకుంటే సమర్థులయ్యే దారులు ఆరంభం కాకముందే మూసుకుపోవూ ! కాబట్టి ఛండాలంగానైనా సరే అందరూ రాయడానికి ప్రయత్నించాల్సిందే. భాషను ఖూనీ చేసైనా సరే తాము సమర్థులమో కాదో తేల్చుకోవలసిందే. అప్పుడే భాష బ్రతుకుతుంది. కొత్త ప్రమాణాలు పుట్టుకొస్తాయి.
Afsar said…
నాసీ:

మంచి వ్యాసానికి మంచి ప్రారంభంలా వుంది.
సాహిత్య సృజనలో భాష ఎప్పుడూ చర్చనీయాంశమే. ఇప్పుడు మరీ!

శ్రీ శ్రీ పలికిన అనేక అతిశయోక్తులలో వొకటి " భాష చేత బాగా చాకిరీ చేయించుకున్నాను" అని!

అలా భాష చేత చాకిరీ చేయించు కోవడం వొక కవి వల్లనో, రచయిత వల్లనో అవుతుందని నేననుకొను.

బైరాగి అన్నట్టు " భాష ఎప్పుడూ అసమర్ధమయింది" కూడా కాదు!

భాష శక్తినీ, భాష విస్తృతినీ పట్టుకోగల సామర్ధ్యం ఎప్పుడూ వొకరి సొంతం కాదు. పుస్తకాల్లో మాత్రమే కాదు, మనం ఎంత వరకు జనంలో వుంటామన్న వాస్తవికత మీద ఆ సామర్ధ్యం ఆధారపడి వుంటుంది. జనజలంలో వుండలేని కవీ రచయిత ఇసకన పడ్డ చేపలే!
నిజంగా రచయిత రచనని, అతని ఆత్మసంభాషణగా చూడాలి...ఏ రచయిత అయినా తనకు తాను చెప్పుకోనిదే ఇతరులకి చెప్పడు...అప్పుడు తన స్వీయ భాషలోనే తన అంతరంగం పూర్ణంగా బయట పడే అవకాశం వుంటుంది ...అలాంటి రచనలని ఏ విధంగా రాసాడో, చదవడంలో మనకూ స్పష్టత వస్తుంది.
ఇక అసమర్థ రచయిత గూర్చి మాట్లాడటంలో పనేముంటుంది, ఇంకో రెండు పేరాలు వేష్టయిపోతాయ్.

చివరగా మాతృభాష తల్లిలాంటిది సరళమైనది, ఇతరభాషలు పిన్ని లాంటివి...
భేషజం లేకుండా తల్లి వడిలో హాయిగా పడుకోగలుగుతాం....కాని పిన్ని తో అంత చొరవ కుదరదు.

అంతే కాని ఏ భాషా ఒకె సమయంలో తల్లీ, ప్రేయసి కాదు...అది అభ్యంతరకరం!
మన్నించండి కొత్తపాళీ గారు...

మాతృత్వమున్నందుకు భాషకి స్త్రీత్వాన్ని ఆపాదిస్తారు .
అంతేకాని,
భాషకు స్త్రీత్వం ఉన్నందుకు ఒకేసారి మాతృత్వాన్ని, ప్రేయసినీ అపాదించరు.

అన్యధా భావించ కండి,దయచేసి నన్ను మన్నించండి.
స్పందించిన అందరికీ ధన్యవాదాలు.
ముందస్తుగా సత్యగారికి - అన్ని క్షమాపణలు అక్కర్లేదండీ. నా బ్లాగులో ఎప్పుడైనా మీ అభిప్రాయం వినిపించే స్వేఛ్ఛ ఉన్నది, నే వెలిబుచ్చిన అభిప్రాయాలతో విభేదించవచ్చు. భాష ఒకే క్షణంలో తల్లీ ప్రేయసీ అవుతుందని ఎందుకు రాశానో నాకు కారణం ఉన్నది. మళ్ళీ వేరేగా రాస్తాను. ప్రేయసి ప్రస్తావన అసమంజసమని మీరెందుకు అన్నారో నాకు అర్ధమైంది.
జ్యోతి, అందుకే పాఠకులు హంసలై కంటబడుతున్న రచనల్లోనించి పాలని నీళ్ళని వేరుచేసుకోగలగాలి.
మాలతి గారు, నిజం.
కృష్ణప్రియ, సినిమా, టీవీ కూడా - మీడియే రూపభేదం కాని, ముందుగా రచనే కదా! అందుకే ఆ బాధ.
మహేశ్, మంచి పాయింట్ లేవనెత్తారు. నిజమే అందరూ రాయాల్సిన అవసరం కూడా ఉన్నది. కానీ సాహిత్య సృష్టి చెయ్యాలనే స్పృహౌన్నవారు అందులో కొద్దిమందే ఉంటారు. కనీసం వారైనా భాషని గట్టిగా పట్టించుకోవాలనేది నా ఆరాటం. మీరు ప్రాథమిక విద్య గురించి మాట్లాడుతున్నారు - నేను రీసెర్చి స్కాలర్ల గురించి మాట్లాడుతున్నా.
అఫ్సర్, వ్యాసాలు రాసే సామర్ధ్యం, అందునా ఈ విషయమ్మీద నాకు లేదుగానీ, ఇది మాత్రం ఒక నాంది వాక్యమే - దీన్ని గురించి ఇంకా ఆలోచన సుళ్ళు తిరుగుతోంది. త్వరలో రాస్తాను. తెలుగులో పేరున్న ప్రతీ కవీ భాషని గురించీ కవిత్వాన్ని గురించీ ఇలాంటి స్టేట్మెంట్ కనీసం ఒకటైనా ఇచ్చాడని అనుకుంటున్నా. ఒక పిడకలవేట - పాతకాలం నించీ ఇప్పటి వరకూ అలాంటి స్టేట్మెంట్లన్నీ సేకరిస్తే ఆసక్తికరంగా ఉంటుంది.
అను, తెరెసా, కెక్యూబ్, ధన్యవాదాలు.
కత్తి మహేష్ కుమార్ గారితో ఏకీభవించక తప్పదు....శ్రేయోభిలాషి ...నూతక్కి .
Anonymous said…
కత్తి మహేశ్ కుమార్ గారన్నట్టు అందరూ రాయాల్సిందే.. కానీ, తాము చేసేది సాహిత్యసృష్టి అని భావించేవారు మాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు.. రాసి చిత్రిక పట్టాలి.. మళ్లీ మళ్లీ చిత్రికపట్టాలి. ఆ తర్వాతనే బయట పెట్టాలి. కొన్నాళ్లకు చిత్రికలు పట్టే అవసరం ఏర్పడకపోవచ్చు. అప్పటివరకూ అది తప్పదు.\
సాహిత్య సృష్టి వరకూ ఎందుకు మామూలుగా మాట్లాడేప్పుడు కూడా ఈ భాషపట్ల అజాగ్రత్తతో పుట్టే ఇబ్బంది గమనించొచ్చు. ఏదో అంటారు.. అందరూ అభ్యంతరపెట్టాకా అబ్బే అది కాదు నా ఉద్దేశం అని నొచ్చుకుంటారు. ఒకటి చెబ్దామని మరొకటి చెప్తే ఇంక అతను మాట్లాడడం ఏం నేర్చుకున్నట్టు.
కొత్తపాళీ గారూ,
మీ ఈ వ్యాసం చదవగానే ఒకే మహనీయుడు గుర్తొస్తున్నారు నాకు.. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.