స్వేఛ్ఛ ఎవడబ్బ సొమ్ము?

వికీ లీక్స్ స్థాపకుడు జూలియన్ అసాంజ్ కథ - లీక్స్ గూడు ద్వారా ఆయా రాజ్యరహస్యాలనే కాదు - అంతర్జాతీయ కుటిల రాజకీయాలను కూడా బయట పెడుతున్నది. పనిలో పనిగా, నాగరికులం అని చెప్పుకునే వారందరి మౌలిక విలువల్ని ప్రశ్నిస్తున్నది. రాజ్యం - వ్యక్తి అనే తూకంలో రాజ్యమే పైకి మొగ్గుతుందని చెబుతోంది. వ్యవస్థీకృతంగా రాజ్యం హింసని ఎంత తెలివిగా ఉపయోగించగలదో చూపిస్తోంది.

ఇంగ్లండులో నివాసం ఉన్న (పోనీ దాక్కున్న) ఆస్ట్రేలియన్ పౌరుడైన అసాంజ్‌పైన స్వీడిష్ ప్రాసిక్యూటర్లు కేసు పెట్టి (అది కూడా రేప్ కేసు - నిరూపించడానికి చాలా కష్టం, నిరూపించినా శిక్ష పడ్డం ఇంకా తక్కువ) అతన్ని స్వీడన్ కి బదలీ చెయ్యమని అడగడం - దీని వెనక అంతా అమెరికా ప్రభుత్వపు అదృశ్య హస్తం (మరీ అంత అదృశ్యం కూడ కాదులే) .. ఇదంతా ఒక పక్కనేమో ఏదో రాబర్ట్ లుడ్లం థ్రిల్లర్ నవల ప్లాటులాగా ఉంది. ఇంకోపక్క చూస్తే పరమ హాస్యాస్పదంగా, ఎవడో తిక్కలాడు పుట్టించిన తలకిమాసిన స్కీంలా ఉంది.

కొన్నేళ్ళ కిందట అమెరికను పౌరుడైన కుర్రోడొకడు సింగపూర్లో ఏదో వేండలిజం చేసి పట్టుబడితే అతగాడికి ఇరవై పేము దెబ్బల శీక్ష విధించగా, అమెరికా వాళ్లంతా నానా గోల చేశారు, ఆఖరికి అధ్యక్షుడు కూడా సింగపూరు అధ్యక్షుడికి ఒక రిక్వెస్టు పంపాడు, ఆ అబ్బాయిని క్షమించమని. మరి అసాంజ్ ని గురించి ఇంత తతంగం నడుస్తుంటే ఆస్ట్రేలియను ప్రభుత్వం నోరు కుట్టేసుకుని కూర్చుంది ఎందుకో.

ఇదిలా ఉండగా, వికీలీక్స్ కి వివిధ సేవలు అందిస్తున్న కంపెనీలు ఒక్కొక్కటే తమ అనుబంధాన్ని తెంచేస్తున్నాయి - అవును మరి, ఏ కంపెనీకి ఏ దేశ ప్రభుత్వంతో రేపు ఏమి అవసరం పడుతుందో?

రెండో ప్రపంచ యుద్ధం దగ్గర్నించీ ఇప్పటిదాకా అమెరికను ప్రభుత్వం, దాని ఏజెంట్లు ప్రపంచ వ్యాప్తంగా తన దారికి అడ్డం అనుకున్న వ్యక్తుల్ని నిశ్శబ్దంగానో పబ్లిగ్గానో లేపేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అసాంజ్‌ని అలాగే లేపెయ్యమని అమెరికను ప్రభుత్వానికి కొన్నివేల విన్నపాలు వచ్చాయిట - కొమ్ములు తిరిగిన నాయకులు ప్రభుత్వం ఆ పని చెయ్యాలని పబ్లిగ్గానే పిలుపునిచ్చారు.

స్వేఛ్ఛ - బంధనం. హక్కు - బాధ్యత. రహస్యం - బట్టబయలు. వికీలీక్స్ బయట పెడుతున్న విషయాలు ప్రజలకి తెలియడం అవసరమా? అసలు ఏ విషయమైనా ప్రజలకి ఎందుకు తెలియాలి? అందరూ టీవీలో సిట్‌కాంలు, రియాలిటీ షోలు మాత్రమే చూస్తూ, రేడియోలో పాటలు వింటూ, అంతర్జాలంలో కాలక్షేపం సైట్లు చూసుకుంటూ హాయిగా ఉండక? ఎందుకు మనకి సంపాదకీయాలు, ఒపీనియన్ పేజీలు? ఎలాగూ అలాగే ఉంటూనే ఉన్నాం - మనమున్న దేశంలో ఆ దేశ ప్రభుత్వ చట్టాలకి బద్ధులంగా, బహు స్వేఛ్ఛగా. ఎటొచ్చీ ఒకటుంది. నేనేదో డిట్రాయిట్లో ఇక్కడి చట్టాల్ని పాటిస్తూ హాయిగా చట్టపరిధిలో నా దారిన నేనుంటే - ఎక్కడో జంబలగిరిగిరి దేశంవాళ్ళు వచ్చి, నువ్వు మా దేశపు చట్టాల్ని అతిక్రమించావు, అందుకు నిన్ను శిక్షించాలి అంటే? సాల్మన్ రష్డీ మీద ఖొమైనీ ఫత్వా గుర్తుకి రావట్లే?

పై పొరలు వొలిచి చూస్తే ఖొమైనీ ఇరానుకీ ఒబామా అమెరికాకీ ఆట్టే తేడాలేదు.

Comments

ప్రస్తుత ప్రపంచంలో స్వేచ్చ అమెరికా వారి దయ అయింది సార్. అసాంజ్ పై పెట్టిన కేసు కూడా ఫాల్స్ అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ counter currents లో వచ్చింది. ఇలా ఎంతమంది గొంతులో నొక్కుతోంది ఈ మట్టికాళ్ళ మహారాక్షసి..
you left another angle, Anonymous group attacking few companies like Mastercard, Visa and Paypal. also preparing to attack Amazon.
They made a piece s/w who like to participate in that attack can download that s/w which attacks the sites as Anonymous group ordered.

A 16yr boy arrested for hacking, in Netherland.
చంద్ర మోహన్ said…
మరీ ఇంత పచ్చిగా చెబితే ఎలా సారూ! అమెరికాలో ఉండాలని లేదా?
కేక్యూబ్, చంద్రమోహన్ .. అభిప్రాయానికి నెనర్లు.
కన్నగాడు, అవును, అసలు ఈ విషయం గురించి చాలా వివరంగా రాయాల్సి ఉంది. ఈ టపా కొంచెం హడవుడిగా ప్రచురించాను.
pi said…
Very well said! My feelings exactly!!
Anonymous said…
ప్రశ్నించిన తీరు బాగుంది.కొన్ని వాక్యాలు చాలా బాగున్నాయి.
"అమెరికా అంటే ఇష్టం"(టోనీ మాటలను ఉటంకిస్తూ అనుకుంటా..)టపాని చదివి ఏంటీయన అని అనుకున్నా!ఇప్పుడు ఇది చదివి తలగోక్కున్నా!ఈ సింకింగ్ ప్రాబ్లం మీరు పాటించే క్లుప్తత వల్ల అనుకుంటా.కబుర్లు ఎలాచెప్పినా ఓకే గానీ ఇలాంటివి కొంచెం విపులంగా రాస్తే నాలాంటి పామరులకి....!నా స్వార్థం కొద్దీ అడిగాను తప్పితే వేరే ఉద్దేశ్యం లేదు.అన్యధా భావించవద్దు.

---బాబు
pi - thank you.

@బాబు, అందులో అసందిగ్ధం ఏం లేదు. భారతీయులకి, తమ దేశాన్ని పాలిస్తున్న నేత్లని అసహ్యించుకుంటూనే ఉన్నా, దేశం పట్ల భక్తి లేదూ? అమెరికా పట్ల నా యిష్టమూ అలాంటిదే. అది రాజకీయులకీ వాళ్ళ వెధవపనులకీ అతీతమైనది. బయటినించి చూసేవారికి అమెరికా అంటే ఒబామా, హిలరీ క్లింటనే కావచ్చు, కానీ నాకు అమెరికా అంటే నా పక్కింటి వాళ్ళు, సూపర్ మార్కెట్లో అమ్మకం చేసే క్లర్కు, నా బిజినెస్‌లో కస్టమర్లు - ఇంకా చాలా. ఈ టపాలోనైనా తిడుతున్నది అమెరికను ప్రభుత్వ వైఖరినే కాని అమెరికాను కాదు, గమనించ గలరు.
ఇక స్పష్టత లోపం - మీరు ఫీలైనది నిజమే. నాకే ఇంకా దీన్ని గురించి చాలా రాయాలని ఉంది. ఈ టపా హడావుడిగా ప్రచురించేశాననీ అనిపించింది. కానీ ఆ గజిబిజి భావాల్ని ఒక కొలిక్కి తీసుకు రావడానికి ఇంకొంచెం శ్రమపడాలి. రాస్తాను. మీ నిర్మొగమాటమైన వ్యాఖ్యకి నిజంగా ధన్యవాదాలు.
Kalpana Rentala said…
చివరి వాక్యం ఎంత కరెక్టో కదా. అమెరికాలో వున్నవారంతా అమెరికా కొమ్ము కాస్తున్నామనుకొని అపోహ చాలా మందికి. మీరు ఈ విషయం గురించి ఇంకాస్త విపులంగా రాస్తానన్నారు గా ఆ పోస్ట్ కోసం చూస్తాను.