కబుర్లు - డిసెంబరు 6

దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు స్వాతంత్ర్య సమరయోధులు, మహాత్ముని సత్యాగ్రహ ఉద్దేశాన్ని పూర్తిగా అర్ధం చేసుకుని తెలుగు గడ్డమీద తొలిసారిగా సత్యాగ్రహ పద్ధతిలో చీరాల పేరాల ఉద్యమంతో ఆంగ్ల ప్రభుత్వాన్ని ఎదిరించిన ధీశాలి. ఆయన చిన్న వయసులో తాలూకా కచేరీలో గుమాస్తాగా ఉద్యోగం చేశారు కొన్నాళ్ళు. ఆ సమయంలో ఊరిలో పెద్దమనిషి అయిన ఒక చౌదరిగారు ప్రభుత్వానికి ఏదో అర్జీ పెట్టుకుంటూ, చివర చౌదరిగారు వ్రాలు అని సంతకం చేశారు. దుగ్గిరాల మహా కొంటెవాడు - ఆ అర్జీకి సమాధానం రాస్తూ - "చౌదరిగారు గారికి .." అని రాశార్ట. మొన్నటి టపాలో పాతమిత్రులొకరు వ్యాఖ్యపెడితే ఆయనకి సమాధానిమిస్తూ "కన్నగాడు గారు" అని సంబోధించాల్సి వచ్చి ఇదంతా గుర్తొచ్చింది.

పోయిన సోమవారం నాడు జెఫ్రీ శాక్స్ గారి ఉపన్యాసం వినొచ్చాను. ఈయన గత ఇరవై యేళ్ళల్లో ప్రపంచవ్యాప్తంగా పేరిన్నక గన్న అభివృద్ధి శాస్త్ర వేత్త. ప్రస్తుతం పర్యావరణ విషయాల మీద బాగా దృష్టి పెడుతున్నారు. పర్యావరణ మార్పు, భూతల ఉష్ణీభవనం, దాని నేపథ్యంలో జరుగుతున్న రాజకీయాలు, చేసుకోవలసిన నిర్ణయాలు, చేపట్టవలసిన కార్యక్రమాల గురించి మాట్లాడారు. ఆయన ఎంతో ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త అయినా తన ప్రసంగాన్ని అందరికీ అర్ధమయ్యే రీతిలో రూపొందించుకోవడం నచ్చింది. కాకపోతే సుమారు గంటన్నర ఉపన్యాసంలో పర్యావరణ మార్పు జరుగుతున్నది, దీనికి ఇట్లాంటి అట్లాంటి సూచనలున్నాయి అని నొక్కి చెప్పేందుకే మొదట్లో చాలా సమయం తీసుకున్నారు. దాంతో దీని వెనక రాజకీయాల్ని, ప్రత్యామ్నాయాల్ని చర్చించేందుకు ఎక్కువ సమయం మిగలక కొంచెం హడావుడిగా ముగించినట్టు అనిపించింది. ఇంతకీ సారాంశం ఏవిటంటే - ప్రస్తుతం ప్రపంచం పరిగెడుతున్న మార్గం కచ్చితంగా సర్వనాశనానికే దారి తీస్తున్నది. ఇప్పటికిప్పుడు సరైన చర్యలు కొన్ని చేపడితే 2050 సంవత్సరానికి కొంతలో కొంత మనకి తెలిసిన ప్రపంచాన్ని రక్షించుకునే అవకాశం ఉన్నది. కానీ అది జరగాలంటే కార్బన్ డయాక్సైడు విడుదలని తీవ్రంగా నియంత్రించాలి. కానీ అభివృద్ధి చెందిన దేశాలు తమ జీవన విధానాల్ని మార్చుకోడానికి ఇష్టపడ్డం లేదు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, ముఖ్యంగా BRICK దేశాలు - మీరిప్పటికే అభివృద్ధి ఫలాలని ఆస్వాదించారు గదా, మాకు మాత్రం ఆ అర్హత లేదా అని - ఇంకా ఎక్కువ ఇంధన వాడుక దిశలో పరుగిడుతున్నాయి. ఇది అంతర్జాతీయ రాజకీయం. ఇక అమెరికాలో జరుగుతున్న రాజకీయం - పదేళ్ళ కిందటి సర్వేలతో పోలిస్తే ఇప్పుడు అధికశాతం అమెరికన్లు - ఏంటీ పర్యావరణమా? మారుతోందా? నేను చేసే పనుల వల్లనా? నీకేవన్నా పిచ్చెక్కిందా? అంటున్నారు. దీనికి మద్దతుగా ఆయన ప్యూ రీసెర్చివారి గణాంకాల్ని ఉదహరించారు. ఇదంతా నాకు కొంతవరకూ తెలిసిన విషయమే, కొత్తగా తెలిసిన విషయాలు కూడా పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు, కానీ ఆయన ముగింపుగా చెప్పిన కొన్ని వాక్యాలు మాత్రం దిగ్భ్రమ కలిగించినై. ఆయన అన్నది ఇది - అమెరికాలో దీనికి సంబంధించిన పనిని కొన్ని శక్తులు ఎలాగైనా ఆపాలని చూస్తున్నాయి. ఆ జాబితాలో మొదటి పేరు, రూపర్ట్ మర్డాక్ (Rupert Murdoch). రెండోది వాలు వీధి పత్రిక (Wall Street Journal). ఈ రెండు శక్తులూ అన్ని రకాల ఉద్యమకారులు, అన్ని రకాల రాజకీయ శక్తులు చేసినదానికంటే ఎక్కువ బలంతో ఈవిషయంపై సంభాషణని పక్కదారి పట్టిస్తున్నాయి, అలా పక్కదారి పట్టించడంలో సఫలీకృతమవుతున్నాయి.

ఒక పూట ఏం తోచక తెలుగు సినిమా డిస్కులేమి ఉన్నాయా అని వెదుకుతుంటే రాజేంద్రప్రసాదు నటించిన రాంబంటు కనబడింది. చూశాను. రమణ రచన, బాపు దర్శకత్వం. బహుశా 80ల చివర్లోనో 90ల మొదట్లోనో తీశారనుకుంటాను. హనుమంతుడిలా విశ్వాసపాత్రుడేకాక అనేక గొప్ప శక్తులు, తెలివితేటలు కలిగిన సేవకుడు అనే కాన్సెప్టుతో తీశారు. వైభవం కరిగిపోతున్న రాజావారు, ఆ రాజావారి కోట, ఆ యింటో తిష్టవేసిన దుష్టగ్రహం - ఈ వాతావరణం, ఈ పాత్రలు అన్నీ బాగా ముత్యాలముగ్గు వాసనలు కొట్టాయి, అయినా కొంత విభిన్నంగానూ, ఆసక్తికరంగానూ ఉన్నది. ముత్యాలముగ్గుకి రావుగోపాల్రావులాగా ఈ సినిమాకి కోటశ్రీనివాసరావే ప్రాణం. ఒక్కమాటలో చెప్పాలంటే అద్భుతంగా చేశాడు. ఆ పాత్ర - గిరీశం (కన్యాశుల్కం గుర్తొస్తే మీ తప్పేం లేదు) - కేవలం రమణ మాత్రమే ఊహించగలిగిన పాత్ర, కేవలం రమణ మాత్రమే రాయగలిగిన డయలాగులు - అటుపైన బాపు మాత్రమే చిత్రీకరించ గలిగిన పాత్ర. సినిమా బాక్సాఫీసుదగ్గర ఘోరంగా ఫెయిలైనట్టు ఉంది (నేనైతే ఇప్పటిదాకా ఈ సినిమా పేరైనా వినలేదు) - దాంతో దీనిద్వారా కోటకి రావల్సినంత ఖ్యాతి రాలేదు కాబోలు. ఒక దృస్యంలో కోట రాజావారికీ ఇతర భక్తులకీ తన విశ్వరూపం చూపించి గీత బోధిస్తాడు - అందులో కొన్ని ముక్కలు - హీరోలలో చిరంజీవినీ తారలలో శ్రీదేవినీ నేను - మధ్య మధ్యలో ఒరిజినల్ కన్యాశుల్కం నుంచి కొన్ని కొన్ని మాటలు నంజుకుంటూ (ఫుల్లు మూను వైటటా, జాసమిన్ను వైటటా ..) - బహురంజుగా చిత్రీకరించారు. తమిళ షావుకారుగా ఏవీయెస్ కూడా మంచి నటన అందించారు. మొత్తమ్మీద మంచి వినోదం. రాజావారి బేవార్సు కొడుకుల్లో ఒకడిగా నూనూగు మీసాల రాజీవు కనకాలని చూసి కొంచెం ఆశ్చర్యం వేసింది, ఓహో ఈ పిలగాడు అంత చిన్నవయసు నించీ సినిమాల్లో ఉన్నాడా అని.

ఆరోగ్యం

ఈ పిండి పదార్ధాలతో వచ్చే పేద్ధ తంటా - మనం చిన్నప్పటినించీ భోజనమంటే ఇలాగే ఉంటుంది అనుకుని అలా కమిటైపోయి ఉంటాం. అలా అన్నం తింటేనేగాని భోజనం చేసినట్టు ఉండదు అనే ఆలోచన మన బుర్రల్లో కదలకుండా తిష్టవేసుకుని కూర్చుని ఉంటుంది. దానికి తోడు ఇంకో జాడ్యం ఉన్నది, మనసుకి సంబంధం లేనిది. పిండి పదార్ధాలనించి సులభంగా తయారయ్యే చక్కెరకి మన శరీరం addict అయి ఉంటుంది. కొన్నేళ్ళ కిందటి దాకా నేను ఎంతగా అన్నానికి దాసుణ్ణయి ఉండేవాణ్ణంటే, ఎప్పుడన్నా బయట వేరే కుయిసీన్ భోజనం చేసి వచ్చినా, ఇంటికొచ్చాక ఒక రెండు గరిటల అన్నంలో అంత పెరుగు, ఒక ఆవకాయ బద్ద వేసుకుని తింటే తప్ప నిద్ర పట్టేది కాదు. రక్తంలో చక్కెర శాతం తగ్గినప్పుడల్లా "ఆకలేస్తోంది" అని మనకి అనిపించే ఫీలింగ్ ఈ ఎడిక్షను వల్లనే - నిజంగా ఆకలి వెయ్యడం వల్ల కాదు. కెఫీన్, నికొటిన్, ఇతర మాదక ద్రవ్యాల ఎడిక్షన్ మనకి స్పష్టంగా తెలుస్తుంది, కానీ ఈ చక్కెర ఎడిక్షన్ని ఎవరూ గుర్తించరు, అందుకని అది నిరాఘాటంగా సాగిపోతూ ఉంటుంది, పనిలోపనిగా ప్రాణాలు తీస్తూ. ఆధునిక నాగరిక జీవితంలో అధికంగా గుర్తించబడుతున్న అనేకానేక జబ్బులకి మూలాలు ఈ చక్కెర ఎడిక్షనులో ఉన్నాయని శాస్త్ర పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

దీన్ని ఎడిక్షనుగా గుర్తించడం ఎంత కష్టమో, గుర్తించినాక ఎదిరించడం అంతకంటే కష్టం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చక్కెర లాబీ చాలా బలమయినది. ఎక్కడా తన వ్యాపార వ్యవహారాలకి అడ్డంకి రానివ్వదు. పైగా చుట్టూతా చక్కెరతో నిండిపోయిన ఆహార సంస్కృతి. ఏదన్నా విమానాశ్రయం నడవాలో నడుస్తున్నప్పుడు అక్కడౌన్న భోజనశాలల్లో అమ్మడానికి ఉన్న వస్తువుల్ని ఒక్క సారి గమనించండి - తొంభై శాతం పిండిపదార్ధాలే - క్రొసాన్‌లు, మఫ్ఫిన్‌లు, ప్రెట్జెల్లు - శాండ్‌విచ్ కొనుక్కున్నా మొత్తమ్మీద ద్రవ్యరాశి చూసుకుంటే బ్రెడ్డే ఎక్కువ. ఇక పోతే ఫ్రెంచ్ ఫ్రైస్. అంతేకాక అమెరికను ప్రభుత్వం సాధికారంగా ప్రకటించే ఫుడ్ పిరమిడ్ లో (పక్కన బొమ్మలో ఉన్నది) భోజనంలో సగానికి పైన పిండి పదార్ధాలు తినమని ప్రోత్సహించేవారు (ఈ మధ్యన కొంచెం మార్చారు లేండి)

అసలు విషయం ఏంటంటే, మన ఆధునిక జీవితాల్లో మన శరీరపోషణకి అవసరమైనంత పిండి పదార్ధం మనం భుజించే మిగతా పదార్ధాల (కూరగాయలు, పప్పులు, బీన్సు, పళ్ళు, ఇత్యాది) వల్ల కూడా సమకూరుతుంది - మనం పనిగట్టుకుని వేరే పిండి పదార్ధం తినాల్సిన అవసరమే లేదు. పిల్లల విషయం వేరే; నేను చెబుతున్నది పెద్దవాళ్ళ గురించి. ఇది కేవలం వొంటి బరువుగురించి బాధపడే వారు మాత్రమే కాదు, ప్రజలందరూ పట్టించుకోవలసిన విషయం. బరువు తగ్గాలనుకునే వారు మరీ శ్రద్ధగా పట్టించుకోవలసిన విషయం. బియ్యం, గోధుమ, బంగాళదుంప, పాస్తా - బై బై!!

దీన్ని గురించి ఇంకా లోతుగా శోధించ దలచిన వారు glycemic load chart అని వెతకండి. ఎన్నో ఉపయోగకరమైన వనరులు మీకు దొరుకుతాయి.
USDAవారి ఆధునీకరించబడిన పిరమిడ్ ని కూడ చూడండి - ఇక్కడ కూడా పనికొచ్చే సమాచారం చాలా ఉంది.

పర్యావరణం

చలికాలం రావడంతోటే అమెరికా వాస్తవ్యులకి చుక్కలు కనబడుతుంటాయి, ఇంటిని వేడిచేసేందుకు హీటింగ్ బిల్లులు కడుతున్నప్పుడల్లా.
ప్రోగ్రామబుల్ ఆటోమేటిక్ థర్మోశ్టాట్ ఉండడం తప్పని సరి. ఇల్లు మరీ పాతది కాకపోతే తలుపులూ కీటికీలూ బహుశా పటిష్ఠంగానే ఉండవచ్చు. అయినా ద్వారబంధాల దగ్గర రబ్బరు ఫోము పట్టీలని అమర్చడం ద్వారా వేడిని కోల్పోకుండా నివారించవచ్చు. కిటికీలమీద విండో ప్రొటెక్టర్ ఇన్సులేషన్ పాలిథీన్ షీట్లని అతికించడం వల్ల కూడా మరి కొంత వేడి ఆదా అవుతుంది. ఈ చర్యలు డబ్బు రూపేణా పెద్ద ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు కానీ, ఆ మేరకు మనం తక్కువ ఇంధనాన్ని ఖర్చు చేస్తున్నామని తృప్తి ఉంటుంది. 12 యూనిట్లు కాల్చే చోట 10 తోనే సరిపెట్టగలిగితే మంచిదే కదా.

హీటింగ్ సిస్టములో బర్నర్/ఫర్నేస్ కన్నా ఆ వేడిగాలిని వ్యాపింపచేసే బ్లోయర్ ఫేను చాలా శక్తిని ఖర్చు చేస్తుంది. ఫర్నేస్‌లో ఉండే అయిర్ ఫిల్టరు ప్రతి ఏడూ మారుస్తూండాలి. సాధ్యమైనంత వరకూ గాలి ప్రయాణించే డక్ట్ మార్గాల్ని శుభ్రంగా ఉంచాలి. ఇటువంటి చిన్న చర్యల ద్వారా బ్లోయర్ ఫేన్ మరింత ఎఫిషియంట్‌గా పనిచేస్తుంది.

ఈ వారపు బ్లాగు

ప్రముఖ రచయిత, బ్లాగరి, శ్రీ కర్లపాలెం హనుమంతరావుగారు ఇప్పటి పత్రికలనించి తన దృష్టిని ఆకర్షించిన ఆసక్తికరమైన విషయాల్ని నాలోకం బ్లాగులో మనతో పంచుకుంటున్నారు. మీరూ ఓ లుక్కెయ్యండి.

Comments

Surya Mahavrata said…
టపాకి సంబంధంలేని వ్యాఖ్య వేసినందుకు క్షమించండి (ఎలాగూ ఆఖరి పేరాలో సినీమా ప్రస్తావన వుంది కనక కొంతవరకు ఫర్వాలేదని నా నమ్మిక) మాయాబజార్ సినిమాలో ఒక చోట లక్ష్మణ కుమారుడు డ్రస్సింగ్ టేబిల్ ముందు నిలబడి స్వీయసౌందర్యానికి ముగ్ధుడై "సమయానికి తగు మాటలాడి" పాటని హమ్మింగ్ చేస్తుంటాడు. అది ఈమధ్యకాలపు త్యాగరాజుగారిది కదా, ద్వాపరయుగంలోకి ఎలా పైరేట్ అయిందబ్బా అని నాకు ఆశ్చర్యం.
@surya - excellent observation.
నా సమాధానం - త్యాగరాజ కృతి లేకపోవచ్చు కానీ ఆరభి రాగం అప్పణ్ణించీ ఉన్నదనుకోవచ్చు. అందుకే హమ్మింగ్ తో సరిపెట్టారు గదా.
సినిమా ప్రస్తావన ఉన్నది ఆఖరి పేరా కాదు, దానికింద టపా ఇంకా చాలా ఉన్నది! :)
Surya Mahavrata said…
అయ్యయ్యో క్షమించాలి తరవాతి హెడ్డింగుని పరాకున తదుపరి బ్లాగుగా ఊహించుకుని రాంబంటునే ఆఖరి పేరాగా భావించేను. చేదైన చక్కెర మీద, వణికించే వెచ్చదనం మీద వ్రాసిన విశేషాలు బాగున్నాయి. ఇప్పుడు ఇంకో ధర్మ సందేహం. మన దాక్షిణాత్యులు తిన్నట్టే ఇతర ఆసియా దేశాలవాళ్ళూ కూడా అన్నమే తింటారు కదా! ఎందుకు దక్షిణ భారతదేశపు శరీరాలే కప్పని మింగి నిటారుగా నిలబడ్డ పాములా పైనాకిందా సన్నంగా, మధ్యంలో మాత్రం ఎత్తైన పొట్ట కలిగి ఉంటాయి? వీలుంటే వ్రాయండి.
astrojoyd said…
ఎందుకు దక్షిణ భారతదేశపు శరీరాలే కప్పని మింగి నిటారుగా నిలబడ్డ పాములా పైనాకిందా సన్నంగా, మధ్యంలో మాత్రం ఎత్తైన పొట్ట కలిగి ఉంటాయి? వీలుంటే వ్రాయండి.----రతిక్రియను భోజనం తర్వాత కొనసాగిన్చడంవల్ల.భోజనం తిన్న ౩ గంటలవరకు పొట్ట కదలికలకు లోనుకారాదు.రతి తర్వాత భోజనం చేసే వారికి పొట్ట రాదు .
హ్మ్ బావున్నాయి కబుర్లు ముఖ్యంగా పిండి పదార్థాల గురించి, పర్యావరణం గురించి. మా ఆర్థికశాస్త్రవేత్తలకి ఈ పర్యావరణం పెద్ద గుదిబండ అయిపోయిప్పుడు.

సూర్య...బలే గమనించారే, నాకెప్పుడూ తట్టలేదు సుమీ!
కబుర్లకీ శాఖలు కేటాయించేశారా! హుమ్.. వార్తలు ఎక్కువ చూస్తున్నారేమిటి?
చక్కెర కి అలవాటు పడటమనేది కొత్తగా వింటున్నాను. అయితే కాఫీ,టీ ల్లో చక్కెర కూడా దోషే అన్నమాట.
స్పందించిన మిత్రులందరికీ నెనర్లు.
@ మందాకిని, టీవీలో వార్తలు అసలు చూడనండీ - కారు నడుపుతూండగా రేడియోలో వినడమే. కబుర్లు ఇలా శీర్షికలుగా విభజించి రాయడం ఇది మూడోవారం. కొంతకాలం ఇలా కంటిన్యూ అవుతాను బహుశా.
కొత్తపాళీ సార్ బాగుంది ఆరోగ్యం పై మీ వర్ణన.
మాలతి said…
ఇంటికొచ్చాక ఒక రెండు గరిటల అన్నంలో అంత పెరుగు, ఒక ఆవకాయ బద్ద వేసుకుని తింటే తప్ప నిద్ర పట్టేది కాదు. -:)) నాక్కూడా అంతే ఇప్పటికీను..
ఇందు said…
బాగున్నాయ్ సర్ మీరు చెప్పిన విశేషాలు.పర్యావరణం గురించి మీరు వ్రాసినవి బాగున్నాయ్..ఇంకా ఆరొగ్యం..ఆ హీటర్ల విషయం కూడా...చక్కెరతో నిండిపోయినా ఆహార సంస్కృతిగురించి బాగ వివరించారు :)
బాగున్నాయ్ సర్ మీరు చెప్పిన విశేషాలు ..మంచి మంచి విషయాలు బాగ వివరించారు
మీ కబుర్లు చదువుతుంటే ఒక విషయం గుర్తొచ్చింది. మాకు తెలిసిన వారబ్బాయి 'శ్రీనివాసయ్యంగార్ ' తన పేరు చెప్పమంటే 'అయ్యంగార్ ' అని చెప్పేవాడు. స్కూల్లో ఆ పేరు లోంచి గారు తీసి 'అయ్యం ' అని పిలిచేవారు...