2010 - అమెరికా విహంగ వీక్షణం

2010 అమెరికాకి పెద్దగా అచ్చిరాలేదు. ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగానే కొనసాగుతున్నది. దేశంలో నిరుద్యోగం పదిశాతం నించి దిగిరాను అని భీష్మించుకుని ఉండగా, ఆర్ధిక సూచికలన్నీ ఎక్కడ ఎవరు తుమ్మినా కిందికి వాలిపోయేందుకు సిద్ధంగా వణుకుతూ కూర్చుని ఉన్నాయి. ప్రభుత్వపు స్పందన కూడా - ఒక పక్కన ఏమి చెయ్యాలో పాలుపోనట్టు, మరోపక్కన ఏమిచేస్తే ఇంకేమి ఉపద్రవంగా పరిణమిస్తుందో అని భయంతో ఉన్నట్టుగా ఉంది.

బయట ప్రపంచంలో ఇరాకులో ఆఫ్ఘనిస్తానులో పరిస్థితులు పెద్దగా మారింది లేదు. దీనికితోడూ ఇరాకులో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఒక కొత్త ప్రభుత్వాన్ని నిలబెట్టలేక పోయినాయి. ప్రభుత్వ ఏర్పాటుకి వివిధ వర్గాలతో చర్చలు లావాదేవీలు తొమ్మిది నెలలపాటు సాగిసాగి మొన్నటికి మొన్ననే ఇదిగో తయారైపోయింది ప్రభుత్వం అని ప్రకటన వచ్చింది. తతంగం తెలుగు టీవీ సీరియల్లా సాగుతూ ఉంటే మరి సలహాదారు పాత్రలో ఉన్న అమెరికను సలహాదారులు ఏమి చేస్తున్నారో అర్ధం కాదు. ఆఫ్ఘనిస్తానులో పరిస్థితి, తనకి తోడున్న పాకిస్తానుతో కలిసి - కరవమంటే కప్పకి కోపం చందాన తయారైంది. ఏతన్మధ్య తన దేశంలో తన ప్రతిష్ఠని కొంచెం పెంచుకునేందుకు ఆఫ్ఘను అధ్యక్షుడు చీటికి మాటికి అమెరికా మీద చిరాకు పడ్డం ఎక్కువైంది. ఇన్ని తలకాయ నెప్పుల మధ్య అమెరికా రాయబారి రిచర్డ్ హోల్బ్రూక్ గారి హఠాన్మరణం అమెరికా ప్రయత్నాలకి పెద్ద దెబ్బ. ఆఫ్ఘను వ్యవహారంలో హోల్బ్రూక్ అమెరికను ప్రభుత్వానికి పెట్టనికోటలాగా ఉండి అతి సున్నితమైన వ్యవహారాన్ని తొణక్కుండా నడిపిస్తూ వచ్చారు ఇప్పటిదాకా. ఆయన నిష్క్రమణని భర్తీ చెయ్యడం కష్టమే.

బ్రిటిష్ పెట్రోలియం ఆధ్వర్యంలో పనిచేస్తున్న సముద్రపు చమురు బావి, డీప్ వాటర్ హొరైజన్ ఏప్రిల్లో పేలిపోయి, అమెరికను చరిత్రలోనే కాదు, నాగరిక మానవచరిత్రలోనే అతి దారుణమైన పర్యావరణ దుర్ఘటన సంభవించింది. అమెరికా మెక్సికో దేశాలకి సంయుక్త తీరంగా ఉన్న గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్రంలో జర్గిన దుర్ఘటన అమెరికాలో ఫ్లారిడా, లూయిసియానా, మిసిసిపీ, టెక్సస్ రాష్ట్రాల సముద్ర తీరాలపైన భయంకరమైన దుష్ఫలితాల్ని కురిపించింది. దుర్ఘటన జరిగింది అని తెలిసిన క్షణాన్నించీ ఇప్పటి వరకూ కూడా అమెరికను ప్రభుత్వం స్పందించిన తీరు చాలా అసంతృప్తిని కలిగించింది. మొదట్లో, అబ్బే ఇదేం పెద్ద ప్రమాదం కాదు అని చెబుతూ వచ్చినదల్లా, జరిగిన ప్రమాదం నిజంగానే చాలా ఘోరమైనదని తెలియంగానే, చమురుబావి గుత్తేదారు అయిన బీపీ కంపెనీని తిట్టడం, ఎట్లాగైనా వాళ్ళదగ్గర్నించి నష్ట పరిహారం వసూలు చేస్తాం అని బీరాలు పలకడం - ఏడేళ్ల కిందట అదే ప్రాంతంలో జరిగిన కట్రీనా హరికేన్ దుర్ఘటనకి స్పందించడంలో బుష్ అధ్యక్షతలోని ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసిందో, ఇప్పుడు ఒబామా అధ్యకషతలోని ప్రభుత్వం కూడా అన్ని తప్పులూ చేసింది. తప్పుల వల్ల ప్రాంతపు ప్రజలు మాత్రమే కష్టాలపాలయ్యారు - ఇప్పటి వైఫల్యం వల్ల ప్రాంతం మొత్తం (సముద్ర గర్భం, సముద్ర ఉపరితలం, కోస్తా ప్రాంతం, తీరాన్ని దాటి, భూమిలోకి చొచ్చుకుని వచ్చే నదీముఖాలు - మొత్తం పర్యావరణం) తీవ్రంగా గాయపడింది. ఇప్పటికి యాభయ్యేళ్ళ తరవాత కూడా దుర్ఘటన ఫలితాల్ని ఇంకా కొత్తగా కనుగొంటూ ఉంటారని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

నవంబర్లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ బాగా పైకొచ్చింది. దిగువచట్ట సభయైన కాంగ్రెస్లో స్పష్టమైన మెజారిటీ సాధించి, ఎగువ సభయైన సెనేట్లో కూడా కొన్ని సీట్లు అదనంగా గెల్చుకోవడంతో ఇప్పటిదాకా కొనసాగిన డిమోక్రాటిక్ పార్టీ (అధ్యక్షులు ఒబామా గారి పార్టీ) ఉధృతానికి గట్టి కళ్ళెమే పడింది. తమ పార్టీ పరాజయానికి ఒబామా తానే బాధ్యత వహిస్తున్నానని ఒప్పుకున్నారు. ఎన్నికల అవమానాన్నించి బయటపడడానికా అన్నట్టు, ఎన్నాళ్ళుగానో పెండింగులో ఉన్న బిల్లుల్ని నవంబరు-డిసెంబరు రెండు నెలల్లోనే ఉభయసభల్లోనూ ఎట్లాగొట్లా ఆమోదింపజేసి చట్టాలు తయారు చేసేశారు. రెండు నెలల్లో జరిగిన చట్ట ప్రక్రియ ఒబామా అధ్యక్షతలో ఒక కొత్త పార్శ్వాన్ని ఆవిష్కరిస్తున్నది - తనుకోరిన ఫలితాల్ని చట్టసభలో నిజంగా సాధించ దలుచుకుంటే ఒబామా తాత్సారం చేసే మనిషి కాదని తద్వారా నిరూపించుకున్నారు.

ఒబామా భారత పర్యటన రెండు పక్కలా కొంచెం అయోమయాన్నే మిగిల్చినట్టుగా ఉంది. దర్శకుడు భాస్కర్ ఇటీవల తీసిన ఆరెంజ్ సినిమాలాగా, ఏవేవే చాలా భారీ అంచనాలతో హడావుడి చేసి, దేవదుందుభులు మోగించి, తీరా ముచ్చటకాస్తా జరిగిపోయినాక - ఏం జరిగిందిక్కడ? అసలేవైనా జరిగిందా? - అన్నటువంటి ఒకమాదిరి అయోమయమే కనబడింది ఇరుపక్షాల మొహాల్లోనూ. దీపావళి ముందు రోజు, సాధారణ భారతీయులు అత్యధికంగా షాపింగ్ చేసే రోజున ఒబామా తాజ్ హోటల్లో తిష్టవెయ్యడంతో దక్షిణ కొలాబా అంతా అష్టదిగ్బంధనమై పోయి, స్థానిక దుకాణదారులందరూ నెత్తీనోరు కొట్టుకున్నారుట - ఒబామాగారు మా వూరు రావడం, మా మధ్యలో తాజ్ హోటల్లో ఉండడం మాకు చాలా ఆనందదాయకమే, కానీ ఆయన దీపావళిరోజున కాక ఇంకో పూట వచ్చి ఉంటే బాగుండేదని దుకాణదారుల సంఇతి ప్రతినిధి ఒకరు అన్నారు. ఒబామాకి పొరబాట్న దెబ్బతగులుతుందేమోనని కొలాబాలో కొబ్బరి చెట్లన్నిటినించీ కాయలన్నీ కొట్టేసిన వారి ముందు చూపు, మరి విషయంలో ఎందుకు పని చెయ్యలేదో. క్రిస్మసుకి ముందు ఒక ముఖ్యమైన అమెరికను షాపింగ్ మాల్ని ఒక వారం పాటు చీమ అయినా కదలకుండా అష్టదిగ్బంధనం చేసేస్తే అమెరికన్లకి ఎలా వుంటుంది? ఇలా ఉంటాయి ప్రభుత్వ నిర్వాకాలు. ఐతే ఒక అమెరికా అధ్యక్షుడు భారత్ని - మిమ్మల్ని ఒక వ్యాపార రంగంగా చూస్తున్నాను, మీతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడమే ప్రస్తుతం నా లక్ష్యం - అని చెప్పడం ఒక మాత్రపు నిజాయితీని సూచిస్తున్నది. అభివృద్ధి అనీ, అణువొప్పందాలనీ, కాష్మీరూ పాకిస్తానూ అంటూ ఎటూ ఉపయోగం కాని సొల్లు కబుర్లు చెప్పడం, తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నాలు కాకుండా. పదేళ్ళ కిందట క్లింటన్ పర్యటనతో పోలిస్తే తేడా స్పష్టంగా కనిపిస్తుంది.

Comments

కొత్తపాళీ గారు మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
SRRao said…
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

SRRao
శిరాకదంబం
శ్రుతీ శుద్ధము లేకపోయినా మీకు ఆగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. :)

మీరు తీసుకున్న కొంగొత్త నిర్ణయాలన్నీ అవిఘ్నంగా అమలుపరచగలగాలని, మీ లక్ష్యాలు నెరవేరాలని మనసారా కోరుకుంటున్నాను.
జయ said…
సో, అన్ని చోట్లా ఇలాంటి వే రకరకాల సమస్యలే ఉన్నట్లున్నాయి.ఉందిలే మంచి రోజూ ముందు ముందూనా అని పాడుకోవాలేమో. మీకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.
kannaji e said…
భళీ... మీకు నవ ఆంగ్ల వత్సర శుభాకాంక్షలు