ఆచార్య అక్కిరాజు సుందరరామకృష్ణగారు

స్ఫురద్రూపం
శ్రావ్యమైన గళం
పద్యాన్ని అర్ధయుక్తంగా పాడే నైపుణ్యం
వెరసి ఆచార్య సుందర రామకృష్ణగారు

"శుంఠలకి చురకలు వేయడానికి సుందరరామకృష్ణ తోందరగా స్పందిస్తాడు. మాడు పగలగొట్టి మందు రాస్తాడు .." ఇవి ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుగారు శ్రీ రామకృష్ణగారి రచనని గురించి చేసిన వ్యాఖ్యలు.

వీరితో ఇంతకు మునుపు పరిచయం లేదు, ఇండియనాపొలిస్ సదస్సులోనే పరిచయం. పుట్టిపెరిగినది గుంటూరు జిల్లా నరసరావుపేట. హైదరాబాదులో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి ఇటీవలనే రిటైరయ్యారు. వ్యంగ్యం, హాస్యం, తెంపరితనం, సృజనాత్మకత - ఈ నాలుగూ వీరి కవితకి నాలుగు ముఖాలు. శ్రీరాజరాజేశ్వరీ అనే మకుటంతో వెయ్యిన్నెనిమిది పద్యాలు (దీన్ని సహస్రకం అనొచ్చా?) రాశారు. తిరుమలకి సంబంధించిన ఎవరో నిర్వాహకుల ఘనకార్యాలతో తన ఆత్మగౌరవానికి భంగం వాటిల్లగా ఆ ఏడుకొండలవానిపైననే కినిసి కోనేటి రాయుడికి తేనీటి విందు పేరిట అధిక్షేప త్రిశతి (ఎగతాళి చేస్తూ మూడొందల పద్యాలు) రాశారు. ఎంత కొమ్ములు తిరిగిన హేమాహేమీలైనా జడుసుకుని భయం చెప్పుకునే శనీశ్వరుణ్ణి చూసికూడా జంకని ధైర్యం రామకృష్ణగారిది - శ్రీశనీశ్వరా అనే మకుటంతో శతకం రచించారు. అనుకోకుండా ఇండియనాపొలిస్ సదస్సులో శ్రీ సుందరరామకృష్ణగారి పరిచయం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

ఇండియనాపొలిస్ సదస్సులో ధూర్జటిని గురించి చేసిన ప్రసంగాన్నించి కొన్ని తునకలు

Comments

Sanath Sripathi said…
కొత్తపాళీ గారు,
'తెలిసిన ' వారిని తెలియజేసినందుకు ధన్యవాదాలు. హైదరాబాదు కృష్ణదేవరాయాంధ్రభాషా నిలయంలో అష్టదిగ్గజాలపై వీరి ప్రవచనాన్ని 1992/ 1994 మధ్యలో విన్నట్టుగా గుర్తు. (స్పష్టంగా గుర్తులేదు, వీరో కారో)

అక్కిరాజు రమాపతిరావు గారికి వీరేమౌతారో మీకేమైనా తెలుసా? (వారినైతే నేను బాగుగానే ఎరుగుదును. ఆయనా తెలుగు సాహిత్యానికి చాలానే కృషిచేసారు)
Thanks కొత్తపాళీ గారు,

మీరన్నట్లు వీరి రూపం, స్వరం, పద్యం పాడిన విథానం, వ్యాఖ్యానం సమ్మోహనకరంగా(మెస్మరైజింగ్) ఎంతసేపైనా వినాలనిపించేట్లుగా ఉన్నాయి.
మొదటి వీడియోలో ధూర్జటి పై పద్యం కొంత తప్పుగా పాడినట్లున్నారండీ. "వనితా ఘనతా జనతాపహార" అని పాడారు. అసలు పద్యం "వనితా జనితా ఘన తాపహార" అని కద ఉండాలి?
మంచి పట్టే పట్టారు చంద్రమోహన్! మేమంతా రామకృష్ణగారి గానసుధారసవాహినిలో కొట్టూకుపోయి గమనించనే లేదు. జనతా ఘనతా అటుదిటయింది.
Unknown said…
He is the younger brother of Akkiraju Ramapati Rao garu (manjusri)

Vishnubhotla Lakshmanna
సుజాత said…
సుందర రామ కృష్ణ గారికిపేరు ఎవరు పెట్టారో గానీ సార్థక నామ ధేయులు! ఆయన గళం నాకు ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. ఎంతో స్పష్టత, శ్రావ్యత! పద్యాలు పాడుతుంటే అప్రతిభులమై వినాలనిపిస్తుంది. చిన్నారి చిట్టి గీతాలు అనే చిన్న పిల్లలల తెలుగు పాటల కాసెట్ లో ఆయన "తెలుగదేల యన్న" పద్యం పాడారూ...సాక్షాత్తూ రాయల వారే వచ్చి పాడుతున్న భావన కలిగింది.

ఆయన వ్యాఖ్యానాలు, ప్రసంగాలు, పద్యాలు అనేకసార్లు ప్రత్యక్షంగా విన్నాను(నరసరావు పేటలో కాదు, హైద్రాబాదులోనే!) . సంగీతమంటే ఎంతో ఆరాధన కల్గిన ఆయన వారి అబ్బాయికి తన అభిమాన రాగం పేరు "బిలహరి" అని పెట్టుకున్నారు. (పద్యాల్లో ఎక్కువగా బిలహరి వినిపిస్తుంది)

ఇక్కడి వీడియోలు ఇంకా చూడలేదు. చాలా స్లోగా లోడ్ అవుతోంది. తీసెయ్యకండేం! నెమ్మది మీద చూస్తాను.

సనత్ శ్రీపతి గారు,
అక్కిరారు రమాపతి రావు(మంజుశ్రీ) గారికి వీరు సోదరులే!
సుజాత, నిజం.
mmkodihalli said…
సుందరరామకృష్ణగారిని చాలా సభలలో చూశాను. ముఖ్యంగా భువనవిజయ సభలలో. వీరితో అంతగా పరిచయం లేదు. కానీ వీరి అన్నగారు అక్కిరాజు రమాపతిరావుగారితో కొంత పరిచయం వుంది. వారు నా పుస్తకానికి పీఠిక వ్రాశారు.
భలే భలే
వీరు గొంతు చిరపరితమే. దూరదర్శన్ లో చాలా కార్యక్రమమాలు చేసారు, పద్య నాటకాలు ఇత్యాదులు. ఈ మధ్యనే చిన్నారి చిట్టిగీతాలు అనే శి.డి కి ఉపోద్ఘాతం లో విన్నాను.
వీరు పద్యం పాడుతుంటే - అన్నీ మరచి చూడవలసినదే

అన్నట్టు, ఇప్పుడు మీ బ్లాగు మూస చాలాబాగుందండోయ్

చంద్రమోహన్ గారి వ్యాఖ్య చూసైనా రాకేశుడు ఇటు వచ్చిఉండాలే
-భవదీయుడు
Purnima said…
I've grown up watching him "n" DD serials! Thanks so much for this post.
Sanath Sripathi said…
అక్కిరాజు జనార్ధనరావు గారని రమాపతిరావు గారి తమ్ముడు. జర్నలిస్టుగా పనిచేసేవారు. వారి ఇల్లు త్యాగరాయ గానసభ ఎదురు సందులో మొదటిదే. అక్కడకి మానాన్నగారు, మా బాబాయిలూ తరచూవెళ్ళే వారు. సుందరరామకృష్నగారిని కూడా అక్కడ చూసిన జ్ఞాపకం, ఇప్పుడు గుర్తుకువచ్చింది.

ఉ.దం. ధన్యవాదాలు. ఈ శ్రావ్యమైన గొంతు ఈ మధ్యకాలం లో ఎక్కడ విన్నానా అని మథనపడుతున్నా. చిన్నారి చిట్టిగీతాలలోనా.. బతికించారు.
మురళి said…
టీవీ ద్వారా వీరి రూపం, గొంతు పరిచితమే.. వీడియోలు కొంచం స్లోగా లోడవుతున్నాయండీ..
Unknown said…
Wonderful blog sir. It is very good and nice.