కబుర్లే - ఎక్కువగా కళలగురించి

చాలా రోజుల (నెలల) తరవాత ఈ వారంతం చక్కటి కళాస్వాదనలో ఆహ్లాదంగా గడిచింది. మెట్టుమెట్టుగా కిందికి దిగిపోతున్న వాతావరణ ఉష్ణోగ్రతకానీ, రెండ్రోజులపాటు మావూరి ఆకాశాన్ని పట్టి విడవని ముసురుగానీ ఈ హాయిని ఇసుమంతయినా తగ్గించలేకపోయాయి.

శుక్రవారం సాయంత్రం పనులు తొందరగా చక్కబెట్టుకుని సాయంత్రం ఆరింటికల్లా బయల్దేరాను అరవై మైళ్ళదూరంలో ఉన్న ఏనార్బర్ నగరానికి. శుక్రవారపు సాయంత్రం రద్దీతో గంటంబావు పట్టింది గమ్యం చేరేప్పటికి. మిషిగన్ వివి వారి సంగీత కళాశాలలో మేకింటోష్ థియేటరులో ఏర్పాటయింది కచేరీ. నూటయిరవై మంది మాత్రం పట్టే చిన్న హాలు. విదుషి ఏ. కన్యాకుమారి, శ్రీ ఎంబార్ కణ్ణన్ గార్ల వయొలిన్ యుగళం. (ఒక కుంటి ప్రశ్న - ఇంగ్లీషులో అయితే సింపుల్‌గా డ్యూయెట్ అనేస్తాం. వాద్య ద్వయాన్ని యుగళం అనొచ్చా?) మృదంగం మీద శ్రీ శ్రీముష్ణం రాజారావుగారు, కంజిర మీద ఆయన శిష్యుడు, టొరాంటో నివాసి కార్తీక్ వెంకటరామన్ తాళవాద్య సహకారం. కన్యాకుమారి గారు చిన్నవయసునుండీ మహావిదుషీమణి ఎమ్మెల్ వసంతకుమారి ఆంతరంగిక వాయులీన సహాయకురాలిగా కచేరీలలో పాల్గొంటూ వసంతకుమారి (అది వారి గురువు జీ.ఎన్. బాలసుబ్రమణ్యంగారు ధారపోసిన) బాణీని పుణికి పుచ్చుకున్నారు. వసంతకుమారి కీర్తిశేషులైనప్పటినించీ ఎక్కువగా కదిరి గోపాలనాథ్ గారి శాక్సఫోన్ వాద్యానికి వయొలిన్ సహకారం అందిస్తూ వస్తున్నారు. ఈవిడ స్వంతగా కచేరీలిచ్చినది చాలా తక్కువ. ఎక్కువగా సహకారవాద్యాన్నే అందిస్తూ వచ్చారు. ఈ రోజు కచేరీ ఒక శ్రోతగా నాకు కనువిప్పు - కన్యాకుమారి గారు తన విద్యలో మరో పార్శ్వాన్నే కాదు, ఏకంగా విశ్వరూపం ప్రదర్శించారు ఆ వేదిక మీద.

కచేరీ అద్యంతమూ పూర్తిగా సాంప్రదాయ పద్ధతిలో ఉన్నట్టుగా ఉంటూనే ఇదివరకు అనుభవానికి రాని కొత్తవింతల్ని ప్రదర్శించింది. చక్కగా వర్ణంతో మొదలు పెట్టారు నాటకురంజిలో. వెనువెంటనే గణపతి ప్రార్ధన మహాగణపతిం నాటరాగంలో. కృతి చివర సాధారణంగా వచ్చే చిట్టస్వరంతో బాటు అద్భుతమైన చమక్కులతో చమత్కృతులతో కల్పనాస్వరాలను గుప్పించి వదిలారు. నేరుగా క్షీరసాగరశయనా అంటూ కృతిలోకి వెళ్ళిపోయారు దేవగాంధారిలో. దీనికి కూడా కృతిముగిసిన తరవాత రసవత్తరమైన స్వరప్రస్థారం చేశారు. దేవగాంధారి కొంచెం plaintiveగా ఉంటుంది, ఈ కృతిలో మరీను. అట్లాంటిది కన్యాకుమారి చేసిన రూపకల్పనలో plaintive natureని అధిగమించి ఒక తారస్థాయిని చేరాలనే ఉప్పొంగిన ఉద్వేగం కనబడింది - సారీ, వినబడింది. కర్ణరంజని అనే అంతగా పరిచయంలేని రాగంలో ముత్తయ్యభాగవతారి బొత్తిగా పరిచయం లేని కృతి తరవాత, మళ్ళీ ఆలాపన ఏమీలేకుండా నేరుగా కృతి అందుకున్నారు. నా చెవుల్లోని ప్రతీ జీవకణమూ అది శంకరాభరణమనీ, స్వరరాగసుధ అనే త్యాగరాజ కృతియనీ ఘోషిస్తున్నాయి. కానీ నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను - ఏవిటి నిజంగానే? ఛ, కాదు. అసలు శంకరాభరణం ఆలాపన లేకుండ ఎట్లా వాయిస్తారు? పోనీ స్వరరాగసుధ కాదేమో. ఏదో ఇంచుమించు అలాగే ఉన్న ఇంకో రాగంలో ఇంకో పాట యేదన్నానేమో? ఉహు, కాదు. రెణ్ణిమిషాల్లో నిర్ధారణ అవనే అయింది. ఆ పల్లవిలో అలలపై అలలుగా పేరుకుంటున్న సంగతులు, ఆ పాట స్వరరాగసుధ అనే నిర్ధారించేశాయి. ఏవిటబ్బా ఈ వింత? ఆలాపన లేకుండా? అయినా మన పిచ్చిగానీ రజతగిరీశుడు నగజకి దెల్పిన స్వరార్ణవ మర్మములను దెలిసిన త్యాగరాజు వెదజల్లే సుస్వరమాయ పరుచుకోడానికి ముందు ఆలాపన అనే అవలంబన కావాలా?

ముఖ్యాంశంగా నటభైరవిలో శ్రీవల్లీ దేవసేనాపతే, బహు విపులంగా, తాళవాద్యాల తని ఆవర్తనం యథావిధే. ఆ పైన ఎన్నెన్నో చిన్నచిన్న కృతులు, కీర్తనలు .. ఆనంద అలలో కొట్టుకుపోతున్నాను. మళ్ళీ తట్టిలేపిన ఒక వినూత్న అంశం .. ఏడు రాగాల మాలికలో గోవింద నామాలు. హ హ హ .. భలే. బహ్లే కాన్సెప్టు! నీనామమే మాకు నిధియు నిధానము .. ఇంకొక సాహిత్యము కావలెనా? శ్రీవేంకటేశా గోవిందా వేంకటరమణా గోవిందా .. గోవిందా హరి గోవిందా గోవిందా భజ గోవిందా .. రేవతి, వలజి, మోహన, హిందోళ, నాగస్వరావళి (రెండు రాగాలు ఇప్పుడు గుర్తు రావట్లేదు) .. అన్నీ ఐదు స్వరాల ఔడవరాగాలే .. గోవిందా, నీనామ మెంత రుచికరమయ్యా .. అదీనూ సప్తస్వరాలకి ప్రతీకలుగా నిలిచిన ఏడురాగాల్లో కూర్చితే, ఇహ అడుగుతావూ .. మధురాధిపతే, అఖిలం మధురం - మరోమాట లేదు. అటుపైన మధ్యమావతిలో (ఇదీ ఔడవరాగమే) భాగ్యదలక్ష్మిని రావించి (అయ్యవారి వెంటనే అమ్మవారూ రావాలి గద!) గబగబా శివరంజనిలో తిల్లానా చూపించేసి పవమానసుతునితో మంగళం పాడించారు. తోడు వచ్చిన మిత్రులందర్నీ యథాస్థానాల్లో దింపి ఇల్లు చేరేప్పటికి పన్నెండున్నర!

ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినవాళ్ళు ఎవరో iCarnatic.org అనగానే కొంచెం ఆశ్చర్యమైంది. మధ్య ఇంటర్వల్లో వాళ్ళే చెప్పారు. కర్నాటకసంగీతంలో గొప్పగొప్ప కచేరీలన్నీ ఎందుకు చెన్నై వాసులకి మాత్రమే లభ్యం కావాలి, ప్రపంచంలో నలుమూలల్ల్లో ఉన్న కర్నాటక సంగీత అభిమానులకి కూడా ఎందుకు అందకూడదు అనే ఉద్దేశంతో మొదలు పెట్టారట ఈ iCarnatic.org. బానే ఉంది ఐడియా.

శనివారం ఉదయం కంప్యూటరు మీద ఏదో పనులు చేసుకుంటూ ఉంటే అకస్మాత్తుగా స్ఫురించింది, అరె దసరాల ప్రత్యక్ష కవిసమ్మేళనం ఇవ్వాళ్ళేగద! పొద్దువారు సాదరంగా పంపిన ఆహ్వానాన్నించి సభాస్థలిలో అడుగుపెట్టాను. అప్పటికే కవితాగానం జోరుగా సాగుతున్నది. అడుగు పెట్తినదే తడవుగా పుంభావసరస్వతుల సాక్షాత్కారం కలిగింది. ఆహా, భలే నిన్నమాపు సంగీత సరస్వతి నేడురేపు సాహిత్య పుంభావ సరస్వతి. భేష్. తెలుగుపద్యం కామేశ్వర్రావుగారి అధ్యక్షతన సభ కడురమ్యంగా నడుస్తున్నది. నేను కొద్ది సేపు మాత్రం ఉండి. కొన్ని రసవత్తరమైన పూరణలు విని, కవిసభ్యులతోపాటు సరససల్లాపంలో పాలుపంచుకుని నిష్క్రమించాను. కార్యక్రమం మొత్తం పొద్దులో విజయదశమి సందర్భంగా ప్రకటితమవుతుంది.

మా స్థానిక భారతీయదేవాలయంలో మరొక వయొలిన్ ద్వయం కచేరీ జరిగింది శనివారం సాయంత్రం. నాపనులు ముగించుకుని నేవెళ్ళేప్పటికి రసకందాయంలో పడుతున్నది. పూర్వికళ్యాణిలో త్యాగరాజస్వామివారి జ్ఞానమొసుగుచున్నారు. అటుపైన ముఖ్యాంశంగా భైరవి రాగంలో ముత్తుస్వామి దీక్షితుల బాలగోపాలుణ్ణి ప్రత్యక్షం చేశారు. భాగ్యశ్రీ (హిందుస్తానీ వారి బాగేశ్రీ)లో రాగం తానం పల్లవి .. రసికుల కనురాగమై, రసగంగలో తానమై, పల్లవించింది. మళ్ళీ ఎన్నెన్నో బుల్లి బుల్లి హొయలు సోయగాలు, భారతియార్ పాటలు, కావడి చిందులు. కచేరీ ముగిసినాక తారసపడిన తమిళమిత్రులతో విచారించాను, ఎవరీ యువకులు? రామలక్ష్మణుల్లా ఉన్నారే? అరుణ్ రామమూర్తి, శివ రామమూర్తి - లాసేంజిలస్ వాస్తవ్యులు, అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు .. ఆహా ఏమి విద్య, ఎలా నేర్చారయ్యా? ఎంత చక్కటి సంగీత జ్ఞానం, ఏమా భక్తి? మాతృదేశాన్నించి పర్యటనలకి వచ్చే వర్ధమాన వాద్యకారుల కెవరికీ తీసిపోకుండా, చక్కటి సమన్వయంతో వాయించారే! జోహార్, జోహార్! ఈ సంగీత సరస్వతిని ఇలాగే ఆరాధిస్తూ ఇంకా గొప్ప ఆనంద శిఖరాలకు చేరెదరు గాక! శుభాశీస్సులు చిరంజీవులారా!!

రాబోవు వారాంతంలో (అక్టోబరు 9, 10) ఇండియానాపొలిస్‌లో తెలుగు సాహిత్యసదస్సు జరగబోతున్నది. నేను హాజరయి తెలుగుబ్లాగుల సాహిత్య సేవ అనే అంశం మీద ఉపన్యాసం దంచబోతున్నాను. సభ వివరాలు వారి బ్లాగులో.

పొద్దులో గిరిధర్ పద్య కావ్యం తప్పక చూడండి.

Comments

భాను said…
సంగీత కచేరీలకు మేమే హాజరయినట్లుగా అనిపించింది. మేము అక్కడ ఉన్న ఇంత స్పష్టంగా అదేంటో మాకు అర్థం కాదనుకుంటా. చాల బాగా వివరించారు నెనర్లు
రజతగిరీశుడు నగజకి దెల్పిన స్వరార్ణవ మర్మములను దెలిసిన త్యాగరాజు వెదజల్లే సుస్వరమాయ పరుచుకోడానికి ముందు ఆలాపన అనే అవలంబన కావాలా?

మీలాగా అంత చక్కని రివ్యూ రాయటానికి ఎంతటి సంగీత/సాహిత్య పరిజ్ఞానం ఉండాలో అనిపించింది.
కన్యాకుమారి గారి గురించి నాకు ఈ మధ్యనే తెలిసింది. మా ఆవిడకి కన్యాకుమారి గారంటే చాలా ఇష్టం. ఆవిడ గురించి చాలా గొప్పగా చెప్తుంటుంది. తితిదే వారు చేస్తున్న నాదనీరాజనం కార్యక్రమం మొదలయ్యింది కన్యాకుమారి గారి కచేరీతోనే. సంవత్సరం పాటు నిర్విఘ్నంగా సాగాక, వార్షిక సంబరాలలో భాగంగా మొన్న ఆగష్టు నెలలో మళ్లీ ఆవిడ కచేరీ ఏర్పాటు చేసారు. అప్పుడు విన్నాను ఆవిడ వయొలిన్ వాయించగా. స్వరఙ్ఞానం అట్టే లేదు కాబట్టి మీలా లోతుల్ని చవిసూసి ఆస్వాదించలేదు కాని, చాలా నచ్చింది ఆవిడ కచేరి. ఆవిడ వాయిస్తున్నంత సేపూ బాగా ఆనందిస్తూ వాయించారనిపించింది. మీరు ప్రస్తావించిన "గోవింద నామాలు" రాగమాలిక చివరి అంశంగా వాయించారు. శ్రోతలందరూ గొంతు కలిపారు ఆ నామలతో.

మీరు రాసింది చదువుతూంటే కచేరీ విన్నంత ఆనందం కలిగింది. మామూలుగా అయితే అందరూ "కొన్ని అనుభూతుల గురించి చెప్పలేమండి, అనుభవించాల్సిందే" అనేస్తారు. మీరు మాత్రం దానికి మినహాయింపు. మీ టపాల ద్వారా మమ్మల్నికూడా ఆ చక్కటి అనుభూతులకు లోను చేస్తున్నారు. నిజం చెప్పాలంటే, ఇంకో మెట్టు పైనే. ఎందుకంటే ప్రత్యక్షంగా ఆ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నా కూడా ఇంత చక్కగా అనుభవించలేము కదా.

మీరు ఇంకా తరచుగా సంగీత సాహిత్య కార్యక్రమాలకి వెళ్లాలని, అవి మాతో ఇలా పంచుకోవాలని కోరుతూ...
మిగిలిన రెండు అభోగి , మధ్యమావతి.నాకు తెలిసి నాగస్వరావళి లేదనుకుంట గుర్తు లేదు.
హర్షోల్లాసం .. నాగస్వరావళి ఔడవమే .. స్వరాలు - స, గ, మ, ప, ద. ఆవిడ వాయించిన రాగమాలికలో ఉన్నది. త్యాగరాజకృతి శ్రీపతే నీపద చింతనమే జీవనము అనే దాన్ని స్వర్గీయ కేవీ నారాయణస్వామిగారు చాలా విరివిగా పాడేవారు.

ఆభోగి - కరక్టు. ఇది కూడా ఉన్నది రాగమాలికలో.
మధ్యమావతి ఆ ఏడురాగాల మాలికలో లేదు. అందుకు ముడుపుచెల్లింపు అన్నట్టు ఆ రాగమాలిక వెనువెంటనే భాగ్యదలక్ష్మి వాయించారు. ఇప్పుడు ఆ మిగిలిపోయిన ఏడో రాగం గుర్తుకి రావట్లేదు!
భాను, కృష్ణపిర్య, హర్ష .. స్పందనకు నెనర్లు. నచ్చినందుకు సంతోషం. సంగీతాన్ని గురించి రాయడం కష్టం. సాధారణంగా పత్రికల్లో వచ్చేలాంటి రొడ్డకొట్టుడు రివ్యూలు రాయడం అస్సలు ఇష్టముండదు. ఐనా నేను సంగీతాన్ని గురించి రాసేవి నిజంగా సమీక్షలు కాదులేండి .. ఆ విన్న అనుభవాన్ని అక్షరాల్లో పెట్టేందుకు ప్రయత్నం - అంతే. దాన్ని గురించి మాటల్లో చదవడం ఆ మధుర సంగీతం విన్న ప్రత్యక్షనుభూతికి ప్రత్యామ్నాయం మాత్రం కాదు ఎప్పటికీ.

హర్ష, సతీసమేతంగా నా బ్లాగు పావనం చేసినందుకు సంతోషం. నువ్వూ ఏమన్నా రాస్తూ ఉండొచ్చుగా? ఏమీ లేకపోతే ఆర్యీసీలో స్పిక్‌మెకే అనుభవాలతో మొదలు పెట్టు. నేనుకూడా చాలాకాలంగా అనుకుంటూ ఉన్నా ఆ అనుభవాలు రాయాలని.
pi said…
I am uber JEALOUS! I badly wanted to go for that concert. I had a release didnt sleep for 48 hours, no way I could have driven without getting into an accident.

There are 2 concerts next Sunday Malladi Brothers & Pantula Rama. I think I know the violinist of Pantula Rama's concert. Violinist Malladi brothers are travelling with is from my music school. They should have rules against having 2 concerts on Same day.

Not to mention with all this I am Italian Neo realism film series in Berkeley.