తెలుగు సినిమాల్లో బోధనాత్మక గీతాలు

మొన్న మూడు ప్రభంజనాలు టపాకి వ్యాఖ్యలు రాస్తూ పలువురు మిత్రులు సీతారామశాస్త్రిగారి ప్రబోధనాత్మక పాటలు చాలావాటిని ఉదహరించారు, అవి తమకి ఉత్తేజం కలిగించాయి అంటూ. చూడగా ఈ పాటలు రెండురకాలుగా ఉన్నట్టు అనిపించాయి. ఒక రకం వ్యక్తిని మాత్రమే సంబోధించేవి. దేశాన్నీ, సమాజాన్నీ సంబోధించేవి రెండో రకం. ఈ రెండురకాలూ మన తెలుగు సినిమాల్లో కొత్తకాదు. తెలుగుటాకీల తొలినాళ్ళనుండీ అభ్యుదయభావాలు కలిగినవాళ్ళు, కొత్త సమాజాన్ని కాంక్షించిన వాళ్ళు, ఆదర్శాల్ని విప్లవభావాల్ని శ్వాసించి జీవించిన వాళ్ళు అయిన దర్శకులు, కవులు, రచయితలు సినీరంగాన్ని ప్రభావితం చేశారు. సినిమాలో కథా సందర్భం ఏదైనా, వ్యాపార వొత్తిళ్ళు ఎన్నున్నా ఈ మహానుభావుల ఆశయాలు సినిమాల్లో చోటు చేసుకుంటూనే ఉండేవి, ముఖ్యంగా పాటల రూపంలో.

అప్పట్లో చాలా సాధారణంగా ఉపయోగించిన ఒక పద్ధతి - సినిమా కథకి సంబంధం లేని ఒక భిక్షగాడో, బైరాగో వీధిలొనో, రైలు పెట్టెలోనో అలా జనాంతికంగా పాడుతున్నట్టు చిత్రీకరించడం, సినిమాకి సంబంధించిన ముఖ్య పాత్ర ఎవరో అటుగా వెళ్తూ ఆ పాట వినడం. చాలా వరకు ఈ పాటలు వేదాంతం బోధిస్తున్నట్టుగా ఉండేవి - షావుకారు సినిమాలో గుడ్డితాత పాడేపాట, చరణదాసి సినిమాలో రైలు ఏక్సిడెంటు జరిగేముందు బిచ్చగాడు పాడే పాట ఇలాంటివి. పెద్దమనుషులు సినిమాలో ముఖ్య పాత్ర అయిన తిక్కశంకరయ్య (రేలంగి) పాత్రే ఇలాంటిది. నందామయా గురుడ నందామయా అని సినిమా మొదట్లోనే వచ్చే పాట మొత్తం సినిమాకి నాందీ ప్రస్తావనలాగా అప్పటికే రాజకీయాల్లో వేళ్ళూనుకున్న కుళ్ళుని కడిగి ఎండేస్తుంది. దేశోద్ధారకులు సినిమాలో పద్మనాభం ఇలాంటి పిచ్చివాడి పాత్రే పోషించి "ఆకలయ్యి అన్నమడిగితే" అనే పాట పాడతారు. ఈ పాటకూడా రాజకీయాల్లో అధికారుల్లో ప్రబలిన అవినీతికి చాకిరేవులాంటిది. 80లలో వచ్చిన అనేక సినిమాల్లో పి.యెల్. నారాయణ ఇటువంటి పాత్రలు చెయ్యడంలో తనదైన ముద్ర వేశారు.

సినిమా కథలో సందర్భం ఉన్నా లేకపోయినా ఏదో నృత్య ప్రదర్శన జరుగుతున్నట్టు చూపి, అందులో పాటలు కొన్ని కేవలమూ వినోదం కోసమే రూపొందించినా చాలా సందర్భాల్లో ప్రబోధానికి ఉపయోగించారు. సరిగంచు చీరగట్టి (సినిమా గుర్తు లేదు) అనే పాటలో పల్లె వదిలి పట్నాలకి వలసపోతే చిక్కుల్లో పడతారని, ఉందిలే మంచి కాలం ముందు ముందునా (రాముడు భీముడు) దేశం బాగుపడాలంటే అందరూ కష్టపడి పనిచెయ్యాలనీ .. ఇలా. ప్రముఖ నటి వహీదారహమాన్‌తో తెరంగేట్రం చేయించిన ఏరువాక పాట (రోజులు మారాయి) రైతు కష్టాల్ని ఈ ఆఫీసర్లూ రాజకీయులూ పట్టించుకోరు అని అప్పుడే చెప్పింది. వెలుగునీడలు సినిమాలో కళాశాల వార్షికోత్సవ సందర్భంగా విద్యార్ధుల ప్రదర్శనలో శ్రీశ్రీ రాసిన పాట పాడవోయి భారతీయుడా ఎంత ప్రసిద్ధి చెందిందంటే - తరవాత్తరవాత పంద్రాగస్టు రోజున జనరంజనిలో ఈ పాట వెయ్యకుండా ఉండేవారు కాదు. కోడలుదిద్దినకాపురం సినిమాలో ఉజ్జ్వల భారతీయ చరిత్రని తలుచుకునే నీ ధర్మం నీ సంఘం నీదేశంను మరవొద్దు పాట కూడా పులకరింపచేస్తుంది. బడిపంతులు సినిమాలో ఇంచుమించు ఇదే సన్నివేశంలో అన్నగారు పాడే భారతమాతకు జేజేలు కూడా మంచి పాట.

హీరోలే అప్పుడప్పుడూ ఆవేశపూరితులైన సందర్భాలు లేకపోలేదు. 60లలో వచ్చిన సినిమాలు చాలా వాటిలో అన్నగారు ధరించిన పాత్రలతో ఇటువంటి వ్యాఖ్యానపు పాటలు చాలా చిత్రీకరించారు. పవిత్రబంధం సినిమాలో నాగేశ్వర్రావు ఘంటసాల గొంతుతో పాడిన శ్రీశ్రీ పాట - గాంధి పుట్టిన దేశమా యిది - ఆనాటి యువత నిస్పృహకి అద్దం పడుతోందనిపిస్తుంది. అప్పటి నిరాశ ఆకలిరాజ్యం సమయానికి సాపాటు యెటూలేదు అంటూ ఆక్రోశమయింది.

వ్యక్తిని సంబోధిస్తూ జీవితంలో విలువైనవి యేమిటో తెలియ చెబుతూ ఆత్మస్థైర్యాన్ని ప్రబోధించే పాటలకీ కొదువలేదు. వెలుగునీడలు సినిమాలో శ్రీశ్రీ రాసినదే కల కానిదీ విలువైనది బ్రతుకు కన్నీటిధారలలోనే బలిచేయకు అనే పాట ఎంత నిరాశలో కుంగిపోయిన వాళ్ళనీ తట్టిలేపుతుంది. డా. చక్రవర్తి సినిమాలో మనసున మనసై మనిషికి తనదనే తోడు ఎంత అవసరమో చెబుతుంది. బాలభారతం సినిమాలో మానవుడే మహనీయుడు (మళ్ళీ శ్రీశ్రీ పాటే) మానవుడు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ఉద్బోధిస్తుంటే అడవిరాముడు సినిమాలో కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని కృషితోనాస్తి దుర్భిక్షం అనే ఆర్యోక్తిని నొక్కి చెబుతోంది.

ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు సినిమాల్లో ఉద్బోధించే మంచి పాటలు ఎన్నో! మీరూ గళం కలపండి!!

Comments

గురూ గారూ,
మంచి అంశం ప్రస్తావించారు. నాకు తెలిసిన కొన్ని ప్రత్యేక గీతాలు చెప్తున్నాను చూడండి.

మాతృదేవత సినిమాలో డా. సి నారాయణ రెడ్డి గారు రాసిన 'మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మహిళ' అనే పాట
'పండిత నెహ్రూ పుట్టిన రోజు.. పాపలందరికీ పండుగ రోజు' - సినిమా పేరు గుర్తు లేదు :-(
'గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం'
'మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా..'
'జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా..'
'పుణ్యభూమి నా దేశం నమో నమామి'

ఇంకా గుర్తొస్తే మళ్ళీ వచ్చి చెప్తాను.
చాలా మంచి టాపిక్ తీసుకున్నారు.
నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన పాటల్లో ఒకటి:
"మౌనమే నీభాష ఓ మూగమనసా!"
* * *
నేను కూడా ఒక ప్రయత్నం చేసి గతంలో బ్లాగాను. :-)
http://sadudreams.blogspot.com/2007/12/blog-post_12.html
చెయెత్తి జైకొట్టు తెలుగోడా - పల్లెటూరు

ఇదిగో రాయలసీమ గడ్డ దీని కథ తెలుసుకో తెలుగుబిడ్డ - సీతయ్య

కలసి పాడుదాం తెలుగుపాట, కదలి సాగుదాం వెలుగుబాట - ?

కొంతమంది యువకులు ముందు యుగం దూతలు పావన నవజీవన బృందావన నిర్మాతలు - శ్రీశ్రీ - ?

విద్యార్ధుల్లారా నవసమాజ నిర్మాతలురా - రంగేళి రాజ

మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తి పరుడు - బాలభారతం

మనిషి.. ఎక్కడుంది ఎక్కడుంది మానవత, ఏమిటొయి ఏమిటోయి ఈ దానవత - మరో కురుక్షేత్రం

ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు.. , ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు.. , నడవరా ముందుగా.. అటో ఇటో ఎటో వైపు..
మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరి.., మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి - అంకురం

తెలుగుజాతి మనది నిండుగ వెలుగు జాతి మనది ప్రాంతాలు వేరైన మన అంతరంగమొకటేనన్నా - ?
తెలుగు వీర లేవరా!
దీక్ష బూని సాగరా!
దేశమాత స్వేఛ్ఛ కోరి
తిరుగుబాటు చేయరా!
(అల్లూరి సీతారామరాజు)
Unknown said…
anuvu anuvu velasina deva---manavudu daanavudu lonidi
అందరికీ - మంచి పాటలు సూచించారు. నెనర్లు.

Heart Strings - దయచేసి తెలుగుని తెలుగు లిపిలో రాయండి. లేదా పూర్తిగా ఆంగ్లంలో రాసినా సరే. అణువు అణువున .. చాలా మంచి పాట, కొద్దిగా క్రిస్టియను భావనలతో ఉన్నట్టుగా ఉంటుంది. బాలు గొంతులో ఆయా వాక్యాల అనుభూతుల్ని చాలా చక్కగా పలికించారు.
పరుగాపక పయనించవె తలపుల నావ
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
ఎదిరించిన(?)సుడిగాలిని జయించినావ
మదికోరిన మధుసీమలు వరించిరావ
Nrahamthulla said…
మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ
రాగంలో అను రాగంలో తరగని పెన్నిది మగువ.

ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియునికి వలపుల వల్లి,
రఘు రామయ్యనే కన్న తల్లి, సకలావనికే కల్ప వల్లి..

సీతగా, ధరణి జాతగా సహన శీలం చాటినది.
రాధగా, మధుర భాధగా ప్రణయ గాధలు మీటినది..

మొల్లగా కవితలల్లగా, తేనె జల్లులు కురిసినది..
లక్ష్మిగా, ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాన దూకినది