తెలుగు పాఠం - మే 4

ఆపాతమధురం అనే సమాసం తరచుగా తప్పు అర్ధంలో వాడుతున్నాము. ఈతప్పు వాడుక మనరాతల్లో ఈమధ్యన మరీ ఎక్కువగా కనిపిస్తున్నది.

ఈ పదబంధానికి మూలం సంగీత సాహిత్యాల ప్రాశస్త్యాన్ని చెప్పేందుకు ప్రసిద్ధికెక్కిన ఈ శ్లోకశకలం అయుండొచ్చు:

ఏకమాపాతమధురం అన్యదాలోచనామృతం

సంగీతం (చెవిన) పడినంతనే తియ్యగా అనిపించేది. మిగిలినదయిన సాహిత్యం ఆలోచనతో మధించడం వల్ల అమృతాన్నిస్తుంది అని స్థూలంగా దీని భావం.

ఆపాతము అంటే పడినది. ఆపాతమధురం అంటే పడినంతనే, అంటే మనం దాన్ని విన్నంతనే ఆహ్లాదాన్ని కలిగిస్తున్నది, వేరే ఏమీ కసరత్తు చెయ్యనక్కరలేకుండా. ఈ పదబంధంలో పాత అని అక్షరాల పొందిక చూసిన శ్లేషప్రియులెవరో దీన్ని ఆ "పాత" మధురం అని ప్రయోగించారు, శ్రావ్యమైన పాత సినిమా పాటల్ని గుర్తు చేసుకునేందుకు. బహుశా ఈవాడుక పత్రికల్లో మొదలయి ఉండొచ్చు, చమత్కారభరితమైన శీర్షికల కోసం పాత్రికేయుల వెంపర్లాట తెలియనిదేముంది? ఏదేమైనా తెలుసుకోవలసిన విషయం ఏమంటే, ఆపాతమధురం అంటే పాత సినిమా పాట కాదు అని.

ఈ కింది పదాలకి అర్ధాలు చెప్పండి - జాలంలో, నిఘంటువుల్లో వెతక్కుండా!
ధారాళం
చూడామణి
చమురు
బోలెడు
మిసిమి

Comments

అయ్యో!! ఆ పాత మధురాలు అని నేను ఎన్నోసార్లు వాడానే!:(.. పత్రికలలో, టీవీ చానెళ్లలో ఈ పదవాడకం చూసి బావుందిగా అనుకున్నా. మరి ఏమనాలి??

ధారాళం -- ఆగకుంఢా
చూడామణి .. తలలో ధరించే ఆభరణం
చమురు .. నూనె
బోలెడు .. చాలా
మిసిమి .. కాంతి
శ్లేష లేకున్నా మీరు చెప్పిన ప్రకారం అయినా ఆపాతమధురాలు అర్ధం బాగానే సరిపోయిందండీ :-) పాత పాటలు వినగానే ఆకట్టుకునే మధురాలే కదా :-)

ధారాళం : చాలా More than enough
చూడామణి : the best (శిష్య చూడామణి ని ఇలానే అర్ధం చేసుకుంటాను నేను:-) సరిగా తెలీదు
చమురు : crude oil / కొన్ని ప్రాంతాల్లో నూనె ను కూడా అంటారనుకుంటా దీపాల్లో పోసే నువ్వుల నూనెను/
బోలెడు : చాలా (Many) (ధారాళాన్ని వెలుగులాంటి వాటికి వాడితే బోలెడు వస్తువులగురించి చెప్పడానికి వాడతారు అనుకుంటున్నాను)
మిసిమి : వెన్నెల?? తెలీదు వాడుక సంధర్భం కూడా గుర్తు రావడం లేదు.

అర్థాలు ఆంగ్లం లో చెప్పినందుకు కోపగించరని తలుస్తాను :-)
నేను ఇప్పటి వరకూ ఆపాత మధురం అంటే పాత పాటలే అని అనుకుంటున్నాను...టీవీల్లో కూడా పాత పాటల ప్రోగ్రాంలకు 'ఆపాతమధురాలు' అని టైటిల్స్ పెడుతుంటారు...అందుకేనేమో మనసుల్లో బాగా ముద్రపడిపోయింది..

దారాళంగా - కంటిన్యూస్ గా.."నీరు ధారాళంగా వస్తుంది" అని అంటుంటాము..

చూడామణి - నా తెలుగు ఎగ్జాం నేను సొంతంగా రాసింది నిజమైతే :-) దీని అర్ధం 'స్త్రీ'

చమురు - నూనె (త్రినాధ వ్రతకల్పం బుక్లో దీపంలో చమురు పోసి అని వాడుతుంటారు..)

బోలెడు - అంటే చాలా అని..

ముసిమి -ప్చ్..తెలీదు..
@ జ్యోతి - ఏమనాలి? ఏమీ అనొద్దు. వాడొద్దని నేను అనలేదు, చమత్కారంలో తప్పులేదు, తెలుసుకుని వాడమని చెబుతున్నాను. మీరు కొంచెం తెరచాటుగా బ్రౌణ్యంలోకి తొంగి చూశారేమోనని నాకు అనుమానంగా ఉంది :)

@ వేణూ - నిజమే. ఈ పాయింటు కూడా ప్రస్తావిద్దాము అనుకుని మళ్ళీ తప్పు వాడూకని ప్రోత్సహించినట్టు అవుతుందని చెప్పలేదు. అర్ధాలు ఆంగ్లంలో చెప్పినా పరవాలేదు - మన పెద్దన్న చెప్పినట్టు పాండిత్యం కన్నా జ్ఞానమే ముఖ్యం!

@ శేఖర్ .. మీ వొట్టు బాగుంది :) పాత సినిమాల్లో .. నేనే మా యమ్మకీ అబ్బకీ పుట్టినోణ్ణయితే .. నేనే పతివ్రతనైతే .. అనుకుంటూ చదివే ప్రతిజ్ఞల పద్యాలు గుర్తొచ్చాయి.
అయ్యో! మీరు చూడొద్దన్నారుగా. చూడలేదండి బాబు . నమ్మండి..
Hima bindu said…
ధారాళం -అనర్గళం (నిరంతరాయం)
చూడామణి-శిరోరత్నం
చమురు -తైలం
బోలెడు -చాలా(మిక్కిలి)
మిసిమి -పసితనం
అవునో కాదో తెలిదు ఒక చిరు ప్రయత్నం :-)
ఇందులో మూడింటికి తెలుసు.
దారాళం = ఆగకుండా
చమురు = నూనె
బోలెడు = చాలా
సందిగ్ధంలో ఉన్నది ఒకటి
చూడామణి = స్త్రీ
తెలియనిది ఒకటి
మిసిమి..
భావన said…
చా కాస్త లేట్ అయ్యాను ఈ లోపు జ్యోతొకటి.. చెప్పనే చెప్పేసింది. నాకు తెలుసబ్బా ఆ అర్ధాలన్ని వెతక్కుండానే.
ధారళం గా గాలేస్తోంది
సీత తలపైని చూడామణి ఇచ్చింది హనుమంతుడికి
దీపం లో చమురు నిండుకుంది
బోలెడు కబుర్లున్నాయి/ బోలెడన్ని తప్పులున్నాయి
పచ్చని పసిమి మిసిమి ఆమె సొంతం

ఈ మాటలు చాలా సార్లే విన్నా రోజు వారి జీవితం లో.

ఆపాత మధురం అంటే ఆ పాట బాగుంది అని అర్ధం అనుకున్నా ఇన్నాళ్ళూ. జనరంజని ఇంకా రేడీయో ప్రోగ్రాం లు, టీవీ లో మొదట్లో శాంతి స్వరూప్, రోజా రాణి ఆ దుర్గమ్మ తెగ వార్తలు చదివే టప్పుడూ విన్నా ఈ మాట. హర్రెర్రే అలెలా అనుకున్నా నబ్బా...
సంగీతం ఆపాతమధురం, సాహిత్యం ఆలోచనామృతం అని మా పెద్దనన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు.

ధారాళం - ఆగకుండా, అనర్గళంగా
చూడామణి - తలలో ధరించేది, ప్రకాశాన్నిచ్చేది
చమురు - జిడ్డు కలిగినది, నూనె
బోలెడు - ఎక్కువ, చాలా
మిసిమి - కాంతి
అయ్యో నాకు కూడా తెలియదు. మంచి విషయం చెప్పారు.
@ చిన్ని .. చిన్నప్పుడు సంస్కృతం చదువుకున్నారా? :)

@ భావన .. తెలుగు పరీక్షల్లో ఉండేది, అర్ధం చెప్పడమే కాక వాక్యంలో ఉపయోగించాలి అని. ఇప్పుడు ఈ పదాలకి వాడుకలు వెదికే బాధ్యత తప్పించారు నాకు.

@ సవ్వడి, sowmya .. good show

@ విజయశర్మ గారు .. అందుకే కదండీ ఈ పాఠం! :)
Hima bindu said…
ఏదో తెలిసితెలిక చదివి ఆగలేక ఇలా సమాధానాలు రాస్తే ...హు ఇలా నన్ను ఎద్దేవా చేస్తారా ....నేను అలిగాను :-(
@ చిన్ని .. ఇది మరీ బావుందండీ! సంస్కృతం చదువుకున్నారా అని అడగడం కూడా తప్పేనా?
మార్చుకోండి పేర్చుకోండి మల్లెమొగ్గల్లారా
చిన్నిగారు అలిగిన వేళ అలకలు తీర్చే వారిపేరేమి?
Hima bindu said…
బాగుందండి :-) వ్యంగ్యం అనుకున్నాను ..సంస్కృతం పూర్తిగా చదవలేదుకానితెలుగు సాహిత్యం నాటి నన్నయ్య నుండి నేటి నన్నయ్య ల వరకు చదువుకున్నాను ...నిజానికి ఇష్టం కంటే అవసరానికి (ఉద్యోగం కొరకు ఒక ఆప్షనల్ )చదివాను.
ఈ పాఠానికి కొంచెం ఆలస్యంగా వచ్చాను, ఆపాతము అంటే పడేది కదా మరి జలపాతము సరైందా! జలాపాతము సరైందా.
వ్యాకరణం తెలిసీ తెలియని సందిగ్దతలో ఓ పిడకల వేట....
@కన్నగాడు .. మంచి ప్రశ్న. పాతము, ఆపాతము రెండూ ఒకే మూలాన్నించి వచ్చాయని తెలుస్తోంది. రెండిటికీ నిఘంటు అర్ధం ఒకటే. ఐతే విశేషార్ధం (వాడూకని బట్టి మారేవి)లో తేడా ఉందేమో ఎవరన్నా సంస్కృతం తెలిసినవాళ్ళు చెప్పాలి. జలపాతము, వర్షపాతము .. ఈ సమాసాలు అసలు waterfall, rainfall అనే ఆంగ్ల పదబంధాలకి తర్జుమాగా మన వాడుకలోకి వచ్చాయేమోనని నాకు అనుమానంగా ఉంది. పాతకావ్యాల్లో తెలుగులోగాని, సంస్కృతంలోగాని జలపాతం అనే వాడుక ఉందేమో ఎవరైనా తెలిస్తే చెప్పగలరు.