కబుర్లు - మే 17

ఏజాతి చరిత్ర చూసినా అని రాశాడు శ్రీశ్రీ. ఏ ప్రభుత్వ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అని రాసుకోవాలి. థాయ్‌లాండులో తన ప్రజలమీదనే దమనకాండ సాగిస్తున్నది ఆ "ప్రజా"ప్రభుత్వం. పూర్వకాలంలో రాజులు, నిరంకుశులు, నియంతలు నరహంతలు అనుకున్నాం. ఆధునిక యుగంలో తమ స్వంత ప్రభుత్వాల చేతిలో అసువులుబాసిన పౌరులెందరో. పాలిటిక్స్, గవర్నమెంట్ అనే మాటలకి రాజకీయం, ప్రభుత్వం అని ఫ్యూడలు మాటలు ఎలాగొచ్చాయో! మాటలదేముందిలే బుద్ధులూ అవేగదా.

అమెరికా దక్షిణ తీరం మొత్తానికీ బీపీకంపెనీ చమురుతో తలంటితే ఇప్పుడు అమెరికా ప్రభుత్వం బీపీ కంపెనీకే తలంటేందుకు చూస్తోంది అదే చమురుతో. ఏ ఒక్క ప్రమాద సంఘటనకైనా ఆ కంపెనీ లయబిలిటీ 75 మిలియన్ల డాలర్లట! నమ్మగలరా? ప్రస్తుతం ఆ చమురు వ్యాప్తిని నిరోధించడానికి సముద్రం మీద జరుగుతున్న పనులకే రోజుకి ఒక్న్ని పదుల మిలియన్ల ఖర్చవుతోంది. కొద్దివారాల క్రితమే తీరప్రాంతాల్లో చమురు పరిశోధనలకి కొత్త అనుమతులిస్తాము అని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, ఇప్పుడు ఈ ప్రమాదం జరగడంతో, అసలు ఈ దేశంలో ఈ చమురు మీద ఆధారపడ్డం ఏ స్థితిలో ఉంది, దీని పట్ల దేశవ్యాప్తంగా మన వైఖరి ఏవిటి అని ఆత్మావలోకనం చేసుకోవలసిన పరిస్థితి. ఇట్లాంటప్పుడే అమెరికను మీడియాలోని బోలుతనం మహా అసహనం కలగేజేస్తుంది నాకు. బీపీ అధినేతలు ఏమంటున్నారు, దానికి ప్రతిగా ప్రభుత్వం ఎట్లాంటి దండన చర్యలు చేపడుతుంది - ఇలాంటి పైపై విషయాలు తప్ప అవసరమైన అంతర్మధనం జరుగుతున్న జాడ లేదు.

పెరూవియన్ నవలాకారుడు మారియో వర్గాస్ లోసా రాసిన The War of the End of the World పూర్తి చేశాను. సుమారు 600 పేజీల నవలని మూడొంతులు వేగంగానే చదివేశాను కానీ చివరి నాలుగోవొంతుని ముగించడానికి కష్టపడాల్సి వచ్చింది. బ్రెజిల్ దేశంలో బాహియా అనే రాష్ట్రంలో 1896 - 1899 మధ్యలో జరుగుతంది కథ. ఇది టూకీగా చెప్పుకునే వ్యవహారం కాదు, చెప్పడమంటూ మొదలెడితే చాలా విపులంగానే చెప్పుకోవాలి. చూద్దాం, ఈ వారంలో రాసేందుకు వీలవుతుందేమో. అయినా ఒక పెరూవియన్ మనిషి ఎక్కడో బ్రెజిల్లోని ఒక మారుమూల రాష్ట్రాన్ని కథా స్థలంగా తీసుకుని అంత పట్టుతో రాయడం నాకు దిగ్భ్రమ కలిగించింది.

చుక్కల్లో చంద్రుడు, వినైతాండి వరువాయా అనే చిత్రరాజాల్ని చూశాను. చుక్కల్లో చంద్రుడులో అక్కినేని నాగేశ్వర్రావు గారి నటన అద్భుతం. నటనాజీవితం మొదలెట్టిన ఇన్నాళ్ళకి పరిణతి చెందిన నటన ఏమిటో ఆయనకి అనుభవంలో కొచ్చినట్టుంది మొత్తానికి. ఆయనే ఈ మధ్య ఏదో ప్రోగ్రాములోనో ఇంటర్వ్యూలోనో చెప్పుకున్నారు, నటన అంటే డయలాగులు వొప్పచెప్పడం కాదు అని తెలుసుకునేప్పటికి నటజీవితం అయిపోయింది అని. ఇదే సినిమాలో ఛార్మి కూడా, తన పాత్ర చిన్నదే అయినా, చాలా బాగా చేసింది అనిపించింది. ఇక రెండో సినిమా, వినైతాండీ వరువాయా నాకు విపరీతంగా నచ్చేసింది. ఈ సినిమాలో గొప్ప రివలేషన్ త్రిష. ఎంత బాగా చేసిందో. ఆ అమ్మాయి మాతృభాష తమిళం అన్నట్టు గుర్తు. అందుకని డయలాగులు తనే చెప్పుకుందేమో ననుకున్నా. కానీ ఎవరో డబ్బింగ్ చెప్పారు అని ఇప్పుడే నవతరంగంలో చదివా. ఛార్మిని గురించి, త్రిషాని గురించీ ఈ బ్లాగులో ఇదివరకు కొంచెం కృరమైన వ్యాఖ్యలు చేసి ఉన్నాను నేను. ఆ వ్యాఖ్యల్ని నిర్ద్వంద్వంగా ఉపసంహరించుకుంటున్నాను. ఆ అమ్మాయిలు టేలెంటున్నవాళ్ళే. మన దర్శక తేభ్యాలు దాన్ని ఉపయోగించుకోలేకపోతే మన ఖర్మం. దానికి ఆ అమ్మాయిల్ని తప్పు పట్టటం ఎందుకు?

వంగూరి ఫౌండేషన్ వారి ఉగాది రచనా పోటీల ఫలితాలు వెలువడినాయి. మన బ్లాగర్లు మంచి విజయాలు సాధించారు.
ఉత్తమ కథకి అబ్రకదబ్ర నగదు బహుమతి, తొలి కథకి వాసు ముళ్ళపూడి ప్రశంసాపత్రం, ఉత్తమ కవితకి నచకి, ప్రసాద్ సామంతపూడి ప్రశంసాపత్రాలు పొందారు. అందరికీ సభాముఖంగా మరోసారి అభినందనలు.

కథారచయిత, కవి, మంచికంటి వేంకటేశ్వరరెడ్డి సరికొత్తగా బ్లాగు మొదలు పెట్టారు. మీరూ ఓ లుక్కెయ్యండి.

Comments

వంగూరి ఫౌండేషన్ వారు, ప్రశంసాపత్రంతో పాటుగా కొన్ని విలువైన పుస్తకాలను కూడా బహుమతులుగా పంపారు.
ప్రసాద్ గారు, సంతోషం.
చౌదరి అని సంతకం పెట్టిన అజ్ఞాత .. తెలుగుని ఆంగ్ల లిపిలో రాసే వ్యాఖ్యలు ప్రచురించనని వొట్టేసుకున్నాను. దయచేసి తెలుగుని తెలుగులిపిలో రాయండి.
వినైతాండి వరువాయా తెలుగులో ఏ మాయ చేసావేగ తీసారు కదా, తెలుగులోనే చూసా బాగుంటుంది. ఈ సినిమా ఓ నాలుగైదు సార్లు చూసిన మా మిత్రుడు "సినిమా ఎన్ని సార్లు చూసినా మళ్లీ చుడాలనిపిస్తుంది, కానీ చూస్తున్నప్పుడల్లా హీరో వేరేవడైతే ఇంకా బాగుండేదనిపిస్తుంది" అని అన్నాడు.