మూడు ప్రభంజనాలు

ఆయన రచనలు చదివి నేను గొప్ప ఉత్తేజం పొందాను

ఆయన రాసిన పాటలు నా ఆలోచనల్ని మార్చడమే కాదు, నా జీవితాన్నే ప్రభావితం చేశాయి

ఆయన స్వరపరిచిన సంగీతం నన్నేదో లోకాలకి తీసుకుపోతుంది

పై మూడు వ్యక్తీకరణలూ నావి కావు, వివిధ సంభాషణల్లో వేర్వేరు మిత్రులు చెప్పినవి. ఆ మిత్రుల్లో ఆడా మగా ఉన్నారు, ఇరవై నించీ యాభై దాకా వయసుల వాళ్ళున్నారు, వేర్వేరు నేపథ్యాల వాళ్ళున్నారు.

ఆ ముగ్గురు వ్యక్తులూ
యండమూరి వీరేంద్రనాథ్
సిరివెన్నెల సీతారామశాస్త్రి
ఇళయరాజా



ఈ ముగ్గురూ తెలుగు నాట ఉదయిస్తున్న సమయంలోనే నేను తెలుగు నేలని విడిచి దూరంగా వెళ్ళటమూ, ఆటుపైన దేశాన్ని కూడా విడిచి సుదీర్ఘ ప్రవాసంలో ఉండడం వల్ల వీరి కళాభ్యుదయం నాకు అప్పట్లో పట్టలేదు. అలాగని బొత్తిగా పరిచయం లేకుండానూ లేదు.
యండమూరివి కొన్ని నవల్లు చదివాను, సిరివెన్నెలవీ, ఇళయరాజావీ కొన్ని పాటలు విన్నాను.

కానీ నాకివేవీ అంత గొప్పగానూ, జీవితాన్ని ప్రభావితం చేసేవిగానూ, వేరే లోకాలకి తీసుకుపోయేవిగానూ అనిపించలేదు.

ఎక్కడో ఏదో మిస్సయింది.

మీకు ఈ ముగ్గురిలో ఎవరిని గురించి అయినా నేను మొదట ఉటంకించిన లాంటి స్టేట్‌మెంట్లు చేసేంత అభిమానం ఉందా? ఐతే మీ అభిప్రాయం నాక్కావాలి.

ఏవిటి వీరిలో గొప్ప?
దయచేసి చెప్పండి.
నేను యెద్దేవాకీ వితండవాదానికీ అడగట్లేదు. నిజంగా తెలుసుకోవాలనే కుతూహలంతోనే అడుగుతున్నాను. నాక్కావాల్సింది సాహిత్య సంగీత తాత్త్విక విశ్లేషణ కాదు - చదివిన, విన్న, ఆస్వాదించిన ఒక మనిషిగా మిమ్మల్ని ఎలా కదిలించాయి వీరి కృతులు? అదీ నేను తెలుసుకోవాలంటున్నది.

ఇక్కడ వ్యాఖ్యగా చెప్పినా సరే, మీ సొంత బ్లాగులో టపా వేసినా సరే.

Comments

Unknown said…
ఈ క్రింది లింకునోసారి చూసి మీ అభిప్రాయం తెలియజేయగలరు.
http://kasstuuritilakam.blogspot.com/2010/04/blog-post_28.html
కొత్తపాళీగారు,
ముందు నన్ను క్షమించాలి, మీ టపా కంటే నా వ్యాఖ్య పెద్దగా ఉంది. ఏం చేయను.నాకు ఇష్టమైన వారి గురించి అడిగారు. ఈమాత్రం రాయకుంటే ఎలా?? :))
మన జీవన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, ప్రశ్నలు, సందేహాలు ఎన్నో ఉంటాయి. కొన్నిసార్లు ఏదైనా సంఘటన చూసినా, చదివినా, ఏదైనా పాట విన్నా కూడా మనకు నిజమే కదా అనిపిస్తుంది. అంతవరకు మనకు తోచని ప్రశ్నలు, సమాధానాలు ఆ రచనల్లో లభిచవచ్చు. ఎంతో మంది రచయితలు, సంగీత దర్శకులు ఉన్నా కూడా కొంతమంది మనను అంతో ఇంతో ప్రభావితం చెయకమానరు. అలా అని వారు చెప్పినవన్నీ నిజము, ప్రామాణికము, నమ్మి ఆచరించదగినవి అని చెప్పలేము. అదే విధంగా మీరు చెప్పిన ఈ ముగ్గురు ప్రముఖులు నావరకు కొంత ప్రభావితం చేసారు అని చెప్పగలను.

యండమూరి...కాలేజీ రోజులలో యండమూరి రచనలు ఎక్కువగా చదివేదాన్ని. అప్పుడు అతను దాదాపు ప్రతి ప్రముఖ వారపత్రికలలో సీరియల్స్ రాస్తుండేవాడు. అతని రచనలలో సస్పెన్స్ ఎక్కువ ఆకర్షించేది అప్పటి పాఠకులను. అలాగే ఎన్నో విషయాల ప్రస్తావన, వివరణ ఉండేది. ప్రార్ధన, కాష్మోరా, డబ్బు డబ్బు డబ్బు, చాలెంజ్,, ఇలా ... దాదాపు ఆ సమయంలో వచ్చిన యండమూరి నవళ్లు అన్నీ కొన్నాను.. అవి ఇపుడు అంత ఆసక్తిని కలగచేస్తాయో లేదో చెప్పలేను.

సిరివెన్నెల... సిరివెన్నెల కంటే గొప్ప పాటల రచయితలు ఉన్నారు. అందుకే ఇతనే గొప్పవాడు అని చెప్పలేను. కాని సిరివెన్నెల రాసిన కొన్ని పాటలు నా మనసులో స్టాంపు వేసినట్టుగా ఉండిపోయాయి. ఆ మాటలు నన్ను ఏ విధంగానూ ప్రభావితం చేయకపోయినా, ఆలోచింపచేసాయి. అప్పటికీ , ఇప్పటికీ మళ్లీ మళ్లీ వినేలా ఆకట్టుకున్నాయి. అందులో కొన్ని.. విరించినై వివరించితిని, ఆదిబిక్షువు వాడినేమి కోరేది, నమ్మకు నమ్మకు ఈ రేయిని,ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో...

ఇళయరాజా... ఇళయరాజా గురించి చెప్పాలంటే అతనో సంగీత మాంత్రికుడు. హాయిగా ఉండే సంగీతం అతని సొంతం. అతని సంగీతం మనకు లభించడం, ఆస్వాదించడం మన అదృష్టం. ఇళయరాజా సంగీతానికి ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది అనిపిస్తుంది. పాట తెలుగైనా, తమిళమైనా సరే ఇళయరాజా బాణీ ఇట్టే తెలిసిపోతుంది. అందుకే నేను ఇళయరాజా పాటలు ముఖ్యంగా ఇరవై ఏళ్ల క్రిందవి తెలుగు, తమిళం రెండూ ఇష్టపడతాను. ఇపుడు వస్తున్న శ్రుతి లయ లేని సంగీతం కంటే ఇళయరాజా సంగీతాన్నందించిన మధురమైన పాటలు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. ముఖ్యంగా ... స్వర్ణకమలం, రుద్రవీణ, వసంత కోకిల, మౌనగీతం, భద్రకాళి, అభినందన..
నన్ను ప్రభావితం చేసారో లేదో నాకు తెలియదు కాని వారి వారి రంగాలలో నాకు నచ్చిన వారు ఆ ముగ్గురే. వీరి ముగ్గురి గురించి నాకు పెద్దగా తెలీదు(ఎందుకంటే యండమూరి, ఇళయరాజా గారు నాకు ఊహ తెలిసే సరికి వారి ఉచ్చస్థితి నుండి వాలిపోయిన వారే) నాకు తెలిసిన నాలుగు ముక్కలు పనికొస్తాయేమో చూడండి.
యండమూరి: మహిళా రచయితలు రాజ్యమేలుతున్న కాలంలో ఒక వినూత్న పంథాలో నవలలు రాయటం ఆరంభించిన వ్యక్తి. కథవస్తువు గురించి సంబంధించి విశేషంగా విషయాలు సేకరించి రాసేవారు (బహుషా) ఆ పద్దతి ఆయనతోటే మొదలయ్యిందనుకుంటా. ఉదా: 'తులసీదళం'(1984 అనుకుంటా) నవలకోసం క్షుద్రోపాసకులు ఎలా ప్రవర్తిస్తారు, పూజలు ఎలా చేస్తారు అనేవి, అదే నవలలో కంప్యూటర్లు ఎలా పని చేస్తాయి అనే అంశాలు తడుముతారు. ఇంకో నవల 'వెన్నెల్లో ఆడపిల్ల'లో టెలొఫోను రిసెప్షనిస్టుల వైపునుండి పరిచయం, పెద్దగా ప్రజాభిమానం లేని 'చెస్' ఆట గురించి, ఇలా కాస్త కొత్త విషయాలను పరిచయం చేస్తూ, సస్పెన్సుతో కథను నడిపించటంలో ఆయన దిట్ట. ఈయన గారికి ఎంతమంది అభిమానులున్నారో అంతమంది వ్యతిరేకులు ఉన్నారు, కథలు కాపీ కొట్టారనే అభియోగం కూడా ఉంది (నిజమేనేమో 'తులసీదళం' నవల 'omen' సినిమాకు పోలికలు కనిపించాయి). ప్రజలు నవలలు చదవడం తగ్గించి సినిమాలు వైపు ఆకర్షితులవుతున్న సమయంలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన రచనలతో మళ్లీ జనాలతో పుస్తకాలు కొనిపించారు.
ఇళయరాజా: సంగీత దర్శకులు వారి పేర్లు తెలియని కాలంలోనే ఎందుకో ఈయన పాటలన్ని నచ్చేవి, తరువాత్తరువాత నాకు నచ్చిన పాటల్లో సింహభాగం ఇళయరాజా గారివని తెలుసుకున్నా. ఈయన సంగీతం ఇప్పటికీ ఎప్పటికీ ప్రాణం కోల్పోదు. ఆయన ఏ వాద్యాన్ని నేర్చుకోలేదు విన్నదాన్ని మరలా వాయించడం అయనకు అయాచితంగా వచ్చిన వరం అని(అంటే as it is గా ఇలాగే కాదు) ఏదో ఇంటర్వ్యూలో ఎస్.పి గారు ఇళయరాజా గురించి చేప్పారు. నాకు తెలిసీ ఆయన పాటల్లో వాడే వాయిద్యాల్లోనే ఆయన బలం దాగుంది(ఇప్పటి సంగీత దర్శకుల్లో వాయిద్యాలను అంత బాగా ఉపయోగించేది రెహమాన్ అనుకుంటా). ఆధునిక సాంకేతిక పరిఙానాన్ని అందిపుచ్చుకొని కొత్త కొత్త డిజిటల్ వాయిద్యాలను వాడి మనకు పరిచయం లేని శబ్దాలను పరిచయం చేసేవారు. పాశ్చత్య సంగీతాన్ని సంప్రదాయ సంగీతంలో ఎలా కలపాలో బాగాతెలిసిన వారు. నాకు సంబంధించినంత వరకు ఇళయరాజా పాటలు ఎక్కువ మటుకు విడుదలైన దశాబ్దాల తరువాత మొదటిసారి విన్నవే అయినా ఇప్పుడు వింటున్న పాటలకు అందనంత ఎత్తులోనే ఉన్నాయవి. అంతేకాదు నాకు తెలిసినంత వరకు ఈయన ఒక పాటనో మరొకటో ఫలాన దాని నుండి ఎత్తేసారనే నింద లేని మనిషి. ఈయన అసలు సిసలు ప్రతిభంతా బ్యాగ్రౌండు స్కోర్లో ఉంటుంది.ఈయన బ్యాగ్రౌండు మ్యూసిక్ ని పాటలా వాడుకున్న సందర్భాలున్నాయి.

సిరివెన్నెల: పాటలు కూడా తూటాల్లా వాడొచ్చని ఈయన సాహిత్యం చూస్తే అర్ధమవుతుంది. ప్రేమగా శివుడిని తిట్టిన('సిరివెన్నెల'లో 'ఆదిభిక్షువు' పాటలో), ఆవేశంతో సమాజాన్ని ప్రశ్నించినా('గాయం'లో 'నిగ్గదీసి అడుగు', 'సింధూరం'లో 'అర్దశతాబ్దపు అఙానాన్ని', 'రుద్రవీణ'లో 'చుట్టుపక్కల చూడరా') ఆయనకు ఆయనే సాటి. సరళమైన పదాలనెంత ఒడుపుగా వాడుతారో క్లిష్టమైన పదాలనూ అంతే ఒడుపుగా వాడేస్తారు. ఈయన పాటల రచయితల్లో నెం. వన్ కాకపోయినా తనదొక సుస్థిరమైన స్థానం. ఈయనగారి పాటలను విని దాని ఆధారంగా సినిమా కథను తయారు చేసుకున్న దర్శకులున్నారు (గాయం, చక్రం ఇది పబ్లిసిటీ స్టంటు కాదని నమ్మకంగా చెప్పలేను). మనిషి ఆశావాదం వైపు నడవమని చెప్పే ఈ పాట మీరు విన్నారో లేదో తెలీదు కానీ ఇక్కడ ఒక సారి తిలకించండి.
http://www.youtube.com/watch?v=K1-_h2iNcOw
Darn - I made a mess of things.
వ్యాఖ్యల మాడరేషన్లో పరధ్యానంలో ఉండి పొరబాట్న రిజెక్ట్ బొత్తాం నొక్కేసినట్టున్నా, వ్యాఖ్యలన్నీ పోయినై. బ్లాగర్లోని ఈ పొరబాటుకి "undo" ఏమీలేదా, వెనక్కి తీసుకోవడానికి? ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.

ముందుగా, శిరారావుగారికి, సౌమ్యగారికి, నాగమురళిగారికి నా క్షమాపణలు.
అదృష్టవశాత్తూ, మీ వ్యాఖ్యలు నా మెయిల్లో భద్రంగా ఉన్నయ్యి. అంచేత వాటిని నకలు-అతుకు చేసి ప్రచురిస్తున్నాను.
SRRao has left a new comment on your post "మూడు ప్రభంజనాలు":

కొత్తపాళీ గారూ !
మంచి చర్చను లేవనెత్తారు. ఆయా రంగాల్లో మూడు దిగ్గజాలమీద అభిప్రాయాలు చెప్పడం అంట సులువు కాదు. అయినా క్లుప్తంగా...
1 . మనం ఏ విషయం తీసుకున్నాం అనే దానికంటే చదువరుల చేత చదివించగలగడం ముఖ్యమని నా అభిప్రాయం. ఆ లక్షణం పుష్కలంగా వున్న రచయిత

యండమూరి. ఎవరేమనుకున్నా తన జీవితాన్ని తన ఇష్టమొచ్చిన రీతిలో గడపడానికి వెరవని వ్యక్తి. రచయితగా కమర్షియల్ గా ఎంత ఎత్తు ఎదిగినా

అహంకారం గానీ, గర్వం గానీ పెరగని మనిషి. ఎదుటివ్యక్తి స్థాయిని బట్టి కాక వ్యక్తిత్వానికి విలువిచ్చే సంస్కారి. ఆయనతో వున్న పరిచయంలో ఇది నా

స్వానుభవం.

2 . సిరివెన్నెల గారు సినీ రచయితగా ఇంకా ఎదగక ముందు కొద్ది పరిచయం. ఆయన మొదటి సినిమా పాట సినిమాకోసం రాసింది కాదు. ' జనని జన్మ భూమి

' చిత్రం క్లైమాక్స్ లో కావాల్సిన పాట కోసం అన్వేషిస్తుండగా ( ఆ అన్వేషణలో నాక్కూడా భాగం వుంది ) విశ్వనాథ్ గారికి జరిగిన సన్మానంలో చిన్నపిల్లల బుర్రకథ

వినడం జరిగింది. అందులో వారు పాడిన గంగావతరణ ఘట్టం అందర్నీ ఆకర్షించింది. అది రాసినది సీతారామశాస్త్రి గారు. దానిలో సినిమాకు తగ్గ మార్పులు

చేయించి వాడుకున్నారు. ఆయన పాటల్లో బాగులేదు అనిపించినవి చాలా తక్కువ.కొన్నిటిలో సాహిత్యం పెద్ద పీట వేసుకుంటే,కొన్నిటిలో భావం ప్రధానమవుతుంది.

ఏమైనా ఈ రెండింటినీ సమపాళ్ళలో రంగరించిన పాటలే ఎక్కువ కనబడతాయి.
3 . ఇళయరాజా - ఈయన పేరు చెబితే ' శిశుర్వేత్తి...' గుర్తుకొస్తుంది. ఇంతకంటే ఆయన గురించి ఏం చెప్పాలి. ఆయన ఏకాగ్రత, కృషి గురించి వీణ రంగారావు

గారు అప్పుడప్పుడు చెప్పేవారు. అప్పటికింకా ఇళయరాజా సింఫోనీ స్థాయికి చేరలేదు. కృషితో నాస్తి దుర్భిక్షం అనేదానికి ఆయనే ఉదాహరణ. సినిమా సంగీతాన్ని

సాంప్రదాయం, ఆధునికత మేళవించి జుగల్బందీ చేయించిన సంగీతజ్ఞుడు.
నా అభిప్రాయాలు రాద్దామని ఓ పెద్ద టపా రాసేసినట్లున్నాను. మీరు అడిగిన విషయ విస్తృతి అది. ఏమైనా మీకు ధన్యవాదాలు.
nagamurali (http://nagamurali.wordpress.com/) has left a new comment on your post "మూడు ప్రభంజనాలు":

మీరు చెప్పిన ముగ్గురిలోనూ ఒక్కరికి మాత్రమే నేను గట్టి అభిమానిని - ఇళయరాజాకి.

యండమూరి - నేనెప్పుడూ ఈయన రాసినవి ఏమీ చదవలా. కాబట్టి నాకసలీయన రచనలగురించి ఏమీ తెలీదు.

సీతారామశాస్త్రి - నా కొక్కిరాయి అభిప్రాయం ప్రకారం - తెలుగు సినిమాలకి పాటలు రాయడం అన్న ఒక శ్రాద్ధపు కార్యక్రమాన్ని కూడా పద్ధతిగా చేసే వ్యక్తి. టీనేజిలో ఈయన విశ్వనాథ్ సినిమాలకి రాసిన కొన్ని పాటలు గట్టిగానే ఆకర్షించినప్పటికీ ’ప్రభావితం (inspire)’ చెయ్యలేదు.

ఇళయరాజా - చిన్నతనంలో ఈయన సంగీతానికి వీరాభిమానిని. ఇప్పుడు ఒట్టి అభిమానిని. (నాకు సంగీతం గురించి అప్పుడు కానీ, ఇప్పుడు కానీ తెలిసింది పూజ్యం). ఈయన సంగీతంలో నన్నాకర్షించేది - శ్రావ్యత, సరళత, మెలొడీ, ఏదో ఒక catchiness. ఏ పాట విన్నా అందులో పామరులకి కూడా అర్థమయ్యే ఒక తీరు (order) కనిపిస్తుంది అందులో. ఆయన మెలొడీకి మనసంతా దిగులుగా, గుబులుగా అయిపోతుంది. Rahaman music ఇళయరాజా music కి higher octave అని నాకో అభిప్రాయం. (ఇళయరాజా సంగీతంలో కూడా చాలా కాపీలున్నాయని ఎక్కడో ఈమధ్య చదివితే చాలా బాధ కలిగింది. చాలా ఒరిజినాలిటీ కలిగిన వ్యక్తి ఇళయరాజా అని ఇంతకాలం భావిస్తూ వచ్చాను.)
sowmya has left a new comment on your post "మూడు ప్రభంజనాలు":

మధ్యలో ప్రభంజనం గురించి నేను చెప్పదలుచుకున్నానండీ

సిరివెన్నెలగారి పాటలంటే నాకు ఎంతో ఇష్టం. మొట్టమొదటగా నేను విన్నవి సిరివెన్నెల సినిమలోవే. అందులోనా "ఆదిభిక్షువువానినేమి అడిగేది" అనే పాట గొప్పగా అనిపించింది. చిన్నచిన్న పదాలతో గొప్పా భావాలను పొందుపరిచారు. ఆ పాట విన్నప్పుడల్లా ఏదో తెలియని గొప్ప అనుభూతి కలుగుతుంది. ఇది అని చెప్పలేను కానీ శక్తివంతంగా అనిపిస్తుంది. బహుసా అది భాష గొప్పతనమేమో మరి. తరువాత గాయం సినిమాలో "నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని" మరియు అలుపన్నది ఉందా ఎగిరే అలకు" అన్న పాటలు. నన్ను బాగా ఉత్తేజపరిచిన పాట అంకురం సినిమాలో "ఎవరో ఒకరు ఎపుడో ఒపుడు" పాట.

"ఎవరో ఒకరు ఎపుడో ఒపుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు
మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి
వెనుకవచ్చు వాళ్ళకు బాట అయినది"
......అన్న పదాలు నేను ఎప్పుడూ పాడుకుంటూ ఉంటాను. ఎందరో సంస్కర్తలు ప్రపంచం నలుమూలలా ఇలాగే ఆలోచించి ముందుకి కదిలి ఉంటారు. ఆ అర్థంలోనే నేను నా జీవితంలో ఎన్నో కొత్త పద్ధతులను ఆచరించాను. అవన్ని ఇప్పుడు రాయలంటే కష్టం కానీ ఏదో ఒకరోజు నా బ్లాగులో రాస్తాను.

"నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరానీ, ఎవ్వరు ఏమైపోనీ"

పాతరాతి గృహలు పాలరాతి గృహాలైనా, అడవినీతిమారిందా ఎన్నియుగాలైనా
వేట అదే, వేటు అదే, నాటి కథే అంతా,నట్టడువులు నడివీధికి నడిచొస్తే వింతా?
బలవంతులే బ్రతకాలని సూక్తి మరవకుండా శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్యకాండ"

........ఎప్పుడైన వ్యవస్థలో ఉన్న కుళ్ళుని చూసినప్పుడల్లా ఈ పాట గుర్తు వస్తుంది నాకు. నేనేమీ చెయ్యలేనా అని బాధపడినప్పుడు "ఎవరో ఒకరు ఎపుడో ఒపుడు" పాట గుర్తొస్తుంది. ధైర్యాన్ని ఇస్తుంది.

అలుపన్నది ఉందా ఎగిరే అలకు, యదలోని లయకు,
నాకోసమే చినుకై విరిసి ఆకాసమే దిగదా ఇలకు
.....ఈ పాట విన్నప్పుడల్లా ఏవేవో లోకాలకి వెళ్ళిపోతూ ఉంటాను.

ఈ మధ్య వచ్చిన "మహాత్మ" సినిమాలో
"తలయెత్తి జీవించు తమ్ముడా, తెలుగు నేలలో మొలకెత్తినానని కనుక తులలేని జన్మమ్మునాదని"
.......
తెలుగు చాలా ఇష్టమైన నాకు ఈ పాట గొప్ప ఉత్తేజాన్ని, ఆత్మవిశ్వాశాన్ని కలిగించింది. ఎన్నిసార్లు విన్ననో నాకే తెలీదు.

అన్నిటికంటే గొప్ప పాట:
"ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏక్షణం, విస్మరించవద్దు నిర్ణయం. అప్పుడే నీ జయం నిశ్చయం రా"

మానవుడు తన ఉనికి కొసం ప్రకృతితోనూ, వ్యవస్థ తోనూ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉండాలి అనే విషయాన్ని సూచిస్తుంది. జీవించాలనే గొప్ప ఆశని కలిగిస్తుంది. ఈ పాట "పట్టుదల" అనే సినిమాకోసం రాసినది. కానీ సినిమాలో రాలేదు.

ఇంకా చెప్పాలంటే
"జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాది, సన్యాసి జీవితం నాది

మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై
రవినై, శశినై, దివమై, నిస్నీ
నాతో నేను సహగమిస్తూ, నాతో నేనే భ్రమిస్తూ"
ఒంటరినై ప్రతి నిమిషం కంతున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాలా, హరిణాన్ని హరిణాల, చరణాల్ని చరణాల చలనాల కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని"
............
అహం బ్రహ్మాస్మి భావన. ఈ పాట గురించి నేను త్వరలో ఒక టపా రాస్తాను.

"నమ్మకు నమ్మకు ఈ రేయిని, కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి, మత్తులోన మెత్తగ తోసి కలలే వలగా విసిరే చీకట్లను"....గొప్ప పాట

"కనివిని ఎరుగని ఈ కల, నిజమని పలికెను కోకిల,
ప్రతి ఒక అణువున నేడిలా, అవనికి వచ్చెను నవకళ,
అలరులు కురిసిన ఈ ఇల మెరిసెను నూతన వధువులా, తొణికిన తూరుపు వెలుగిలా పుడమికి అలరెను మేఖల"
..........
ఈ పాట గురించి నేను ఒక టపా రాసాను.
http://vivaha-bhojanambu.blogspot.com/2010/02/blog-post.html

ఇలా అడుగడుగునా అణువణువునీ కదిలించే ఎన్నో ఆణిముత్యాలు సీతరామశాస్త్రిగారి కలం నుండి జారిపడ్డాయి. ఇంకా గొప్ప కవులు లేరని కారు, కానీ నాలో ఉత్తేజాని కలిగించింది పింగళిగారి తరువాత ఖచ్చితంగా సీతారామశాస్త్రిగారే.

కామెంటే టపా అంత పెద్దది వచ్చింది, ఏమీ అనుకోకండి.
యండమూరి,ఇళయరాజా ఇద్దరూ నన్ను బాగా ప్రభావితం చేసినవారే.విపులంగా వ్రాయాలంటే పెద్ద టపా అవుతుంది కాబట్టి క్లుప్తంగా చెబుతాను.

నేను చదివిన మొట్టమొదటి యండమూరి నవల ' థ్రిల్లర్ ' (ముత్యమంత ముద్దు సినిమా గా వచ్చింది).టీనేజ్ లో చదివిన నవలది.ఆ ట్రాన్స్ నుంచి బయటికి రావటానికి కొన్ని రోజులు పట్టింది.అప్పటినుంచి ఆయన రచనలు వీలు చేసుకొని చదువుతూనే ఉన్నాను.' విజయానికి ఐదు మెట్లు ' నా అలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తే,'పాపులర్ రచనలు చెయ్యడం ఎలా' నాలోని భావుకతకు పదనిర్దేశం చేసింది.ఈ మధ్య వ్రాసిన 'వీళ్ళనేం చెయ్యాలి ' నాకు నచ్చలేదు (అర్థం కాలేదు అనటం సబబేమో).

ఇళయరాజా గారి పాటలు ఎవర్గ్రీన్.రహమాన్ పాటలకంటే ఇళయరాజా పాటల్లో నాకు ఆత్మ కనిపిస్తుంది.
Purnima said…
నేను యండమూరి నవలలు చదవలేదు.

నాకు సంగీతంలో తెల్సింది ఏమీ లేదు, చెవులు అప్పగించి వినటం తప్ప. నేను సినిమా పాటలు ఎక్కువ వింటూ ఉన్నా, అందులో సాహిత్యంలోనే ధ్యాస పెడతాను. అంటే, నేను కొద్దో గొప్పో సిరివెన్నెల గారి గురించే మాట్లాడగలను. కాని ఇళయరాజా గారి గురించి నా అనుభవంలో ఒక రెండు ముక్కలు. సంగీతం, వాద్యపరికరాల గురించి నాకు అస్సలేమి తెలీదు. కాని, ఇళయరాజా పాటలు వింటుంటే ఏదో గమ్మత్తైన అనుభవం కలుగుతుంది. ఊసుపోక పాడుకుంటున్నప్పుడు, అసలైతే పాట పల్లవో, చరణమో గుర్తు వస్తూ ఉంటుంది. ఇళయరాజ పాటల విషయం వచ్చే సరికి - వాటిని రాగాలంటారో, ఏమో మరి - అవి నోటి మీద ఆడుతుంటాయి. పాట అయిపోయిన చాలా సేపటికి కూడా ఆ సంగీతం బుర్రలో ఆడుతూనే ఉంటుంది. ఈ క్షణాన ఈ కమ్మెంటు రాస్తున్న వేళ, "ఆకాశం ఏనాటిదో.." అన్న పాట తాలూకు సంగీతం (ఇటీవల విడుదలైన "పా"లో కూడా ఈ సంగీతం ఉంది) నా బుర్రలో ప్లే అవుతూ ఉంది. ప్లే అవుతున్న దాన్ని నేను బయటకి పాడి, నాకు ఏం గుర్తుందో చెప్పలేను. కాని, దాదాపుగా నాలుగు నిమిషాల సంగీతాన్ని నేను ప్లే చేసేసుకున్నాను. నాకు రెహ్మాన్, ఆర్.డి. బర్మన్ అన్నా ఇష్టం, కాని ఇలా గుర్తుండవు వారి పాటలు.

ఇహ, సిరివెన్నెల గారి దగ్గరకొస్తే, అల్ప పదాలతో అనంత భావాన్ని, భావోద్వేగాన్ని కలిగించటం ఈయన సొంతం. పై కమ్మెంట్ లో సౌమ్య ఆయనవి చాలా మంచి పాటలను ఉదహరించింది. వాటి అన్నింటితో పోలిస్తే, పెద్ద గొప్పగా అనిపించకున్నా, కొన్ని భావోద్వేగాలని ఆయన పలికించే తీరు, నా ఉద్దేశ్యంలో:

"నచ్చే కష్టం నువ్వు", "ప్రియ శత్రువు", "తీరని దాహం నువ్వు", "తప్పని స్నేహం నువ్వు" - ఈ కాలపు ఆడపిల్ల తను మనసుపడ్డ వాడిని ఇంతకన్నా బా వర్ణించలేదేమో అనిపిస్తూ ఉంటుంది ఈ పాట వింటుంటే.

అలానే అంతఃపురంలో, "అణువణువు అమృతంలో తడిసింది అద్భుతంగా" లాంటి కొన్ని లైన్లు, ఓహ్.. అమేజింగ్ అసలు.

రొమాంటిక్ ఏ కాకుండా, అన్ని రసాలనూ పలికించగలరాయన. కొన్ని పాటలు నాకు పరమ బోరింగ్ గా అనిపిస్తుంటాయ్, "నీ ప్రశ్నలు నీవే, ఎవరూ బదులివ్వరుగా" టైపు. సెల్ఫ్-హెల్ప్ కోచింగ్ ఏ రూపంలోనూ నాకు ఎక్కదు. కాని ఈయనవి కొన్ని పాటలు మాత్రం ఎక్కడెక్కడో నిద్రపోతున్న భావాలు తట్టి లేపుతాయి. దేశం గురించో, సమాజం గురించో, మనుషుల గురించో, వారి బంధాలను గురించో, మనిషిలోని అంతర్మధనం గురించో, లేక మనిషిని సృష్టించిన దేవుని గురించో.. ఆహ్, ఆయన ఒక్కో పదం, చీకటి పేరుకుపోయిన మన మూలాల్లో దీపం వెలిగిస్తుంటాయి.

సిరివెన్నెల సినిమాలో ప్రతీ పాటా ఒక ఆణిముత్యం. అక్షరం విలువ తెల్సి, దాన్ని సరైన రీతిలో వాడే అతి కొద్ది మందిలో సీతారామశాస్త్రి ఒకరు.
Anonymous said…
ఏవిటీ గొప్ప అంటేనండీ....
యండమూరి: చదివించే-కొనిపించే గుణం
సీ.శా: లిరిసిస్ట్ కాదు కవి అని నమ్మించకలగటం
ఇళయరాజా:పాట-దానికంటే రీరికార్డింగ్ లో దిట్టని అనిపించుకోగలగటం
ముగ్గురిలో కామన్ గొప్పతనం ఏవిటంటేనండీ...ఆయా రంగాల్లోని కమర్షియల్ ఎలిమెంట్ ని ఒడుపుగా పట్టుకోగలగటం...

(మీరు జగమంత కుటుంబం పాటకి పాత టపాల్లో తలంటినట్టు లీలగా గుర్తు..?)

ఏమైనా, మీతో కబుర్లు కాదండోయ్...!:)
వ్యాఖ్యలు రాసిన అందరికీ పేరుపేరునా నా ధన్యవాదాలు.
మరో విన్నపం అందరికీ - ఈ టాపిక్ గురించి మరింత విపులంగా ఉదాహరణలిస్తూ మీ మీ బ్లాగుల్లో రాయాలనిపిస్తే తప్పక రాయండి. నాకో కబురు చెప్పడం మరిచిపోకండేం.
అందరు చెప్పిన పాయింట్లూ బాగున్నాయి.

నావి మరికొన్ని ఆలోచనలు:
.. ఆత్మవిశ్వాసం, పట్టుదల, ఇలాంటి కొన్ని మౌలికమైన జీవిత విలువలు సాధారణంగా మన కుటుంబంనించీ, విద్యద్వారానూ, కొంతవరకూ మన చుట్టూ ఉన్న సమాజం ద్వారానూ వస్తాయి - అలాంటిది ఇవి సినిమాపాటల ద్వారా కలుగుతున్నాయి అంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతోంది.
యండమూరి అప్పటి తీరుకి భిన్నంగా రాశారు, చదివించేట్టు రాశారు, వివిధ విషయాలమీద వివరాలిస్తూ రాశారు, సస్పెన్సుని బాగా నడిపించారు - అన్నీ కరక్టే. ఇవన్నీ ఆయన రచనల్ని ఆసక్తికరం చెయ్యొచ్చు కానీ పాఠకుల్ని ప్రభావితం చెయ్యడం ఏముంది అందులో?
సంగీతాన్ని గురించి మాటల్లో చెప్పడమే చాలా కష్టం. అందులోనూ సినిమా సంగీతం గురించి మరీని. ఐనా ఇళయరాజా సంగీతాన్ని విని మీ అనుభూతుల్ని పంచుకున్నందుకు అభినందనలు.
Anonymous said…
ముగ్గురిలో ఇళయరాజాకి నేను వీరాభిమానిని.
సంగీతం గురించి నాకేమీ తెలియదు. కానీ
ఒక బాధొచ్చినా, కష్టమొచ్చినా, సంతోషమొచ్చినా
ఆ సంగీతం పంచుకుంటుంది. అందుకే అతని పాటలు
ఎప్పటివో అయినా కూడా ఈనాటికీ మొదటిసారి కలిగించినంత
అనుభూతిని కలిగిస్తాయంటే అతిశయోక్తి కాదు.

-పాటలోని మాటలు స్పష్టంగా వినిపిస్తాయి.
-సంగీతం హోరు వాటిని ఇసుమంతైనా ముంచేసినట్లుగా అనిపించవు.
-వినటానికి శ్రావ్యంగా, పొందికగా..తేటతెల్లని జలతారునో, సెలయేరునో చూసిన అనుభూతిని కలిగిస్తాయి.
-అతని పాటలు పదాలకనుగుణంగా ఉన్నట్లుంటాయి. ఒక విషాద గీతానికి ఒక రాగం పెట్టేసుకొని లిరిక్స్‌తో సంబంధం లేకుండా ఓ వాయించేసి ఉండవు. పదాలకు పెద్దపీట వేస్తారు.
- పాట ఆద్యంతమూ ఒకే రకమైన బాణీ ఉండకుండా రెండు రెండు లైన్లకీ ఒక కొత్త బాణీ ఉండటం...ఆ ముందు బాణికీ, ఈ బాణికీ మద్య ట్రాన్‌జిషన్ చాలా సహజంగా ఉండటం...ఏదో నీరు అలా ప్రశాంతంగా ప్రవహిస్తున్నట్లు...చాలా బాగా అనిపిస్తుంది.
- ఇంకా ముఖ్యంగా నచ్చేది నేటివిటీ. ముఖ్యంగా మన దక్షిణాది నేటివిటి అతని పాటల్లో ఉంటుంది. సాంప్రదాయ, ఆధునిక సంగీతాల జుగల్బంది ఉన్నప్పటికినీ అంతర్లీనంగా అవి మన పాటలు అనే ఒక ఫీలింగ్ కలిగిస్తాయి. బాణీలు మనవే పెట్టి అక్కడక్కడా ఆధునిక సంగీత పరికరాలు (చాలా సహజంగా) ఉపయోగిస్తారనిపిస్తుంది. మన పాటలనీ ఆ సంగీతానికి ట్యూన్ చేయకుండా, వాళ్ళ సంగీతాన్ని మన పాటలకు ఉపయోగిస్తారు.


ఇంకా చెప్పాలంటే వ్యక్తిగా కూడా అతనంటే నాకభిమానం. -దర్శకులు ఒక రికార్డింగ్ సెషన్‌కి ఆలస్యంగా వస్తే, లేచి వెళ్ళిపోతారట. సమయాన్ని పాటించకపోతే క్షమించరట. సినిమా పరిశ్రమలాంటి పరిశ్రమలో అలా ఎవరి నియమాలు వాళ్ళు పెట్టుకుని ఆ ప్రకారంగా వెళ్ళటం చాలా అరుదు.
రాధిక said…
పైన చెప్పినవాళ్ళందరితోనూ ఏకీభవిస్తూ నావి కూడా కొన్ని అభిప్రాయాలు.
యండమూరి వల్ల యువత కొంత మంది పుస్తకాలు,నవలలు వైపు ఆకర్షితులయ్యారు.ఆయన నవలలు సరళం గా వుంటూనే ఎంతో ఇంతో జ్ఞానాన్ని,కొద్ది వ్యక్తిత్వాన్ని కల్గిస్తాయి.[జ్ఞానం అదీ అంటున్నానని పెద్దగా ఊహించేసుకోకండి.ఆ వయసు వారికి అవసరమయ్యే రీతిలో చెపుతున్నాను వినండి అన్నట్టు గా కాకుండా భలే చెపుతారు]
సిరివెన్నెల గారు....అమ్మో నన్ను కదల్చకండి.ఈ విషయం లో నేను పుస్తకమే రాసేస్తాను.నేను వ్యక్తి పూజ చేస్తే గనుక అది ఆయనే.మిగతా వారికి అంత గొప్ప అనిపించకపోవచ్చు కానీ ఇది నా అభిప్రాయం.ఆయన పదాలతో గుండెను తడతారు.మనసు,కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తారు.గిలిగింతలు పెట్టే రొమాంటిక్ పదాలు,రక్తాన్ని ఉడికించే మాటలు,సమాజం తీరుని సూటిగా సరళం గా చెప్పే తీరు....అన్నీ బావుంటాయి.ఇలాంటివి చాలా మంది రచయితలు చేస్తారు గా అనొచ్చు.చాలా మంది రాస్తారు కానీ ఆయనలా రాయలేరు.ఆయన ఎప్పుడూ ఎక్కువగా వాడే పదం "మనిషితనం".ఆ మాటే నన్ను ఆయన్ని అభిమానించేలా చేసింది.
"ఒకటి రెండంటూ విడిగా లెక్కెడితే తొమ్మిది గుమ్మం దాటవు ఎపుడూ అంకెలు ఎన్నంటే.పక్కన నిలబెడుతూ కలుపుకు పోతుంటే లెక్కలకైనా అందవు సంఖ్యలు ఎన్నంటే" అంటారు.పైన సౌమ్య గారు చెప్పినవి చాలా తక్కువ :) కోట్లిస్తానన్నా అసభ్యం గా ఒక్క పాట కూడా రాయలేదిప్పటివరకు.మామూలు ద్యూఎట్లని కూడా ఎంతో భావయుక్తం గా మార్చేస్తారు."పూల చెట్టు ఊగినట్టు,పాల బొట్టు చిందినట్టు...ఝల్లు మంది గుండెల్లో ఎవరే నువ్వు" అని సున్నితం గా వర్ణిస్తారు.ముఖ్యం గా సామాన్యులకి సైతం అర్ధం అయ్యేట్టు,పదాడంబరత లేకుండా హాయిగా పాడుకునెలా రాస్తారు.
"కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు,చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు"
"నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవ సారం"
"ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా,గుడికో,గడకో సాగనంపక వుంటుందా"
"బాధైనా చేదైనా అన్నీ కొన్నాళ్ళే"
............... ఇలా చాలా పాటలు వున్నాయి సార్.మీరు ఆ పాటలు వినండొక్కసారి.నెను మికు మైల్ చెస్తాను.
ఇళయ రాజా గారి పాటలు వినడానికి హాయిగా వుంటాయి.పాడుకోడానికి సులువుగా వుంటాయి.
రాధిక said…
"నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో"
"పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువో అని
ఏతోడుకూ నోచుకోని నడకెంత అలుపో అని"...[అప్పటివరకు బంధాలు తెలియని వ్యక్తి కి ప్రేమ పుట్టే సందర్భంలొనిది]
"చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవ్తానని అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదు,అయ్య చుట్టమూ కాదు అయినా అన్నీ అంది మనీ మనీ"
"నిజం గా నెగ్గడం అంటే ...ఇష్టం గా ఓడడం అంతే"
"పసిడి పతకాల హారం ...కాదురా విజయ గీతం
ఆటనే మాట కర్ధం ...నిను నువే గెలుచు యుద్దం"
"తుంచిన పూలను తెచ్చి, అతికించలేను గానీ
చైత్రం నేనై వచ్చి...నా తప్పు దిద్దుకోనీ"....[తనవల్ల జరిగిన తప్పుకి ఒక కుటుంబం పడే బాధని చూసి సాయపడాలనుకునే వ్యక్తి కి చెందిన పాట]
"నిన్నటి స్వప్నం కోసం వెనుతిరిగి చూడకంటూ
రేపటి ఉదయం కోసం ముందడుగు వేయమంటూ"
"నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి"
"వెక్కెక్కి ఏడ్చే కన్నీళ్ళు ఉప్పన
ఫక్కుమన్న నవ్వే ఒక తేనె ఉప్పెన"
"ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడయ్యో
అందమైన జీవితాన్ని తాకి చూడయ్యో
ఒక్కటంటే ఒక్క లైఫే ఏడిపించకు దాన్నీ"
"నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపు గా నీ చూపు సాగదుగా"
"చుట్టమల్లె కష్టమొస్తె కళ్ళనీళ్ళు పెట్టుకుంటు
కాళ్ళు కడిగి స్వాగతించకు
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా లేనిపోని సేవ చేయకు"
"ఆశలు రేపినా,అడియాశలు చూపినా
సాగే గీవితం క్షణమైనా ఆగదుగా
నిన్న రాత్రి పీడకల నేడు తలచుకుంటూ నిద్ర మానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైన అందులోనే వుంటూ లేవకుండ వుండగలమా"[మోసపోయిన స్నేహితురాలికి ధైర్యం చెపుతూ సాగే పాట]
"ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా
గుండెబావిలో వున్న ఆశతడి ఆవిరి అవుతున్నా"[ఇది అయినవాళ్ళని వదులుకుని తనని ఇష్టపడ్ని ప్రేయసి కోసం తిరిగే ప్రేమికుడి గురించే పాట]
"ఎన్ని ఉరుములో విసరకుండ ఆ నీలినింగి కరిగిందా
ఈ నేలగొంతు తడిపిందా"
"ఎన్నో రుచులుగల బ్రతుకుంది
ఎన్నో ఋతువులతో పిలిచింది
చేదొక్కటే నీకు తెలిసింది
రేయొక్కటే నువు చూస్తుంది
ఉదయాలనే వెలివేస్తానంటావా
కలకాలమూ కలలోనే వుంటావా
మిత్రమా మిత్రమా శూన్యమే స్వర్గమా"....ఇది విలాసాలకు అలవాటుపడ్డ స్నేహితుడిని ప్రశ్నిస్తూ సాగే పాట.
"దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి
స్నేహం తో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
దరి దాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా
తనలో ఆ ఉరవడి తెచ్చిన తొలి చినుకేదంటే
సిరి పైరై ఎదిగే వరకు చేనుకు మాత్రం తెలిసిందా
తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే"...[ ప్రేమ గురించి చెపుతూ]
"పండే పొలము చెబుతుందే,పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే
తనువంతా విరబూసే గాయాలే వరమాలై ...దరిచేరే ప్రియురాలే గెలుపంటే".....ప్రేమని ఒప్పుకోడానికి గెలిచి చూపమన్నప్పుడు వచ్చే పాట లో మాటలు]
"బాధైనా చేదైనా అన్నీ మామూలే
మేలైనా,కీడైనా అన్నీ కొన్నాళ్ళే
మలుపేదైనా నీ పాదం నిలిచిపోకుంటే
ఎటువైపున్నా నీ తీరం ...కలిసి వస్తుంది"
"యదలో ఆశవెంటే
ఎగసే వేగముంటే
సమయం వెనుక పడదా
ఊహ తనకన్నా ముందుంటే"
"కసిరే వేసవైనా-ముసిరే వర్షమైనా
గొడుగే వేసుకుంటే వద్దని అడ్డం పడుతుందా
మసకే కమ్ముకున్న- ముసుగే కప్పుకున్న
కనులే కలలుకంటే నిద్దరే కాదని అంటుందా
నిట్టూర్పే తరిమేస్తుంటే పారిపోదా సంతోషం
ఆయువే మిగిలుంటే మానిపోదా ప్రతి గాయం
నమ్మకాన్ని వదులుకున్న మనిషికి విషమవ్వదా అమృతమైనా"
రాధిక said…
మీ చివరి కామెంటు ఇప్పుడే చూసాను.అందుకే మళ్ళా ఈ కామెంటు.టీనేజర్స్ ఎవరి మాటా వినరు,వునాలనుకోరు.కూర్చోబెట్టి చెపితే చావగొడుతున్నాడని కుర్చుంటారు తప్పించి చెప్పేదానిమీద మనసు పెట్టరు. కానీ సినిమాలు,పాటలు అలా కాదు.అవి అయస్కాంతం లా లాగేస్తుంటాయి వాళ్ళని.అక్కడ వాళ్ళకి వినడానికి[మనకి చెప్పడానికి] ఆస్కారం వుంది.
నన్ను ప్రభావితం చేసింది సిరివెన్నెల గారే.ఇంకెవ్వరూ లేరు.
"చేదైనా బాధైనా అన్నీ మామూలే"
"ఒక్కటంటే ఒక్క లైఫే ఏడిపించకు దాన్నీ"
"పచ్చని పైరుకు నాగలి పోటు చేసిన మేలంటే"
.....ఇలాంటి మాటలు నన్ను చాలా ఆలోచించేలా చేసాయి.నాకివన్నీ అనుభవ పూర్వకం గా తెలుసుకునే అవకాశం ,వయసు లేదు. ఇలాంటివి నాకు చెప్పే చాన్స్ ఎవరికీ నేనివ్వలేదు.కానీ పాటలు చాలా మామూలుగా విన్నప్పుడు ఆ మాటలు ఆలోచింపచేసాయి.ఆచరిస్తే బావున్నాయనిపించింది.పుస్తకాలైనా అంతే.ఒకటి చదవడం మొదలు పెట్టామూ అంటే వాళ్ళు చెప్పేది వినడానికి సిద్ధం అయినట్టే.నచ్చక పోతే మధ్యలోనే మానేస్తాం అది వేరే విషయం.కొంత మందికి కొన్ని రకాలుగా చెపితే నచ్చుతుంది.అందుకే నాకు నచ్చి ప్రభావితం అయింది మరొకరికి నచ్చలేదు.ఇంకొకరెవరైనా చెపితే వాళ్ళూ ప్రభావితం అవ్వచ్చేమో.
[ఈ ప్రభావితం అయిందంతా నేను కాలేజ్ లో వుండగా.అందుకే అప్పటి ఆలోచనలు,అభిప్రాయాలు రాస్తూ అనుభవం,వయసు లేదు అని రాయాల్సొచ్చింది]
మీరు "జగమంత కుటుంబం నాది" పాట గురించి ఇంతకుముందు టపాల్లో రాసారా?
అదే నిజమయితే ఏమి రాసారో చదవాలని కుతూహలంగా ఉంది. కాస్త ఆ లింకు ఇవ్వరూ? నాకు తెలియనివి ఏమైనా ఉంటే నెర్చుకుందామని లేదా తప్పు గా అర్థం చేసుకుని ఉంటే తెలుసుకుందామని.
అయ్యా గురువు గారూ నేను చెప్పాల్సినవన్ని పైన మిత్రులందరూ చెప్పేసారు.ఇంక నేను మాత్రమే చెప్పాల్సిందేంటంటే మీరుదహరించిన వారు నాకు చాలా బాగా తెల్సు కాని నాగురించే వారిలో ఏ ఒక్కరికి తెలీదు.(నాలాంటి పామరుడికి కూడా వారి గురించి తెల్సు అదీ వారి ప్రఖ్యాతి అని నా అభిప్రాయం సూక్ష్మంగా)
రవి said…
యండమూరి రచనలు నేను దాదాపు అన్నీ చదివాను. (ఏవో కొన్ని తప్ప).ఒకప్పుడు ఈయన నవల్లంటే అభిమానం ఉండేది. అయితే, ఈయన స్వోత్కర్ష, పాఠకులను ఎక్స్ ప్లాయిట్ చేశానని తనే చెబుతూ, అది గొప్పవిషయం అని చాటుకునే తీరు చూసిన తరువాత, ఆయన మీద అభిప్రాయం పోయింది. ఆయన రచనలలోనూ నిజాయితీ లోపించడం చూసిన తర్వాత, అవి చదవడం మానుకున్నాను.

సిరివెన్నెల - ఎందుకో తెలీదు, నాకు ’ఆదిభిక్షువు వాడినేది.." ఇలాంటి పాటలకన్నా, "బాటనీ పాఠముంది", "పెళ్ళికి ముందు ఒక్కసారి (ఓ బాలయ్య సినిమా పాట)" వంటివే నాకు నచ్చుతాయి. సాహిత్యపు గుబాళింపులు వ్రాయడం గొప్పయితే, అలా వ్రాయగలిగీ, సాధారణమైన పాటలు అసాధారణంగా వ్రాయడం మరింత గొప్ప.

ఇళయరాజా - అమ్మ బువ్వ తింటూ, ఆకాశవాణి కడప కేంద్రంలో "చిన్ని చిన్ని కన్నయ్య (భద్రకాళి అనే సినిమా అట)", "కన్నెపిల్లవని కన్నులున్నవని.." పాటలు వినే వయసులో ఇళయరాజా సంగీత మాధుర్యం కమ్ముకున్న వాళ్ళల్లో నేనూ ఉన్నాను. ఇన్నేళ్ళయి, మొన్నామధ్య అంతఃపురం లో కూడా ఆయన పాట ("అసలేం తోచదు నాకు.."), సౌందర్య చీర కొంగు అలా తాకినట్టు, అందంగానే ఉంది.అయితే వ్యక్తిగతంగా నాకు ఆయన నచ్చడు. (డబ్బు కోసం ఒకప్పుడు తాపత్రయపడ్డాడు కాబట్టి).
మళ్ళీ అందరికీ థాంకులు.
@ రాధిక - వావ్ - బ్రావో! మీ వీరాభిమానిత్వం (?) తెలుసు, కానీ ఈ వరద మాత్రం ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు! :)
@ Anon - సంగీతం గురించి మంచి పాయింట్లు చెప్పారు. బాణీ మారుతున్నట్టుగా ఉండడం - ఇదే రాగం మారడం అంటే. అంతే కాక సాంప్రదాయక రాగాల్లోనే ఒకటి రెండు స్వరాలను మారుస్తూ ఇళయరాజా కొత్త ఎఫెక్ట్స్ సాధించాడని ఆయన సంగీతాన్ని బాగా పరిశీలించిన ఇంకో మిత్రులు చెప్పారు.

@ శ్రీను భాయ్ - హ హ వోకే. మీకు వాళ్ళందరూ బాగా తెల్సు గద. అది చాలు.

@ రవి - interesting.

@ సౌమ్య - అదేదో పాత గొడవ ఇప్పుడెందుకు లేండి. అసలే ఇక్కడంతా వీరాభిమానులు, మీకు నచ్చక పోవచ్చు - let it be :)

ఈ మహానుభావుల వ్యక్తిగతాల గురించి వ్యక్తిత్వాల గురించి వచ్చిన వ్యాఖ్యలపై ఒకట్రెందు మాటలు - నా చర్చలో ఉద్దేశం వారి కళల పటుత్వాన్ని బేరీజు వేసుకోవడమే. అయినా డబ్బుల్లు ఇష్టం లేణిది ఎవరికి చెప్పండి? నిధి చాల సుఖమా అని త్యాగరాజ కృతులుపాడే కర్నాటక సంగీత విద్వాంసులే, ఈరేటుకి పైసా తగ్గేది లేదు అని కరాఖండీగా చెబుతున్నారు. అందులో కాస్త ఆదమరిస్తే పీకలు కోసే సినిమారంగంలో తన విలువకి తగిన పారితోషికాన్ని అణాపైసల్తో రాబట్టుకో గలగడం కూడా ఒక వ్యక్తిత్వ విశేషమే! రెండోది మార్కెట్‌ని ఎక్స్‌ప్లాయిట్ చెయ్యడం - ఆ రోజుల్లో యండమూరి అల్మోస్టు సింగిల్ హేండెడ్‌గా తన మార్కెట్6ని సృష్టించుకున్నాడని నా వుద్దేశం - అప్పటికి ఆ మార్కెట్ లేదు.
ఇప్పుడే చూశాను ఇళయరాజా టాప్ 25 లిస్టు ఒక అభిమానినుంచి
రాఘవ said…
నావఱకూ నాకు--

యండమూరి వీరేంద్రనాథ్: సినీమా కథలు సమకూర్చడానికి ఎందుకు ప్రయత్నించలేదా అనిపిస్తుందండీ, ఈయన కథనపద్ధతి చూస్తే. ఈయన రచనలు తొలిలో చదివేవాడిని, తర్వాత్తర్వాత చదవాలని అనిపించక మానేశాను. 3/5.

చేంబోలు సీతారామశాస్త్రి: తెలుగు పలుకుబడులు తెలిసిన మంచి (విలువలున్న) కవి ఈయన. ఐనా, నాకెందుకో ఈయన వద్దనున్న భావుకత వేటూరివారితో పోలిస్తే కొంచెం తక్కువే అనిపిస్తుంది. 4/5.

ఇళైయరాజా: 4/5. నాకు నచ్చిన సినీసంగీతంలో ఈయనది పెద్దభాగమే! వినడానికి హాయిగా ఉండేలా సంగీతం సమకూర్చడం అనే కళ ఈయనతో దాదాపు అంతమైపోయిందనే నాకు తోస్తుంది.
కమల్ said…
కొత్తపాళీ గారు. విశిష్టవ్యక్తుల్లో ముగ్గరిని మాత్రమే ఇచ్చి అడిగారు. మీరిచ్చిన ముగ్గురిలో, ఇద్దరివిషయంలో నా ఆలోచనలు వేరున్నా..ముగ్గురు విశిష్టవ్యక్తులే.
1. యండమూరి గురించి ఇప్పటికే చాలా మంది బ్లాగర్స్ చెప్పేసారు, నేనిక చెప్పవలసింది ఏమి మిగలలేదు అనుకుంటా, క్షుద్ర సాహిత్యం, కమర్షియల్ సాహిత్యం మినహాయిస్తే..మిగతా నవలలు..ఉదా: ఋషి, పర్ణశాల, అంతర్మఖం..ఇవన్నీ ఆలోచింపచేసివి, చదివించేవి. వ్యక్తిగతంగా ఏవైనా ఉండచ్చుగాని..మంచినవలకారుడు.

2. సిరివెన్నెల సీతారామశాస్త్రి : పైన రాఘవగారన్నట్లు సిరివెన్నెల కంటే కూడ వేటూరి వారి కలం ఇంకా మృదమధురంగాను ఉంటుంది, ఆయన కలానికి ఎటువంటి నిబందనలుండవు అంటే..! ఒక పదం ఇక్కడే వాడాలి మరెక్కడో వాడకూడదు అన్న నిబందనలుండవు.. నాకు తెలిసి సిరివెన్నెల గారు కూడ వస్తువు ఏదైన గాని శైలి విషయంలో వేటూరిని అనుసరిస్తారని ఒక చోట విన్నా అదెంతవరకు నిజమో..? పైన ఒక బ్లాగరూ.. సిరివెన్నెల గారు కోట్ల రూపాయలిచ్చినా సరే " బూతుపాట" రాయరు అని చెప్పారు..ఒక సారి.. " ధర్మక్షేత్రం " సినిమాలో " పెల్లికి ముందు ఒక సారి" అన్న పాట విని చెప్పండి.

కాని పదాల అల్లికలో మాత్రం సిరివెన్నెల రారాజు, ఉదా: " కటిక చీకటైన కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి ", అలాగే మరోటి " పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా ", ఈ వ్యాక్యంలో గమ్మత్తు ఉంది ఏమిటో చెప్పగలరా.. ఎవరైనా..? ఇలాంటివి వింటుంటే మనసెక్కడికో తేలిపోతుంది., ఇలాంటివి చాలానే ఉన్నాయి ఇప్పటికే చాలా మంది చెప్పారుగా పైన.

3. లయరాజ ఇళయరాజ : నాకు తెలిసి మెలోడీ పాటల్లో అగ్రతాంబూలం మాత్రం పాతతరం సంగీత దర్శకుడు " సత్యం " గారి తర్వాతే ఎవరైనా..తర్వాత రమేష్ నాయుడు చేసారు గాని..ఎక్కువగా చేయలేకపోయారు, తర్వాత స్థానం " రాజెన్ - నాగేంధ్ర " ద్వయందే...! వీరిని కొనసాగిస్తూ ఇళయరాజ కొన్ని సంవత్సరాల పాటు తన ముద్రను అటు తమిళ.ఇటు తెలుగుప్రేక్షకుల్లో పదిలింగా పెనవేసుకున్నారు, కాని ఆయన కూడ, కాపియింగు అనండి..లేక ఇన్స్‌పైరింగ్ అనండి చేసారని తెలిస్తే..భరించలేకపోవచ్చు అది నిజం.." బంతీ..చామంతి..ముద్దాడు కున్నాయి " ఈ పాటలు మాతృక వింటే..వార్నీ..లయరాజ కూడనా..అని అనిపిస్తుంది. ఇళయరాజ ఎక్కువగా ఆఫ్రికన్ జానపద సంగీతాన్ని ఆధారం చేసుకొని తెలుగులోనూ..అటు తమిళ్ లోనూ చేసారు..అవి ఎలా ఉన్నాయింటే మక్కీకి మక్కీ...! ఒక సంవత్సరం క్రితం ఒక ఇటాలియన్ (1972) సినిమా చూస్తుంటే అందులోని బ్యాక్‌గ్రౌండ్ సంగీతాన్ని మక్కీకి మక్కి కాఫి చేసారు మన " లయరాజ గారు", మీకు కొన్ని వివరణలిస్తాను వీలుంటే అంతర్జాలో వెతకండి. ప్రఖ్యాత ఆఫ్రికన్ జానపద కళకారుడు " బాబా మాల్ " గారి సంగీతాన్ని చాలా వరకు మన " లయరాజ " వారు ఇక్కడ చేసారు. ఈయన పేరుతో అంతర్జాలంలో వెతికితే దొరుకుతాయి, అలాగే ఈస్ట్ ఆఫ్రికన్ వారి రిచ్ జానపద సంగీతాన్ని తన పాటల్లో వాడుకున్నారు. అయితే అవి కాపీ అయుండచ్చుగాని మన నేటివిటికి బాగా అతుక్కపోయాయి..అసలు అవి కాపీ అని ఎవరు చెప్పలేరు, నాకీ విషయాలన్ని వారి వద్ద రెహమాన్ పనిచేస్తున్నప్పుడూ వారి సహ వాయుద్యకారుడి ద్వార తెలిసాయి. నెలకో మారు షిప్ ద్వార కొన్ని విదేశీ వస్తువులు మద్రాస్ కి రవణా అయి వస్తూ ఉండేవి అందులో మన "లయరాజా" కి కొన్ని ఆడియో క్యాసెట్స్ వచ్చేవి, వాటిని షిప్‌యార్డ్ నుండి తీసుకురావడం రెహమాన్ పని అట..! ఏది ఏమైనా కాని తమిళ్, తెలుగు ప్రేక్షకులకు మరిచిపోలేని సంగీతాన్ని ఇచ్చారు..వాటికి ప్రాణం పోసారు అని చెప్పవచ్చు.
కొత్త పాళీ గారు ముందుగా నా బ్లాగ్ లో ఇళయరాజా టాప్ 25 లిస్ట్ పొస్టింగ్ గురించి మీ కామెంట్స్ లో ప్రస్తావించినందుకు చాలా థాంక్స్.
మీ బ్లాగ్ లో ''మూడు ప్రభంజనాలు'' అన్న పోస్ట్ కి నాకు తోచిన రీతిలో నా అభిప్రాయాన్ని పోస్ట్ చేస్తున్నాను.
Wow! కొన్ని కామెంట్లు బావున్నాయి.

నావరకూ "ప్రభావితం" అన్నది పెద్ద పదమే ముగ్గురి విషయంలోనూ. "అభిమానం" ఇంకా సరైన పదం.

యండమూరిని ఒక దశలో చాలా అభిమానించాను. కానీ, ఒకప్పుడు నా అంతగా అభిమానించిన వాళ్ళు మాత్రమే అసహ్యించుకోగలిగేటంతగా ప్రస్తుతం అసహ్యించుకుంటున్నాను.

సీతారామశాస్త్రి ఎప్పుడూ నన్ను ప్రభావితమూ చేయలేదు, ఆయన పట్ల నాకు ప్రత్యేకమైన అభిమానమూ లేదు. వేటూరి ఇంకా ఇష్టం. కానీ కొన్ని ఆకట్టుకునే పాటలున్నాయి. రాధిక గారి కామెంటు చూస్తుంటే వాటి సంఖ్యా ఎక్కువే అనిపిస్తోంది.

ఇళయరాజా మాత్రం బాగా ఇష్టం. నేను రెహ్మాన్ పాటలు వింటూ పెరిగాను. చాలా ఇష్టం కూడా. కానీ ఈ మధ్యనే కాస్త సన్నగిల్లుతోంది. రెహ్మాన్ చెవుల్లో మోగుతున్నంతసేపే మనతో వుంటాడనిపిస్తుంది. ఇళయరాజా మాత్రం మనలోకి దూరిపోయి, పాటకి దూరంగా వున్నప్పుడు కూడా కూనిరాగాల రూపేణా మోగుతూనే వుంటాడు.
@ కమల్ .. యండమూరివి తులసీదళానికి ముందు రాసిన నవల్లు నాటికలు ఈ "ప్రభావితం" లెక్కలోకి రావనుకుంటా. నా దృష్టిలో కూడా కాస్త శహిత్య విలువ అంటూ ఉంటే వాటిల్లోనే. కానీ ప్రభావితులమయ్యాము అని చెప్పే అభిమానులు ఉదహరించే రచనలన్నీ తులసిదళం తరవాతి రచనలే. ఇళయరాజా గురించి .. నాకసలు ఆయన సంగీతం గురించే ఎక్కువగా తెలీదు, ఇక కాపీలు ఏం చేశారో ఏం తెలుస్తుంది? మనం అభిమానించేవారిలో ఒరిజినాలిటీ, సృజనాత్మకత మనం అభిమానించే లక్షణమైతే, వాళ్ళుకూడా కాపీలు కొట్టారని తెల్సినప్పుడు కచ్చితంగా బాధేస్తుంది.

@ రాఘవ .. పోస్టొకసారి జాగ్రత్తగా చదవండి - వీరాభిమానులకే నా ప్రశ్నలు - మీరు వీళ్ళకి మార్కులు వేస్తున్నారు కాబట్టి మీరు వీరాభిమానులు కారు! :)

@ రాజి - వోకే.

@ meher - కదా! నేను మొదట పోస్ట్ చేసినప్పుడు అస్సలు ఊహించలేదు ఈ ప్రభంజనాన్ని.
కిషోర్ said…
కొత్త పాళీ గారు...నేను గత కొంత కాలం నుండి మీ బ్లాగుని చదువుతున్నా!!!! కాని కామెంట్ రాయటం ఇదే మొదటి సారి.
మీ లాగ, మీ స్నేహితుల లాగా ఆ ముగ్గురు వ్యక్తులు అంటే నాకు కూడా పిచ్చి అభిమానం!!!

శాస్త్రి గారి పాటల్లో ఎవరూ ప్రస్తావించని ఒక పాట నాకు చాలా ఇష్టం. ఆనందం చిత్రం లో "ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా...నడి రాత్రి తోలి వేకువ రేఖ..!!!"
అసలు ఆ సాహిత్యానికి శాస్త్రి గారికి పాదాభివందనం చెయ్యాలి!!!!

ఇళయరాజా గారి గురించి, ఆయన పాటల గురించి కామెంట్ చేసేటంత పెద్దవాడిని కాను. నేను చెన్నై prasad studios లో ఇళయరాజా గారిని ఒక సారి కాలిసేను. అది నా జీవితం లో మర్చిపోలేని రోజు. చాలా బాగా మాట్లాడతారు. నా వరకు ఆయన భారతీయ సిని సంగీత ప్రపంచానికి రాజు (మిగతా వారు తక్కువ అని కాదు....ఇది నా ఒపీనియన్ మాత్రమే)
కిషోర్ గారు, మీ వ్యాఖ్యకి స్వాగతం
సిరివెన్నెల
-నాకీయన పాటలు ఇష్టం. అయితే నన్నవి ప్రభావితమేమీ చెయ్యలేదు (నేనో రాయినిలెండి). ఈయన బాగా పాడతాడు కూడాను. మనిషిలో ఆవేశం పాలు కొంత ఎక్కువ అనిపిస్తూంటుంది. రచనల్లో కూడా కనిపిస్తుంది. ఆయన నటించిన ఒక సినిమాలో (అంకురం?) "మనదీ ఒక బతుకేనా.." అనే శ్రీశ్రీ కవిత చదూతాడు. అక్కడ ఆయన ప్రదర్శించిన ఆవేశాన్ని చూసి - ’ఆదిభిక్షువు’తో శివుణ్ణి ఉడికించినవాడు అలా కనిపించగా చూసి - విస్తుపోయాను.

ఆదిభిక్షువు పాట నాకు బాగా నచ్చినవాటిలో ఒకటి. "తికమక" పాట కూడా ఇష్టం. "శ్రీరామచందురుణ్ణీ కోవెల్లొ ఖైదు చేసి రాకాసి రావణుణ్ణీ గుండెల్లో కొలువు జేసి, తలతిక్కల భక్తితో తైతక్కల? మనిషీ.." -ఆహా! కానీ, ఖడ్గంలో ఈ పాటను చింపేసి, చంపేసిన దుర్మార్గ దర్శకుడిని ఉరేసి ఉరేసి ఉరేసి ఉరెయ్యాలనిపించింది. (అలాంటి నేరాలు ఐపీసీ నాలుగొందలరొండు పరిధిలోకే వస్తాయి.)

ఈ ముగ్గురిలోనూ సిరివెన్నెల కున్న ప్రత్యేకత ఇంకొకటుంది.. సంగీతాస్వాదన ఎవరైనా చేస్తారు, ఆనందిస్తారు. సంగీత శాస్త్రం తెలిసినవాళ్ళు, పండితులు, పామరులూ అంతా! శిశుర్వేత్తి, పశుర్వేత్తి.. అన్నారు కదా. కానీ సాహిత్యాన్ని ఆస్వాదించి అభిమానించేవాళ్ళు కేవలం చదూకున్నవాళ్ళే. చదూకున్నవాళ్ళు కూడా మాసు రచనలను, మాసు రచయితలను ఆదరించడమే ఎక్కువగా కనిపిస్తుంది. యండమూరి లాంటి వాళ్ళు మాసు రచనలు చేసి ప్రజాదరణ పొందారు. సిరివెన్నెల లాగా కవిత్వం రాసి, జనాన్ని మెప్పించడం తేలికేమీ కాదు. (ఎక్కడో ఉంటారు.. తిరుపతి వేంకట కవులవంటి వారు)

ఇంకోటుంది.. ఇళయరాజా కాపీలు కొట్టాడని వినికిడి.
యండమూరి కాపీలు కొట్టాడని మహా వినికిడి.
సిరివెన్నెల -నిజానికా పేరు ఆయనకు అతకలేదు, ఆయన స్వయంప్రకాశకుడు.

సిరివెన్నెల గురించి అభిమానం ప్రకటించిన వాళ్ళు ఎలాగూ ఉన్నారు. ఆయనకు గర్వమని బాధపడ్డ అభిమానులూ ఉన్నారు. ఈ లింకు చూడండి.
@ చదువరి - మీకూ జ్ఞాపకశక్తి ఎక్కువేనండోయ్ బాబు. ఎప్పుడో 2007 లో జరిగిన .. అదీనూ వేరే బ్లాగులో .. చర్చలు పట్టుకొస్తే యెలా? మిగతా పాయింట్లన్నీ అలాగుంచితే, నా వుద్దేశంలో ప్రతి కవికీ తన కవిత్వాన్ని గురించి ఆమాత్రం "గీర" ఉంటుంది. నామట్టుకి నేను అది తప్పుగా కూడా భావించటంలేదు. మల్లాది రామకృష్ణశాస్త్రిగారి గీర గురించి ఆరుద్ర చెప్పిన పిట్టకథ ఇక్కడ చదవచ్చు. ఆయనకీ ఈయనకీ పోలికా అనొద్దు .. పోల్చడంలేదు. మాటవరసకి చెబుతున్నాను. బైదవే, నాదో చిన్న పిట్టకథ - వీయేకే రంగారావుగారు ఆలాపన అనే కాలం రాస్తూ - ఇది జరిగింది సీతారామశాస్త్రిగారు మాంఛి పీక్‌లో ఉన్నరోజుల్లో - ఈయనకి నంది ఎవార్డొచ్చిన పాటనొకదాన్ని ఏకిపెట్టి, పనిలోపనిగా తన ఇష్టదైవం మల్లాదివారిని తల్చుకుని అలాంటి మహోన్నతులు నడిచిన నేలమీద ఈనాడు ఇలాంటి వాలఖిల్యులు తిరుగుతున్నారని వాపోయారు. ఆయనకి మల్లాది వారంటే భక్తి ఉండొచ్చు కానీ మిగిలిన వాళ్ళందరూ పనికిమాలిన వాళ్ళా అని సీతారామశాస్త్రిగారు తగుమోతాదులో బాధపడ్డం నాకళ్ళముందే జరిగింది. ఇది ఆయన్ని కించపరచడానికి చెప్పలేదు - ఆయనా మనిషే అని.
రాధిక said…
చదువరి గారూ ఆ తలతిక్కల మనిషీ అన్న పాట ఖడ్గం లోది కాదండి.శ్రీ ఆంజనేయం సినిమాలోది.నాకా పాట బానే తీసారనిపించిందండి.బహుశా కృష్ణవంశీ మీద అభిమానం కావచ్చు :)

నేను పైన ఊటంకించిన పాటలన్నీ అప్పటికప్పుడు గుర్తొచ్చినవి.ఇంకా ఆణిముత్యాలెన్నో వున్నాయి.ఇంత చెప్పానా.......ఒకటి మాత్రం చెప్పుకోవాలి.నావరకూ.....అభిమానించడానికైనా,ద్వేషించడానికైనా పెద్దగా కారణాలుండవండి.అదలా జరిగిపోతుందంతే. .కారణాలున్నాయంటే.....అవి మిగతావారిని ఒప్పించడానికే :)
pi said…
I dont know if somebody already mention it. Ilayaraja uses a lot of carnatic music. He is also entertaining at the same time. He used Hamsanandi pretty extensively and there is a composition is keeravani in the movie anveshana. I like him too!
కొత్తపాళీ గారూ, చూసారా, నాకు జ్ఞాపకశక్తి ఎఖ్ఖూఎమీ కాదని రాధిక గారు తేల్చేసారు. :)
"..నామట్టుకి నేను అది తప్పుగా కూడా భావించటంలేదు." - నేను కూడానండి. ఆ లింకు సంగతంటారా.. ఈసారికి ఒగ్గెయ్యండి.

నాకేమో ఆ రీడర్లు అలవాటు కాలేదు. నా బ్లాగు వైపేమో ఏదైనా రాస్తే తప్ప పోను. మీరేమో కూడళ్ళలో కనబడరు. అంచేత, అధ్యక్షా.. మీ బ్లాగును మిస్సవుతున్నాను. ఇక రీడరుకు దుమ్ము దులపాల్సిందే.


రాధికగారూ, ఔనౌను. అది శ్రీ ఆంజనేయం! ఎప్పుడూ అనుకుంటూంటాను.. తెలుసనుకున్న సంగతులు తప్పు అయ్యే అవకాశముంది, అంచేత ఇంకోసారి ధ్రువీకరించుకుని రాయాలని; కానీ ఎప్పుడూ ఆ తప్పు చేస్తూనే ఉంటాను. సరిదిద్దినందుకు నెనరులు. అయితే గుడ్డిలో మెల్ల.. సినిమా మారిందిగానీ, ముమ్మారు ఉరికి గురి కావాల్సినవాడు మాత్రం మారలేదు. :)
(మీ అభిమాన దర్శకుడని అన్నారు కాబట్టి ఉరిని ఓసారి తగ్గించేసాను :) )
రాధిక గారూ, మరొక్క సంగతి.. "అభిమానించడానికైనా,ద్వేషించడానికైనా పెద్దగా కారణాలుండవండి.అదలా జరిగిపోతుందంతే." -నిజం.
మీరు చెప్పకపోతే మాత్రం నేను కనుక్కోలేననుకున్నారా? "జగమంత కుటుంబం నాది" పాట మీద మీ పోస్ట్ ని నేను పట్టేసాగా మీ "విన్నవి కన్నవీ" బ్లాగులో. అసలే మాయాశశిరేఖని ఆ మాత్రం సాధించలేనా! :)
@ చదువరి .. కృవం గురించి మీరన్నది నిజం నిజం. చందమామ సినిమా తరవాత అనుకుంటా ఆయన సినిమాలు తియ్యడం ఇక మానేస్తే బెటర్ అని రాసుకున్నాను నా సమీక్షలో. :) అభిమానించడానికి కారణం అక్కర్లేదేమోగాని ద్వేషించడానికి బలమైన కారణం ఉండాలని నేను నమ్ముతాను.

@ sowmya .. మీరంతటి సమర్ధులని తెలుసునే :)
భలే మంచి ఐడియా. 'మీకు ఇష్టం అంటున్నారు కదా, అయితే ఎందుకిష్ట'మో చెప్పండి అని అడగడం చాల బాగుంది. సిరివెన్నెల, ఇళయ రాజాల కృషిని, సినిమా చూస్తున్నపుడు ఆనందించడం తప్ప, వారి గురించి తెలియదు, ప్రత్యేక అభిమానం లేదు. యండమూరివి చాల నవలలు చదివాను. ఒక ప్రగతిశీల సంఘంలో కార్యకర్తగా పని చేస్తున్నన్నప్పుడు, ఆ సంఘం పనిలో భాగంగానే, ఈ నవలలు యువ పాఠకులను ఎందుకు ఆకర్షిస్తున్నాయో తెలుసుకోడానికి చదవడం మొదలెట్టాను. ఆ తరువాత, మనసు 'తిక్కతిక్కగా' ఉన్నప్పుడంతా చదివాను. యండమూరి పఠనీయతకు నాకు తోచిన కారణం ఇప్పటికే చెప్పేశాననుకుంటా. 'మనసు తిక్క తిక్కగా ఉండడ'మే నా కారణం. వ్యాఖ్యాతలలో మెహెర్ గారి అభిప్రాయం ఆసక్తి కలిగించి, అర్థం కాలేదు. ఒకప్పుడు ఇష్టపడి ఇప్పుడు ఇష్టపడక పోవడం సరే. బతకును/సాహిత్యాన్ని అర్థం చేసుకునే శక్తి పెరగడం కారణం కావచ్చు. అసహ్యం ఎందుకు? అదీ ఒకప్పటి అభిమానం స్థాయిలో ఇప్పటి అసహ్యం? బలమైన కారణం వుండి వుంటుంది. వివరిస్తే బాగుంటుంది.