కబుర్లు - ఏప్రిల్ 26

గత నెల అంతా బీభత్సాలు, ప్రకృతి వైపరీత్యాలు, మనసుని కుదిపేసే భయానక దృశ్యాలు.
ప్రపంచవ్యాప్తంగా తరచుగా వస్తున్న భూకంపాలు - ఒక పక్కన తీవ్రమైన మానవ నష్టం, బతికున్నవారి కష్టం చూసిచూసి మనసు మొద్దుబారిపోయే పరిస్థితి కలిగిస్తుంటే, మరొక పక్కన ప్రకృతి వొళ్ళువిరుచుకుంటే దాని అనూహ్యమైన బలమ్ముందు మనిషి అస్తిత్వం ఎంత అల్పమో అన్న స్పృహ కలిగిస్తున్న దిగ్భ్రాంతి. అమెరికాలోనే, ఇంకా వసంతకాలం కూడా సరిగ్గా రాకుండా వరదల్లాంటి అనేక ఉపద్రవాలు. ఐస్‌లాండ్ అగ్నిపర్వతం అదో తమాషా - ఒక్క చిన్న అగ్నిపర్వతం అంత పెద్ద ఐరోపీయ మహాసామ్రాజ్యాన్ని పాదాక్రాంతం చేసుకుంది, ఎంత ఆశ్చర్యం? న్యూస్‌లో చెబుతున్నాడు దక్షిణాఫ్రికా నించి స్విట్జర్లాండుకెళ్ళాల్సిన చామంతిపూల కాడలు జోహనెస్‌బర్గు విమానాశ్రయం దగ్గర కోల్డుస్టోరేజిలో వడలిపోతున్నాయిట! ప్రపంచీకరణపు వింత సమీకరణం!!

వాలువీధిలో చాకిరేవు జరుగుతోంది .. ఉతుకో ఉతుకు!!! మకిలంతా బయటికి రానీ .. పోనీ పోనీ మురికంతా కడిగెయ్‌నీ!

హబుల్ టెలిస్కోపు ఇరవయ్యో పుట్టిన్రోజు జరుపుకుంటోంది. నా అభిమాన రేడియో కార్యక్రమం డయాన్ రేం షోలో హబుల్ ప్రాజెక్టుకి నేతగా పనిచేసిన ఎడ్వర్డ్ వైలర్ గారు నెమరువేసుకున్న అనుభవాలు చాలా ఆసక్తికరంగా అనిపించాయి. అందులో నన్ను మరీ ఆకట్టుకున్న అంశం ఈ హబుల్ టెలిస్కోపు ప్రాజెక్టుకి అమెరికను కాంగ్రెసు సంపాయించడానికి సుమారు 30 యేళ్ళు పట్టిందట. ఆ లెక్కన మన భారతీయ పార్లమెంటులో బిల్లులు చాలా తొందరగా జరుగుతున్నట్టే!

వారాంతంలో విలేజ్‌లో వినాయకుడు సినిమా చూశాను. టెన్షన్లూ ఉద్రేకాలూ లేకుండా నింపాదిగా హాయిగా బానే ఉంది. ఆ యింటి లొకేషన్ అద్భుతంగా ఉంది. ఎక్స్‌టీరియర్ ఏంగిల్స్‌లో ఆ అందాన్ని బాగా పట్టుకున్నాడు ఛాయాగ్రాహకుడు. యండమూరి నటన సరదాగా ఉంది. ఆయన ఇంతకు ముందు ఎక్కడన్నా సినిమాల్లో నటించారా? ఆయన మాట్లాడగా ఇంతకు మునుపు ఎప్పుడూ వినలేదు. అందుకని ఆయన గొంతు రూపానికి తగినట్టు లోతుగా గంభీరంగా ఉంటుందని ఊహించుకున్నానేమో - పీలగా హైపిచ్‌లో ఉండడంతో ఆయన డయలాగు చెప్పడానికి నోరు తెరిచినప్పుడల్లా ఉలిక్కిపడుతూ వచ్చాను! అన్నట్టు బ్లాగరి రవిగారు వైద్యుడిగా ఒక కేమియో పాత్ర సమర్ధవంతంగా పోషించారు. మాటిమాటికీ సాక్షిపేపరూ, రిలయన్సు ఫోను నెట్వర్కూ కనబడుతూ వినబడుతూ ఉండడం చిరాకెత్తించింది.

ప్రస్తుతం ఇంగ్లీషులో వైదేహి అనే కన్నడ రచయిత్రి రాసిన కథల ఆంగ్లానువాదం, (పుస్తకం పేరు గులాబీ టాకీస్, పెంగ్విన్ ఇండియా ప్రచురణ), తెలుగులో మన రాతలుకోతలు బ్లాగరి కస్తూరి మురళీకృష్ణగారు రాసిన అసిధార నవలిక చదువుతున్నా. రెండూ ఆసక్తికరంగానే ఉన్నయ్యి.

మాలిక అని సరికొత్త సంకలిని తెరంగేట్రం చేసింది. స్పీడు స్పీడు మా తీరే స్పీడు అని రూపకర్తలు చెబుతున్నారు. నిజమేననిపించింది. రూపనిర్మాణ, నిర్వహణ బృందానికి అభినందనలు. వివాదాలకి, నిషేధాలకి అతీతంగా నడిపిస్తామని కూడా ప్రకటిస్తున్నారు - జరుగుతుందని ఆశిద్దాం. శాస్త్రవిజ్ఞానం బ్లాగులో ఆర్థర్ సి. క్లార్క్ వైజ్ఞానికి నవలిక జూపిటర్ ఫైవుని తెలుగు చేస్తున్నారు, కడు సమర్ధవంతంగా, అనువాదం అని చెబితేకాని తెలియనట్టుగా. మొన్నోరోజున బ్లాగుల్లో కోతికొమ్మచ్చి ఆడుతుంటే ఈ చక్కటి దృశ్యమాలిక కంటబడింది - ఆ శిల్పాలెంత బాగున్నాయో. మీరూ ఓ లుక్కెయ్యండి.

Comments

Sanath Sripathi said…
బ్లాగరి రవిగారు వైద్యుడిగా ఒక కేమియో పాత్ర సమర్ధవంతంగా పోషించారు???

రవి గారు సినిమాలో నటించారా?? ఎవరు?? మన బ్లాగాడిస్తా రవిగారే??

- సనత్ కుమార్
కాదు, బ్లాగు పేరు, యూఆరెల్లూ, ఆయనపేరు అన్నీ రవిగారే :)
http://ravigaru.blogspot.com/
మురళి said…
బాగున్నాయండీ కబుర్లు.. ఆ ఇల్లు ఏపీ టూరిజం వాళ్ళు కొత్తగా కట్టిన రిసార్ట్. దిండి అనే ఊళ్ళో గోదారి ఒడ్డున ఉంది.. యండమూరి నటన నచ్చిందా మీకు??!!
@ మురళి .. బ్లాగర్ ఏంటో వ్యాఖ్యల్తో ఫుట్బాలాడుతోంది. మీ వ్యాఖ్య ఇప్పుడే ప్రచురించాను, కానీ అదిక్కడ కనబట్టల్లేదు! ఇంకెవరికైనా ఇలాంటి సమస్య ఎదురైందా?
యండమూరి గారు 'ఫోటో'( శివాజీ,శ్రద్దాదాస్) అనే సినిమాలో కూడా క్లైమాక్స్ లో కనిపిస్తారండీ...బహుశా అదే ఆయన తొలిసారి స్క్రీన్ పై కనపడిందనుకుంటా....
@ మురళి .. ఆ ఇంటిని గురించి చెప్పినందుకు నెనర్లు. ఆ యింటి స్టైలూ, చుట్టూతా ఆ నీళ్ళూ అవీ చూసి కేరళలో యేవన్నా తీశారేమోనని అనుమానం వచ్చింది.
యండమూరి నటన నచ్చక పోయేందుకేముంది ఆ సినిమాలో? చాలా సింపుల్ పాత్రే కదా! కానీ అలాంటి కేజువల్ పాత్రలు చెయ్యడం కూడా కష్టమే - ఆయన బాగా చేశారనే నాకనిపించింది.

@ శేఖర్.. వోకే. నెనర్లు.
యండమూరి చివరిలో కనిపించే శివాజి సినిమా పేరు ఫోటో కాదు శేఖర్ "డైరీ". అంతకుముందు కొన్ని టివి సీరియల్స్ లో నటించారు కానీ సినిమాల్లో అదే మొదటిది అనుకుంటా. ఈ మధ్య మా టివిలో అనుకుంటా వ్యక్తిత్వవికాసం ప్రోగ్రాంలో కూడా కనిపిస్తున్నారు.

నేను కూడా మొదటి సారి అతని గొంతు విన్నపుడు ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మీరనుకున్నట్లే నేనుకూడా గంభీరంగా ఉంటుందనుకున్నాను.
కమల్ said…
మీ వ్యాసంలో నా బ్లాగ్ కి చోటు ఇచ్చినందుకు థ్యాంక్స్ పాళిగారు
@ కమల్ .. నేనే మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలి, అంత చక్కటి శిల్పకళని పరిచయం చేసినందుకు. తరచూ రాస్తూండండి.