మన తెలుగు పిల్లకాయల ప్రతాపం

నిన్న మా స్థానిక భారతీయ దేవాలయంలో అన్ని వయసుల పిల్లకాయలకీ ఏవేవో సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. ఆ దేవాలయంలో చురుగ్గా పాల్గొనే స్నేహితుల ప్రోద్బలంతో నేను కూడా శ్లోకాలు చదివే ఒక పోటీకి న్యాయనిర్ణేతగా వెళ్ళాను.

అందులో వాళ్ళకి ఇచ్చిన అంశం విశ్వనాథాష్టకం లోంచి ఐదు శ్లోకాలు ఎంచి యిచ్చారు. పిల్లకాయలు బానే బట్టీ పెట్టారు. ఉచ్ఛారణ కూడా చాలా మట్టుకి చక్కగానే ఉంది, త అనాల్సిన చోట త అనీ, ద అనాల్సిన చోట ద అనే పలికారు, ట, డ అనకుండా. వొత్తులు కూడా చక్కగా పలికారు.

ముందొక ఇద్దరు పిల్లకాయలు చెప్పి వెళ్ళిన తరవాత మూడో వాడొక ఏడేళ్ల పిల్లగాడొచ్చాడు. వాడి ఇంటి పేరు వింటే ఏదో తెలుగు పేరులా ఉందే అనుకున్నా. సరే, పేర్రాసుకుని కానీవోయ్ అన్నా. అంతే, మనోడు, గుండె నిండా గాలి పీల్చుకుని ఉచ్ఛైస్వరంలో "గంగా తరంగ" అని రాగయుక్తంగా యెత్తుకుని "జటాకలాపంంం" అని రెండు మూడు గమకాలు పీకాడు. నేనులిక్కి పడ్డా. ఎందుకంటే, అప్పటిదాకా వప్పచెప్పిన ఇద్దరు పిల్లకాయలూ మామూలుగా, రాగాలూ యేవీ లేకుండా, సాధారణంగా సంస్కృత శ్లోకాలు చదివే పద్ధతిలో చెప్పి వేళ్ళారు. వీడిలా ఇంకో రెండు శ్లోకాలకి రాగాలు పీకింతర్వాత నాకు వెలిగింది - వార్నీ, అప్పుడెప్పుడో బాలసుబ్రమణ్యం శివస్తుతి అనే పేరిట విడుదల చేసిన రికార్డులో ఈ స్తోత్రం ఈ బాణీలో పాడాడు. మరి ఈ బుడ్డోడి అమంఆ నాన్నానో, లేక సంగీతం టీచరో సుబ్బరంగా ఆ నమూనాలో మనోడికి టరిఫీదు గుప్పేసినట్టున్నారు. ఏదేమైనా, శ్రుతి తప్పకుండా, గమకం చెడకుండా, బాగా పాడాడు పిల్లోడు.

సరే, ఇంకో ఇద్దరు పిల్లలైనాక మళ్ళీ ఇంకో తెలుగు పేరు వినొచ్చింది. ఈ సారి పదేళ్ళ బుడ్డది. ఈమె కూడా బాలు అడుగుజాడలో నడుస్తుందా లేదానని కుతూహలంగా ఎదురు చూశా. నా ఆశ నిరాశ కాలేదు. జమాయించి అందుకుంది .. "గంగా తరంగ" అని. ఈ సారి జటాకలాపం దగ్గర గమకం ఇంకొంచెం ఎక్కువ మెలికలు తిరిగింది, ఇందాకటి బుడ్డోడికంటే మూడేళ్ళు పెద్దది కదా, గమకాలు పీకడంలో నాలుగాకులెక్కువ చదివినట్టుంది. మొత్తానికి ఐదు శ్లోకాలు పూర్తయ్యే సరికి నా చెవుల తుప్పొదిలింది.

ఇంకాసేపటికి మళ్ళి ఇంకో తెలుగు పేరొచ్చింది. ఇది కూడా పదేళ్ళ పిల్ల. నేను గుసగుసగా నా తోటి జడిజితో చెప్పాను. చూస్తూ ఉండండి, ఈ పిల్ల కూడా ఇందాకటి ట్యూనులోనే పాడుతుంది అని. నా జోస్యం వమ్ము కాలేదు.

ఏదైతేనేం, మొత్తానికి డజను మంది పోటీ పడితే, మనోళ్ళు ముగ్గురు బాలు గమకాల్ని తమ గొంతుల్లో పలికించి మన తెలుగోళ్ళ పరువు నిలబెట్టారు.

మీరూ ఆ స్త్రోత్రామృతం రుచి చూడండి, బాలూ గొంతులోనే!

Comments

Ravi said…
కొత్తపాళీ గారూ,
ఇది బాలు గొంతు కాదు. రాము అనే గాయకుడిది. మా ఊరు శ్రీకాళహస్తిలో ఈ స్తోత్రం బాలుగారి గొంతులో ఎన్నోసార్లు విన్నాను.
teresa said…
Doesn't sound like Balu!!!
ఏమో మరి, విడియో హెడింగ్‌లో బాలు అనే ఉంది! ఒకేళ గొంతు బాలు కాకపోయినా, స్టైలు మాత్రం అదే :)
Ravi said…
నాకు తెలుసండీ.. ఆ గొంతు బాలుది కాదు. దాదాపు ఆయన గొంతును పోలి ఉండే రాము అనే గాయకుడిది.
Anonymous said…
సర్ అప్రస్తుతమనుకోవద్దు. మీరు అంజన సౌమ్య పాడిన ’కృష్ణ నీ బేగనే బారో’ పాట ఈ link లో తప్పకవినాలని నాకోరిక.http://www.youtube.com/watch?v=G-tdLImEdak. -తెలుగు అభిమాని
Unknown said…
ప్రశ్న పత్రం అందలేదండీ. ఆహ్వానపత్రిక ఎక్కడో చూశాను. రెండింటినీ దయతో మళ్ళీ ఒకసారి నాకు పంపించగలరు. నా మెయిలు ఎఢ్రసు.
narasimharaomallina@gmail.com
శ్రమ ఇస్తున్నందుకు మీరు నన్ను మన్నించాలి.
పిల్లల ప్రతిభ వినడం చాలా బాగుంది. ఇది బాలు గారు పాడినది కాదండీ. బాలు గారి గొంతులో ఇక్కడ వినచ్చు చూడండి. http://www.youtube.com/watch?v=KOl9MesEU-0
Vasu said…
సరిగ్గా నేనూ ఇదే చెప్పబోయా.ఇది బాలు గొంతు కాదు అని. స్టైల్ అదే.
నేను ఎంత వెతికినా యు ట్యూబ్ లో బాలు గొంతులో ఈ అష్టకం దొరకలేదు.
మొత్తానికి పిల్లకాయలు ఆదరగొట్టారన్నమాట.
మురళి said…
బాలు గొంతు కాకపోయినా వినడం బాగుందండీ.. ఇంతకీ బహుమతి ఎవరికీ ఇచ్చారు??
కొత్తపాళీగారు అది బాలు గొంతు అవునో కాదో నేను పట్టించుకోలేదు.కాని మీరు పెట్టిన రికార్డు వింటుంటే మాత్రం నా చెవుల్లో తుప్పు వదిలిపోయింది. నా చిన్నప్పుడు రోజులు గుర్తుకువచ్చాయి. ఈరోజుల్లో తెలుగు ఎమ్మే చేస్తున్నవాళ‌్లు కూడా ఇలా పాడలేరు, చెప్పలేరు అని అనిపిస్తోంది. పాళీగారు నేను ఈమధ్యనే కొత్త బ్లాగు పెట్టాను. మీకు వీలయితే ొకసారి చదవండి. తెలుగు సాహిత్యంలో నాకున్న పరిజ్ఞానాన్ని, భావాలను కొంచెం ప్రదర్శించాను ఇందులో. www.manognaseema.blogspot.com
kiranmayi said…
ఇంతకి మీరు ప్రైజ్ ఎవరికిచ్చారో చెప్పనేలేదు.
ఆర్యా!ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వ రెదురైనా పొఘడరా నీ తల్లి భూమి బారతిని; నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్న మన రయప్రోలు ఆశల పంటగా మీ నిర్వహణా; పిల్లకయల ప్రతాపం దేశ విదేశాల్లో
మనకీర్తి కిరణాలు వ్యాపిస్తున్నాయి. చాలా సంతోషం. ఆ చిరంజీవులకు శుభాశీశ్శులు.
మీకు అభినందనలు.
చింతా రామ కృష్ణా రావు.
SRRao said…
కొత్తపాళీ గారూ !

నూతన సంవత్సరంలో మీ పాళీ మరిన్ని కొత్త రచనల్ని అందించాలని కోరుకుంటూ...ఉగాది శుభాకాంక్షలతో...

- శిరాకదంబం
భావన said…
అవును హనుమాన్ చాలిసా కూడా M.S గారి స్టైల్ లోనే పాడేయ్యటం కూడా అలవాటు ఐపోయింది మరి. :-)
బెంగుళూరులో ఓ కచేరీలో "కాశీ యాత్ర" అన్న సీడీ కొన్నాను. అందులో విశ్వనాథాష్టకం పాడిన శైలి, మీరు చెప్పిన శైలికన్నా బావుందనిపించింది.

ఆ సీడీలో కాశీలో మనం దర్శించవలసిన క్రమంలో శంకరాచార్యులు రచించిన స్తోత్రాలు తొమ్మిది వున్నాయి. నాకు బాగా నచ్చాయి. విశ్వనాథాష్టకం, అచ్యుతాష్టకం,కాలభైరవాష్టకం అప్లోడ్ చేసాను.
బాలూ గొంతు కాకపోతే పోయిందిలెండి, రాము చక్కగా పాడాడు. ఉచ్చారణ బావుంది.గొంతు కూడా సొంతగానే ఉంది.బాలూని పోలి లేదు.

భావన చెప్పినట్లు ఒక రికార్డ్ రాగానే దాన్నే ఫాలో అయిపోవడం తప్ప మనకి వేరే ఛాయిస్ ఏముంది? లింగాష్టకం కూడా విజయవాడ ఆలిండియా రేడియో వాళ్ళు పాడిన రికార్డ్ ముందు బాలూ రికార్డ్ పేలవంగా (కనీసం నాకు) ఉంటుంది. అయినా తన రికార్డ్ కే శ్రోతలెక్కువ!ఆలిండియా రికార్డ్ సంగతి చాలా మందికి తెలీదు కూడా! మార్కెటింగ్ లేదుగా మరి!

పిల్లలకు శ్లోకాలు నేర్పడం సంతోషించదగ్గ విషయం. వాళ్ళు గమకాలతో సహా పాడ్డం ఇంకా సంతోషించదగ్గ విషయం! అంత చక్కగా నేర్చుకున్నందుకు పోటీలో పాల్గొన్న పిల్లలందరికీ ఇచ్చేయాలి ప్రైజులు!
Malathi said…
మన తెలుగు పిల్లకాయలకి నా అభినందనలు కూడా అందజేయండి. ఏమిటో తెలుగు మాటాడనివాళ్లు మాటాడ్డం లేదని విచారించడం కంటే. ఇలా నేర్చుకుంటున్నవాళ్లు ఉన్నారని విని ఆనందించడం నయం అని ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది నాకు. మంచి టపా.
విశ్వనాథాష్టకం కూడా చాలా బాగుంది.
Sandeep P said…
మా తరువాతి తరం పిల్లలు కూడా భక్తితోనో, బహుమానం మీద ఆసక్తితోనో కాస్త స్తోత్రాలు నేర్చుకోవడం ఆనందం కలిగిస్తోంది :)