మాటలు – ఒక ఏక్సిడెంట్ కథ

ఎప్పటిదో పాతది .. సుమారు పదేళ్ళ కిందటి కథ. ఆ రోజుల్లో తానా పత్రికలో ప్రచురితమైంది. అప్పణ్ణించి అలా దీర్ఘనిద్రలో ఉంది. మళ్ళి ఇప్పుడు ఇలా మీకోసం ..

ఆ ఒక్ఖ మాటా అనేశాడతను. అనేశాక వెనక్కి తీసుకోలేని మాట .. అర్జునుడి అస్త్రంలా గురితప్పని మాట .. ఆయువు పట్టులో తగిలి అగ్గి రగిలించే మాట .. అని తెలుసతనికి. అది వినగానే .. మనసుకి తగలగానే ఆ దెబ్బకి ఆమె విలవిల్లాడి పోతుందనీ తెలుసు.
అనొద్దనుకున్నాడు .. ఐనా అనేశాడు.
తెలుసుండే .. కావాలనే .. ఆమె అలా విలవిల్లాడి పోవాలనే.
అతి తేలిగ్గా అనేశాడు.

ఎప్పట్లాగే మొదలైంది సంభాషణ ఆ రోజు కూడా .. కబుర్లు చెప్పుకుంటున్నట్లుగా. ఎన్నిసార్లు ముచ్చట్లాడుకోలేదు అలా ? వందలు వేల సార్లు .. ప్రేమించుకునే రోజుల్లోనూ .. పెళ్ళాడిన కొత్తల్లోనూ .. కబుర్లేసుకుంటే ఇక వొళ్ళు తెలిసేది కాదు ఇద్దరికీ .. టైము లెక్కలోకి అసలే వచ్చేది కాదు. అలా చెప్పుకునే వాళ్ళు కబుర్లు. కానీ ఈ మధ్య ఏదో వెలితి .. ఏమీ లోతు లేకుండా .. పైపైన మాట్లాడు కుంటున్నట్టు. తెరిచి చూపించాల్సిన గుండెల తలుపులు మూసేసుకున్నట్టు .. తరచి చూడాల్సిన మనసుల మీద ఏవో పొరలు కప్పేసుకున్నట్టు. తొలకరిలో తడిసిన మాగాణి భూమిని లోతుగా తవ్వుకు పోయే నాగటి చాలు రాతి నేల తగిలి పట్టు దొరక్క జారి పోతున్నట్టు .. ఊరికే పైపైన మాటలు .. కబుర్లు .. ఇన్నాళ్ళుగా చెప్పేసుకున్న తరవాత ఇంకేం వుంటై కొత్తవి ? ఫ్రెష్ గా పిండి కలిపి దోరగా వేడిగా వేయించుకున్న మిరపకాయ బజ్జీలల్లే .. కావాలంటే ఎప్పటి కప్పుడు ఎక్కణ్ణించి పుట్టుకొస్తాయ్ ? రెండ్రోజుల క్రితం రెడీ మేడ్ పేకెట్ పిండితో వొండుకుని తినగా మిగిల్నవి రిఫ్రిజిరేటర్లో దాచుకుని ఈ పూట మైక్రోవేవ్లో రి-ఫ్రెష్ చేసుకున్న చద్ది ఇడ్లీలకు మల్లే .. ఈ మాటలు. నీరసంగా .. పేలవంగా .. ఈ కబుర్లు.

బేలెన్సు చాలా ఇంపార్టెంటు. జీవితం సాఫీగా సాగి పోవటానికి బేలెన్సు అతిముఖ్యం. ఎంతో జాగ్రత్తగా మైంటైన్ చెయ్యాలి ఈ బేలన్సు. అలా మైంటైన్ చేసుకొస్తున్నా డతను. ఒంటి త్రాటి మీద .. వేరే వూతం లేకుండా నడుస్తున్న గారడీ వాడి కౌశలంతో .. బేలెన్సు నిలుపుకుంటూ వస్తున్నా డతను. పొడి పొడి మాటలు వాడుకుంటూ .. పై పై కబుర్లు పేర్చుకుంటూ .. వాటి ఆసరాతో ఆ బేలెన్సు .. సంద్రంలో నావకి ఎన్ని ఒడిదుడుకులు .. ఎన్నెన్ని ఆటు పోట్లూ .. అవన్నీ తమకి తగలకుండా .. జెర్కులు లేకుండా .. కుదుపులు రాకుండా .. ఆమె ఆ రోజు తాడు తెగేట్టుగా ఒక్ఖ పాటున గుంజింది. నావ తల్లకిందులయ్యేట్టు ఒక్ఖ తోపు తోసింది. పైపై కబుర్ల పేక మేడల్ని .. అతనెంతో జాగ్రత్తగా పేర్చు కొచ్చిన వాటిని .. ఊఫ్ మని ఊదేసింది. పొడి పొడి మాటల మూటల్ని చించేసి .. వాటిల్లోకి కుక్కేసిన అసంతృప్తిని బయటికి లాగింది చిందర వందరగా. అది అప్పుడప్పుడే ముక్కిన వాసన కొడుతూ వుంది.

పోనీ ఆమె అంతటితో వూరుకుంటే పరిస్థితి ఇంత వరకూ రాకనే పోయేది. వూరుకునేట్టుందా? ఎప్పటెప్పటి విషయాల్నో తవ్వి తీసింది. ఎప్పుడో మరిచిపోయిన విశేషాల్ని గుర్తుకి తెచ్చుకుంది. ఒకప్పుడు .. సరదాగా, బాధగా, బరువుగా, ప్రేమగా, ఆశగా, ఆనందంగా, కోపంగా, చిలిపిగా .. ఎన్నెన్నో భావాల్ని పంచుకున్న కబుర్ల నీడల్ని అతని ముందు ఝళిపించింది. అతని మీదికి విసిరేసింది ఎన్నెన్నో ప్రశ్నల్ని .. ఆ భావాలన్నీ ఎక్కడ దాచావని .. ఆ మాటలన్నీ ఏ మూటల్లో కూరుకు పోయి ఎక్కడ అటకెక్కేశా యని .. ఆ ఆశలన్నీ ఎక్కడికి ఎగిరి పోయాయని .. ప్రశ్నలు. కబుర్లు తరిగి పోయి ప్రశ్నలే మిగిలి పోయాయా అనడిగింది. కబుర్లు తరిగి పోతే మరి ప్రశ్నలైనా అడక్కుండా ఈ వూకదంపుడు మాటలెందుకూ అనడిగేసింది చివరికి.

సరిగ్గా అప్పుడే అతనా మాట అనేశాడు. ఈ మాటలు మొదలై నప్పటినుంచీ అతనికి లోలోపల అనుమానంగానే ఉంది .. ఇది ఎటు దారి తీస్తోందో అతనికి తెలుస్తూనే ఉంది. దాన్నటు పోనివ్వకుండా మళ్ళించాలని .. అదలా పరిణమించకుండా విశ్వప్రయత్నమైనా చేసెయ్యాలని అనిపించింది .. కానీ ఏమీ చెయ్యలే దతను. చెయ్యలేడు .. చెయ్యటానికి చేతులు కట్టేసినట్టు .. పెదాలు కుట్టేసినట్టు .. నాలికని వెనక్కి మడిచి పై అంగటికి క్రేజీ గ్లూతో ఎవరో అంటించేసినట్టు .. అశక్తత.

మాయలా కప్పేసిన మంచు మీద ఓడిపోయిన బ్రేకులు, నిర్వీర్యమైపోయిన సుదర్శనంలా స్టీరింగ్ వ్హీల్ నీరసించిపోయిన చేతుల్లో .. ఇనెవిటబుల్ .. అని అర్థమైపోయి .. వేచి వేచి .. ఆ తాకిడికై చూసి చూసి .. ఎన్నో యుగాలు గడిచాక .. థడ్! సరిగ్గా అలాగే ఇప్పుడు కూడా .. స్పష్టంగా స్లో మోషన్ లో ..

ఇనెవిటబుల్ .. ఇప్పుడో ఇంకాస్సేపట్లోనో .. ఢీ కొట్టుకోవడం తధ్యం .. అతనికి తెలుస్తూనే వుంది .. కేమ్రీ టోటలై పోతే స్టేట్ ఫార్మ్ వాడు డబ్బిచ్చాడు కొత్త కారు కొనుక్కునేందుకు .. ఈ జరగ బోతున్న ఏక్సిడెంటుకి ఇన్సూరెన్స్ ఏదీ? ఈ క్రాష్ లో గుద్దుకుని విరిగి ముక్కలై పోయే మనసుల్ని రిపైర్ చేసే మెకానిక్ ఎవడూ? క్రాష్ జరక్కుండా ఆప లేడా తను? అది తన చేతుల్లో పని కాదా? నిజమా? నిఝంగా అది నిజమైతే ఎంత బావుణ్ణు! కానీ అది నిజం కాదు .. ఎప్పుడైతే జాగ్రత్తగా పేర్చుకున్న పైపై కబుర్ల పేక మేడలు కూలి పొయ్యాయో .. ఎప్పుడైతే ముక్కిన వాసన కొడుతూన్న పొడి పొడి మాటల మూటలు చిరిగి పోయాయో .. అప్పుడే అర్థమై పోయింది .. inevitable .. this crash .. with no survivors .. it’s just going to happen .. in front of his very eyes .. with both of them right in the middle of it.

ఇనెవిటబుల్ గా అతనా ఒక్ఖ మాటా అనేశాడు. అనొద్దనుకున్నాడు .. ఐనా అనేశాడు. శరాఘాతం .. లోతైన గాయం .. బాణం .. తగిలిన వాళ్ళకి .. వేసిన వాళ్ళక్కూడా .. గుండెలు ఛిద్రమై పోయి .. మనసులు భీభత్సమై పోయి .. అల్ల కల్లోలం .. బయట నిశ్శబ్దం .. ప్రశాంతం .. లోలోపల ప్రళయం .. అగ్ని గోళాలు ఢీకొని ఫెటీల్మని పేలి పోతున్నట్లు .. నరాలు చిట్లి పోతున్నట్లు .. మాట విని ఆమె ఎంత విలవిల్లాడి పోతోందో ఆ మాట అని అతనూ అంతగానూ .. మండి పోతూ .. రెండు మనసులూ రగిలి పోతూ .. ఇద్దరూ మాడి మసై పోతూ .. విధ్వంసం .. సర్వ నాశనం .. అయిపోయాక మిగిలింది ఇంత బూడిద. లోపల గాఢాంధకారం .. బయట నిశ్శబ్దం .. మధ్య ఎడారి.

రవంత చెమ్మ .. మంటల వేడికి ఇగిరి ఆవిరై పారిపోయిందనుకున్న చెమ్మ .. ఇంకా నేనున్నా నంటూ .. హఠాత్తుగా ద్రవీభవించి .. నాలుగు కళ్ళల్లోనూ నాలుగు చుక్కలుగా .. ఆ ఎడారిలో .. ప్రాణానికి జీవం పోసే చెమ్మ.

చాలా సన్నటి సవ్వడి .. చిన్న చప్పుడు .. రెండు చేతులు ఒకదాన్నొకటి వెతుక్కుని .. ముని వేళ్ళతో స్పృశించినప్పుడు .. ఒక అరచేతిలో ఇంకో అరచెయ్యి ఒరుసుకున్నప్పుడు .. ఆ చప్పుడు .. నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ .. ఒక మెత్తటి వెచ్చటి స్పర్శ చేసే సవ్వడి.

మబ్బులు వీడి పోయి .. మంచు పొరలు ఎగిరి పోయి .. మనసుల పరస్పర వీక్షణంలో .. గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ ఒక సన్నటి కాంతి కిరణం.

అప్పుడింక మాట లనవసరం.

Comments

భావన said…
హ్మ్మ్... చాలా బాగుందండి కధ. కొన్ని మాటలు జీవితాంతం వెంటాడతాయి, కొన్ని ప్రాణాలు నిలిచె జీవ శక్తి తో పాత పుటల్లోకి ఎక్కి పోతాయి. తుఫాను కాలం లో బయటకు వస్తాయి వాయు వేగ విఝృంభణ తో. కొన్ని చెమ్మ కలిపే బంధంలో మాయ మవుతాయి. ఇది అలా అయ్యిందన్నమాట. బాగుంది కధ.
నాకేం అర్థం కాలేదు. ఇంతకీ అతనేమాటన్నాడు. అదేంటో తెలిస్తే, మేము కూడా అటువంటి మాట అనకుండా జాగ్రత్త తీసుకుంటాం కదా :). అతనేమాటన్నాడోనని చివరి వరకూ చదివా. ప్చ్...నిరాశపర్చింది. :(

>>ఈ బ్లాగులో వచ్చే కొత్త టపాలూ, వ్యాఖ్యలూ కూడలిలోనూ జల్లెడలోనూ కనిపించవు."

??????????????????????????????????????????????????????????????????????
భావన .. నెనర్లు.
నాగప్రసాద్ .. పోన్లెండి. కష్టపడి చదివినందుకు నెనర్లు.
నా బ్లాగు గమనికలోని ఆ వాక్యంతో మీకేమైనా ఇబ్బందా? అన్ని ప్రశ్నార్ధకాలు వెలిబుచ్చారు?
Anonymous said…
>>ఈ బ్లాగులో వచ్చే కొత్త టపాలూ, వ్యాఖ్యలూ కూడలిలోనూ జల్లెడలోనూ కనిపించవు.

నా బ్లాగు గమనికలోని ఆ వాక్యంతో మీకేమైనా ఇబ్బందా? అన్ని ప్రశ్నార్ధకాలు వెలిబుచ్చారు?

No, methinks (s)he was saying, the blog is quite nicely visible and accessible from Kudali (sahityam) section.
Purnima said…
WOW.. It has been a day of serendipity. I was thinking of this story.. and here it is.

Thank you! :)
Anon .. thank you for bringing this to my attention. I contacted Kudali support to remove it from their listings. You are welcome to comment with your name.

Purnima .. ok.
చాలా బాగుంది కథ! ఎక్కడో మనసులో ఏదో గుచ్చుకున్న అనుభూతి, అద్భుతంగా ఉంది. ముగింపు మరీ బాగుంది, విషాదాంతం కాకుండా.
Vasu said…
నాకూ అర్థం కాలేదు. అతను ఏమన్నాడు. నేనేమన్నా మిస్ అయ్యానా కథలో???
అతను అనేశాడు. అతను అనేశాడు.
ఏం అనేశాడు . ఏం అనేశాడు.?? అని ఆలోచిస్తున్నా.

విడాకులా??
asha said…
'మాటలే' లేవు. కధ చాలా బాగుంది.
Anonymous said…
ఆ మాటేమిటో పాఠకుల ఊహకే వదిలేయడం బాగుంది. ఏదైనా కావచ్చు!
Chowdary said…
తానాపత్రికలో ఈ కథ ప్రచురించటానికి ముందు చికాగోలో జరిగిన రెండో అమెరికా తెలుగు సాహిత్య సదస్సులో (2000?) స్వీయరచనా పఠనంగా విన్నట్లు గుర్తు.
Anonymous said…
కధ బావుంది . చేసిన గాయాన్ని బట్టి ఆయుధం( మాట) పదును వూహించుకోటమే !
నా కధ ( కధ అనొచ్చో అనకూడదో)" మాటల యుద్ధం ముగిసినవేళ " గుర్తొచ్చింది.కొంచెం రొమేంటిక్ టచ్ తో వుంటుంది . మీరూ చదివారు బావుందని మెచ్చుకున్నారు.
Anonymous said…
చాల బాగుంది కథ . అద్భుతమైన కధనం . పాతది ...పదేళ్ళ కిందటిది అయినా, వాడిన పాళీ కొత్తదవటం వల్లనేమో బాగా పదునుగా ఉంది. ఈమధ్య కాలం లో ఇంత మంచి కధ చదవలేదు. ధన్యవాదాలు.
చౌదరి గారు, మీకు బాగా గుర్తుందండీ!

చంద్రమోహన్, భవాని, లలిత, అజ్ఞాత, సత్ .. నచ్చినందుకు సంతోషం.

వాసు .. అర్ధం కాకపోతే పర్లేదు. విడాకులకంటే దారుణమైనవి ఇంకా చాలా వున్నాయి జీవితంలో.

భవాని, మీరేంటి ఈ మధ్య రాస్తున్నట్టు లేదు? తరచు రాయండి.

లలిత, మీ రచన గుర్తుంది. అలాగే కొన్నేళ్ళ క్రితం ఇదే విషయమ్మీద, ఇంచుమించుగా ఇదే ట్రీట్‌మెంటుతో అమెరికా తెలుగు కవి కన్నెగంటి చంద్ర, దేశీయ తెలుగు కవి సన్నపురెడ్డి మంచి పద్యాలు రాశారు. నా దగ్గర ఎక్కడొ ఉండాలి. వారు అనుమతిస్తే పంచుకుంటా.
మాలతి said…
విలక్షణమయిన కథ. ఒకే ఒక సంఘటనని తీసుకుని ఇలా రాయడం చాలా కష్టం. అద్భుతంగా నడిపించారు కొసదాకా. ఏంమాటో చెప్పకుండా అతనిమీద ఆమాటప్రభావం మాత్రం వివరించడం - చాలా బాగా చేశారు. అభినందనలు.
మీ కథలసంకలనంకోసం ఎదురు చూస్తున్నాను.
మాట పదును మరోసారి తెలిసేట్లు చేసారు.
వావ్!!!! చాలారోజుల తర్వాత చదువుతూనే ఇలా పైకే 'వావ్!' అనుకునేంత గాఢమైన కధ చదివాను!! మాలతి గారు చెప్పినట్టు ఒక సంఘటన (అసలైతే ఒక మాట మీద అనొచ్చేమో?!) మీద ఆధారపడి ఇంతటి ఉత్కంఠతో చదివించిన కధ ఇదేనేమో! అయిపోయాక కూడా ఆ మాటేదో తెలీకపోవడం వల్ల నిరుత్సాహమేమీ లేదు!!
ఈ ఆణిముత్యాన్ని వెలికితీసి మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు :-)

ఈ ట్రాన్స్ లో నుంచి బయటపడటానికి సమయం పట్టేదట్టుంది..అంత బాగుంది.