జయహో నానో!

డిట్రాయిట్‌లో ఉత్తరమెరికా అంతర్జాతీయ కార్ల ప్రదర్శన జరుగుతోంది. నేనింకా వెళ్ళలేదు, వీలైతే వచ్చేవారం వెళ్ళి ఆ విశేషాలు కూడా రాస్తాను. కాకపోతే, ఈ సంరంభాన్ని పురస్కరించుకుని టాటా వారి అనుయాయి సంస్థ టాటా టెక్నాలజీస్ వారు నిన్న సాయంత్రం స్థానిక విజ్ఞాన కేంద్రం (Detroit Science Center) లో ఒక చిన్న ప్రదర్శన, విందు ఏర్పాటు చేశారు.

టాటా టెక్నాలజీస్ సంస్థ అనేక పెద్ద తయారు సంస్థలకి (manufacturing companies) ఇంజనీరింగ్ సేవలని అందిస్తుంది. వారి వినియోగదారులకి ఒక విందు చెయ్యడం ఈ సమావేశాపు ముఖ్యోద్దేశము అయినా, ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని తమ సహ సంస్థ అయిన టాటా మోటర్స్ వారి సరికొత్త కారు నానోని ఇక్కడి సమాజానికి పరిచయం చేశారు.

కారుని ఆవిష్కరించేముందు కంపెనీ అధ్యక్షుడు రతన్ టాటా గారు ఢిల్లీలో ఈ కారుని ఆవిష్కరిస్తూ చెప్పిన ప్రసంగం విడియో ఒకటి ప్రదర్శించారు. అటుపైన ఈ కారుని రూపొందించే బృందంలో పని చేసిన ఒక యువ ఇంజనీరింగ్ మేనేజరు, ఒక సీనియర్ మేనేజర్ మాట్లాడారు ఈ అనుభవాన్ని గురించి. కారుని రూపొందించడంలో ఏ విషయంలోనూ రాజీపడలేదనీ, మొదటినించి చివరి దాకా ప్రతీ భాగాన్నీ, ఇంతకు ముందు ఎలా చేశారు, వేరే కార్లలో ఎలా చేశారు అని కాకుండా, మన ఉద్దేశం ఏంటి, దాణికి తగినట్టు ఎలా చెయ్యాలి అని ఆలోచించామని, తత్ఫలితంగా, ఈ కారు అంతర్జాతీయ పనితనపు మరియు భద్రత ప్రమాణాలకి తూగ గలుగుతున్నదనీ చెప్పారు. యువ ఇంజనీరు మాట్లాడిన మాటలు నాకు చాలా నచ్చాయి. ముప్ఫయ్యేళ్ళయినా నిండని చిన్న వయసులో, వందేళ్ళుగా నెలకొని, పాతుకుని, వేళ్ళూనుకుని ఉన్న అంతర్జాతీయ కార్ల తయారీ అనే మహావృక్షం నీడలో, ఇప్పటివరకూ ఎవరూ ఊహించని (లక్షరూపాయల్లో కారు) లక్ష్యమ్మీద రాజీ లేకుండా పని చెయ్యడం .. తద్వారా కేవలం కారు రూపకల్పనలోనే కాక తదంతర్గత ప్రక్రియలన్నీ కొత్తతీరుగా ఆలోచించి పెంపొందింప చెయ్యడం నిజంగా ఒక ఆశ్చర్యకరమైన, అద్భుతమైన విషయం. అంతిమంగా ఈ కారు విపణిలో విజయం సాధిస్తుందా అనే ప్రశ్న పలువురి మనసుల్లో మెదుల్తూనే ఉన్నా, అసలీ లక్ష్యాన్ని ఊహించి దీన్ని సాధించి తీరాలి అని నిర్దేశించిన అధ్యక్షుడు శ్రీ రతన్ టాటా, ఆయన విసిరిన సవాలుని అందుకుని ఐదేళ్ళు శ్రమించి సాధించిన టాటా బృందమూ అభినందనీయులు. చాణూర మల్లుడిలాంటి అంతర్జాతీయ కార్ల వ్యవస్థని సవాలు చేస్తున్న చిన్నికృష్ణుడీ నానో. జయహో నానో!

ఇక కారెలా ఉందా? మీరే చూడండి.


ఇవ్వాళ్ళ పొద్దున హిందూ పత్రికలో వార్త.

Comments

SRRao said…
కొత్తపాళీ గారూ !
మన భారతీయ నానో అమెరికాలో జయకేతనం ఎగురవేసిందన్నమాట. జై భారత్.
Jay said…
Video of Nano in US

http://cosmos.bcst.yahoo.com/up/player/popup/?rn=289004&cl=17599720&src=finance&ch=4043681
Vasu said…
నాకు టాటాస్ ముఖ్యంగా రతన్ టాటా. కేవలం లాభార్జనే కాక దేశానికి ఏదో ఇవ్వాలని ప్రయత్నిస్తారు. నానో రతన్ టాటా జీవితాశయం అన్ని చాలా సార్లు చెప్పినట్టు గుర్తు. అది మార్కెట్ లోకి రాక మునుపు, లక్ష రూపాయలకి కార్ ఏంటి అని అందరూ నవ్వుకున్నారు సెవెన్ సీటర్ లా ఉంటుందని బోలెడు యగ తాళి కూడా చేసారు. నేను ఒక మాదిరిగా ఉంటుందేమో అనుకునే వాడిని. కార్ విడుదల చేసినప్పుడు చూస్తె లక్ష రూపాయలకి చాలా మంచి కార్ లాగ అనిపిచింది ముఖ్యంగా కళ్ళకింపుగా ఉంది. కాకపోతే ఒకటే బాధ బోలెడు ట్రాఫ్ఫిక్ సమస్యలు ఉత్పన్నం చేస్తుందని. ద్విచక్ర వాహనాలని రిప్లేస్ చేసి బోలెడు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. కార్ పూలింగ్ కచ్చితంగా అమలు చేస్తే బావుంటుంది అన్ని నగరాలలో.
KumarN said…
మొదట్లో దీన్ని 2,500-3,000 రేంజి లో అమెరికా లో అమ్ముతారని వార్తలు వచ్చాయి. నేను నిజంగా కొందామనుకొన్నాను..స్వామి కార్యము, స్వకార్యము కలసి వస్తాయని. ఇండియా కార్ కొన్నట్లూ ఉంటుంది, నాకు 45 మైళ్ళ దూరంలో ఉన్న ఎయిర్ పోర్ట్ కి ప్రతి వారం వెళ్ళి రావడానికి, బాగా పనికి వస్తుందని.

కాని నిన్నెక్కడో చదివా..అది 5,000-6,000 రేంజిలో ప్రవేశపెడుతున్నారంట. కొంచెం నిరాశ చెందాను.

ఇంతకీ ఎప్పుడు అమ్మకాలు మొదలు పెడుతున్నారో తెలుసా?.
Sujata M said…
మంచి కబురు. ఇంకో విశేషం ఏమిటంటే, టాటా గ్రూప్ ఇపుడు చవకలో, మంచి నీళ్ళ (త్రాగు నీళ్ళ) ఫిల్టర్ తయారుచేస్తోంది. ఇప్పటికైతే ఈ ఫిల్టర్ నీళ్ళలో చాలా వరకూ కాలుష్యాల్ని వడగడుతుందిట. కాకపోతే, కంపెనీ ఆర్ ఎండ్ డీ మాత్రం ఫ్లోరోసిస్ లాంటి ప్రమాదకర పదార్ధాల్ని కూడా ఫిల్టర్ చేసి పెట్టే సాధరణ వాటర్ ఫిల్టర్ లను తయారు చేయడం మీద దృష్టి పెట్టింది. ఇదే గనక విజయవంతం అయితే, భారత దేశంలో నీళ్ళ ద్వారా సంక్రమించే వ్యాధులనూ, వాటి వల్ల సంభవించే మరణాల్నూ తగ్గించొచ్చు. ఈ ఐడియా మాత్రం ఖచ్చితంగా దేశానికి పనికొచ్చేదే !


http://www.thehindubusinessline.com/2009/12/08/stories/2009120852360300.htm
నవ్విన నాపచేనే పండింది. అప్పట్లో ఎగతాళి చేసినవాళ్ళే ఇప్పుడు ఆ కారును చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.
శ్రీ said…
ఆటో షోకి నేను శనివారం వెళ్ళాను.టాటా నానో కోసం వెతికితే ఎక్కడా లేదు. డెట్రాయిట్ సైన్స్ సెంటర్ లొ పెట్టాడని ఇపుడే మీ టపా ద్వారా తెలిసింది.
రావు గారు అచ్చగా జయకేతనం అనలేముగానీ, కొంత సంచలనం సృష్టించింది.

జయ్ .. విడియాఒకి ధన్యవాదాలు

వాసు .. ఆయన ఇది కేవలం వ్యాపార దృష్టితో కాకుండా ప్రపంచానికి తన కానుక టైపులో ఆలోచించాడేమోనని నేనూ నా సహోద్యోగీ అనుకున్నాము.

కుమార్ .. ఈ కారు అమెరికాలో అమ్మకానికొస్తుందా అని ఊహాగానం కూడా అనవసరం నా దృష్టిలో. దీని లక్ష్యం అమెరికను విపణి కాదు. అలాంటప్పుడు ఇక్కడ మూడు వేలకి అమ్ముతుందా, ఐదువేలకి అమ్ముతుందా అని ఆలోచన ఎందుకు? కుడి స్టీరింగ్ నించి దాని ప్రతిబింబంలాగా ఎడామ స్టీరింగ్ నమూనా తయారు చెయ్యడం చాలా ఖర్చుతో కూడిన పని. చేస్తారని నేనైతే అనుకోవటల్లేదు.

సుజాత .. నిజం

రవిచంద్ర, శ్రీ .. ధన్యవాదాలు