కబుర్లు నవంబరు 9

హమ్మయ్య. హౌస్సభ్యులు ముక్కీ మూలిగీ మొత్తానికొక ఆరోగ్య వ్యవస్థ బిల్లుని గెలిపించారు. అనుకున్నట్టుగానే రిపబ్లికన్లందరూ (ఒకరు తప్ప) దీనికి వోటెయ్యలేదు, కొంతమంది డెమోక్రాట్లుకూడా. సుమారుగా యాభయ్యేళ్ళుగా జరుగుతున్న ఈ వ్యవస్థా ఉద్ధరణ ప్రయత్నంలో చేసిన తొలి యత్నంతోనే సంపూర్ణ విజయం సాధిస్తామని అనుకోవలసిన పనిలేదు. ఎందుకంటే ఏ సూత్రాల పరిణామాలు నిజంగా ఎలా తయారవుతాయో కూచున్న చోటునుండి వీళ్ళెవరూ పసిగట్టలేరు. సరైనదిశగా ఒక అడుగైనా వెయ్యడం ముందు ముఖ్యం. ఆ అడుగు నిన్న పడింది. అందుకు సంతోషం. ఇక సెనేటుతో బేరసారాలు యెలా జరుగుతాయో చూడాలి.

ఒబామా అధ్యక్ష పదవికి యెన్నికయ్యి ఏడాదయింది గతవారంలో, తాను పదవి పగ్గాలు చేబట్టింది జనవరిలో అయినా. పైగా మొన్న మంగళారం రాష్ట్ర గవర్నర్ల పదవులకి జరిగిన రెండు ఎన్నికల్లో రిపబ్లికన్లు గెలవడంతో ఒబామా హవా తగ్గిపోయిందనీ, అతని యెజెండాని ప్రజలు వ్యతిరేకిస్తున్నారనీ ప్రచారం మొదలైపోయింది. ఒబామా అతన ప్రచారంలో చేసిన వాగ్దానాల మీద అతను ఈ యేడాదిలో సాధించి చూపించినది యిప్పటికి తక్కువే అయినా, అన్నిరకాల అభిప్రాయ సేకరణలోనూ దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయం అతనికి అనుకూలంగానే ఉంది. కానీ ఈ సహనం ఇంకా యెక్కువసేపుండకపోవచ్చు. ముఖ్యంగా దేశ ఆర్ధిక పరిస్థితి విషయంలో. కంపెనీల బేలెన్సు షీట్లు బాగుపడుతున్నాయి, వాలువీధి నావరించుకున్న గాఢాంధకారం కరిగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి కానీ ఉద్యోగాల పరిస్థితి మాత్రం ఎక్కడా మెరుగుపడిన సూచనలు లేవు. పైపెచ్చు, దేశావ్యాప్తంగా నిరుద్యోగపు శాతం పది దాటింది (అంటే 15 మిలియన్లకి మించిన అమెరికన్లు). సామాన్యులు అల్లాడుతున్నారు, ప్రభుత్వం ఆర్ధికోద్ధరణ దిశగా చేపట్టిన పనులు అదృశ్యమవుతున్న ఉద్యోగాల్ని నిలిపి ఉంచేదుకుగానీ, కొత్త ఉద్యోగాల్ని పుట్టించేందుకు గానీ ఉపయోగపడిన దాఖలాలు లేవు. ఏతన్మధ్య ప్రభుత్వపు బిలియన్లతో ఊపిరి తిప్పుకున్న బేంకులు మంచి లాభాల్ని ప్రకటిస్తున్నాయి. త్వరలో ఉద్యోగ పరిస్థితి మారకపోతే పౌరుల సహనం ఎక్కువకాలం నిలిచి ఉండదు.

ఈ సోమవారం ఈ కార్తీకమాసానికి చివరిది అనుకుంటా. (ఇది నిజం కాదు. వొచ్చే సోమవారం కూడా కార్తీక సోమవారమే. ఈ కార్తీకమాసంలో పౌర్ణమి, అమావాస్య రెండు సోమవారాల్లోనే వచ్చాయి) ఐతే ఏంటంటా? ఏంలేదు, శివపూజకు వేళాయెరా! .. అంతే!!

తెలుగుసినీ ఆకాశంలో చిరంజీవి మెగాష్టారుగా వెలుగు పుంజుకుంటున్న రోజుల్లోనే నేను ఆంధ్రదేశానికి దూరమవ్వడంతో అనేక చిత్రరాజాల్ని మిస్సయ్యాను నేను. ఈరోజు యూట్యూబు పుణ్యమాని, పూర్తి సినిమాలు కాకపోయినా అలనాటి సినిమాలనించి పాటలైనా చూస్తుంటాను అప్పుడప్పుడూ. అలా కంటబడిందీ ఈ చక్కటి ఆణిముత్యం. మన సినిమాల్లో తల్లిప్రేమని చూపించే పాటలూ ఘట్టాలూ చాలానే ఉంటాయి. కానీ తండ్రి ప్రేమని సున్నితంగా చెప్పే దృశ్యాలు చాలా అరుదుగా వుంటై. ఈ చిన్ని పాట దృశ్యాన్ని చాలా సున్నితంగా, అందంగా, మనసు చెమర్చేలా తీశారనిపించింది.

బాలగోపాల్ గారి అకాల నిష్క్రమణ సాధారణ పౌరుల జీవితాల్లో ఎటువంటి శూన్యాన్ని మిగులుస్తున్నదో స్వానుభవంగా వివరిస్తున్నారు మిత్రులు అక్కిరాజు. పేరుపొందిన మరొక రచయిత సరికొత్తగా బ్లాగు తెరిచారు. విశాఖనించి కథా రచయిత్రి మల్లీశ్వరిగారు జాజిమల్లి అంటూ తమ కబుర్లు చెబుతున్నారు. మీరూ ఓ లుక్కెయ్యండి.

Comments

కొత్త పాళీ గారు,
నా టపాపై మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలండి. కాని, ఒక జోకుని కూడా వ్రాసుంటే ఇంకా బాగుండేది.
Anonymous said…
USA population is more than 250 Million according to reports. Unemployment is topping 25 million people :-( Less talked the better about Obama now. Wonder where he stashed the Noble prize money. Any guesses anyone?

dharmadAta movie (ANR) has a good song - about fatherly love. jO lAli.. very touching. Not sure if it is available on You tube though.

And kartika masam is ending next monday 16th. 16th is New moon day of the month; so methinks 16th is the last monday of karteeka masam. pADyami will not start until Tuesday 17th. Should not that make the16th as the last monday of karteeka masam?
రాంగోపాల్ గారు, నాకు జోకులు రాయడం చేతకాదండి, యేదన్నా సందర్భం వొచ్చినప్పుడు పిట్టకథలు మాత్రం చెబుతుంటాను.

యెనానిమిషులకు .. మీరు చెప్పిన సవరణలన్నీ బావున్నై. నిరుద్యోగ గణాంకం పది శాతం అంటే జనాభా మొత్తమ్మీద అని అర్థం కాదనుకుంటా. ఉద్యోగ మార్కెట్లో ఉన్నవాళ్ళతో ంఆత్రమే గణిస్తారనుకుంటాను. అంచేత 15 మిలియన్ల సంఖ్య సరైనదిగా కనిపిస్తోంది. ధర్మదాత సినిమాలో తండ్రి పాడిన జోలపాట అద్భుతంగా వుంటుంది. వొచ్చే సోమవారము కూడా కార్తీక సోమవారమే యని మా శాస్త్రిగారు ఇప్పుడే చెప్పారు.
ఇంకో విషయము. ఒబామా బీదవాడు కాదు. అధ్యక్ష ఎన్నికలకి పోటీలో ఉండగా భార్యాభర్తలు జాయింటుగా దఖలు పరిచిన ఆదాయపన్ను వివరాల్ని బట్టి వారి సాలుసరి ఆదాయం రెండు మిలియన్ల పైబడి ఉన్నట్టు గుర్తు. అంచేత, ఆయన ఏదన్నా యెక్కడన్నా "శ్టాష్" చీయాలంటే, నొబెలు బహుమతి మొత్తమ్మీదనే ఆధారపడనవసరం లేదు. ఆయన సొంతడబ్బు బాగానే ఉంది.
Vasu said…
ఇంకా ఎన్నాళ్లండీ బాబూ ఈ ఆర్థిక మాంద్యం. ఉద్యోగాల పరిస్థితి ఇండియా లోనే బావుందని విన్నాను. చాలా సంస్థలు (ఐటి వి) కొత్త వారిని తీసుకుంటున్నాయిట. ఒబామా కబుర్లు చెప్పినంత బాగా పని ఏమీ చేసినట్టు కనపడట్లేదు.
ఔను. కార్తీక మాసం ఇక ఒక వారమే ఉందా. మీరు వన భోజనాలకీ గట్రా వెళ్ళారా ? అన్నట్టు మీకు మంచు పడడం ఎప్పుడు మొదలవుతుంది?
మురళి said…
బాగున్నాయండీ కబుర్లు.. మాంద్యం మందగమనంతో సాగుతోందన్న మాట అక్కడ... మేము కోలుకుంటున్నామని మన్మోహనుడు మొన్ననే సెలవిచ్చాడు..
ఆర్థిక మాంద్యం గురించి మరోసారి వాపోయాను. అయినా కోలుకోగలమనే ఆశ.

కార్తీకమాసం౦ ఇప్పటికి మూడు సత్యనారాయణవ్రాతాలు చూసొచ్చాను. మరొకటి వుందా తెలియదు.

చిరంజీవి సాత్వికంగా నటించిన ఏ సినిమాలు జనరంజకం కాలేదు. ఒక విధంగా ఇమేజ్ ముద్ర ఆయనకి శాపం. "రుద్రవీణ" తర్వాత అటువంటిదే మరొక విఫలం తర్వాత ఆయన ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన మాట ఇది.