షికాగో శివార్లలో మహారుద్రం - మరువలేని అనుభవం

షికాగోనగర శివార్లలో విల్లోబ్రుక్ అనేచోట మహారుద్రాభిషేకం, హోమం నిర్వహించారు కంచి కామకోటి సేవా ఫౌండేషనువారు. స్థానిక చిన్మయామిషన్ వారి భవనంలో ఏర్పాటు చేశారు. మా వూర్నించి ఇంకో ఆరుగురితో కలిసి ఒక వేన్‌లో శుక్రవారం సాయంత్రం బయల్దేరి వెళ్ళాము. అంతకు ముందురోజునే అక్కడికి చేరుకున్న మరో ఆరుగురు మావూరివాళ్ళూ కలిశారు. చిన్మయామిషన్ కి దగ్గర్లోనే ఒకహోటల్లో బస.

శివరాత్రికీ, ఇంకా ఇంట్లో ఏదైనా ప్రత్యేకమైన సందర్భాల్లోనూ ఏకాదశ రుద్రాభిషేకం చెయ్యడం ఆనవాయితీ. అంటే రుద్రాన్ని (దీన్నే రుద్రప్రశ్నం, శతరుద్రీయం, నమకం అని వ్యవహరిస్తారు) పదకొండుసార్లు పఠించడం. ఆ చదివేది ఒక్కరు కాక, నూట ఇరవయ్యొక్క మంది చదివితే, దాన్ని మహారుద్రం అంటారు. ఈ వారాంతంలో నేను పాల్గొన్న ఈ మహారుద్రంలో పదహారుమంది పురోహితులు కాక నాలాగా చదవడానికి మొత్తం నూటముప్ఫైనాలుగు మంది వచ్చారు దేశం నలుమూలల్నించీ. టొరాంటో నించికూడా కొందరు వచ్చారుట.

శనివారం పొద్దుట ఐదున్నరకల్లా పూజాస్థలానికి చేరుకున్నాం. ఆరింటికి, చెప్పినట్టుగా కార్యక్రమం మొదలీంది. అసలు కాండకి ముందు జరగాల్సిన తయారీ వ్యవహారమంతా జరిగేందుకు రెండుగంటలు పట్టింది. ఎనిమిదింటికి మహాన్యాసం మొదలైంది. అదంతా ఒకగంట. మహాన్యాసం జరుగుతుండగానే నాకు వొళ్ళు గగుర్పొడిచింది. నూటయాభై కంఠాలు ఒక్క స్వరంతో ఒక్క గొంతులో సస్వరవేదమంత్రోఛ్ఛారణ చెయ్యడం .. ఒక నయాగరా జలపాతపు హోరు .. అదొక మహాప్రభంజనం .. కానీ తుపానులో ఉండే కల్లోలం మాత్రం లేదు .. ఉచ్ఛస్వరంలో పైకి లేస్తూ, మంద్రంతో కిందికి దిగుతూ .. అదొక ఆనంద డోలిక. అక్కడ ఆ నూట యాభై గొంతుల్లోంచి ఒక్క స్వరూపంగా ప్రత్యక్షమై మమ్మల్నందర్నీ ఆవరించిన ఆ శబ్దబ్రహ్మాన్ని అంతకంటే వర్ణించలేను.

ఇక అక్కణ్ణించి పదకొండు ఆవృత్తాలు సస్వర నమక పారాయణం. ప్రతీ ఆవృత్తం తరవాతా చమకంనించి ఒక అనువాకం. మధ్యలో పురోహితుల్లో ఒకరు, న్యూజెర్సీ నించి వచ్చిన నటరాజశ్రౌతిగారు, సామవేదరుద్రాన్ని గానం చేశారు. ఆవృత్తాలు పదకొండూ ముగిసి, ఇతరసూక్తాల పారాయణ జరుగుతుండగా అలంకారం, పిమ్మట అర్చన. మహానైవేద్యం పెట్టి హారతిచ్చేప్పటికి మధ్యాన్నం మూడు కొట్టింది.

నాకు ఉదయం పదింటినించే నడుంనెప్పి మొదలైంది బాసింపట్టులో కూర్చోవడం అలవాటు లేక. అక్కడ చాలామంది నాలాగే నలభయ్యో పడిలో ఉన్నవాళ్ళే. కొందరు స్థిమితంగా కదలకుండా కూర్చోగలిగారు కానీ, చాలామంది నాలాగా ఇబ్బంది పడుతున్నవాళ్ళే. ఇంక మరీ భరించ శక్యం కానప్పుడు, లేచి, ఒక ఐదు నిమిషాలు పక్కకి వొచ్చి నించోవడం, మళ్ళీ యథాస్థానంలో కూర్చోవడం .. గొంతులు మాత్రం పారాయణ ఆపింది లేదు. ఒక్కరంటే ఒక్కరైనా ఆ సభాస్థలిని వదిలి కదిల్తే వొట్టు. అక్కడ జరుగుతున్నది ఏదో మన వొంటి నెప్పులకీ, మన దైనందిన వ్యవహారాలకీ, సమస్యలకీ అతీతమైనది, గొప్ప శక్తివంతమైన మహాద్భుతం ఏదో అక్కడ జరుగుతోందన్న స్పృహ ప్రతి ఒక్కరిలోనూ వెలుగుతూ ఉంది.

సాయంత్రం ఆరింటికి రుద్రక్రమార్చన. నాకు అన్ని వివరాలూ తెలియవు కానీ క్రమ, ఘన, జట .. అనేవి వేద పనస వల్లించడానికి రకరకాల పద్ధతులున్నాయి, ఒకదానికంటే క్లిష్టమైనది మరోటి. వేదపండితుల్ని ఘనాపాఠీ అనీ, జటాంతస్వాధ్యాయి అనీ వ్యవహరించడం వింటూ ఉంటాం. ఒక మోతాదువడితో నమక పారాయణ ఒక ఆవృత్తం చదవడానికి సుమారు ఇరవై నిమిషాలు పడుతుంది. అదే క్రమపద్ధతిలో పారాయణకి గంటంబావు పట్టింది. నాకు చేతకాలేదుగానీ, అనుభవం ఉన్నవాళ్ళు చాలామంది పురోహితులతో గొంతు కలిపారు ఈ పారాయణలో కూడాను. తదుపరి షోడశోపచార పూజ. నాలుగు వేదాలనించీ ఒక్కొక్క పనస పారాయణ చేశారు ఒక్కొక్క పురోహితులు. ఒకరు నమకంనించి ఒక మంత్రాన్నీ, మరొకరు చమకంనించి ఒక మంత్రాన్నీ ఘనం వల్లించారు. ఒకాయన ద్రావిడవేద గానం చేశారు శ్రావ్యంగా. శివుడు నాట్యవేదానికి ఆద్యుడూ, నటరాజూ కదా .. నాట్యం అవధారయ అంటూ ఒక పది పన్నెండేళ్ళ బాలిక శివస్తుతి కీర్తనకి చక్కటి భరతనాట్యం చేసింది.

ఆదివారంనాడు హోమం. ఇది భవనంలో చెయ్యడానికి వీలులేక బయట లాన్లో టెంట్లు వేసి అక్కడ నిర్వహించారు. ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేశారు. నలుచతురస్రంగా పెద్ద హోమగుండం. దాని చుట్టూతా పదహారు మంది పురోహితులు. ఒక పక్కగా ఒక టెంటులో మేము నూటముప్ఫై నాలుగు మందిమీనీ. ఎక్కడ చలి తగులుతుందోనని టెంటుకి అటుచివరా ఇటుచివరా వేడి పంకాలు అమర్చారు. ఎందుకంటే, మేవంతా కట్టుకున్నది నూలు పంచెలు. పైన చొక్కా ఉండడానికి వీల్లేదు. మొదట వచ్చి కూర్చున్నప్పుడు, కింద ఎన్ని పట్టాలు పరిచినా, మంచుగడ్డ మీద కూర్చున్నట్టుంది. కానీ ఆ రుద్రం వేడికి వానమబ్బులు కూడా ఆవిరైపోయి ఎనిమిదింటికల్లా సూర్యుడొచ్చి వెచ్చ చేశాడు. మొదటి ఆవృత్తం మాత్రం మామూలు వడితో చదివాము, రెండు నించీ పది దాకా వాయువేగ మనోవేగాలతో సాగింది పారాయణం. నాలిక అంత వేగంగా కదలగలదని నేనెప్పుడూ ఊహించనైనా లేదు. అంతటి వడిలోనూ ఎక్కడా స్వరం తప్పలేదు. ఆఖరి ఆవృత్తాన్ని మళ్ళీ మామూలుగతిలో చదివాక, చమక పారాయణతో వసర్ధార హోమం చేసి పూర్ణాహుతి ఇచ్చారు.

మా పారాయణ నించి మీకోసం రెండు శబ్దపు తునకలు.
Get this widget
Track details
eSnips Social DNA


Get this widget
Track details
eSnips Social DNA


తరవాత ఆచార్యులందరికీ సన్మానాలు, నిర్వహణలో తోడ్పడిన స్వచ్ఛంద సేవకులనీ, విశిష్టసేవలందించిన ప్రముఖుల్నీ, ఆఖరికీ నాలాగా గొంతెత్తి పారాయణ చేసిన ఋత్విక్కులందర్నీ కూడా శాలువాలు కప్పి సత్కరించారు. షడ్రసోపేతమైన భోజనం పెట్టి వీడ్కోలు చెప్పారు.

ఈ యాత్రలో నిరంతర నమక చమక పారాయణ వల్ల కలిగిన ఆధ్యాత్మికానందం ఒకయెత్తయితే, కార్యక్రమ నిర్వహణలో అక్కడివారు చూపిన శ్రద్ధ, సామర్ధ్యం చూసి కలిగిన విస్మయం ఇంకో యెత్తు. ఏర్పాట్లన్నీ ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే, ఎక్కడా వేలెత్తి చూపించడానికైనా ఒక్కతప్పు కనబడలేదు. నిర్వాహకులందరూ, ఎక్కడే ఆత్రుత గానీ చిరాకుగానీ లేకుండా, ఎవరి పని వారు చేసుకుంటూ, నావంటి పొరుగూరి అతిథులపట్ల ఎంతో ఆదరం కనబరిచారు. ఇక భోజనాల ఏర్పాట్లు చెప్పనే అక్కర్లేదు. వారింట పెళ్ళి భోజనం అన్నట్టు కొసరి కొసరి వడ్డించారు.

ఈ కార్యక్రమాన్ని గురించి మరికొంత సమాచారం.

బాసింపట్టు వేసుక్కూర్చోవడం అలవాటు లేక నడుం మహా నీలిగింది కానీ .. ఆ మాత్రం కష్టపడకుండా పరమాద్భుతమైన అనుభవాలు రమ్మంటే ఎలా వస్తాయి?

Comments

తృష్ణ said…
చాలా బాగుందండి.చదువుతూంటేనే రోమాలు నిక్కబొడుచుకున్నయి.రుద్రంలో ఉన్న శక్తి అల్లాంటిది మరి..!
మా నాన్నగారింట్లో పాప బారసాలకి మా ఇంట్లో చేయించాము మహారుద్రాభిషేకం.పదహారు మందే వచ్చినట్లున్నారు...బాగా జరిగింది.
మళ్ళీ ఈ ఏడాదిలో మా మామగారి సంవత్సరికాలు అయ్యాకా;కాశీ సమారాధనా(కాశీలో కార్యక్రమాలు చేసివచ్చాము),గంగ పుజలతో పాటూ రుద్రాభిషేకం మాఇంట్లో చేయించాము.
ఎంతో ప్రశాంతంగా ఉంటుంది..ఇల్లూ,మనసూ కూడా ఆ సమయంలో.

ఇళ్ళలో డైనింగ్ టేబుల్స్,పెళ్ళిళ్ళలో కూడా బఫే డిన్నర్లూ బాగా అలవాటైపోయాకా అందరకూ కూడా క్రింద కూర్చునే అలవాటు తప్పిపోయిందండి..ఏవైనా భజనలకు వెళ్ళినప్పుడు బాసింపట్టులో కూర్చోవటం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది..:) :)
తృష్ణ said…
వినటానికి ఆడియో లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.
Sanath Sripathi said…
చాలా బాగుంది, కళ్ళకి కట్టినట్టు చెప్పారు. చిన్నప్పుడు విశాఖపట్నంలో దొండపర్తిలో ఉచిత హోమియో వైద్యాలయం లో ఇల్లనే అఖండ రుద్రాభిషేకంలో పాల్గొన్న రోజులు గుర్తొచ్చాయి.

థాంక్సండీ ...

సనత్
అన్నగారూ నమస్తే
అత్భుతంగా వివరించారు.
ధన్యవాదాలు.
ఈ కార్యక్రమానికి మా గురువుగారు కూడా విచ్చేసారు. ఆయన పేరు శ్రీ అనంతకృష్ణన్[మేరీల్యాండ్]. ఆయన ఈ కార్యక్రమానికి వెళ్తున్నట్టు ముందుగానే మాకు చెప్పారు.
ఏమైనా ఇలాంటి కార్యక్రమానికి హాజరవ్వటం ఓ సుకృతం. మాతో పంచుకోటంవల్ల ఆ పుణ్యం మాకూ కొంత దక్కింది.
ధన్యవాదాలు
Anonymous said…
తమ మఠం వెనకనున్న మసీదులో రోజూ పొద్దున్నే గంట కొడుతున్నారనీ ఆ మసీదుని అక్కడ్నుంచి లేపేద్దాం అని చంద్రశేఖర సరస్వతి స్వామిగార్ని అడిగేరుట కొందరు. 'ఎందుకూ? వాళ్ళ గంట మనల్ని పొద్దున్నే లేవమని పిలుస్తోంది అనుష్టానం చేసుకోమనీ అని వచ్చిందిట సమాధానం. ;-) ఈ స్వామిగారి శిష్యుడే ఒక డాక్టర్ లండన్లో కంటి సర్జన్ గా ట్రైనింగ్ అయి ఇండియా వచ్చేట్ట. మా అబ్బాయ్ బాగా చదూకున్నాడా? అని అడిగేట్ట మనవాడి తండ్రి లండన్ ఆచార్యులగార్ని. నేను బతికే ఉన్నాను కనక మీ అబ్బాయ్ రెండో రేంక్ లో ఉన్నాడు కానీ లేకపోతే మీ వాడే ప్రపంచంలో మొదటి వాడు అని చెప్పేట్టా ఆచార్యులు గారు. ఈ డాక్టర్ గారు ఒకానొక పారిశ్రామికవేత్తకి కంటిజబ్బు నయంచేసినందుకు ఈయన్ని అడిగేట్ట 'నాకు కోట్లున్నాయి. మీకేంకావాలో చెప్పండి అని. 'మా గురువు గార్నడుగు నాకు డబ్బులెందుకూ అన్నాట్ట మద్రాసు డాక్టర్ గారు. ఇంతకీ ఈయన గురువుగారు ఈ స్వామి గారే. ఆయన మద్రాసులో ఒక కళ్ళ హాస్పిటల్ కట్టించి పెట్టమన్నారని, అలాగే కట్టించారనీ చెప్తారు. ఇంతకీ ఆ డాక్టర్ గారి స్పెషలైజేషన్ ఏమిటో తెల్సా? నల్లటి కంటి గుడ్డులో కన్నం పడి చూపు కనపడకపోతే ఆ కన్నం పూడ్చి చూపు తెప్పిస్తాట్ట! తస్సాదియ్యా ఏమి డాక్టరూ ఏమి ఆనస్టీ. ఎంత అణుకువా?

ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఈ స్వామిగార్ల కార్య దక్షత అలాంతిది. ఈ మహారుద్రం బాగా జరగడం అనేది వాళ్లకి వెన్నతో బెట్టిన విషయం. ఎంతటి పెద్ద పెద్ద విషయాలైనా వాళ్ళు అలాగే ఈజీగా చేయగలరు. ఎందుకంటే 'నాహం కర్తా' అనేది వాళ్ళు రోజూ 7/24 ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి. ఆ మధ్య ఒక రామాకౄష్ణా మిషన్ కి వెళ్తే తెల్సింది. మామూలు సాధువులు, వాళ్ళ బడ్జట్ ని ఎంత ఎఫిషెంట్ గా చేస్తున్నారో. బడ్జట్ ఎంతో తెల్సా? అరవై కోట్లు. ఈ హర్వార్డ్ ఎం బి ఏ లు, యేల్ గ్రాడ్యుయేట్లు ఈ సాధువుల కాలిగోటిక్కూడా పోలరనిపించింది అనుకోండి.

ఏమైనా కొ.పా గారి అదౄష్టానికి అసూయగా ఉంది :-(
అజ్ఞాత గారూ, సరిగ్గా చెప్పారండీ. నాహం కర్తా అనే చెప్పుకున్నారు అక్కడ నిర్వాహకులందరూ. చివరకి, అంతా ముగిశాక మేమూ అదే ఫీలయాము. ఇంత చక్కటి వ్యాఖ్య రాస్తూ ఒక తెరపేరైనా పెడితే బావుండేది.
Bolloju Baba said…
wonderful discription

felt as if i was there
జయ said…
రుద్రాభిషేకం లో మేము కూడా పాల్గొన్నంత అనుభూతి కలిగించారు. ఆడియొ వినే అవకాశం కలిగించారు. మీ వర్ణన లో నేను పాల్గోలేదే అన్న దిగులు తీరిపోయింది. అక్కడే ఉన్న అనుభూతి కలిగించారు. థాంక్స్.
సుజాత said…
ఇంత దూరం నుంచి అంత దూరంలో జరిగిన మీ పారాయణని కళ్ళారా చూసిన అనుభూతి కల్గింది! ఈ రోజు పొద్దున్నే ఆలిండియా రేడియో విజయవాడ వారి నుంచి కొనుక్కున్న ఆర్కైవు సీడీలో విశ్వేశ్వర స్తోత్రం, ఓలేటి వారు "భవాయ చంద్ర చూడాయ"అంటూ పాడిన మంగళం విన్న మంచి మూడ్ లో పది రోజుల తర్వాత బ్లాగుల్లోకొచ్చి చూస్తే మీ పోస్టు!

బావుందండీ, కోటప్ప కొండ ఎక్కి ఆది భిక్షువును చూస్తున్నట్లనిపించింది.

బాసింపట్టు వేసుక్కూర్చోవడం అలవాటు లేక నడుం మహా నీలిగింది కానీ .. ఆ మాత్రం కష్టపడకుండా పరమాద్భుతమైన అనుభవాలు రమ్మంటే ఎలా వస్తాయి? .. మరే, బాగా చెప్పారు.
Shashank said…
గురు.. చాలా అద్భుతంగా ఉంది.నేను రావాల్సి ఉండింది ఈ వేడుకకి కాని కొన్ని అనివార్య కారణాల వళ్ళ రాలేకపోయాను. ఇందులో మా గురువు గారు మరియు మా వేద పాఠశాల నుండి దాదాపుగా ఓ 20-25 మంది వచ్చారు. మహరుద్రం కంటే "అతి రుద్రం" అనడం సబబు. చాలా గొప్పగా వర్ణించారు కొత్తపాళీ.

గతవారం ఇక్కడి గుడిలో ఏకాదశ రుద్రాభిషేకం మరియు రుద్రహోమం జరిగింది.. అక్షరాలా ఐదు గంటలు పట్టింది నిజంగా రుద్రుడే వేంచేసినట్టు అనిపించింది. గతయేడాది మా గుడిలో మహారుద్రం జరిగింది అండి.. దేశం నుండి 116 మంది వేదపండితులు వచ్చారు. ఇంకా మేము ఇంకో వంద మంది. ఆ అనుభూతిని మళ్ళ తలపింపజేసారు మీరు. నెనెర్లు.
పరమాద్భుతంగా ఉంది, ఆడియో ఇచ్చినందుకు నెనర్లు.
భావన said…
చాలా బాగుంది అండి, అదృష్టవంతులు వెళ్ళగలిగేరు...
నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ
త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాయ రుద్రాయ
నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ
సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః
rākeśvara said…
అమెరికాలో కరడు(ఆంగ్లపదం) కట్టిన ఈగోయిజంకి ధీటుగా మన వారు వారింటి మధ్యనే హోమం పెట్టడం విశేషం. నాహం కర్తా అన్నది మన వారి నినాదం అయితే, అహమేవ కర్తా వారిది. తప్పొప్పులు నాకు తెలియదు గానీ, ఇలా నిజానికి పరస్పరం అటూ ఇటూ వున్న రెండు ఇజాలు ఒకటికినొకటి తమ మధ్యలో స్థానం ఇవ్వడం నిజంగా అభినందనీయము. గాంధీ కల గుఱించి చెప్పలేం గానీ, ఠాగూరు కల నిజమయ్యేట్టేవుంది.
కొత్తపాళీ గారూ, ఆ హోమ గుండం చుట్టూరా నే తిరుగుతూ యింకా నా మనసు. రుద్రాభిషేక కార్యక్రమాన్ని కనులకు కట్టినట్లు విశదపరిచారు.మేమూ మీ తో పాటుగా ఆ క్రియలో పాలు పంచుకున్న భావన కలిగింది.అత్యధ్భుత వ్యక్తీకరణ.
"సస్వరవేదమంత్రోఛ్ఛారణ చెయ్యడం .. ఒక నయాగరా జలపాతపు హోరు .. అదొక మహాప్రభంజనం .. కానీ తుపానులో ఉండే కల్లోలం మాత్రం లేదు .. ఉచ్ఛస్వరంలో పైకి లేస్తూ, మంద్రంతో కిందికి దిగుతూ .. అదొక ఆనంద డోలిక. అక్కడ ఆ నూట యాభై గొంతుల్లోంచి ఒక్క స్వరూపంగా ప్రత్యక్షమై మమ్మల్నందర్నీ ఆవరించిన ఆ శబ్దబ్రహ్మాన్ని అంతకంటే వర్ణించలేను." అధ్భుతమ్. అభినందనలతో .....శ్రేయోభిలాషి.......నూతక్కి.
రుద్రాభిషేకం గురించి అద్భుతంగా చెప్పారు. చదువుతున్న మాకే రోమాంచితమైంది !
పాల్గొన్న మీరు అదృష్టవంతులు.
కొత్తపాళీ గారూ!అద్భుతంగా కళ్ళారా చూసినట్టుగా ఉందండి.