కబుర్లు - అక్టోబరు 12

డా. కె. బాలగోపాల్ గారి అకాల ఆకస్మిక మరణం దిగ్భ్రాంతి కలిగించింది. వారితో నేరుగా పరిచయం లేకపోయినా, ఆయన సన్నిహితులు చాలా మందితో అనేక ప్రాజెక్టుల్లో పనిచెయ్యడం వల్ల ఆయన వ్యక్తిత్వం నాకు పరిచయమైనట్టే ఉంది. అదీ కాక, ఆయన రచనలు అనేక పత్రికల్లో చదువుతుండడం, ఒక విషయాన్ని నిశితంగా విశ్లేషీంచే ఆయన బుద్ధి పటిమ, తాను కనుగొన్న విషయాన్ని, ఎంత క్లిష్టమైనదైనా, విప్పి చెప్పగలిగే చక్కటి వాగ్ధార ఆయన రచనా లక్షణాలు. యాదృఛ్ఛికంగా మొన్న వయ్యెస్సార్ మృతి తరవాత, ఆయన చరిత్ర గురించి వెతుకుతుంటే, 2004 ఎన్నికల తరవాత వయ్యెస్సార్ రాజకీయ జీవితాన్నీ సీమ రాజకీయ నేపథ్యాన్నీ సమీక్షిస్తూ బాలగోపాల్ గారు రాసిన ఈ వ్యాసం నా కంట పడింది. బాలగోపాల్ వంటి వ్యక్తులు కనుమరుగైనప్పుడు, విధిని నిందించడం, కుటుంబానికి సానుభూతి తెలుపుకోడం, ఆత్మ శాంతికి ప్రార్ధించడం ఇవన్నీ అర్ధంలేని పన్లుగా కనిపిస్తాయి నాకు. మనం చెయ్యాల్సిందల్లా .. ఆ కనుమరుగైన మనిషి ఎటువంటి విలువల్ని నమ్మి ఆచరించారో ఆ విలువల్ని అప్పుడప్పుడూ అయినా గుర్తు చేసుకుంటూ, చాతనైతే మనం కూడా ఆ విలువల్ని మన జీవితాల్లో ఆచరిస్తూ ముందడుగు వెయ్యడమే.


కాబూల్లో భారతీయ దౌత్య కార్యాలయం వద్ద బాంబు పేలింది. ఇంకా తాజాగా రావల్పిండిలో ఏకంగా పాకిస్తాను సైన్య ముఖ్య కార్యాలయం మీదనే భీకరమైన దాడి చేశారు తాలిబాన్ దుండగులు. మన కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా నాకైతే ఎక్కడా కనబళ్ళేదు. పక్క వీధిలో ఇళ్ళు నిప్పంటుకున్నాయని తెలిసినప్పుడైనా మన చూరు మీదా నీళ్ళు చల్లుకోకుండా కూర్చుంటే ... ఇదిలా ఉండగా 40,000 సైన్యం అదనంగా కావాలని అడిగారుట ఆఫ్ఘనిస్తానులో నేటో సైన్యాధ్యక్షుడు. సాధారణ ప్రజలు ఎలా ఉంటున్నారో, ఏమి అల్లాడి పోతున్నారో .. ఇంతలో చలికాలం రానున్నది. ఎనిమిదేళ్ళయింది అమెరికా తొలి దాడులు జరిపి ..

తుంగభద్ర, కృష్ణ వరదల నేపథ్యంలో, జీమెయిలు చాట్లో ఎవరన్నా ఇండియా స్నేహితులు కనబడి చాట్లో చెబితే తెలిసిన వివరాలు తప్ప, ఆన్లైన్ పత్రికల్లో కానీ, పదే పదే ఎప్పటికప్పుడు యూట్యూబులో అప్లోడ్ అవుతూ ఉండిన టీవీ వార్తా ఛానెళ్ళ ప్రసారాలు కానీ ఒక్క పనికొచ్చే వార్త చెప్పలేదు. ఈ సందర్భంగా బ్లాగుల్లో టీవీ ఛానెళ్ళ తాండవాన్ని మన వాళ్ళు బాగానే విమర్శించారు. అదలా ఉండగా, వార్తా పత్రిక గానీ, వార్తా ఛానెల్ గానీ, ఒక పద్ధతి ప్రకారం కవరేజ్ ఇవ్వనక్కర్లేదా? ఉదాహరణకి, ఈనాడో, ఆంధ్ర జ్యోతో తెరిస్తే, కనీసం ఒక అరగంట వెతుక్కోవాలి, కృష్ణ వెంబడి పలాని వూర్లో పరిస్థితి ఎలాగుందో అని తెలుసుకోవడానికి. కృష్ణ ప్రవహించే మార్గం తెలిసినదే. దాన్ని ఒక మేప్ గా ఇచ్చి, దాన్నించి వివిధ ప్రాంతాల వివరాల్ని ఇవ్వచ్చు. ఇంకా చాలా రకాలుగా సమర్ధవంతంగా ఇవ్వచ్చు. ఈ సందర్భంగా వార్తా మాధ్యమాల పూర్తి ఫెయిలయ్యాయని భావిస్తున్నాన్నేను. సరే, వరద తగ్గు మొగం పట్టిందని చదివి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని పోనీ మన మేధావులేమని విశ్లేషిస్తున్నారో అని ఆంధ్రజ్యోతి సంపాదకీయం తీస్తే, ప్రధాన సంపాదకుడు కే. శ్రీనివాస్ గారు, ఏంటో తలా తోకా లేకుండా .. ఋగ్వేదం నించి కొటేషన్లు చెబుతూ .. ఆయన తెలివినంతా కుమ్మరించింది చదివేప్పటికి నాకు తిక్క నసాళం అంటుకుంది.

ఉట్టుడియంగా ఒబామాకి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. ఈ నార్వీజియన్లకి చదవేస్తే ఉన్నమతి పోతున్నట్టుంది :) నేను ఒబామా అభిమానినే గానీ, ఇది మాత్రం టుమ్మచ్ అనిపించింది. ఆయన సున్నితంగా తిరస్కరించే బావుణ్ణని కూడా అనుకున్నాను. కానీ హబ్బే మారీ బాగుండదేమో అని సిగ్గు పడుతూనే స్వీకరించేశాడు. బుష్షుగారు మిగతాప్రపంచం మీదంతా కత్తులు దూస్తూ వీరతాండవం చెయ్యనారంభించిన రోజునుంచీ, ఈ నార్వీజియన్లకి ఎట్లాగైనా అమెరికన్ల దిమ్మతిరిగేలా ఒక్క చెంపపెట్టు పెట్టాలని వాళ్ళకి చేతులు తిమ్మిరి తిమ్మిర్గా ఉన్నాయనీ, ఒబామాకి శాంతి నోబెలు నిచ్చేసి ఆ తిమ్మిరి తీర్చేసుకున్నారనీ నాకో గాట్ఠి అనుమానం. అసలే మనిషి అందర్నీ కలుపుకు పోవాలీ, ఎక్కడా మాట తొణక్కూడదూ అన్నట్టు ఆచి తూచి అడుగేస్తుంటాడు .. ఇహ ఇంత గౌరవం చేసేశాక, ఇంక మరీ జాగ్రత్త పరుడైపోతాడేమో అని నా భయం. ఎందుకంటే, రాజకీయం, జాతీయంగానైనా, అంతర్జాతీయంగానైనా ఏదన్నా ముఖ్యమైన విజయం సాధించాలంటే కొంచెం తెగింపు ఉండాలి. ఇతగాడు సాధించాల్సిన ఘనకార్యాలెన్నో ఉన్నాయి. ఈ బహుమతి ఏదో ఆయనకి గర్వంతో కళ్ళు నెత్తిమీదికి తెస్తుందనే భయం లేదు కాని, ఈయన జాగ్రత్త విపరీతం ఐపోతుందని మాత్రం నాకు భయంగా ఉంది. టైం పత్రిక విలేకరి జో లైన్ తనబ్లాగులో నా భావాల్ని సరిగ్గా పట్టుకున్నాడు.

Comments

Purnima said…
How about this opinion? :)

http://epaper.timesofindia.com/Default/Scripting/ArticleWin.asp?From=Archive&Source=Page&Skin=TOINEW&BaseHref=TOIM/2009/10/12&PageLabel=16&EntityId=Ar01605&ViewMode=HTML&GZ=T

(Hoping link is accessible)
భావన said…
as usual ఈ వారం కబుర్లు బాగున్నాయి.. మంచి ఆర్టికల్ అందించారు YSR గురించి బాలగోపాల్ గారు రాసింది, మంచి విశ్లేషణ చంద్ర బాబు నాయుడు, YSR ల వైఫల్యత, విజాయల గురించి. కొన్ని చదువుతుంటే భయ పడ్డాను అతని అతని తండ్రి అరాచకాలకు, ఎప్పుడో 50 ఏళ్ళ కితమే విధ్వంసాన్ని సృష్టించాడన్నమాట రాజా రెడ్డి గారు. అమ్మో అంత అరాచకమా... కాళ్ళలోనుంచి వణుకొస్తోంది చదువుతుంటే..

మంచి విశ్లేషణ తరువాతి రెండిటి గురించి అవునవును..(తల వూపేసా, ఇంకో మాట లేదు)

చివరికి ఒబామా కు కొమ్ము కాసే CNN వాడు కూడా వ్యంగ్యం గా మాట్లాడేడు ఈ విషయం గురించి.. అవును నాకు అదే డౌట్ అండి ముందరి కాళ్ళకు బంధం వేస్తూ కావాలని ఒక విధం గా ఒబామా ను అన్ పాపులర్ చేస్తున్నారా అని.
good article..fair representation of YSR as of 2004
మురళి said…
బాలగోపాల్ వార్త నాకు షాక్ కలిగిస్తే, ఒబామా కి బహుమతి వార్త నవ్వు రప్పించింది... బాగున్నాయండి కబుర్లు..
GKK said…
ఒసామా కు బదులుగా పొరపాటుగా ఒబామాకు శాంతి బహుమతి ప్రకటించారేమో అన్నా!
Anonymous said…
నోబెల్ బహుమతి మన భారతీయుల్ని మఱీ యెక్కువసార్లు వరించలేదనే గిలి నాకు ఇటీవలి దాకా మనసులో కదలాడుతూ ఉండేది. కానీ ఈసారి అందుకున్న కొందఱిని చూశాక రాజకీయ/ శాఖేయాది సంకుచిత పరిగణనల (political/ sectarian considerations) తో కలుషితమైన నోబెల్ - ఛ ! అది వస్తే ఎంత ? రాకపోతే ఎంత ? అనిపిస్తున్నది. అంతమాత్రాన నోబెల్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబాఱిందనడం తొందఱపాటే కావచ్చు, ముఖ్యంగా బహుమతి రూపేణా వారు ఒడ్డుతున్న (stake) అమేయమైన ధనపరిమాణం దృష్ట్యా ! అయితే ఈ పొఱపాట్ల నుంచి, ఇవి తెచ్చిన అంతర్జాతీయ తలవంపుల నుంచి స్వీడిష్ అకాడెమీ వారు సకాలంలో గుణపాఠాలు నేర్చుకొని కనీసం భవిష్యత్తులోనైనా సహేతుకమైన నిర్ణయాల్ని వెలువఱిస్తారని ఆశిద్దాం.

శ్రీ ఒబామా విషయానికొస్తే - ఇద వక్తృత్వానికి ప్రకటించబడ్డ తొట్టతొలి నోబెల్ గా చరిత్రలో నిలిచిపోతుందనుకుంటా.

-- తాడేపల్లి
వేమన said…
బాలగోపాల్ గారి అర్టికిల్ బావుందండీ.. వెదికి పట్టినందుకు కృతఙతలు. తెలుగు ఛానళ్ళకి ఒక బెంచ్ మార్కు లేకుండా పోయింది. వరద దృశ్యాలు చూపిస్తూ విషాద గీతాలు ప్లే చెయ్యడం వెగటు తెప్పించింది. ఇక ఒబామాకి నోబుల్ బహుమతి ఇవ్వడం చరిత్రలో నిలిచిపోతుంది, పూర్వ జన్మ పుణ్య ఫలం కాన్సెప్టు కింద :)
తాడేపల్లి గారూ, ఈ అంతర్జాతీయ పురస్కారాల గురించి మీరు చెప్పింది సముచితం. మనం (భారతీయులం) ఈ నోబెళ్ళూ, ఆస్కార్లు గురించి పట్టించుకోకుండా, మన బాగు సంగతి చూసుకుంటే మంచిది అని నా అభిప్రాయం స్థిరపడుతోంది. అసలు ఈ నోబెళ్ళ వ్యవహారమ్మీద ఒక విశ్లేషణ రాద్దామనుకుంటున్నా కొంచెం వీలు చిక్కగానే.
వక్తృత్వపు విజయం - నిజం! ఇదే మాట నిన్న ఇంకో బ్లాగులో భవాని గారు కూడా అన్నారు.

వేమన గారు .. నిజం.
భావన said…
పూర్వ జన్మ పుణ్య ఫలం కాన్సెప్టు కింద :)
ha ha ha :-) :-) don't come to that conclusion that fast. u never know whats waiting for him behind that.
కొత్త పాళీ గారూ !నన్నూ, నా బ్లాగునూ పూర్తిగా మరిచి పోయినట్లున్నారు.అందరి కీ వాక్యలు రాస్తూ....నన్నెందుకో..
మీరు సర్గీయ శ్రీ బాలగోపాలుగారి గురించి వ్రాసిన వ్యాసంలో మీరు వ్రాసిన యీ క్రింది పంక్తులు.......
"వ్యక్తులు కనుమరుగైనప్పుడు, విధిని నిందించడం, కుటుంబానికి సానుభూతి తెలుపుకోడం, ఆత్మ శాంతికి ప్రార్ధించడం ఇవన్నీ అర్ధంలేని పన్లుగా కనిపిస్తాయి నాకు. మనం చెయ్యాల్సిందల్లా .. ఆ కనుమరుగైన మనిషి ఎటువంటి విలువల్ని నమ్మి ఆచరించారో ఆ విలువల్ని అప్పుడప్పుడూ అయినా గుర్తు చేసుకుంటూ, చాతనైతే మనం కూడా ఆ విలువల్ని మన జీవితాల్లో ఆచరిస్తూ ముందడుగు వెయ్యడమే.".
నాకు బాగా నచ్చాయి .మతమన్నది అభిమతమైతే మన మనోగతాలలోచీకటి కోణాలను వెలుతురుతో నింపుకుందాం ముందు.ఆత్మ న్యూనతా ,పరనిందా ....భాద్యతా రాహిత్యానికి పునాదులౌతున్న వేళ,మీ యీ క్రింది పలుకులు ...ఎడారిలో ఒయాసిస్సు.with cordial wishes....Nutakki
రాఘవేంద్ర గారు, నా మాటలు మీకు నచ్చినందుకు సంతోషం.
బ్లాగుల్ని పట్టించుకోక పోవడం ఏం లేదండి. ఈ మధ్యన సమయాభావం వల్ల ఏవో కొద్ది బ్లాగులే చూస్తున్నా .. అది కూడా రేండం గానే.
sreenika said…
సాహితీ మిత్రులకు
ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు