నీవేనా నను తలచినది - 01

నేన్రాసిన ఈ కథ తానా సావనీరులో ప్రచురితమైంది. ఆ సావనీరు అందరికీ అందే అవకాశం ప్రస్తుతానికి కనబడక ఇలా మీతో దీన్ని పంచుకుంటున్నా. కథ పూర్తయ్యే వరకూ ప్రతి రోజూ సీరియల్ గా ప్రచురిస్తాను. నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలు చెప్పొచ్చు.

నీవేనా నను తలచినది
అను ఆర్ధిక రాజకీయ ప్రేమ కథ
ఎస్. నారాయణస్వామి

March 9 2008 Sunday 2:00 AM

ద్రవరూపమైన బంగారంలో ఐసుముక్కలు మెల్లగా కరిగి అస్తిత్వాన్నికోల్పోతున్నై. అది అనుభవించిన గాజు గ్లాసుకి మేను చెమర్చింది. ఆ చిరుచెమట బిందువులు ఏకమై ధార కట్టి ..
తేజా తదేకంగా గ్లాసు వేపు చూస్తున్నాడు. కిందకి జారుతున్న ఆ ధార అతన్ని హిప్నటైజ్ చేస్తోంది.
"నాక్కూడా అదోటి తెప్పించు .. నువ్ తాగేది" చెవులో హస్కీగా .. గుసగుసగా.
ఉలిక్కిపడి పక్కకి తిరిగి చూశాడు.
ఎవరో దేశీ పిల్ల. ఆ మొహం తమాషాగా ఉంది. కళ్ళు ముక్కు చెవులూ మూతీ అన్నీ ఉన్నాయి, కానీ ఏ ఒక్క పోలికా ఇది నాది అన్నట్టు స్పష్టంగా లేదు.
ఛ, రెండు స్కాచిలకే నాకు ఇంత ఎక్కేసిందా అనుకుని తేజా కళ్ళు నులుముకుని మరీ చూశాడు.
అతని చూపుకేం కాలేదు. ఆ ఫీచర్స్ అలానే ఉన్నై.
ఇంతలోనే ఇంకో విషయం గమనించాడు. ఆ అమ్మాయి కనుబొమల మధ్య ఒక చిన్న బొట్టు బిళ్ళ. కానీ అది మధ్యలో లేకుండా కొంచెం ఒక పక్కకి ఉంది. అనాలోచితంగా తేజా చెయ్యెత్తి ఆ బొట్టుని సరిచెయ్యబోయాడు.
చటుక్కున మెలకువొచ్చింది. కింగ్ సైజ్ బెడ్లో ఎడమ పక్కకి తిరిగి పడుకొనున్నాడు. అవతల ఉన్నదాన్ని దేన్నో అందుకోడానికి చాచినట్టుగా కుడిచెయ్యి పక్కకి అడ్డంగా చాచి ఉంది. నేపథ్యంలో సెంట్రల్ హీట్ చప్పుడు మంద్రంగా వినిపిస్తోంది. నైట్ స్టాండ్ మీద ఎర్ర అంకెల ఫుట్బాల్ గడియారం రెండైనట్టు చూపిస్తోంది. తేజాకి కల గుర్తొచ్చింది.
వెల్లికిలా తిరిగి పడుకుని రెండు చేతులూ గుండెల మీద వేసుకున్నాడు. తనొక బార్లో వొంటరిగా కూర్చుని రెండు స్కాచిలు తాగేసి మూడోది సేవిస్తూ ఉండడం. తను .. టీటోటలరైన తను!
ఎంత అసంభవమైన సంఘటన!
అదికాదు అసలు సమస్య .. ఆ అమ్మాయి. ఆ వంకర బొట్టు అమ్మాయి. ఎవరా అమ్మాయి? అందులో దేశీ అమ్మాయి?
బొట్టు పెట్టుకుని బార్లోకెందుకొచ్చింది? ఆమె మొహాన్ని గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఏదీ స్పష్టంగా గుర్తుకి రాలేదు. నిద్ర పట్టక నైట్ స్టాండ్ మీదున్న దీపం వెలిగించాడు.
కంఫర్టర్ పక్కకి తోసి, పక్క దిగి, కిటికీ పక్కగా ఉన్న లేజీబాయ్ రెక్లైనర్లో కూలబడి లాప్‌టాప్ తెరిచాడు. మిట్ రామ్నీ (1) కేంపేన్ ఏమవుతోందో చూద్దాం. ఇవ్వాళ్ళ ఆదివారం, పర్లేదు రోజంతా నిద్ర పోవచ్చు!
***
March 10, 2008 Monday 11:00 AM

"హెలో?"
"అమ్మా!"
"తేజా, చెప్పు నాన్నా. ఎలా ఉన్నావు?"
"బానే ఉన్నా. పని టైములో చేస్తున్నా, బిజీగా ఉన్నావా?"
"పర్లేదు, చెప్పు. నీకంటే ముఖ్యం కాదులే."
"హమ్మ్ .. విషయం తెలిసే ఉంటుంది నీకు."
"ఏ విషయం? బేర్ స్టెర్ణ్స్ (2) సంగతేనా?"
"అదే. న్యూస్ చూస్తూనే ఉన్నావుగా. నువ్వూ ఒక బేంకు వైస్ ప్రెసిడెంటువి. నీకు తెలీనిదేవుంది? బేర్ స్టెర్ణ్స్ ఇంక చరిత్ర పుటల్లోకి .."
"ఊ. అనుకుంటూనే ఉన్నా. నీ పరిస్థితి ఏంటి? మీ విభాగాన్ని ఉంచుతున్నారా? జేపీ మోర్గన్ (3) వాళ్ళేమన్నా ఆఫరిచ్చారా?"
"లేదు. ఇవ్వాళ్టితో నా ఉద్యోగం ఆఖరు."
"ఆహా."
"..."
"నువ్వెలా ఉన్నావ్? ఎలా తీసుకుంటున్నావ్?"
"హమ్మ్. ఏమో .. తెలీదు. ఇంకా ఏం అనుకోలా."
"ఏం పర్లేదు. నీకిది మొదటి ఉద్యోగం కదా. కొంచెం బెంగగానే ఉంటుంది."
"ఊ. బెంగ కాదు. ఓడిపోయాను అనిపిస్తోంది. కానీ నాకు ఓడిపోవటం అలవాట్లేదు."
"అదే అనుకోకు. అమెరికన్ ఎకానమీ అనే మహా కర్మాగారంలో బేర్ స్టెర్ణ్స్ ఒక చిన్న యంత్రం. అందులో నువ్వొక చిన్న శీలవి."
"ఏదైనా .. చాలా చిరాగ్గా ఉంది."
"పోనీ కొన్నాళ్ళు ఇంటికి రాకూడదూ? ఈ సమయంలో మిషిగన్ (4) ఎంత ఆహ్లాదంగా ఉంటుందో నీకు తెల్సుగా. కొద్ది రోజులు రిలాక్స్డ్ గా గడిపితే, తరవాత సంగతి మెల్లగా ఆలోచించుకోవచ్చు."
"ఇప్పుడా? ఈ పరిస్థితుల్లోనా? మిషిగన్‌కా?"
"అవును."
"ఏమోనమ్మా. ఇప్పుడైతే ఎక్కడికీ రావాలని లేదు నాకు. ఉద్యోగం పోయిందని ఏ మొహం పెట్టుకుని నీ దగ్గరికి రాను?"
"అదేంట్రా నాన్నా? ఏ పరిస్థితుల్లోనైనా, ఎప్పుడైనా నువ్వు నా దగ్గరికి రావచ్చు. ఆ సంగతి నీకు తెల్సు."
"హమ్మ్ .. చూస్తాలే. ముందసలు ఈ గోలంతా ఏంటో కొంచెం సెటిలవనీ."
"అలాగే. నేనేం నిన్ను ఈ క్షణమే వచ్చెయ్యమని బలవంతం చెయ్యట్లేదు. నా ముప్పయ్యేళ్ళ బేంకింగ్ జీవితంలో, మరీ ఇంత ఘోరం కాకపోయినా, ఇలాంటి వొడిదుడుకులు చాలా చూశాను. ఉద్యోగం ముగిసింది అంటే, ముగిసింది, అంతే. అదొక మజిలీ .. ఐపోయింది. ముందుకెళ్ళడమే నువ్వు చెయ్యగలిగింది ఇంక."
"అవుననుకో."
"స్థిమితంగా ఉండు. నీకెప్పుడు కావాలన్నా నాతో మాట్లాడచ్చు. ముందు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. సరేనా?"
"ఓకే అమ్మా. మళ్ళీ మాట్లాడతా నేను."
"సరే నాన్నా. మాట్లాడదాం."
***
పద సూచిక
(1) మిట్ రామ్నీ - గొప్ప వ్యాపార వేత్త, అమెరికను రాజకీయ నేత. గత ఎన్నికల్లో రిపబ్లికను పార్టీ తరపున అధ్యక్ష ఎన్నికలో అభ్యర్ధిగా ఉండేందుకు పోటీ పడ్డారు. కానీ త్వరలోనే విరమించుకున్నారు.
(2) బేర్ స్టెర్ణ్స్ - వాలు వీధిలో మదుపు బేంకుల్లో ఒకటి. గత ఏడాది ఇళ్ళ ఋణాల సంక్షోభంలో మొదటగా కుప్పకూలిన సంస్థ.
(3) జేపీ మోర్గన్ - మరొక వాలువీధి మదుపు బేంకు. అమెరికను ప్రభుత్వం జోక్యంతో కూలిపోయిన బేర్ స్టెర్ణ్స్ ని కొన్నది.
(4) మిషిగన్ - అమెరికా ఉత్తర సరిహద్దులో ఉండే ఒక రాష్ట్రం. పంచ మహా సరోవరాలు దీని చుట్టూతా ఉన్నాయి. అతి పెద్ద నగరం డిట్రాయిట్ కార్ల తయారీకి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.

Comments

Unknown said…
అమెరికా తెలుగుకథ లా వుంది. ప్రారంభం బాగుంది. కొనసాగించండి.
సమయోచితమైన సబ్జెక్టు. :)

సోమవారం జరిగిన సంభాషణకు ఆదివారం నేపథ్యం గాంభీర్యాన్ని తెచ్చేసి, కథలోకి లాక్కెళ్లింది. పదసూచిక చాలా మంచి ఆలోచన.
Anonymous said…
ఆర్థిక రాజకీయ ప్రేమకధ అనటంలోనే సాదా సీదా కధ కాదని అర్థమవుతుంది.ఎత్తుడు బాగుంది.గాజు గ్లాసు మేను చెమర్చింది...నాకు బాగా నచ్చింది!

ఎక్కడో మీరే ఉదహరించినట్లుగా-త్రి.శ్రీ అన్నట్లుగా,అథోజ్ఞాపికలెందుకు...కుండలీకరణాలెందుకు...!కవిత్వం కాకపోయినప్పటికీనూ..!