పట్టమ్మాళ్ గారికి వీడుకోలు

సంగీత కళానిధి డి.కే. పట్టమ్మాళ్ తొంభై నిండిన పండు వయసులో ఈ అవతారం చాలించి సరస్వతీ సాన్నిధ్యానికి చేరుకున్నారు.

సాంప్రదాయకమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, బ్రాహ్మణ బాలికలు వేదికనెక్కి కచ్చేరీ చెయ్యడం అనాచారంగా భావించే కాలంలోనే అనేక సామాజిక కట్టుబాట్లని ఎదురుకుని, గొప్ప గాయనీమణిగా పేరు తెచ్చుకున్నారు. తన తరంవారే అయిన ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, ఎమ్మెల్ వసంతకుమారిలతో కలిపి కర్ణాటక గాత్ర సంగీతంలో స్త్రీరత్నత్రయంగా ప్రసిద్ధి చెందారు. తరువాతి తరంలో స్త్రీలు వేదికనెక్కేందుకు మార్గదర్శకులయ్యారు.

తమిళంలో ఎన్నో మరపురాని కృతులు రచించిన మహా వాగ్గేయకారుడు పాపనాశం శివన్ గారి ప్రత్యక్ష శిష్యురాలీమె. అందువల్ల తమ గురువుగారి కృతులు పాడ్డంలో ఆ కృతుల భావం ఇంకా గొప్ప సొగసుతో ప్రభవిస్తుండేది. ఆవిడ గొంతు విలక్షణమైనది. ఎమ్మెస్ సుబ్బలక్ష్మికి లాగా కోకిల కంఠం కాదు, వసంత కుమారికి లాగా కంచుగంట కాదు. కొద్దిగా బొంగురుగా, ఒక మాదిరి జీర కలిసిన కొమ్ముబూర ధ్వనిలా ఉండేది. అటువంటి గొంతునే తన స్వంత ముద్రగా మలచుకుని, అంత ప్రసిద్ధుడైన గురువు నీడలో పెరిగినా సంగీత వేదిక మీద తనదైన స్థానం సంపాదించుకున్నారు. సంప్రదాయం, శ్రుతి శుద్ధం, లయ మీద పట్టు .. వెరసి పట్టమ్మాళ్ (ఇది చిన్న శ్లేష. తెలుగులో పిల్లల్ని చిన్ని, బంగారం అని పిల్చుకున్నట్టు, తమిళంలో చెల్లం, పట్టు (silk)అంటారు. ఒక్కోసారి అదే నిజం పేరుకూడా అవుతుంది. పట్టు + అమ్మాళ్ = పట్టమ్మాళ్ అన్నమాట).

తనకంటే బాగా చిన్నవాడైన సోదరుడు డి.కే. జయరామన్ కి తానే గురువై తనంత వాడిని చేశారు. ఈ నాడు పట్టమ్మాళ్ గారి మనుమరాలు శ్రీమతి నిత్యశ్రీ మహాదేవన్ బామ్మగారి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కర్ణాటక రంగంలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు.

ఆవిడ ఇంకా కొన్నేళ్ళు బతికి ఉండాలని కోరుకోవడం బహుశా అత్యాశే అవుతుంది. అయినా, అకస్మాత్తుగా ఇక లేరు అనుకుంటే, చెవుల్లోనూ, మనసులోనూ వెలితే మరి!

పట్టమ్మాళ్ వికీ పేజి
హిందూ పత్రికలో వార్త
మ్యూజిక్ ఇండియా ఆన్లైన్లో దీక్షితర్ కృతి రంగనాయకం

Comments

తృష్ణ said…
జాక్సన్ గురించి మీరు నా బ్లాగులో చదివితే ,ఇవాళ ఫట్టమ్మాళ్ గారి గురించి మీ బ్లాగులో ఇప్పుడే...ప్చ్..ఏం చేస్తాం ..యం.యస్.పొయినప్పుడూ ఇదే భావన...కారణజన్ములు..మహానుభావులూ...వాళ్ళంతా!!
మురళి said…
ఒక శకం ముగిసింది... నిత్యశ్రీ మహదేవన్ సినిమాల్లో కూడా పాడుతూ ఉంటారు..
Anonymous said…
కొత్తపాళి,

పట్టమ్మాళ్ కి మీ నివాళి తో పాటు మా అందరి నివాళి కూడా. ఈ పోస్ట్ తో పాటు ఆమె పాట కూడా చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది.

కల్పన
మాలతి said…
పట్టమ్మాళ్ గారి శ్యామలాదండకం వింటుంటే గుండెల్లో ప్రతిధ్వనిస్తుంది. సంగీతాభిమానులందరితోనూ నేను కూడా ఒక అశ్రుతర్పణం.
pi said…
Wonder what's with all these deaths. Ali Akhbar Khan, Pattammal and Gangubai Hangal! I agree they are all old, but it is SAD!