సప్తర్షి మండలం - పెద్ద గరిటె

వేసవి రాత్రుల్లో ఆరుబయటనో డాబామీదనో పడుకుని బాల్యం గడిపిన వాళ్ళకి సప్తర్షి మండలం సుపరిచయమే. చక్కగా పేద్ద గాలిపటంలా ఉంటుంది, మూడు నక్షత్రాల తోకతో.

ఆంగ్లం నేర్చాక దీన్ని Big Dipper అంటారని నేర్చుకున్నా, కానీ ఎందుకా పేరొచ్చిందో ఎప్పుడూ అంతు బట్టలా.

ఇవ్వాళ్ళ సూర్యాస్తమయం తరవాత మా యింటి వెనక పచ్చిక బయల్లో పచార్లు చేస్తుంటే, ఇంకా చంద్రోదయం కాని మబ్బులు లేని ఆకాశంలో దర్శనమిచ్చింది .. ఒక్క పాటున బుర్రలో చిరుదీపం వెలిగింది, ఈ నక్షత్ర సముదాయానికి ఆంగ్లంలో ఆ పేరెందుకొచ్చిందో.

భారద్దేశపు అక్షాంశరేఖ నించి చూస్తే ధృవతార క్షితిజసమాంతర రేఖ (horizon) కి బాగా చేరువలో కనబడీ కనబడకుండా ఉంటుంది. సప్తర్షిమండలం దానికి దగ్గర్లోనే దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. వేసవి రాత్రుల్లో సప్తర్షిమండలం ఎప్పుడూ ఉదయిస్తూ కనిపిస్తుంది, అంచేత గాలిపటాన్ని చేసే నాలుగు నక్షత్రాలూ పైకి ఉన్నట్టూ, మిగతా మూడు నక్షత్రాలూ తోకలా ఉన్నట్టూ కనిపిస్తాయి.

మిషిగన్ అక్షాంశరేఖ నించి చూస్తే ధృవతార క్షిసరే కి సుమారు యాభై డిగ్రీల కోణంలో ఉంటుంది. వేసవి రాత్రుల్లో సూర్యాస్తమయమైన వేళలో సప్తర్షిమండలం భారద్దేశంలో కనిపించే దృశ్యానికి తల కిందులుగా కనిపిస్తుంది. అంటే తోకగా ఉండే మూడు నక్షత్రాలూ చక్కగా వొంపు తిరిగిన గరిటె కాడలాగానూ, గాలిపటంలా ఉండే నాలుగు నక్షత్రాలూ లోతైన గరిటె లాగానూ. అదీ బిగ్ డిప్పర్!

ఈ దృశ్యం దక్షిణభారద్దేశంలో ఎక్కడా కనబడదు. కాష్మీరు ప్రాంతాల ఏవన్నా కనిపిస్తుందేమో.

Comments

S said…
:) కారణం అదే.
చిన్నప్పుడు విజయవాడ ప్లానెటోరియం తాలూకా ఆయనెవరో "తారాపథం" అని ఓ పుస్తకం రాస్తే చదివాను. నక్షత్రాలు ఎలా గుర్తించాలి..ఇత్యాది విషయాలపై. అందులో ఈ "గరిటె" వివరణ ఉంది. అది గుర్తొచ్చింది మీ పోస్టు చూసాక.. :)
మేధ said…
వివరణ బావుంది..
టెంప్లేట్ మార్చినట్లున్నారు! పాతదానికి అలావాటుపడి, క్రొత్తది చూసేసరికి, మొదట వేరే వాళ్ళ బ్లాగుకి వచ్చానా ఏంటా అనిపించింది.. మీ మిగతా బ్లాగులు చూసి కాదు అని సర్దిచెప్పుకున్నా :)
అవునూ, పైన కూడలిలో టపాలు కనిపించవు అన్నారు..!? కానీ నేను కూడలి ద్వారానే వచ్చా!!
Sanath Sripathi said…
కొత్త పాళీ గారూ, నాకు తెలిసీనంత వరకూ సప్తర్షి మండలాన్ని Great Bear అని అంటారని విన్నా. Big dipper అని వినటం ఇదే ప్రథమం.

ఇంకొక విషయం. ఒకవేళ అలా తిరగేసి ఉన్నట్టు కనిపించటమే నిజమైతే (నిజమా కాదా అన్న సందేహం లేదనుకోండి.)మనకి ఆకాశం లో కనిపించే వృషభం, మిథునం ||మొ|| రాశులన్నీ.. దక్షిణ భారత దేశానికీ అమెరికాకీ తలకిందులుగా (అద్దం లో ప్రతిబింబాలు గా) కనిపిస్తాయా? ప్లానెటోరియం లో చూపించే ఊహారేఖ చిత్రాలు అలా చూసినట్టు గుర్తు లేదు. (నాగమురళి ఏమైనా జ్ఞానగుళిక ఇస్తే తప్ప)

నాకు ఆంగ్లమూ పెద్దగా తెలీదు, ఆస్ట్రానమీ అంతగా తెలీదు కనక తెలియక అడిగుతున్న ప్రశ్నలకి నన్ను క్షమించాలి.
మురళి said…
మా చిన్నప్పుడు పెద్ద వాళ్ళు ఆకాశంలోకి చూసి 'గొల్లకావిడీ పిల్లలలకోడీ కనిపిస్తున్నాయి' అనేవాళ్ళు, తెల్లవారు జామున..
@S .. ఆయన బహుశా ముక్కామల నాగభూషణంగారు అయుండొచ్చు.

@sanath .. ఈ విషయంలో నా విజ్ఞానం అంతంత మాత్రమే నండీ. నేను కష్టపడకుండా గుర్తు పట్ట గలిగేవి Orion (మృగవ్యాధుడు), Scorpio (వృశ్చికం). ఈ రెండూ అమెరికా ఆకాశంలో చూసిన గుర్తు లేదు. నేను అనుకోవడం సప్తర్షిమండలం ధృవనక్ష్త్రానికి బాగా దగ్గరగా ఉండడం వల్ల ఇలా కనిపిస్తుందని. ధృవ నక్ష్త్రానికి బాగా దూరంగా ఉండే రాశులకి ఇది వర్తించక పోవచ్చు.
@ మురళి .. ఇవి ఏ రాశులు???
Aswin Budaraju said…
రాయాలని ఆశ
Soooper
తృష్ణ said…
కొత్తపాళిగారూ,
సప్తఋషి మండలం మాకు నాన్న చూపించేవారు.కాకినాడ వెళ్ళినప్పుడు డాబాపై పడుకుంటే ఆకాశంలో చాలా క్లియర్ గా కనిపించేది.మేమైతే కొంచం వంకరైన ఒక మంచం,దాని తొక అనుకునేవాళ్ళమండీ :)
మీ ప్రశ్నలకి సమాధానాలు రాసానండీ బ్లాగులో.
navatarangam మీద కన్ను వెయ్యాలండీ..once again thanks for your visit.
సంస్కృతులలో తేడా ఎంత బాగా కనిపిస్తుందో. మనమేమో ధృవుడని, సప్తఋషులని ఇలా ఆధ్యాత్మికమయిన పేర్లు పెట్టుకుంటే.. మరీ materialistic గా.. గరిటె చెంచా ని వీళ్ళు పులుచుకుంటున్నారు. ఎప్పుడూ తిందాము తాగుదాము అనేగానీ.. కాస్త కృష్ణ రామ అనుకుందామని లేదు.. ఏంచేస్తాం.. అయినా..ఇక్కడికొచ్చి అఘోరిస్తున్నా :-(
ముందు మీ బ్లాగు రంగులు చూసి ఇదే పేరుతో కొత్తబ్లాగు వచ్చిందేమో. ఎవరా అనుకున్నా. పక్కన మీ ఇతర బ్లాగులు గట్రా చూసి గుర్తుపట్టాను. చాలా సింపుల్ గా బావుంది కొత్త టెంప్లేట్.. దానికి తగ్గట్టు కొత్తటపా ఉంది..
కొత్తపాళీ గారూ,
నేను కూడా చిన్నప్పుడు వేసవి రాత్రులలో డాబా మీద పడుకున్నప్పుడు ఎక్కువ చూసేది ఈ గాలిపటాన్నే.
గుర్తు చేసినందుకు నెనరులు.
తోకలో మధ్య నక్షత్రంకి పక్కన చిన్నగా కనిపించే అరుంధతి నక్షత్రం గురించి చెప్పలేదేమిటండి :-)
మీ డీలక్సు మూస చాలా బావుంది.

నా ఉద్దేశంలో సప్తర్షిమండలం Euphemism కాదు, నిజంగా అది సప్తర్షి మండలమే.