కథాంశం

చాన్నాళ్ళ కిందటి ముచ్చట.
రెండు ఎసైన్మెంట్ల మధ్య కాలంలో నేను కోంచెం ఖాళీగా ఉంటే మిత్రులు, మిషిగన్ విశ్వవిద్యాలయంలో సాహిత్యాచార్యులూ డా. క్రిస్టీ మెర్రిల్, తను బోధిస్తున్న భారతీయ సాహిత్యపు తరగతికి ఆహ్వానించారు, నాకు సాహిత్యమంటే ఉన్న ఆసక్తి తెలిసి. క్లాసులో సుమారు ఇరవై మంది విద్యార్ధులున్నారు. అందులో కొందరు భారతీయ సంతతి వారు. Waiting for the Mahatma అని ఆర్కె నారాయణ్ రాసిన నవల చదువుతున్నారు. ప్రతి క్లాసుకి నవల్లో ఒక యాభై పేజీలు చదువుకుని రావాలి. ఆ యాభై పేజీల్లో కథలో పాత్రల్లో జరిగిన పరిణామాల్ని తరగతిలో చర్చించేవాళ్ళు. నేను క్లాసులో వెనకాల కూర్చుని ఆ చర్చలు వింటూ ఉండేవాణ్ణి. ఎప్పుడో 1945లో భారత స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంగా దక్షిణ భారతంలో ఒక చిన్న వూళ్ళో రూపొందిన ఈ కథని ఈ ఇరవయ్యొకటో శతాబ్దంలో అమెరికాలో యువతీ యువకులు (భారతీయ సంతతి వారైనా కాకపోయినా) ఎలా చూస్తున్నారనేది నాకు గొప్ప ఆసక్తిగా ఉండేది.

ఈ నవల్లో హీరో శ్రీరాం ఒకమ్మాయి మోజులో పడి తనకేమీ ఆసక్తి లేని క్విటిండియా ఉద్యమంలో పీకల్లోతుకి మునిగిపోతాడు తనకి తెలీకుండానే. ఒకానొక సందర్భంలో అతడు తన పరిస్థితిని సమీక్షించుకుంటూ ఎట్లా ఇంత చిక్కుల్లో ఇరుకున్నానురా భగవంతుడా అని నీరస పడి కూర్చుంటాడు. ఆ రోజు ఆ సన్నివేశం చర్చకి వచ్చింది. చాలా ఉత్తేజంగానూ జరిగింది వాదన. హీరోకి ఎదురైన అయోమయం సహజమే అన్నారు కొందరు. మరి కొందరు అది అప్పటి అల్లకల్లోల పరిస్థితుల ప్రభావం అని అభిప్రాయపడ్డారు. ఇంకొకరు అది గాంధీమహాత్ముడి ప్రభావం అన్నారు. ఇలా వాద ప్రతివాదాలు జరుగుతుండగా దీప్తి అనే అమ్మాయి (ఇంటి పేరుని బట్టి చూస్తే తెలుగువాళ్ళమ్మాయి అనిపించింది) మొదలు పెట్టింది. మాట్లాడ్డం మొదలెట్టిన కాసేపటికే ఆవేశంతో ఊగిపోతోంది. ఈ హీరో అంత చవట దద్దమ్మని ఎక్కడా చూళ్ళేదంది. మరీ అంత వెన్నెముక లేకుండా ఎలాగున్నాడంది. తన జీవితానికి ఒక సొంత లక్ష్యమూ గమ్యమూ లేకుండా ఏగాలి వీస్తే అటు ఊగుతూ ఉండడం ఏవిటంది. అతనికి ఆ ఉద్యమం గురించి ఏమీ అవగాహన లేకుండా కేవలం ఒకమ్మాయి మోజులో ఉద్యమంలో దిగడం ఏవిటి, తరవాత ఇలాగ తలపట్టుకు కూర్చోవడమేవిటి అని శ్రీరాం వ్యక్తిత్వ రాహిత్యమ్మీద నిప్పులు చెరిగింది. ఆ పిల్ల ఆవేశం చూస్తే, ఆ శ్రీరాం నవల్లో ఒక పాత్ర కాక, తన సొంత అన్నదమ్ముడో, కజినో అయినట్టూ, అతగాడి చేతగాని తనాన్ని సరిదిద్దడానికి ఈమెకి సరైన అవకాశం దొరక్క గొప్ప ఫ్రస్త్రేషన్‌కి గురైనట్టూ, ఆ శ్రీరామే గనక ఎదురుగా ఉంటే ఆ చెంపా ఈ చెంపా వాయించి వాడి బుర్రలోకి కూసింత సెన్సుని, మరికాస్త వ్యక్తిత్వాన్ని బలవంతంగానైనా ఇంజెక్టు చేసి పారేసేదానిలా కనిపించింది.

ఆ పిల్ల వాదన విన్నంత సేపూ, ఔరా, ఆ నారాయణ్ గారు ఈ నవల రాసినప్పుడు, ఇరవయ్యొకటో శతాబ్దంలో ఎక్కడో అమెరికాలో పుట్టి పెరిగిన ఒక భారతీయజాతి పిల్ల ఈ నవల చదువుతుందనీ, చదివినాక తన హీరోపైన ఇలా విరుచుకు పడుతుందనీ అస్సలు ఊహించైనా ఉండడేమో కదా అనిపించింది నాకు. ఆ తరగతి ముగిశాక డా. మెర్రిల్‌తో మాట్లాడుతూ, ఇందాక చర్చలో మీరెందుకు దీప్తి వాదనని సరి చెయ్యలేదు. శ్రీరాం పాత్రని సృష్టించడంలో నారాయణ్ గారి ఉద్దేశం అది కాదు గదా అన్నాను. ఆవిడ చిర్నవ్వుతో, నారాయణ్ గారి ఉద్దేశం పలానా అని మీకెలా తెలుసు అని ఎదురు ప్రశ్న వేశారు. నా దగ్గర బదుల్లేదు.

సాహిత్యం చదవడాన్ని గురించి ఒక ముఖ్య సూత్రాన్ని ప్రామాణికంగానూ, అనుభవ పూర్వకంగానూ నేర్పించింది ఈ సంఘటన నాకు. ఏ రచనకయినా పాఠకుడు దాన్నుంచి ఏం గ్రహించాడు అనేదే ఆ రచన పరమావధిని నిర్ణయిస్తున్నది. ఒకసారి రచన పుర్తి చేసి ప్రకటించాక రచయితకి దానిమీద హక్కులన్నీ పోయినట్టే. మొన్నటి దాకా అచ్చుమాధ్యమాలు రాజ్యమేలినప్పుడు, ఫలాని పాఠకుడు ఫలానా రచనని ఈ విధంగా అర్ధం చేసుకున్నాడు అని రచయితకి తెలిసే అవకాశాలు చాలా తక్కువ. ఏవో చిన్న చిన్న సాహిత్య బృందాల్లో మాత్రం అటువంటి స్పందనలు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుండేది. రచయితలకీ పాఠకులకీ మధ్య సరిహద్దు చెరిగిపోతున్న ఈ జాల మాధ్యమంలో రచయితే పనిగట్టుకునొచ్చి నా రచన ఉద్దేశం ఇది అని చెప్పజూసినా, పాఠకులు పోపోవోయ్, నీ శాస్త్రాలు సొంత తెలివి లేనివాళ్ళకి, స్వయంగా ఆలోచించగలిగిన మాక్కాదు అనేస్తారు. ఈ కొత్త యుగంలో నిష్పాక్షికంగా శరపరంపరగా తమపై కురిసే పాఠకాభిప్రాయాల్ని తట్టుకోవడానికి రచయితలు కొత్త మార్గాలు వెతుక్కోవలసిందే, కొత్త సాధన చెయ్యాల్సిందే.

Comments

మురళి said…
దీప్తి ఆవేశం ముచ్చట గొలిపింది.. ఒక రచనని యెంతో శ్రద్ధగా చదివి కథలో లీనమైపోయిన పాఠకురాలు కనిపించింది ఆమెలో..
Padmarpita said…
పాఠకుల అభిప్రాయంతో పాటు మన ఆత్మసంతృప్తి కూడా అవసరమేమో అనిపిస్తుందండి..ఏమంటారు?
@Aruna .. Please post your comments either fully in English or fully in Telugu. Thank you.
మాలతి said…
కొత్తపాళీ,
ఈమధ్య బ్లాగుల్లో కొన్ని కామెంట్లదృష్టితో చూస్తే, మంచి సమయంలో పెట్టేరండీ మీటపా. కాకపోతే "ఒకసారి రచన పూర్తి చేసి ప్రకటించాక రచయితకి దానిమీద హక్కులన్నీ పోయినట్టే" అన్నది నేను అంగీకరించను. అది కొన్నిపరిస్థితుల్లోనే వర్తిస్తుంది.
పాఠకులు తమకి తోచినట్టు కథకిసంబంధంలేని అంశాలు మాటాడుతుంటే, రచయితకి అది కాదు అని చెప్పడానికి కూడా అధికారం వుంటుందనే అనుకుంటున్నాను. అవతలివారు వినకపోతే, అది వేరే సంగతి. కానీ రచయిత తనకోణాన్ని మరోసారి వివరించచడంలో తప్పులేదు.
దీప్తిలాటివారు మానవనైజం చాలా complex అని గ్రహించనివారు అనుకుంటాను. మనిషి ఏదో కంప్యూటర్ ప్రోగ్రాంప్రకారం నడుచుకునే రోబాట్ కాదు అని మర్చిపోతారేమో.
మీరు ఏం మాటాడేరో చెప్పలేదింతకీ.
రచయిత నా రాతల ఆశయం ఇదికాదన్నా, సాహితీ విమర్శనం యొక్క ముఖ్యోద్దేశం "to see the object as in itself it really is" అని విమర్శకులు ఎంత మొత్తుకున్నా ఒక రచన పాఠకుడి చేతిలో పడ్డాక అది పాఠకుడిదైపోతుంది.

పాఠకుడి అనుభవం,పూర్వజ్ఞానం,ఆభిజాత్యం,అపోహ,అర్థరాహిత్యం,జ్ఞానం అన్నీ కలిపి ఆ రచనకు తనదైన అర్థాల్ని కల్పిస్తాయి. పాఠకుడికి సంబంధించినంటవరకూ అదే ఆశయం,అదే ఉద్దేశం.Writer and critic have no right to interrupt readers interpretation.

కానీ పాఠకుడిని guide చేసే అవకాశాన్నికూడా రచయిత/విమర్శకులు ఒదులుకోకూడదు.ఎందుకంటే అది వారి బాధ్యత. రచయిత ఏ ఉద్దేశాన్నైతే ఆశించాడో (ఒకవేళ ఆశిస్తే) అది చెప్పడం రచయిత బాధ్యత. ఒక రచనను "ఎలా చదవచ్చో" చెప్పడం విర్శకుడి బాధ్యత. వాటిల్లో నచ్చింది ఎంచుకుంటూనో,తృణీకరిస్తూనో తనదైన భాష్యాన్ని తెలుసుకోవడం పాఠకుడి హక్కు. One is not in contradiction to another. They are all part of a whole. Making it an integrated experience of literature.
S said…
good one!
"కానీ పాఠకుడిని guide చేసే అవకాశాన్నికూడా రచయిత/విమర్శకులు ఒదులుకోకూడదు.ఎందుకంటే అది వారి బాధ్యత."
హెంత అమాయకులండీ మహేష్ గారూ. కథకుడికన్నా నాలుగాకులు ఎక్కువ చదవడమే కాదు, ఏకంగా తిలకాష్ఠమహిషబంధనం అనే ఉద్గ్రంధాన్నే నమిలి మింగి జీర్ణం చేసేసుకున్నాం, మాకు కథకుడు చెప్పేదేంటి అనే ఎత్తులో ఉన్న పాఠకులకి ఇంక కథకుడు కొత్తగా చెప్పేదేముందండీ? కథమీద వివరణ రాశామూ అంటే అది జోకు చెప్పి ఎవరూ నవ్వకపోతే ఆ జోకులోని హాస్యమేవిటో వివరించడనికి చేసే వృధాప్రయత్నం లాంటిదే!
ఁఉరళి .. ఆ తరగతిలో ఉన్న విద్యార్ధులందరిలోనూ ఆ లీనమవడం కనిపించింది నాకు. ఏదో మొక్కుబడిగా చదివాము అని కాక, చదివిన కథలో సందర్భం తమకి ప్రత్యక్షం కాకపోయినా దానిపట్ల వారు స్పందించిన తీరే నాకు ముచ్చట గొలిపింది.

@ పద్మార్పిత .. మన? ఇక్కడ మనం ఎవరండీ?? :)

@ మాలతి .. నేనేమి అనలేదండి బాబు ఆ తరగతిలో. రెండేసి గంటల సేపు నోరు మూసుకుని కూర్చోవడం చానా కష్టంగా ఉండేది.
Unknown said…
కథలోని నేపథ్యాన్ని గ్రహించి, రచయిత దృష్టితో అర్థంచేసుకొనే ఆసక్తీ, ఓపికా, సామర్థ్యం కొంతమంది పాఠకులకి ఉంటుంది. వాళ్ళు కథలో రచయిత చెప్పినదాన్ని రచయిత కోణంలోంచి అర్థం చేసుకోడనికి ప్రయత్నిస్తారు. కొందరికి అవతలవాళ్ళు చెప్పింది గ్రహించే ఆసక్తికాని సామర్థ్యం కాని ఉండవు. వీళ్ళకి గ్రహింపుకన్నా ప్రతిస్పందనే ముఖ్యం. తమకి తెలిసిన పరిధిలోనే, తమ దృష్టితోనే కథని అర్థం చేసుకుంటారు. చాలామంది యీ రెంటి మధ్యనా ఊగులాడుతూ ఉంటారు.
రచయిత తన కథకి వచ్చిన స్పందన బట్టి తన రచనని బేరీజు వేసుకోవచ్చు. ఎక్కువ మందికి (తాను లెక్కచేసే పాఠకులకి) తను చెప్పింది అర్థం కాకపోతే, తమ అభివ్యక్తిలో లోపమేమో ఆలోచించుకోవచ్చు. అంతేకాని మళ్ళీ తన దృక్పథాన్ని వివరించడం వల్ల ప్రయోజనం ఉంటుందని నేననుకోను. కొంతమంది రచయితలకి ఏ పాఠకుల స్పందనతోనూ పనే ఉండదు. నేను రాసింది రాసాను, అర్థం చేసుకోకపోతే పాఠకుల ఖర్మ అనుకుంటారు.
ఇక విమర్శకుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఈ కాలంలో విమర్శకుల పేరెత్తితేనే అటు రచయితలూ, ఇటు పాఠకులూ కూడా వాళ్ళ మీద దండెత్తుకొస్తారు! కాబట్టి ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో విమర్శ దాదాపు చచ్చిపోయిందని నా అనుమానం. చచ్చిపోయిందన్న మాట కటువుగా అనిపిస్తే "రూపాంతరం" చెందింది, "డెమోక్రటైజ్" అయ్యింది అనుకోవచ్చు. ఇప్పుడు ప్రతి పాఠకుడూ విమర్శకుడే.
Sujata said…
బైరవభట్ల కామేశ్వర రావు గారు.

నిజం చెప్పారు.
ఒక రచయిత, తన ఊహలనూ, అనుభవాలనూ కలగలిపి ఒక నవలో, కవితో సృస్ఠిస్తాడు. పాఠకులకు అది ఆకాశంలో మబ్బుల సమూహంలాంటిది. చూసే వారి ఆలోచలన బట్టి, అది వివిధి అనుభూతులుగా రూపాంతరం చెందుతుంది. ఆ శతకోటి చిత్రాల్లో రచయిత ఆలోచించిన చిత్రం ఒకటవుతుంది. కావాలని ఇలా పాఠకులలో ఆలోచనలు రేకిత్తించడం కోసమే రాసే రచయితలూ ఉంటారు, వారు చెప్పాలి అనుకున్నది సూటి చెప్పే వారూ ఉంటారు. రచయితా ఎలాంటి వారైనా... ఊహలు పాఠకుల సొత్తు కనుక.. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ఆ రచనను స్వీకరిస్తారు.

ఈ రోజుల్లో, అచ్చయిన తరువాత, రచయిత తను చెప్పదలుచుకున్న దానికి, నీళ్ళొదులుకోవడమే.. పైగా... "నువ్విలా అన్నావు" అని జనాలు రచయిత మీద పడ్డ కేసులూ లేకపోలేదు.

దీప్తి లా కాక.. కధానాయకుడంటే సానుభూతి చూపే వారూ లేకుండా పోరు. కధానాయిక మీద.. "అతని అభి రుచులూ సామర్ధ్యమూ చూసుకోకుండా... అతనిని ఇలా పోరాటాల్లోకి దూకడం చూసి అడ్డుకోలేదు.." అని ఆక్షేపించే వారూ ఉంటారు.

చాలా బాగుందండీ
Hima bindu said…
ఒక్కోప్పుడు దీప్తి లానే నేనూ ఆవేశాపడతాను...మీరు చెప్పిన విధం నవ్వొచ్చింది . నిజానికి అది ఆ రచయిత గొప్పదనం .