కబుర్లు జూన్ 1

ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతున్న సమయంలో జీవించే అదృష్టం నీకు పట్టుగాక అని ఏదో కల్చర్లో సాంప్రదాయకమైన ఆశీర్వచనంట. ఆ లెక్కన మనం చాలా అదృష్టవంతుల మన్నట్టే.

మీరు ఇది చదవబోయే సమయానికి జెనెరల్ మోటర్స్ కంపెనీ వాళ్ళు దివాలా కోర్టులో అప్పీళ్ళు దాఖలు చేసి ఉంటారు. సుమారుగా ఎనిమిదేళ్ళుగా అమెరికను వాహన వ్యాపారమనే విషాద నాటకంలో ఇది ఒక విధంగా చరమాంకం అనుకోవచ్చు. అటు జీయెం నాయకులూ, ఇటు అమెరికను ప్రభుత్వమూ బింకంగానే ఉన్నారుగానీ ఈ కోర్టు ప్రక్రియ (త్వరగా ఒక కొలిక్కొస్తుందని ఆశిద్దాం) ముగిసిన తర్వాత ది బిగ్ త్రీ అనే పదబంధానికి అర్ధం లేకుండా పోతుంది. కనీసం, అర్ధం మారుతుంది. (బిగ్ త్రీలో ఒకటైన క్రైస్లరు కంపెనీ కొంత కాలం పాటు జర్మను కంపెనీ డైంలరులో అంతర్భాగంగానూ, తదుపరి ఒక ప్రైవేటు మదుపు కంపెనీ సొత్తుగానూ ఉండి తన పెద్దరికాన్ని ఎప్పుడోనో కోల్పోయిందని కొందరి అభిప్రాయం).

మొన్నీమధ్యన ఒక చిన్న వూళ్ళో ఒక డాక్టరుగారు (తెల్లాయన) భోజనానికి పిలిస్తే వారింటికి వెళ్ళాం. ఆయన వొట్టి సామాన్య డాక్టరు కాదు, ఒక మల్టీ స్పెషాల్టీ క్లినిక్కి ఆయన మెడికల్ డైరెక్టరు. అంతే కాక, ఆ రాష్ట్ర వైద్య సంఘాలు, సమితులు, సలహా బృందాలు ఇత్యాదుల్లో అనేక పదవులు నిర్వ్హించినవారు. అవసరమైతే రాష్ట్ర గవర్నరుకి తిన్నగా ఫోను చేసే వీలున్న పరపతి కలవాడు. అసలా కుటుంబం ఎంత ముచ్చటగా ఉందో. ఇల్లు చక్కగా తీర్చి దిద్దినట్టు పెట్టుకోవడం .. చక్కటి ఆతిథ్యం, అవన్నీ సరే లేండి. నా మీద బలమైన ముద్ర వేసింది వాళ్ళ పిల్లలు. ఒకమ్మాయీ ఒకబ్బాయీ, కాలేజీ చదువుల్లో ఉన్నవాళ్ళు, చక్కగా ఇంట్లో అమ్మకి అదీ ఇదీ అందిస్తూ భోజనం బల్లు సర్ది సహాయం చూస్తుంటే ముచ్చటేసి పోయింది. తరవాత సంభాషణలో ఏదో హోటలు ప్రసక్తి వస్తే ఆ అమ్మాయి - నాకా చోటు తెలుసు, నా హైస్కూలు ముగిసిన వేసవిలో నేనా హోటల్లో మెయిడ్ గా పని చేశాను - అని చెప్తే నాకు కళ్ళు తిరిగి కింద పడ్డంత పనైంది. ఆ బాబు కూడా .. ఇప్పుడు వైద్య కళాశాలలో విద్యార్ధి కానీ కొద్ది కాలం క్రితం నర్సు సహాయకునిగా పని చేశాడుట (శారీరకంగా చాలా కష్టమైనదే కాక, అనేకమార్లు అతి జుగుప్సా కరమైన పనులు చెయ్యాల్సి వస్తుంది). నాకు వారి నిరాడంబరత, స్వశక్తి మీద పైకి రావాలనే పట్టుదలా చూసి అద్భుతంగా అనిపించింది. అఫ్కోర్సు, అమెరికన్లందరూ అలా ఉంటారా అంటే .. ఉండరు. నాకు పరిచయమై, అద్భుతంగా అనిపించిన వారి విషయం పంచుకుంటున్నా అంతే.

కింద శ్రీలంకలో మారణహోమం, పక్కన పాక్ లో స్వాట్ లోయలో మారణ హోమం, మధ్య భారత్లో ఎన్నికల సందడి, తదుపరి విజయోత్సవాలు .. అసలు మన పక్కనే ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతోందో మనవాళ్ళకి ఏమన్నా పడుతోందా అని నాక్కొంచం అనుమానంగా ఉంది. ఎందుకంటే, ఎక్కడా ప్రభుత్వాంగాలు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ, ప్రసారమాధ్యమాలు కానీ అసలీ సంఘటనలు జరుగుతున్నట్టు గమనించి పట్టించుకున్న సూచనకూడా కనబడ్డం లేదు - విశ్లేషణ, తగుచర్యల సంగతి దేవుడెరుగు. రాజీవుని నేతృత్వంలో భారతీయ శాంతి దళమని చెప్పి ఎందరు వీర జవానులు తమది కాని యుద్ధంలో అసవులు బాశారో. ఇండియా స్లీపింగ్ టైగర్, ఇండియా సూపర్ పవర్ అని కేకలు పెట్టే ప్రభుత్వ యంత్రాంగాలకి సరిహద్దు దేశాల్లో ఇటువంటీ కల్లోల పరిస్థితుల్లో ఉండాల్సిన అప్రమత్తత మచ్చుకైనా కనబడుతోందా?

అమెరికాలో ఇప్పుడు పెద్ద వార్త, పుయెర్టో రికో వారసురాలూ, తద్వారా హిస్పానిక్ అమెరికన్ గా గుర్తించబడిన మహిళ సోన్యా సొటొమయోర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిత్వానికి అధ్యక్షులు ఒబామాచే ప్రతిపాదించబడటం. ఇహ కనీసం మూణ్ణెల్లపాటు ప్రసారమాధ్యమాలన్నీ ఆవిడ ఎటువంటి కేసుల్లో ఎటువంటి తీర్పులిచ్చింది అనే ప్రశ్న దగ్గర్నించీ, ఆవిడ వేసుకునే అండర్వేరు సరైన శ్రామిక పద్ధతులు అమలవుతున్న దేశంలో/కంపెనీలో చెయ్యబడిందా అనే ప్రశ్నదాకా శల్య పరీక్ష చేసి పండగ చేసుకుంటారు. క్లేరెన్సు థామస్ గారి అభ్యర్ధి స్థిరపరుపు పద్ధతిలో జరిగిన అతి జుగుప్సాకరమైన నాటకం ఇప్పటికీ జ్ఞప్తికొచ్చి వొళ్ళు జలదరిస్తుంది. ఎవరన్నా సుప్రీం న్యాయమూర్తి రిటైరవుతూ కొత్త అభ్యుర్ధుల ఎంపిక జరుగుతుంటే .. ఓరి భగవంతుడా .. ఈ అభ్యర్ధి అలమారులో కంకాళాలేవీ లేకుండా చూడు నాయనా .. అనిపిస్తుంది.

సరే, ఈ రాజకీయాల గోల సరేగానీ .. కాస్త మనసుకి ఆహ్లాదం కలిగించే మాటల చెప్పుకుందాం. మన ఆంధ్రామృతం రామకృష్ణ మేష్టారు షిర్డీ సాయినాథుని సంబోధిస్తూ ఉత్పల చంపక మాలలతో శతకం అల్లుతున్నారు. సాయి భక్తులకిది చాలా ఆనందదాయకం కాగలదు.
సంచలనాత్మక బ్లాగరి రేరాజ్ గారి ప్రేరణతో యువబ్లాగరి విజయమాధవగారు తన బ్లాగులో ఒక ఆసక్తికరమైన అభిప్రాయ సేకరణ నడుపుతున్నారు. వోటెయ్యడానికి ఇవ్వాళ్ళే ఆఖరు. మీ అభిప్రాయం తప్పక తెలియజెయ్యండి.
న్యూజెర్సీ తెలుగుజ్యోతి వారి రజతోత్సవ ప్రత్యేక సంచికలో మన బ్లాగర్లు ప్రకటించిన కథా, కవితా బ్లాగుల్లో పునర్దర్శనమిస్తున్నాయి. ప్రముఖ కవి అఫ్సర్ గారి పఠనాసక్తిని మనకి పరిచయం చేశారు రవికుమార్ చదువు ముచ్చట్లంటూ. చావా కిరణ్ రాసిన సైఫై థ్రిల్లర్ నవలిక తొలిరేయి ఈ-పుస్తకంగా దొరుకుతోంది. ఇటీవల ధారావాహికలుగా సాగిన మాలతి గారి ఇంటర్వ్యూ కథా మాలతీయం (పొద్దులో), తాలబాసు గారి రచన - ప్రజలుగా ప్రజాస్వామ్యంలో మనకేం కావాలి (వారి స్వంతబ్లాగు కలగూరగంపలో) - ఇప్పుడు ఈ-పుస్తకాలుగా లభ్యమవుతున్నాయి. సమకాలీన సాహిత్యాన్ని గురించీ, సమకాలీన జీవితాన్ని గురించీ ఆలోచనలు రేకెత్తించే రచనలు ఈ రెండూ. ఓ లుక్కెయ్యండి.

Comments

oremuna said…
ఈ పుస్తకం కాదు. ప్రింట్ పుస్తకమే!

http://tolireyi.com
teresa said…
అలమారులో కళేబరాలు...సిసలైన అనువాదం :)
వేమన said…
అమెరికన్ మీడియాలో ఉన్నంత పైత్యం ఎక్కడా కనపడదు.
రాధిక said…
మా కంపెనీకి జనరల్ మోటార్స్ అతి పెద్ద క్లయింటు.గత రెండు నెలలుగా మా కంపెనీలో జనాలకి ఏదో తెలియని అలజడి.మూసేసారు అనే మాటకంటే మూస్తారు ,ఎత్తేస్తారు అనే మాటలు ఎంత భయాన్ని,భాధని[తీవ్రమైన బాధ అన్న మాట :)] కలిగించాయో.ఈ రోజు పెద్ద తలనొప్పి వదిలిపోయింది[ఇది నిజం కాదని మనవి చేసుకుంటున్నాను]
Anil Dasari said…
@రాధిక:

జీఎమ్ దివాలా తీసిందే కానీ మూతపడలేదు కదా.
భావన said…
ఇప్పుడు ఈ జీఎం దివాళా తీస్తే మన ఒబామా ఇచ్చిన బెయిల్ ఔట్ డబ్బు లు ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవిందానేనా? లోకాలెన్ని అంటే అందుకే కదండి ఎవరో గురువు గారు చెప్పేరట శిష్యుడికి తలకోలోకం నాయనా అని... ఎద్దు పుండు కాకికి నొప్పా? శ్రీలంక లో మారణ హోమం ఇండియా లో విజయోత్సవాలు... దివాళా బాట లో జీఎం... మద్య లో మునిగింది టేక్స్ కట్టే వాళ్ళు, ఎవరి బాధ ఎవరికి నొప్పి అండి...
డాక్టరుగారి కబురు నచ్చిదండి. అటువంటి కొందరు ప్రభావితం చేస్తారు. జెనెరల్ మోటర్స్ వార్త చదివితే మోటోరోలా గుర్తొచ్చింది. సరిహద్దుదేశాల కబురు చదివితే, కాబూల్ ఎక్స్ ప్రెస్ సినిమా గుర్తొచ్చింది.
@oremuna .. my bad.
@వేమన .. ఆ పైత్యంలోనూ అక్కడక్కడా కొంత వినోదమూ విజ్ఞానమూ లేకపోలేదు
@రాధిక..ఒక్క కంపెనీకే మీకలా ఉంటే అటువంటివి వందల కంపెనీలు ఉన్న ఊరి పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఆలోచించండి.
@భావన..ఇప్పటిదాకా ప్రభుత్వం పెట్టిన డబ్బులు అప్పు కింద లెక్క. దానికి బదులుగా కొత్తగా ఆవిర్భవించనున్న కంపెనీలో ప్రభుత్వానికి (అనగా అమెరికను పన్ను చెల్లింపుదారులకి) సుమారు 60% వాటా ఉంటుంది-ట.
మురళి said…
కాస్త ఎక్కువ కొంచం ఆలస్యంగా చెప్పినా బాగున్నాయండి కబుర్లు... ముఖ్యంగా డాక్టరు గారి విశేషాలు. భారత దేశం కర్మ భూమి.. పక్కింట్లో బ్రహ్మాండం బద్దలైనా తమ ఇంట్లో నిశ్చింతగా ఉండగలగడం భారతీయుల ప్రత్యేకత..అని మీకూ తెలుసు కదా....
మీరు ఆలశ్యంగా రాసారని నేనూ ఆలశ్యంగానే చూశ్తున్నాను :-)

ఈసారి బోలెడన్ని కబుర్లు పంచిపెట్టారు!

మీరు చెప్పిన పూర్తి వ్యతిరేకమైన ఇంకో డాక్టర్ గారి కుటుంబం నాకు తెలుసు.. సమ్మర్ జాబులు, పార్ట్ టైం జాబుల మాట అటు ఉంచి అసలు గ్రాడ్యుయేషన్ అవ్వగానే వాళ్ళ పేరెంట్స్ లా మిలియన్ డాలర్ల జాబ్స్ ఏమీ రావటంలేదని ఇంట్లోనే కూర్చుని గోళ్ళు కొరుక్కునే పిల్లలు వాళ్ళు.. అలా అని ఇంట్లో అటు పుల్ల తీసి ఇటు పెట్టే రకం కూడా కాదు!

సోటొమయోర్ కి ఆల్రెడీ లిబరల్ యాక్టివిస్ట్ అని ముద్ర వేసేసారు కదా.. ఆవిడ తీర్పులన్నీ ఆ ధృక్పధంతోనే ఇవ్వొచ్చు అని కన్సర్వేటివ్స్ అప్పుడే మూతులు తిప్పేస్తున్నారు మరి!

నా కవిత గురించి ప్రస్తావించినందుకు ధన్యవాదాలు :-)
teresa said…
Nishi,

Just curious-- Is that family of Indian origin?
Vani said…
చక్కగా ఉన్నవండి మీ కబుర్లు. టీ తాగుతూ , గోడ మీద నుండి పక్కింటి వారితో మాట్లాడినట్లు.
డాక్టర్ గారి ఫ్యామిలీ గూర్చి బాగా చెప్పారు. ఇప్పుడు ఇండియా లో కూడా చాల మార్పు వచ్చిందండి ముఖ్యంగా చిన్న పిల్లల్లో , టీన్స్ లో . చక్కగా సంపాదిస్తూ చదువుకొంటున్నారు. కాక పొతే చిన్నతనం లో సంపాదించటం మొదలు పెడితే చిన్న చిన్న గోల్స్ , కొద్ది సంపాదనలతో తృప్తి పడిపోతారు. అది ఫ్లిప్ సైడ్ .
అన్నట్టు మీ కబుర్లు కూడలి లో ఏదో మూల సాహిత్యం ట్యాబు లో వచ్చే టప్పటికి మిస్ అవుతున్నాం. అలా ఎందుకు అవుతున్నదో?