మేలుకొలుపులు

కాస్తో కూస్తో సంగీతం తెలిసిన వారికి భూపాలం అనగానే ఉషఃకాంతులూ, పక్షుల కిలకిల రవాలూ, మంచులో తడిసిన పూలూ, రాత్రంతా సేదతీరి బద్ధకంగా మేలుకుంటున్న ప్రకృతి, తెలతెలవారుతున్న తూరుపు ఆకాశం .. ఇవన్నీ గుర్తొస్తాయి. మరి ఆ తిరుమల స్వామిని నిద్ర లేపడానికి భూపాల రాగం పాడ్డంలో ఆశ్చర్య మేముంది?

Get this widget | Track details | eSnips Social DNA

భూపాలంలో స్వరపరిచిన అన్నమయ్య పదం, బాలమురళీకృష్ణ గాత్రంలో శ్రీవేంకటపతికి మేలుకొలుపు

భూపాలం, బౌళి (కొందరు భౌళి అంటారు), రేవగుప్తి .. ఈ మూడూ చాలా సన్నిహితంగా ఉండే రాగాలు. మూడూ బహు ప్రాచీనమైనవే. అనాదిగా ఉషఃకాలోచితమైన అనేక దైవ మానవ కార్యక్రమాలకి ఈ మూడు రాగాలూ నేపథ్యసంగీతాన్ని అందిస్తూ వచ్చాయి. మూడిటికీ మధ్య తేడాలు బహు స్వల్పం. ఎంత చిన్న తేడాలంటే, ఒకపాటి సంగీతం వచ్చిన వారు కూడా ఈ రాగాల్ని విన్నప్పుడు కొంచెం తికమక పడుతుంటారు.

భూపాలం ఆరోహణలోనూ, అవరోహణలోనూ అవే ఐదు స్వరాలను కలిగి ఉంది. ఇలాంటి రాగాల్ని ఔడవ రాగాలంటారు.
ఆరోహణ: స, రి1, గ1, ప, ద1
అవరోహణ: ద1, ప, గ1, రి1, స
72 మేళకర్త విభజన పద్ధతిలో దీన్ని 8వ మేళకర్త హనుమత్తోడి జన్యంగా భావిస్తారు.

దీన్నించి బౌళి రెండు విషయాల్లో విభేదిస్తుంది. గ1 కి బదులు గ2 ఉంటుంది ఆరోహణంలోనూ, అవరోహణంలోనూ. అది కాక, అవరోహణలో ని2 స్వరం అదనంగా వచ్చి చేరుతుంది. అంటే బౌళి స్వరక్రమం ఇలా ఉంటుంది.
ఆరోహణ: స, రి1, గ2, ప, ద1
అవరోహణ: ని2, ద1, ప, గ2, రి1, స
దీన్ని 15 వ మేళకర్త మాయామాళవగౌళ జన్యంగా పరిగణిస్తారు.

బౌళిలో శ్రీరామునికి మేలుకొలుపు, త్యాగరాజ ఉత్సవ సంప్రదాయ కీర్తన, గొంతు బాలమురళీకృష్ణ

Get this widget | Track details | eSnips Social DNA

బౌళిలో ప్రసిద్ధమైన అన్నమయ్య పదం, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గానం

బౌళిలో అవరోహణలో వచ్చే ని2 స్వరాన్ని తొలిగిస్తే అదే రేవగుప్తి. అంటే, ఈ తేడాని కనిపెట్టడానికి బహు సునిశితమైన వినికిడి ఉండాలన్నమాట. స్వరస్థానాలు మారకపోవడం వల్ల రేవగుప్తి కూడ మాయామాళవగౌళ జన్యమే.

రేవగుప్తిలో నేదునూరి వారు స్వరపరిచిన అన్నమాచార్యులవారి గొప్ప తాత్త్విక కీర్తన, గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారి గళంలో


ట్రావంకూరు ఏలిక శ్రీ కులశేఖరమహారాజు (స్వాతి తిరునాళ్ గా ప్రసిద్ధులు) రచించిన అద్భుతమైన సంస్కృత కృతి, గోపాలదేవుని కీర్తిస్తూ, జేసుదాసు గళంలో

ఈ మూడు రాగాల్లోనూ ఒక ప్రత్యేకమైన తూగు ఉంటుంది. ఎందుకంటే, ఆరోహణలో ద1 నించి తారస్థాయి స కి వెళ్ళేప్పుడు, రెంటికీ మధ్య మూడు స్వరస్థానాలు ఖాళీగా ఉంటాయి. ఆ మధ్యలో స్వరాలేవీ ధ్వనించకుండా గొంతుని గంతు వేయించాలి. ఆలాగే అవరోహణలో కూడా (బౌళి అవరోహణలో ఈ ఖాళీ రెండు స్థానాలే, ని2 ఉంటుంది కాబట్టి). ఇదే విధంగా రి-గ ల మధ్య వచ్చే ఖాళీ, గ-ప ల మధ్య వచ్చే ఖాళీ కూడా ఈ రాగాల ప్రత్యేకతకి దోహదం చేస్తాయి.

స, రి, గ, ప, ద, స్వరస్థానాలు కలిగిన ఇంకొక ప్రఖ్యాత రాగం ఉంది. ఐతే అది ఈ మూడు రాగాల్లాగా ఉండదు. అంతే కాదు, కర్నాటక సంగీతంలోనే కాక హిందుస్తానీ సంగీతంలోనూ, ఇంకా అనేక ప్రపంచ దేశాల సంప్రదాయ సంగీతాల్లోనూ తనకొక ప్రత్యేకతని ఆపాదించుకున్న రాగం ఇది. అదే మోహన రాగం.

Comments

రాగాల గురించి పెద్దగా తెలీదు కాని.... సంగీతం అంటే మాత్రం పిచ్చి నాకు... వీలైతే నా రాగం కుడా చూడండి...

భూపాలం అని చూడగానే... 'ఎవ్వరో పాడారు భూపాల రాగం' అనే కోకిలమ్మ చిత్రంలోని పాత గుర్తొచ్చింది...

మిగిలిన రాగాలు పెద్దగా తెలీదు కాని... హాయిగా నిద్రపుచ్చే నీలాంబరి రాగం అన్నా నాకు ఇష్టమే :)
అన్నట్టు ఈ బ్లాగులో కామెంట్ moderation పెట్టటం మరిచినట్టున్నారు!?
నా 'రాగం' అంటే... నా 'రాగం' అనే బ్లాగు
ఇన్నాళ్ళకు మరల తెరిచారా ఈ బ్లాగు ద్వారాలు!! పునఃదర్శనం ఆలశ్యమైనా అద్భుతమైన కిర్తనలను వినిపించారు.. వాటితో పాటే మీరు చెప్పిన సంగీత పాఠం కూడా బావుంది..

"శ్రీమన్నారాయణ.." వింటూ ఉంటే శరీరం అచేతనమైపోయి.. మనసు ఎగురుకుంటూ ఆ ఏడుకొండలలో సంచరించి వచ్చింది!!

సంగీతానికి మించిన స్ట్రెస్ రిలీవర్ ఇంకోటి లేదేమో.. సరైన సమయంలో చూశాను మీ టపా!

ధన్యవాదాలు :-)
Sharada said…
మధ్యలో స్వరాలని వదిలేసే రాగాలకి అదోరకమైన appeal వుంటుంది. ఇదే రకంగా తెల్లవారుజామున పాడే రాగాల్లో అద్భుతమైంది భటియార్ (హిందుస్తానీ రాగం). దీన్లో కూడా స నించి ధ కి గెంతే ప్రక్రియ చాలా అందంగా వుంటుంది. దూరదర్శన్ లో చిన్నప్పుడు కవితా కృష్ణ మూర్తి పాడిన "పూరబ్ సే సూర్య్ ఉగా- ఫైలా ఉజియారా" అనే పాట గుర్తుండే వుంటుంది.

http://www.youtube.com/watch?v=NbyAD8ETRK4&feature=PlayList&p=AC339B1F4A6B2992&index=0&playnext=1


అలాటిదే ఇంకొక రాగం హిందుస్తానీ శ్రీ రాగం. దీన్లో అయితే ఏకంగా flat గా వుండే రిషభం నించి పంచమానికి ఎగరటం చాలా ఆహ్లాదంగా వుంటుంది.
http://www.youtube.com/watch?v=SzIVSA9M-8I
vookadampudu said…
భక్తి వినా సంగీతఙ్ఞానము అని త్యాగయ్యగారు చెప్పారు కదా..
అందువల్ల నాకు సంగీతం గురుంచీ యేమి తెలీదు గానియండి, ఉత్సవ సంప్రదాయ కీర్తనలంటే చాలా చాలా ఇష్టం..
మాయా బజార్ లో మాయా శశిరేఖ నిద్ర లేచేముందు భూపాలం వినిపిస్తుంది అని నా గట్టి అనుమానం
భవదీయుడు
సుజాత said…
"శ్రీమన్నారాయణ" వింటే శ్రీమన్నారాయణ కూడా విస్తుపోతాడేమో ఆ గాత్ర మాధుర్యానికి అనిపిస్తుంది. దాదాపు ప్రతి ఉదయమూ మా ఇంట్లో వినిపించే కీర్తన ఇది.

ఒక చిన్న విన్నపం!(సూచనంటే బాగోదు)వివిధ రాగాల్లో సంప్రదాయ సంగీతాన్ని వినిపించేటపుడు ఆయా రాగాల్లో కూర్చిన "మంచి" సినిమా పాటలని కూడా ఒకటో రెండో వినిపిస్తే మా వంటి పామర జనానికి ఏ రాగం ఏదో కొంచెం పట్టుకోగలిగే స్థాయి వస్తుందని ఆశ.

భూపాల రాగంలో విప్రనారాయణ లో "మేలుకో శ్రీరంగా " పాట ఎంత బాగుంటుందో!

అలాగే సీతారాములు సినిమాలో "తొలిసంధ్య వేళలో" కూడా!
రాఘవ said…
స-రి-గ-ప-ద ల "శివరంజని"ని వదిలేసారేమండీ :) మహరాజపురం సంతానం ఊరుకోరు :P
Sriram said…
గురువుగారూ, ధన్యవాదాలు...ఈ రక్తిరాగాలే నాకు మొదటగా కర్నాటక సంగీతాన్ని పరిచయం చేసాయి. చాలా రోజులకి నేదునూరివారి కీర్తన మళ్ళీ విన్నా...ఇంకా శారదగారు వినిపించిన భతియార్ చాలా ఇస్టమైన రాగం. అజయ్ చక్రవర్తి గారమ్మాయి కౌశికి చక్రవర్తి ఒక గంటసేపు ఈ రాగం పాడిన రికార్డింగ్ నా దగ్గర ఉండేది ఈ మధ్యే మిస్సైంది. మీకెక్కడైనా దొరికితే వినండి, నచ్చుతుంది.
కొత్త విషయాలు తెలిసినయ్.
ధన్యవాదములు
చాలా బాగుందండీ రాగాల గురించి మీరిచ్చిన వివరణ. ఏసుదాస్ గారి పాట నాకు చాలా బాగా నచ్చింది.