కబుర్లు - ఏప్రిల్ 20

అమెరికాలో వంగూరి ఫౌండేషను అని ఉంది. హ్యూస్టను నగర వాస్తవ్యులు, వ్యాపారదక్షులు, అమెరికాలో ప్రసిద్ధ తెలుగు రచయిత అయిన డా. వంగూరి చిట్టెన్రాజుగారి నాయకత్వంలో అనేక విధాలుగా తెలుగు సాహిత్య సేవ చేస్తోంది ఈ సంస్థ. ప్రతి ఏడూ ఉగాది సందర్భంగా అమెరికా తెలుగు రచనల పోటీ నిర్వహిస్తుంటారు. పదేళ్ళ క్రితం, 1999 సంవత్సరంలో జరిపిన పోటీకి ఒక కథ రాసి పంపాను. ఒక అమెరికను బడిలో జాత్యహంకార పూరితుడైన ఒక తెల్ల పిల్లవాడు నల్లజాతి మీది ద్వేషంతో స్కూలు అసెంబ్లీ మీద ఆటోమేటిక్ తుపాకితో దాడి చేసినట్టు అందులో చిత్రించాను.

ఆ కథ పంపేసిన సుమారు వారం పది రోజులకి కొలరాడో రాష్ట్రంలోని కొలంబైన్ హైస్కూల్లో ఇటువంటి ఘాతుకం నిజంగా జరిగింది. ఆ దాడి జాత్యహంకారంతో ప్రేరణ చెందినది కాదు కానీ, ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు ఉపాధ్యాయులూ, విద్యార్ధులూ కూడా తమ తోటివారిని రక్షించేందుకు అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించారు. దేశం మొత్తాన్నీ ఈ సంఘటన కుదిపేసింది.

కథని సబ్మిట్ చేసిన కొద్ది రోజుల్లోనే కథలో చెప్పినటువంటి సంఘటన నిజంగా జరగడం వల్లనో, లేక ఆ కథలో న్యాయనిర్ణేతలకి ఏదో విలువ కనబడో, మొత్తానికి ఆ కథకి ఆ పోటీలో మొదటి బహుమతి వచ్చింది. ఆ తరవాత ఆ కథ అమెరికాలోనూ, ఆంధ్రాలోనూ అనేక పత్రికల్లో, సంకలనాల్లో మళ్ళీ మళ్ళీ ప్రచురితమై, కథా రచయితగా నాకు కొంచెం మంచిపేరే తెచ్చి పెట్టింది. కానీ, నిజజీవితంలో అటువంటి ఘాతుకం జరగడం నన్ను కూడా కుదిపేసింది. ఆ కథని మళ్ళీ నేను అభిమానంగా చూసుకోలేక పోయాను. అది తెరిచినప్పుడల్లా నాకు వెన్ను జలదరిస్తుంది.

ఈ రోజు కొలంబైను మారణహోమం జరిగి పదేళ్ళు గడిచాయి! కానీ మనసు గాయాలింకా పచ్చిగానే ఉన్నాయి.

గత వారం ఒకరి మీద చాలా కోపమొచ్చేసింది నాకు. ఎలాగంటే, ఏదో ఒక భయంకరమైన అవమానం, ఘోరాతి ఘోరమైన ప్రతిక్రియ చేసేస్తే గానీ ఆ కోపం చల్లారేటట్టు కనబళ్ళేదు. రాత్రీ పగలూ ఇదే ఆలోచన. మరి దేనిమీదా మనసు లగ్నం కాదు. అంత ఆవేశం వచ్చినప్పుడు మరి ఆ ప్రతిక్రియ ఏదో చేసెయకుండా ఎందుకు ఆగానో స్పహ్టంగా చెప్పలేను. ఆవేశానికి లొంగిపోవడం మంచిది కాదు అనే వివేకం కంటే ఏం ప్రతిక్రియ ఎలా చెయ్యాలో తెలియక పోవడం వలన అయ్యుండొచ్చు. ఇలా పూరాగా ఏడు రోజులు బాధ పడ్డాను. ఆ ఆఖరి రోజు ఒక నిర్ణయానికి వచ్చేశాను. ఇవ్వాళ్టితో నా ప్రత్యర్ధికి మూడింది. అలుగుటయే యెరుంగని .. టైపులో నేపథ్య సంగీతం నేనే ఇచ్చేసుకుని పురెక్కి పోయి, రెచ్చిపోదామని డిసైడైపోయి, యథా ప్రకారం ఉదయం మొదటి కప్పు టీ తాగుతూ కంప్యూటరు తెరిచాను. విధి అనండి, దేవుడనండి, డివైన్ ఇంటర్వెన్ష ననండి (ఈ మాట వినంగానే మీలో ఎంతమందికి పల్ప్ ఫిక్షన్ సినిమా గుర్తొచ్చింది?) మొదట నేను తెరిచిన మెయిల్లో ఈ లింకుంది.

అంతే, ఆ కథలో చెప్పినట్టు ఒక్కసారి రెక్కలు విదిలించి చూశా .. వారంరోజులుగా నన్ను కుదిపేసిన కోపం ఆవేశం అంతా తుస్సున జారి పోయింది. మీక్కూడా ఎవరిమీదన్నా కోపంగా ఉందా? ఒక్కసారి రెక్కలు విదిలించండి.

Comments

Anonymous said…
కబుర్లు చాలా బాగున్నాయి - కదిలించేలా ఉన్నాయి. మీరు కోపాన్ని హేండిల్ చేసిన తీరుని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను.

పల్ప్ ఫిక్షన్ సినిమా నాకు ఖచ్చితంగా గుర్తొచ్చింది. ఎందుకంటే, దాన్ని నిన్ననే చూశాను కాబట్టి. చూస్తున్నంత సేపూ మీ moment of clarity టపా గుర్తొస్తూనే ఉంది. ఆ సినిమా చూశాకా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది.
“FLAP YOUR WINGS”
నా రెక్కల్ని నేనూ టపటప లాడిస్తున్నా!!
Anil Dasari said…
బాతూల్ కతలేంది సారూ. శరపరంపరగా వినవస్తున్న మాంద్యం గాధలు, అఘాయిత్యాలు వగైరా చెడు వార్తల మధ్య పోయిన వారం అమెరికాలో సంభవించిన రెండు హీరోచిత సంఘటనల ప్రస్తావన తెస్తారనుకున్నాను ఈ వారం కబుర్లలో. నావీ సీల్స్ & కెప్టెన్ రిచర్డ్ ఫిలిప్, మరియు ఫ్లోరిడాలో విమానం దించిన అనామక ప్రయాణీకధానాయకుల గురించి రాస్తారనుకున్నా - ఎందుకో!
@గీతాచార్య, ఏమైంది నవతరంగానికి?
@అబ్రకదబ్ర .. కబుర్లు అంటే వర్తమాన వార్తల సమాహారం అనే భ్రమ మీకు కలిగించి ఉంటే క్షంతవ్యుణ్ణి. అలాంటి ప్రణాళిక ఏం లేదు. కొన్ని కారాణల వల్ల గత వారమంతా వార్తల్ని ఫాలో అవలేదు, ఒకేళ ఫాలో అయి ఉంటే ఈ కథనాలు నన్నూ కదిలించి ఉండేవేమో.
asha said…
నాకూ అలా రెక్కలు విదిలిస్తే కోపం పోతే బాగుణ్ణు. అంటే లిటరల్‌గా...ఫిగరిటివ్‌గా కాదు.
ఓ, ఆ కధ కోలంబైన్ ఇన్సిడెంట్ జరగక ముందు రాసారా!! జరిగాక రాసారేమో, అందుకే అసలు ఆ పిల్లల భయాన్ని, భావాల్ని హృద్యంగా వర్ణించగలిగారని అనుకున్నా!

Very appreciative work!
నాకు చిన్నపుడు కోపం బాగా వచ్చేది, అలగటమొక ఒక అలవాటుగావుండేది. ఇంతలో జీవితం దుఃఖాన్ని, శోకాన్ని పరిచయం చేసింది. అప్పుడు మా నానమ్మ ఇలా అనేవారు "ఈ పిల్ల కోపం తాటాకుమంట, శోకం వూటబావి".
రామకృష్ణ పరమహంస బోధన ఇది - "నీకు బాధ కలిగించిన విషయం మరొకరికి నీ ద్వారా అదే బాధ కలిగించరాదు" అని. అలా అలా మనసుకి అలవాటు చేసిన మెతకతనంతో కోపం తగ్గిపోయింది.

The Duck story is so thought provoking. మీరు ప్రస్తావించిన సంఘటనలవంటివి నేను చదివితట్టుకోలేను, అంచేత అది మాత్రం వదిలేస్తున్నాను.