అప్పుడేం చేస్తారు?

జీతం కోసం ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం లేదనుకోండి, మీరేంచేస్తారు?

ఒకసారి ఈ పరిస్థితిని ఊహించుకోండి.
మీ ప్రస్తుత జీవితంలో మిగతా విషయాలన్నీ అలాగే ఉంటాయి మారకుండా. ఇప్పుడు మీకొస్తున్న జీతం (పోనీ స్వంత వ్యాపారం ఉన్నవారైతే, దాని ద్వారా మీకొచ్చే సంపాదన) రెండు వారాలకోసారో, నెలకోసారో మీ బేంకెకౌంటులో జమయిపోతోంది. పొద్దున్నే లేవంగానే హమ్మో ఆ ప్రాజెక్టు ఏ స్థితిలో ఉందో, ఇవ్వాళ్ళ ఎనిమిదింటికల్లా బాసుకి రిపోర్టు ఇవ్వాలి, లేకపోతే పది గంటలకి విదేశీ క్లయంట్లతో విడియో కాన్ఫరెన్సుంది, హబ్బ ఈ ట్రాఫిక్కులో పడి గంట సేపు కొట్టుకోవాలి .. ఇలాంటి వత్తిళ్ళు ఏమీ లేవు.
ఇలాంటి పరిస్థితిలో మీ సమయంతో మీరేం చేస్తారు?

ఊహ తెలిసిన నాటి నుండీ మన జీవితం ఏదో ముందే నిర్దేశించిన మార్గంలో నడిచిపోతున్నట్టే ఉంటుంది. ఏదో ఎక్కడో ఒకటీ అరా తప్పించి, మనం చేసే ప్రతీపనీ, వేసే ప్రతీ అడుగూ ఒక మంచి ఉద్యోగం సంపాయించుకోడానికే. ఎందుకంటే? మంచి ఉద్యోగం వస్తే, తగినంత జీతం వస్తుంది. జీవితం సుఖంగా ఉంటుంది. తగినంత జీవితం అంటే? జీవితం సుఖంగా ఉండటం అంటే?

నా మట్టుకి నాకు ఎంత సంపాదన ఉన్నా, రోజులో కొంచెం సేపయినా మంచి సంగీతం వినడమూ, పడుకోబోయే ముందు ఏదన్నా ఒక పుస్తకం చదువుకోవడమూ జరక్క పోతే మహా వెలితిగా ఉంటుంది. అలాగే కొందరికి తమ పిల్లలతో గడిపే సమయం విలువైనది కావచ్చు. ఇంకొకరికి వారి గోల్ఫు ఆట అదే తృప్తినివ్వచ్చు. ఒకేళ జీతం కోసం అఫీసుకి వెళ్ళాల్సిన అవసరం లేకపోతే రోజంతా ఇదే పని చేస్తూ కూర్చుంటామా? అసలు ఎవరైనా రోజంతా సంగీతం వినగలరా? మాంఛి సస్పెన్సు థ్రిల్లరైతే వొదిలి పెట్టకుండా ఇరవైనాలుగ్గంటలూ ఏకబిగిని చదివేస్తామేమో కానీ అదే పనిగా ప్రతీ రోజూ చెయ్యలేము కదా. అలాగే గాల్ఫయినా, పిల్లల్తో ఆడుకోవడమైనా, ఇంకేదైనా.

పిచ్చెక్కదూ?

జీతం కోసం ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం లేదనుకోండి, మీరేంచేస్తారు?

Comments

నాకు బాగా ఇష్టమైన హాబీ painting... ఇప్పుడు చేస్తున్నట్టు ఎప్పుడో ఒకరోజు కాకుండా... ఎక్కువగా దానికోసం సమయం కేటాయిస్తాను.
ఇప్పుడైతే నెలలో ఒకరోజే ఫౌండేషన్ ద్వారా homes కి వెళ్లి చిన్నపిల్లలతో గడపగలుగుతున్నాను... ఉద్యోగం చేసే పని లేకపోతే... ఇంకా ఇదే నా ఫుల్ టైం పని అయిపోతుంది. ఇంకా వాళ్ళకోసం చేయాల్సిన చాలా పనులకి అప్పుడు తగినంత సమయం వెచ్చించగలుగుతాను.
నాకు సంగీతమన్నా కుడా చాలా ఇష్టం... ఎప్పుడూ వింటూనే ఉంటాను... డ్రైవింగ్ లో కుడా. వయొలిన్ నేర్చుకోవాలనే నా కోరిక తీర్చుకోటానికి సమయం కేటాయిస్తాను.
ఇంకా ఇలాంటి చిన్న చిన్న కోరికలు, ఆలోచనలు చాలా ఉన్నాయి మైండ్ లో...

ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నా... ఏదో ఒక రోజు ఆ ఉద్యోగం మానేసి నాకిష్టమైన ఈ పనులన్నీ చేసుకుంటాను.
జీతం కోసం పని చేస్తున్నా కూడా మనకంటూ కొంత సమయం మీలాగా కేటాయించుకోవడం అవసరమనుకుంటాను నేను. ఎంత పని వత్తిడి ఉన్నా సరే మన అభిరుచులకు కొంత సమయం కేటాయించకపోతే మనుషులకూ, యంత్రాలకూ తేడా ఏముంటుంది?

ఇష్టమైన పనులు చేయడానికి ప్రతి ఒక్కరూ టైము కేటాయించుకోవాల్సిందే!కానీ "పని " అంటూ లేకపొతే రోజంతా అభిరుచులకు కేటాయిస్తే మీరన్నట్లు పిచ్చి ఎక్కడం ఖాయం. అప్పుడు మళ్ళీ మనల్ని బిజీగా ఉంచే మరో పని (అది ఖచ్చితంగా డబ్బుకి సంబంధించిందే , ఉద్యోగమో, వ్యాపారమో అయి ఉంటుంది చూడండి) వెదుక్కుంటాం.
Purnima said…
hahahaha.. interesting topic! I know you wouldn't allow comments in english! Would get back to you in telugu, very soon! :)
S said…
జీతం వద్దు గీతం కావాలి అని చెప్పేసి చేస్తాను. గీతం అనగా కాలక్షేపమని భావము. ;)
అదృష్టమో, దురదృష్టమో కాని కొన్ని కారణాల వల్ల నేను అటువంటి జీవితాన్ని ఒక ఆరు నెలల పాటు అనుభవించాను. ఆ ఆరునెలలు నేను ఏమి చేసేవాడినంటే, రోజుకు దాదాపు పన్నెండు గంటలు నిద్రపోయేవాడిని. మిగతా టైం లో ఏం చేసేవాడినంటే, ప్రొద్దున్నే టిఫిన్ చాలా ఎక్కువగా తినేవాడిని. ఎలా తినేవాడినంటే, నిదానంగా బాగా నములుతూ, రుచిని ఆస్వాదిస్తూ అరగంట నుంచి గంట సేపు తినేవాడిని. ఎక్కువగా తినడం వల్ల కొంచెం మగతగా అనిపించేది. టిఫిన్ కు, మధ్యాహ్నం భోజనానికి గ్యాప్ మూడు గంటలు ఉంటుంది కాబట్టి, ఈ సమయంలో ఒక తెలుగు సినిమా చూసేవాడిని. మధ్యాహ్నం భోజనం కూడా దాదాపు అరగంట నుంచి గంట సేపు తినేవాడిని. నేను తినే విధానం చూసి నాతో కంపెనీకి రావడానికి మా ఫ్రెండ్స్ ఇష్టపడేవారు కాదు. వాళ్ళు మాత్రం ఏదో హడావిడిగా తిని వెళ్ళిపోయేవారు. భోజనం తర్వాత ఏదైనా వారపత్రిక చదువుతూ అలాగే నిద్రపోయేవాడిని.

సాయంత్రం 5-6 గంటలకు వాకింగ్ కు వెళ్ళేవాడిని. దాదాపు ఒక గంట సేపు వాకింగ్ చేసిన తర్వాత, మరో గంట సేపు ప్రశాంతంగా స్నానం చేసేవాడిని. ఈ తతంగమంతా అయ్యేసరికల్లా డిన్నర్ టైం అవుతుంది. డిన్నర్ అయిన తర్వాత తెలుగు బ్లాగులు చదివేవాడిని లేదా మళ్ళీ ఏదో ఒక తెలుగు సినిమా చూసేవాడిని. జీతం మాత్రం ఠంచనుగా ఒకటోతారీఖు బ్యాంకు అకౌంట్ లో పడిపోయేది.

నిజం చెప్పొద్దూ, ఈ మాత్రం దినచర్య కు కూడా నాకు రోజుకు ఇరవై నాలుగ్గంటలు సరిపోయేవి కాదు.

నాకు ఆ లైఫ్ చాలా బాగా నచ్చింది. మళ్ళీ నాకు అటువంటి లైఫ్ వస్తే ఛస్తే వదులుకోను.
@మాల గారు. అవును, తెలుగులోనే రాయాలి. కంప్యూటర్లో తెలుగులో రాసేందుకు చాలా పద్ధతులున్నాయి. అన్నిటికంటే సులభమైనది.
http://lekhini.org
మురళి said…
ఆలోచిస్తుంటే అర్ధమవుతోంది. అప్పుడప్పుడు తిట్టుకున్నా ఉద్యోగానికి ఎంతగా అలవాటు పడిపోయామో.. అయినా.. కష్ట పడకుండా వచ్చే డబ్బు సంతోషాన్ని ఇవ్వదు కాబట్టి, ఏ పని చేసినా సంతోషంగా ఉండలేనేమో.. మంచి టాపిక్ ఇచ్చారు..
Ramani Rao said…
మీకు వ్యాఖ్య రాద్దామనుకొన్నా కాని, అది పోస్ట్ అయ్యింది కాని చాలా ఆసక్తికరమైన అంశం.
Anonymous said…
బహుశా రిటైర్మెంట్ తరువాత ఏం చేస్తామో, ఈ పరిస్థితిలోనూ అదే చేస్తాము.

సుజాత గారు, బాగా చెప్పారు.
నాగ ప్రసాద్ గారు, మీరు చాలా అదృష్టవంతులు. మీ కీ భాగ్యం మళ్ళీ మళ్ళీ కలగాలని ఆశిస్తున్నాను.
ఇప్పుడు prioirty call నెపం తో తక్కువ సమయం కేటాయించబడ్డ నాకిష్టమైన పనులన్నిటికీ గడువు పొడిగిస్తాను. ఇంకా చేయని ఆసక్తికరమైన పనులు మొదలు పెడతాను. మీకింకో విషయం చెప్పాలి, ఇటువంటి పరిస్థితి వస్తుందని ఆశగానో, కోరికతోనో నేనపుడే నా ఆశయసాధనా మార్గంలో మొదటి అడుగు వేసాను. బహుశా అది నా మరో మానస పుత్రిక, గారాల పుత్రిక కావచ్చు. నాతోనే నేపోయేదాకా వుండిపోవచ్చు. మరి కొన్ని అనూహ్యమైన మార్పులు కాలం నా జీవితంలోకి తీసుకురావచ్చు. ఒకటి మాత్రం నిజం, వారానికే చిన్నదో, చితకదో మార్పు చేసుకునే నా దైనందిన జీవితం నాకెపుడూ నిస్సారమనిపించదు. నా మీద నాకు నమ్మకం అధికం, అదింతవరకు వమ్మూ కాలేదు.
అమ్మో! నేను ఇతర పనులతో ఎంత బిజీగా ఉన్నా, ఉదయం , రాత్రి పడుకునేముందు కనీసం అరగంట ఐనా నాకిష్టమైన పాటలు వింటాను.
ఏపని లేకుంటే నాకైతే పిచ్చెక్కుతుంది..
Sudhakar said…
Nice topic. Nenithe Loksatta party lo join avuthanu :)
థాంక్ యు.పాస్ అయ్యనా ?
Anonymous said…
ఉద్యోగం లేకుండా ఉంటే జీవితానికి పెద్ద అడ్డు తొలిగిపోతుందనీ, మనకి నచ్చేవీ, పదిమందికీ పనికొచ్చేవీ ఎన్నో పన్లు చేసుకోవచ్చనీ ఇరవైనాలుగ్గంటలూ కలలు కంటూనే ఉంటాను... కానీ కొంచం ఆత్మారావుణ్ణి తట్టి లేపి, ఇదే ప్రశ్న నిలదీసడిగితే మాత్రం సమాధానం వేరేగా వస్తోంది.

ఊహ తెలిసినప్పణ్ణించీ, వేసవి సెలవలు వస్తున్నాయి అని ఎదురు చూడ్డం, ఆ సెలవల్లో అది చేద్దాం, ఇది చేద్దాం అని ఉవ్విళ్ళూరడం, చివరికి సెలవలు ఎలా గడిచిపోయాయంటే.. ఏమో!

ఆ సెలవల్లాగే ఆదివారాలూ, ఇప్పుడైతే రెండ్రోజుల వీకెండ్లూ. ఎన్ని వీకెండ్లు గడిచాయి ఉద్యోగంలో చేరాకా? ప్రతీ వారం అది చేద్దాం, ఇది చేద్దాం అని ఎన్ని ప్లాన్లు వేసి ఉంటాను? అందులో ఎన్ని నిజంగా చేసి ఉంటాను!

కాబట్టి ’అలా సెలవలు దొరికితే ఏం చేస్తాం’ అన్న ప్రశ్న దండుగ అనిపిస్తుంది నాకు. జీవితమంతా సెలవలు దొరికినా ఇప్పటివరకూ గడిచిన సెలవలు ఎలాగో అవీ అలాగే.

ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడే నాకు జీవితంలో తారసపడ్డ కొందరు ప్రత్యేక వ్యక్తులు గుర్తొస్తారు. వాళ్ళు చూడ్డానికి చాలా అమాయకులు. నా అంత తెలివైనవాళ్ళు మాత్రం ఖచ్చితంగా కారు.

ఒకాయన మా నాన్నగారి స్నేహితుడు. ఎమ్మార్వోగా పనిచేసేవారు. ముగ్గురు చిన్నపిల్లలు. ఒకసారి ఆయనమీద కుట్ర జరిగి ఉద్యోగంలోంచి సస్పెండయ్యారు. ఖాళీ. మా ఊరుకి (వాళ్ళ అత్తగారి ఊరు) వచ్చి కుటుంబ సమేతంగా నెలలతరబడి ఉండిపోయారు. రోజూ రామకృష్ణామఠానికి వెళ్ళేవారు. మంచి పుస్తకాలు చదివేవారు. ధ్యానం చేసేవారు.

మా ఇంటికి ఆయనా, వాళ్ళావిడా కలిసివస్తే, ఆవిడ మా అమ్మదగ్గర దు:ఖపడుతూ ఉండేది. ఆయన మాత్రం నిబ్బరంగా ఉండేవారు. ‘ఇలా నా ఉద్యోగం పోకపోతే నేనింత చక్కగా ఈ పుస్తకాలన్నీ చదివి, ఇలా ధ్యానం చేసుకోగలిగేవాణ్ణా? ఎంత మంచి అవకాశం దొరికిందో చూడు. ఆ పుస్తకాల్లో చెప్పినవన్నీ మర్చిపోయి ఎందుకేడుస్తావు? అవన్నీ అబద్ధమని నీ ఉద్దేశ్యమా?’ అనేవారు ఆవిడతో. ఆయన మాటలకి మేము షాకయ్యేవాళ్ళం.

ఇంతకీ జరిగిందేమిటంటే, ఆయన మీద అభియోగాలు తొలగి ఆ ఉద్యోగం మళ్ళీ వచ్చింది. కానీ ఉద్యోగంలో చేరిన కొద్దిరోజుల్లోనే హఠాత్తుగా అయనకి హార్టెటాకొచ్చి పోయారు.

చేతిలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోగల ‘సంసిద్ధత’ ఉండడం చాలా గొప్ప విషయం. ఆ సంసిద్ధత ఉన్నవాళ్ళు ‘అప్పుడేం చేద్దాం’ అని ఆలోచించరు అనుకుంటాను.

నాకు తెలిసిన మరొకాయనకి వాళ్ళ గురువుగారు ఒక సూక్తి చెప్పారట. ‘గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్’. మృత్యువు నీ జుట్టు పట్టుకుని లాగేస్తోంది అన్న తొందరతో చెయ్యాల్సిన కర్తవ్యాన్ని నిర్వర్తించు అని దానికి భావం. ఆయన తన జీవితంలో ఆ సూక్తిని నూటికి నూరు శాతం ఆచరించారు. అదంతా చెప్పాలంటే పెద్ద కథ. కాబట్టి ఇక్కడికి ఆపేస్తాను.
రాఘవ said…
ఏదో ఒకటి చేస్తూనే ఉండాలండీ. లేకపోతే అస్సలేమీ తోచక వెఱ్ఱెక్కడం ఖాయం. మీరు మరీ ఇంత విడ్డూరమైన ప్రశ్న వేస్తారనుకోలేదు. కానీ ఆలోచించాల్సిన విషయమే. ఔనండీ, రిటైరైనవాళ్లకి ఏం తోస్తుందండీ?
శ్రీ said…
ప్రపంచాన్ని చుట్టేస్తాను.
నాగప్రసాద్ గారు - మీరు చేసిన పనే నేను కూడా అక్షరాలా ఆరు నెలలు చేసాను. తేడా ఏమిటంటే అపుడు ఉద్యోగం లేదు :). ఇప్పుడు అలా ఉండడం కష్టం. ఉద్యోగం చేయడం మొదలుపెట్టిన తర్వాతే జీవితాన్ని బాగా ఎంజ్యాయ్ చెయ్యవచ్చు అన్నది నా అనుభవం. ఉద్యోగాన్ని జీవితానికి అనుగుణంగా మలచుకోవాలి కానీ జీవితాన్ని ఉద్యోగానికి అనుగుణంగా మలుచుకుంటే సారాన్ని కోల్పోతాము. కొన్నిసార్లు తప్పదు!! ఒకటి మాత్రం నమ్ముతాను - Job is just a driving factor for life. It is not the life
అసలు మనసుకు నచ్చిన పనే మనము ఉద్యోగంలో చేస్తున్నప్పుడు మనకు ఎంత మాత్రం ఆ ఉద్యోగానికి కేటాయిస్తున్న సమయము మన వ్యక్తిగత జీవితాన్ని, సంతోషాన్ని హరించేస్తుంది అన్న భావన, జీతం కోసం చేస్తున్నాము అన్న ఫీలింగ్ బహుసా రాదేమో....జీతం కోసం ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం లేక పొతే మనసుకు నచ్చిన పని చేస్తాము...మన సన్నిహిత వ్యక్తులకే కాకుండా, ఎదుటివారి సంతోషాల్లో, భాదల్లో మరింత ఎక్కువ పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్నింటి కంటే ముఖ్యంగా రోజూ చేసే పని కొద్దిపాటిదైనా, ఆ రోజు చాలా సంతృప్తితో ముగుస్తుంది. పడుకున్న పది సెకనులకే మంచి నిద్ర పడుతుంది. ఇప్పుడు లాగ శని, ఆది వారములు మాత్రమే మనకోసం మనం బతుకుతున్నట్టు ఉండదు.

నా వరకు నేనైతే గిటార్ క్లాసులకు రోజూ ఒక గంట కేటాయిస్తాను. చిత్ర లేఖనం, గాత్రం మరింత సాధన చేస్తాను...ఏదైనా యాడ్ ఏజెన్సి లో ఫ్రీలాన్సర్ గా క్రియేటివ్ ఐడియాస్ విభాగంలో పని చేస్తాను.
నేనైతే ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాను,ఒక్కో ప్రదేశంలో కొన్నేసి ఏళ్ళు గడిపేస్తా జీవితాంతం నా అక్కౌంట్ క్లోజ్ అయిపోయేదాకా...
Sujata M said…
సంగీతం నేర్చుకుంటాను.
ప్రపంచాన్ని చుట్టేస్తా.
ఎక్కువ సేపు ఇంటర్నెట్టుతో గడుపుతాను.
ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభిస్తాను.
మంత్రం తీసుకుంటాను.
ఒక చిన్న తోట పెంచుతాను.
విశాఖపట్నానికి పెట్టేబేడా సర్దుకుంటాను.
అమ్మా నాన్నలకి తోడుగా ఉంటాను.
ఎక్కడైనా ఉచితంగా ఉద్యోగం కూడా చేసిపెడతాను.
Anil Dasari said…
పొట్టకూటి కోసం పన్జేసే పన్లేకపోతే ఎలా ఉంటుందో తెలీదుగానీ, ఏడాదికోసారి - ఎక్కువగా క్రిస్మస్ సీజన్లో - కంపెనీ షట్ డౌన్ ఉండేటప్పుడు నాకు పండగే పండగ. ఏకబిగిన రెండు వారాలపాటు సెలవలొచ్చేస్తాయి. అన్ని రోజులూ రోజుకు నాలుగైదు గంటలు పుస్తకాలు చదవటానికి (ఎక్కువగా చరిత్ర పుస్తకాలు, అదీ ఇంట్లో కాకుండా ఏ బోర్డర్స్ లోనో, స్టార్‌బక్స్ లోనో కూర్చుని చదివితే ఆ మజాయే వేరు), రెండు మూడు గంటలు పెయింటింగ్, ఇంకో రెండు మూడు గంటలు వీడియోలు తియ్యటం, లేదా తీసిన వాటిని ఎడిట్ చెయ్యటం, కొంత సేపు ఫొటోగ్రఫీ ఎక్స్‌పెడిషన్‌కి, సాయంత్రం కాసేపు క్రికెట్టాటకి, ఇంకాసేపు పియానో వాయించటానికి, కాసేపు ఏదన్నా రాయటానికి, ఇంకా టైముంటే ఓ మాంఛి సినిమా చూట్టానికి (అది ఫాంటసీయో, వెస్టర్నో అయితే బెటర్), ఇవన్నీ కాకపోతే నాకిష్టమైన ఏ ప్రదేశానికో ఊరికే అలా వెళ్లి రావటానికి .. అబ్బో అసలు టైముండాలేగానీ నేను బోర్‌గా ఫీలయ్యే ప్రసక్తే లేదు. ప్రపంచంలో అన్ని రకాల ఆసక్తికరమైన పన్లుంటే అవన్నీ వదిలేసి బోర్ బోర్ అనుకునేవాళ్లని చూస్తే నాకు బోలెడాశ్చర్యం!
నేనైతే ఊకదంపుడు :)

తిండికీ నిద్రకీ కాక ఇంకా టైము మిగిలితే అంబాన్నీల్ల సంపాదించలేదని ముందు తరాలని తిట్టటం...
ఇక్కడ ఇలా పుట్టించినందుకు దేవుడిని తిట్టటం..
అవినీతి అని , రోడ్లని వేయలేదని ప్రభుత్వాన్ని తిట్టటం...
అది కాకపోతే పరువుగా తన మానాన తను బ్లాగు రాసుకుంటున్నవాడిని చూసి తిట్టటం...
ఎన్ని పనులో...శుభలగ్నం సినిమాలో ఆమని చెప్పినట్టు
ఐనా మీకీ సందేహం ఇప్పుడెందుకొచ్చిందీ?, అంధ్రదేశం లో చదువు పేరిట, పోటీ పరీక్షలకి తయారవ్వటం పేరిట ఈ పనులుచేస్తున్నవారెవ్వరూ తారసపడలేదు?
ఏమీ చెయ్యను. కాదు కాదు ఏమీ చెయ్యలేని అశక్తుణ్ణవుతాను..

మొదటి కొద్దినెలలు మాబాగా ఉంటుంది ఆ తరువాత మొదలవుతుంది కధ. కష్టపడి సాధించిన దానికీ అప్పనంగా ఒళ్ళో పడ్డదానికీ రుచిలో చాలా తేడా ఉంటుంది..

అపర కుబేరుడయినా పని లేకుంటే పిచ్చోడవటం ఖాయం...
Ramani Rao said…
నిజానికి అలాంటి అవకాశమే రావాలి కాని (వస్తుందంటారా? నాకు కాస్త నిరాశావాదం ఎక్కువే) ఎన్నో పుస్తకాలు చదవాలి చదవాలి అని ఎప్పటికప్పుడు వాయిదా పడ్తోంది. పెళ్ళి కాకముందు బాగా చదివేదాన్ని. ఏళ్ళు గడిచిపోతున్నాయి, చదవాల్సిన పుస్తకాల సంఖ్య పెరిగిపోతోంది. కాబట్టి పక్కన కాలక్షేపానికి ఏ కారం బఠాణీలో పెట్టుకొని తింటూ ఒక్కో పుస్తకం చదవేస్తా. ఎప్పటినుండో ఇంకో చిన్న కోరిక ఉంది. మంచి మంచి ప్రదేశాలు చుట్టి రావాలి (ప్రపంచం అనేది పెద్ద ఆశే అవుతుంది) అది కూడా నేను మావారు మాత్రమే. పిల్లలు కూడా వద్దు అనుకొంటాను (ఎంత స్వార్థమో కదా నాకు) ఇవేమి కుదరదు కుదరలేదు అంటే ఎప్పటినుండో వేసుకొన్న ప్లాన్ ఏంటంటే ఏ సేవాశ్రమంలోనే చేరిపోయి శేష జీవితం గడిపేయడం.
మోహన said…
ఒక పుస్తకం నా బాగ్గు లో ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడూ చదవాలనిప్స్తే అప్పుడు చదవటనికి. ఇక పై ఒక పాకెట్ కామెరా కూడా ఉంచుకోవాలని అనుకుంటున్నాను. పాటలు పాడుకోవటానికి ఒక టైం అని లేదు. పెయింటింగ్ వేయటం పడుకోబోయే ముందు పని. ఇవి మాత్రం టైం ఉన్నా లేకపోయినా మారవు.

ఇకపోతే అంత టైం దొరికితే, అబ్బో చాలా ఉన్నాయండీ.. ఇది అని చెప్పను కానీ, ఇప్పుడు నా ఆఫీస్లో కుర్చీకి ఉన్న చక్రాలు అప్పుడు నా కాళ్ళకు కట్టేసుకుంటాను. సొంత వాహనం ఉపయోగించను. భారతదేశం మొత్తం తిరుగుతాను. అన్ని రకాల వ్యక్తుల్నీ కలుస్తాను. అలా తిరిగటం వల్ల ప్రస్తుతం నేను నా అభిరుచులు అనుకుంటున్నవి మారచ్చు. వేరే పని అన్నిటికంటే ఎక్కువ నచ్చవచ్చు. ముఖ్యమైనది అనిపించవచ్చు. అప్పుడు ఆ 'పని' ఖచ్చితం గా చేస్తాను అని మాత్రం చెప్పగలను.
Krishna said…
ఊద్యొగం ఉన్నా లేక పొయినా నాకు కొన్ని పనులు మాత్రం మానలేనివి. ఆవి సంగీతం(వినటం), సాహిత్యం(చదవటం). ఇంక తినటం పడుకోవటం మన దైనందింక జీవనం లో బాగాలే కాబట్టి పెద్ద గా చెప్పెది ఎమీ లేదు. ఇంక పొతే కొంచెం కాలి సమయం ఎక్కువ దొరుకుతుంది కాబట్టి నా అలవట్లలో ఒకటైన "కొత్త ప్రాంత దర్శనాన్ని" మరింతగా చెస్తాను. ఇంక సినెమా అన్నది నాకు మరొక విశ్రాంతి మంత్రం ఇంక అది కూడా బగనె జపిస్తూ ఉంటాను.
asha said…
నేను పిచ్చాసుపత్రిలో జాయిన్ అవుతాను.
అదే నన్ను జాయిన్ చెయ్యాల్సి వస్తుంది.
నేనైతే దారీతెన్ను లేనిగాలిపటంలా ఎప్పడికేది తోస్తే అది చేస్తా.ఈ టైం ప్రకారము పనులు చేయాలంటే మా చెడ్డచిరాకు.
Hima bindu said…
బాగుందండి ప్రశ్న , రెండు రోజులు ఇంట్లో వున్నాను అంటే మనస్సంత గజిబిజిగా వుంటది ,నాకు ఏదో కోల్పోతున్న భావన .ఖాళీ దొరికితే ఫలానా పని చేసుకోవాలి అనుకుంటాన ,వుహు అది కుడా క్రమంలో చేయను . ఎప్పుడు ఏదొకటి సర్దుకుంటూ {ఇల్లు}పుస్తకాలు చదువుతూ , ఇష్టమైన పాటలు వింటూ గడుపుతాను.చిన్ని వుంటే ఇద్దరం బోల్డన్ని కబుర్లు చెప్పుకుంటాము ,అలానే నాకిష్టమైన ఫ్రెండ్స్ తో ఫోన్ లో కబుర్లు ,పక్క వీధి లోనే అమ్మ వాళ్ళుంటారు కాబట్టి ఏదో టైం లో అక్కడికెళ్ళి అక్కడ ఏ చెట్టు పూసిందో , ఏ చెట్టు కాసిందో చూసి ,కావలసినవి కోసుకుని ,ముఖ్యమ్గా పూలని బ్రతకనివ్వను {అదే మా ఇంట్లో ఒక్క పువ్వుకోయడానికి నా చేతులు రావు }నేను నడిచే దారి లో ఏ ఇంటి గోడ బయటికి పూలు వాలిన మనం స్వాదినం తప్పి దొంగతనం చేసేస్తాం ::)
మనం ఏం .ఏ సోషల్ వర్క్ చదివాం కాబట్టి వద్దునుకున్న సమాజం గురించి ఆలోచిస్తో ఏదొకటి చేయాలనిపిస్తోంది కాబట్టి నా పరిధి లో నచిన కార్యక్రమాలు చేస్తాను తప్పకుండ .చేయాల్సినవి చాలానే
వున్నాయండి .నిజానికి ఏదో సాధించాలనే తపనతోనే ఈ వుద్యోగం .
bharath said…
జీతం కోసం ఉద్యోగం అది లేనపుడు
జీవితం కోసం సద్యోగం [ అదే మంచిపనులతో కాలక్షేపం ] చేస్తానేమో
ఆలోచించాల్సిన విషయమే
regards
jayabharath
ఎంటో! నేనెప్పుడ్డూ, వృత్తికి సంబంధించినవాటి గురించి కాకుండా, ప్రవృత్తికి సంబంధించిన విషయాల గురించే ఎక్కువ ఆలోచిస్తాను. ముఖ్యంగా నూతన ఆవిష్కరణలు, , DIY(do it yourself) లాంటి విషయాల మీద. ఇప్పటికైతె, వచ్చిన ఆలోచనలన్నిటినీ, google docs లో ఎప్పటికప్పుడు చిన్న వివరణలు, URLs తో, రాస్తూపోతున్నాను. సమయం (ముఖ్యంగా అవి చెయ్యడానికి డబ్బులు) దొరికినప్పుడు వాటిని అమలుపరచడానికి. ఒక్కొక్కసారి, మనం అనుకున్నపనులు చెయ్యడానికి, ఒక జీవితం సరిపోదు అనుపిస్తుంది.
Anonymous said…
nagamurali, interesting post.
pi said…
ఏదొ social causesకి పని చేస్తాను. విద్య, స్త్రీలు, ఆరోగ్యం, పర్యావరణం కి సంభందించిన పనులు చేస్తాను.
మిడ్వెస్టులో ఒక పొలం కొనుక్కుని మా జేజినాయిన అన్నట్టు కాడికి పోతాను
Vasu said…
ఈ విషయం లో ఆర్ట్స్ కెరీర్గా తీసుకున్న వాళ్ళను, ఉద్యోగం జీతం కోసం కాక ఇష్టం వల్ల చేసేవాళ్ళను చూస్తే అసూయ గా ఉంటుంది.
Chellayi said…
నేనైతే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ వుంటా. పాటలు వినడం, వంట ఇలాంటివి ప్రత్యేకంగా చెప్పుకో దగ్గవి కావేమో. వంటరిగా కూర్చుని వూహల్లోకి వెళ్ళిపోవడం నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి విషయాలు తలుచుకుంటూ, నాలో నేనే నవ్వుకుంటూ, వూహకందని లోకల్లో విహరించడం నాకిష్టం. వూహించినవి అన్నీ అందరితో పంచుకోవాలని కోరిక. కానీ టైపు చెయ్యడం చాలా చాలా బద్దకం.