తానా బహుకరిస్తున్న గిడుగు రామమూర్తి స్మారక పురస్కారం

ప్రళయకావేరి ..
ఈ పేరెక్కడో విన్నట్టుగా ఉందా?
చిన్నప్పుడు సాంఘిక శాస్త్రంలో ఆంధ్ర ప్రదేశ నైసర్గిక స్వరూపం పాఠాల్లో చదువుకొని ఉంటారు, పులికాట్ సరస్సు గురించి.
ఆ సరస్సు ప్రాంతాన్నీ అక్కడి ప్రజల్నీ సజీవంగా తన కథల్లో నిలుపుతూ ప్రళయకావేరి కథల్ని సృష్టించిన అక్షర బ్రహ్మ శ్రీ స. వెం. రమేశ్.
ఈ కథల్ని మొన్నీ మధ్యనే పుస్తకం.నెట్ లో సిరిసిరిమువ్వ గారు పరిచయం చేశారు.
2003లో గిడుగు రామమూర్తి పంతులుగారి స్మృతిలో తానా ఏర్పాటు చేసిన పురస్కారాన్ని 2009 సంవత్సరానికి గాను స.వెం. రమేశ్ గారికి ఇస్తున్నారు. తెలుగు భాషోన్నతికి, వికాసానికి కృషి చేసిన వ్యక్తులకి రెండేళ్ళకోసారి ఈ పురస్కారాన్ని ఇస్తారు.

వీరి కుటుంబ మూలాలు నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట ప్రాంతంలో ఉన్నా, వీరి తండ్రి ఉద్యోగ రీత్యా తమిళనాడులో స్థిరపడ్డారు. రమేశ్ తమిళనాడులోనే పుట్టి పెరిగారు. తన పదహారవ ఏట తెలుగు నేర్చుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ కు వెలుపల ఉన్న తెలుగు వారు తమ మాతృభాషకు దూరం కావడం ఆయన స్వయంగా అనుభవించారు. ఇదే ఆయన్ని తెలుగు భాషా ఉద్యమకారునిగా తీర్చి దిద్దింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో ఇతర రాష్ట్రాల్లో ఉండిపోయిన తెలుగు కుటుంబాలకి భాషా పరంగా జరుగుతున్న అన్యాయం వీర్ని ప్రభావితం చేసింది.

తమిళ, కర్ణాటక, కేరళ, ఒరిస్సా రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు అధికంగా నివసించే ఊళ్ళన్నీ పర్యటించి అక్కడి స్థితిగతుల్ని అధ్యయనం చేశారు. అక్కడ విరిసి ఉన్న తెలుగు భాషా సంపదని సేకరించారు. తమిళనాడులో 100 గ్రామాల్ని ఎంచుకుని సుమారు 5000 మంది కార్య కర్తలకి తెలుగు చదువనూ రాయనూ నేర్పించారు. ఇందుకు గాను భాషాశాస్త్రవేత్తలతో సంప్రదించి తగిన పాఠ్య ప్రణాళికనూ, పాఠ్యాంశాలనూ రూపొందించారు. ప్రభుత్వ స్థాయిలో ఉద్యమించి మూత బడిన తెలుగు పాఠ శాలల్లో 280 పాఠశాలల్ని తిరిగి తెరిపించారు. స్థానిక ప్రజా ప్రతినిధులకి ఈ సమస్యలపై అవగాహన కలిగేటట్లు కార్యక్రమాలు నిర్వహించారు. తమిళ కర్ణాటక రాష్ట్రాల్లో సజీవంగా ఉన్న తెలుగు వారి కళారూపాల్ని సేకరించి 2007 లో హోసూరులోనూ, 2008 లో తిరుచిరాపల్లిలోనూ తెలుగు జానపద కళా మేలాలను ఒంటి చేత్తో నిర్వహించారు.

చెన్నై పచ్చయప్ప కళాశాలలో ఏంత్రొపాలజీ ఎమ్మే పట్టం పొందిన శ్రీ రమేశ్ ఉద్యోగ రీత్యా హోసూరులో నివసిస్తున్నారు. ఇంతా చేసి ఈయనకి నలభయ్యేళ్ళు కూడా లేవు! నేను గమనించిన ఇంకో విషయం .. ఈయన తన పేరు ముందున్న పొడి అక్షరాల్ని ఎక్కడా ఆంగ్లంలో రాసుకున్నట్టు చూళ్ళేదు!!

మన తెలుగు బ్లాగ్లోకం తరపున శ్రీ స.వెం రమేశ్ గారికి అభినందనలు ప్రకటిస్తున్నాను. ఈ పురస్కారంతో వచ్చే నగదు బహుమతి ఆయన నిర్వహిస్తున్న బృహత్కార్యాల్లో గమనార్హం కాకపోవచ్చు. కానీ ఈ పురస్కారం వల్ల వచ్చే గుర్తింపు ప్రపంచ వ్యాప్తంగా వారికి సహాయ సహకారాలు అందేటట్లు చెయ్యగలదని నా ఆకాంక్ష.

ఎప్పుడైనా లేనిదాన్నే మిస్సవుతాం కాబోలు. పరాయి రాష్ట్రంలో పుట్టి పెరిగి నివశిస్తూ ఆయన నా భాషో అని తపన పడిపొయ్యారు.

ఈ బంగారు గడ్డ మీద పుట్టి పెరిగి ఈ తేట తెలుగులో చదువుకున్న మనం .. ఆ తెలుగులో యేవుంది మయ్యాస్ అని దాన్ని మురుక్కాలవలో పారబోసేందుకు సిద్ధంగా ఉన్నాం!

(శ్రీ రమేశ్ గారి జీవిత విశేషాల గురించి కార్యకలాపాల గురించి తెలియ జేసినందుకు తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు డా. జంపాల చౌదరిగారికి ధన్యవాదాలు.)

Comments

తెలుగు జాతి మూలాలకై తపిస్తూ తెలుగు వ్యాప్తికై కృషి చేస్తున్న సామల వెంకట రమేష్ గారి వ్యాసాలు తెలుగుపీపుల్.కాం లో ఉన్నాయి. మనకి తెలీని ఎన్నో విషయాల్ని ఆయన ఈ వ్యాసాల్లో రాశారు. కింది లంకెని చూడండి.

http://www.telugupeople.com/discussion/userArticles.asp?userId=CV_RAMESH

అందులో మీరు చెప్పిన "ప్రళయ కావేరి కధలు" - కింది లంకెలో చూడండి.

http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=22714&page=1
రమేశ్ గారికి మనఃపూర్వక అభినందనలు..

ఈ కధలు ఆ మధ్య ఆంధ్రప్రభలో వరుసగా ప్రచురించారు.. అవి చదువుతుంటే అక్కడే పుట్టి పెరిగిన వ్యక్తి రాసినవిలా అనిపించేవి.. ఆ పాత్రలు అంత సహజంగా ఉంటాయి.. ఆయన పదహారో యేట తెలుగు నేర్చుకుని ఇంతటి హృద్యమైన కధల్ని అందించారంటే నమ్మశక్యంగా లేదు! ఆయన భాషాభిమానానికి నమస్సులు!

ఇంతటి మంచి విషయం మా కళ్ళన వేసినందుకు మీకు ధన్యవాదాలు :-)
శ్రీ స.వెం.రమేశ్ గారు చేసిన, చేస్తున్న భాషా సేవకి గిడుగు పురస్కారం చాలా ఉచితమైనదే. చెన్నైలో జరిగిన తెలుగు సభలలో అతని ఉపన్యాసం ప్రత్యక్షంగా వినే అదృష్టం నాకు దక్కింది. తెలుగు భాషపై అభిమానం, తపన అణువణువునా అతనిలో కనిపించాయి. తమిళనాట యే యే ప్రాంతాలలో ఎంతమంది తెలుగు వాళ్ళున్నారో, వాళ్ళ చరిత్ర ఏమిటో, వాళ్ళ భాషలోని వైవిధ్యం ఏమిటో అతను వివరిస్తూ చెప్తూ ఉంటే అలా విస్మయంతో వింటూ ఉండిపోయాను!
Publicity అసలు ఇష్టపడని అతను ఒక నిశ్శబ్ద సైనికుడు.
visalakshi said…
తెలుగు జాతి మనది. ని౦డుగ వెలుగు జాతి మనది అని గొ౦తెత్తి ఆన౦ద౦గా పాడుకోవాలపి౦చి౦ది ఈ టపా చదవగానే.సామల వె౦కట రమేష్ గారికి అభిన౦దనలు.మీకు నా ధన్యవాదాలు.
Bolloju Baba said…
అవును భైరవభట్లగారు చెప్పినట్లు రమేష్ గారు మంచి వక్త. ధారాళమైన భావస్రవంతిలో ఓలలాడవలసిందే వీరుమాట్లాడుతుంటే.

సోమసుందర్ లిటరరీ ట్రస్ట్ తరపున వీరికి సన్మానం చేయటం జరిగింది. అపుడు వీరి ఉపన్యాసం ఆద్యంతం ఎంతో భావోద్వేగంతో సాగింది.

తమిళనాడులో తగ్గిపోతున్న తెలుగు స్కూళ్లగురించి, తెలుగువారికి జరుగుతున్న అవమానాలగురించి వారు చెపుతుంటే చాలా విస్మయం కలిగింది. కట్టబొమ్మన విగ్రహాన్ని విరగ్గొట్టటం వంటి ఉదంతాలు.

తనలాంటి వారిని ప్రవాసాంద్రులు అని జమకట్టటాన్ని కూడా వీరు తప్పుపట్టారు.

ప్రళయకావేరి కధలు నాస్టాల్జిక్ మెమొరీస్ గా ఉంటాయి, ఆ తదుపరి కధలు మరింత సామాజిక ప్రయోజనాత్మకంగా వ్రాయాలి అని తనని తాను బేరీజు వేసుకోవటం కూడా అచ్చెరువు కలిగించింది.

వీరు చెప్పిన మరో సంఘటన
సుమారు ఇరవై సంవత్సరాల క్రితం వీరు కృష్ణ శాస్త్రిగారి సొంతవూరు వెళదామని కాకినాడ వచ్చారట. డబ్బులు పోయాయట. ఎవరో పెద్దాయన విషయం తెలసుకొని, కృష్ణ శాస్త్రిగారి వూరిలో ఎవరూ ఉండటం లేదు అని వివరించి తన ఇంటికి తీసుకొని వెళ్ళి భోజనం పెట్టించి, చేతికి యాభై రూపాయిలు ఇచ్చి, మద్రాసువెళిపోమ్మని రైల్వే స్టేషను కు వెళ్ళే బస్సెంక్కించారట. ట్రైన్ టికట్ డబ్బై రూపాయిలు. మిగిలిన డబ్బులకోసం తన ఫాంటు షర్టు లను ఒక రిక్షా వానికి అమ్మి టికెట్ కొనుక్కుని వెనుతిరిగారట.
Anonymous said…
I would like see his photo. could you please provide it, incase if you have.
శ్రీ said…
వెంకట రమేష్ గారి కృషికి నా వందనములు.
Anonymous said…
ప్రవాసాంధ్రులు అంటే ఒక్క అమెరికాలోను, ఒక ఐరోపా ఖండంలోను ఉన్న ఖరీదైన టెల్గు వాళ్ళు మాత్రమే కాదు.భాష మీద తమ సంస్కృతిమీద అభిమానాన్ని ప్రేమని చంపుకోలేక, ఉన్న సభ్య సమాజంలో ఇమడలేక బాధ పడుతున్నవారిని చూస్తే తెలుస్తుంది.
రక్తం ఉడికి పోతుంది. కొన్ని జీవీతాలు, జీవితాలు చిద్రమై పొయీనవి. కాని ఆంధ్ర భూమిలో ఉన్న తెలుగువాడు, ఆంగ్లానికి, ఇప్పుడు హిందికి అమ్ముడు బోతున్నారు.
చీచీ, ఇక్కడికెందుకు వచ్చాను అని అనుకుంటూ, గుడ్లలో నీళ్ళూ కుక్కుటుంటున్న వారిని చూస్తుంటే, కదుపు రగిలి పోతుంది.
తెలుగు అభిమానులారా, మీరు ఈ ఆంధ్రదేశానికి రావద్దు.
మీరున్న చోటునే ఉండి పొండి.
అంధ్రప్రదేశ్ లో తెలుగు పుచ్చి పోయింది.
అంధ్రప్రదేశ్ లో తెలుగు చచ్చి పోయింది.
దూరపు కొండలు ఎప్పుడూ నునుపే!
Ramani Rao said…
వె౦కట రమేష్ గారికి అభిన౦దనలు.
SAMEEHA said…
మాతృభాషాభిమానం కూడా సంస్కారంలో ఒక భాగమే అని గుర్తెరిగితే తెలుగు భాష వృద్ధి చెందుతుంది. ఎందఱో మహాను భావులు.
రమేష్ గారికి అభినందలు.
కొత్తపాళీ వారికి ధన్యవాదాలు.