కబుర్లు .. రెండ్రోజులాలస్యంగా

ఎన్నాళ్ళొ వేచిన ఉదయం .. మొత్తానికి వచ్చేసింది. చారిత్రాత్మక నిర్ణయంగా అమెరికా దేశ పౌరులు ఎన్నుకున్న నలభై నాలుగవ అధ్యక్షునిగా బరాక్ ఒబామా ప్రమాణ స్వీకారం చేశారు. కనీ వీనీ ఎరుగని రీతిలో దేశం నలుమూలల నించే కాదు, ఇతర దేశాల నుండి కూడా కేవలం ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు అనేకులు విచ్చేశారుట. అక్కడ కేపిటల్ భవనం ముందు కూడుకున్న సమూహంలోనూ, తమతమ ప్రదేశాలనించి టీవీలో, అంతర్జాలంలో చూస్తున్న ప్రజలలోనూ పెల్లుబికే విజయోత్సాహం కంటే, ఒక విధమైన గంభీరంతో కూడిన ఆశాభావం మాత్రమే వ్యక్తమవుతూ వచ్చింది రోజంతా. నూతన అధ్యక్షునిగా ఒబామా చేసిన ప్రసంగంలో కూడా, ఏ విధమైన విజయ గర్వం కానీ, గతించిన ప్రభుత్వం పట్ల అసహనం కానీ తొణక్కుండా, తమ ప్రభుత్వానికీ, ఈ దేశానికీ ఎదురుగా ఉన్న కొండంతలేసి సమస్యల్ని గుర్తిస్తూ వాటిల్ని అధిగమించగలమనే దృఢమైన కార్యదీక్ష మాత్రమే ప్రకటించారు.

యాదృఛ్ఛికంగా నిన్ననే మార్టిన్ లూథర్ కింగ్ గారి సంస్మరణ దినం కావడం, ఎన్నో సార్లు ఇంతకు ముందు విని ఉన్నా, నిన్న మళ్ళీ రేడియోలో వినడం ఈ సందర్భంలో ఒక ప్రత్యేకతని సంతరించుకుంది.

తెలంగాణా జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలని రికార్డు చేసుకోవడమే కాకుండా వాటి గురించి సమచార వ్యాప్తి జరగాలి అనే సదుద్దేశంతో ఒక చిన్న సినిమాల పోటీ జరుపుతున్నారు డిస్కవర్ తెలంగాణా వారు. పోటీ వివరాలకి ఫిలిం తెలంగాణా గూడుని దర్శించండి. ఔత్సాహికులకి ఇది మంచి అవకాశం.

కౌముది జాల పత్రిక వారు రచన అచ్చు పత్రికతో కలిసి తెలుగు కథానికల పోటీ నిర్వహిస్తున్నారు. వివరాలిక్కడ.


పలు సంవత్సరాలుగా అమెరికాలో తెలుగు సాహిత్య సేవ చేస్తున్న వంగూరి ఫౌండేషను వారు ప్రవాసాంధ్రుల తెలుగు రచనల పోటీని ప్రకటించారు. కథానిక, కవిత, వ్యాసము, నవల ప్రక్రియల్లో ఈ పోటీ జరుగుతుంది. భారతదేశానికి బయట నివాసమున్న తెలుగు రచయితలందరూ పాల్గొనేందుకు అర్హులే. వివరాలు పై లంకెలో చూడొచ్చు.

ఈ సారి అసలే ఆలస్యమైన కబుర్లు అన్నీ ప్రకటనల సర్వీసుగా మారిపోయినట్టుంది.
పోనీ, ఈ సారికిలా కానిచ్చెయ్యండి. వచ్చే వారం సరైన సమయానికి కరకరలాడే తాజా కబుర్లతో మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తూ ..

Comments

అబ్బే కబుర్లింత చప్పగా వుంటే అసలే సమయాభావంతో సతమయ్యే మాబోటివారం మళ్ళీ మళ్ళీ రావాలా వద్దా మీరే చెప్పాలిక, కొత్తపాళీ గారు :)
Ramani Rao said…
కనురెప్పవేయకుండా ఒబామ ప్రమాణస్వీకరం చూసిన వాళ్ళల్లో నేను ఒకదాన్ని. ఆమెరికా వాళ్ళ ఆశలసౌధం, ఈ శ్వేతసౌధంలో వెలసిన మొట్టమొదటి ఆఫ్రీ-అమెరికన్ రేడు అని అంటున్నారు. ప్రపంచం అంతా కూడా అసక్తిగా అమెరికా వైపు, ఒబామా పరిపాలన వైపే దృష్టి సారించిదిట కదా.
Naga said…
ప్రమాణస్వీకారాన్ని మా ఆఫీసులో పెద్ద తెరలపై(స్క్రీన్స్), విహారిణులపై చూసేందుకు ఏర్పాట్లు చేసారు. అద్భుతమైన అనుభవం.