కబుర్లు - జనవరి 26

బ్లాగ్మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
మాతృదేశం విడిచి వచ్చాక గుర్తుంచుకోడానికి అతి కష్టమైన పండగలు ఈ రెండూ. ఇంకా దసరా దీపావళీ ఇత్యాదులకి స్థానిక పచారీ కొట్టువాడూ, పూటకూళ్ళవాడూ ఏదో ప్రత్యేక అమ్మకాలు తగ్గింపు ధరలు పెడతారు. అదీ కాకపోతే స్థానిక దేవాలయమైనా ఘోషిస్తుంది, ఒరే నాయనా, పండగొస్తోందిరా అని. పాపం, దేశానికి సంబంధించిన పండగలకి మాత్రం ఎవరూ గోల పెట్టరు. ఆఖరికి భారతీయ దౌత్య కార్యాలయం కూడా .. ఆ రోజు మా ఆఫీస్కి సెలవ అని బుల్లి అక్షరాల్లో ఒహ నోటీసు పెట్టడం తప్ప ఏమీ అట్టహాసం చెయ్యదు.

నాకు స్కూల్లో ఉండగా ఈ గణతంత్ర దినోత్సవం కథా కమామిషు ఏంటో సరిగ్గా అర్ధమయ్యేది కాదు. స్వాతంత్ర్య దినోత్సవం .. బ్రిటీషు వాళ్ళ మీద గాంధీ గారు సత్యాగ్రహం చేసి గెలిచారు, దేశమాతని దాస్యవిముక్తని చేశారు .. అందులో డౌటేమీ లేదు. ఈ గణతంత్రం గోలేంటో అర్ధమయ్యేది కాదు. మనది ప్రజాస్వామ్యం .. ఇందులో మళ్ళీ గణతంత్రం అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేంటీ అని.

ఇలాంటి విషయాలు అమెరికా వచ్చాక, కూసింత అమెరికా, తదితర పాశ్చాత్య దేశాల చరిత్రలు చదివాక కాస్త వంట బట్టింది. రాచరికానికి పెద్ద పీట వేసి పట్టంకట్టే (శ్లేషని మన్నించండి) మన భారతీయ సంస్కృతిలో .. స్వాతంత్ర్యానంతరం ఆ రాచరిక వ్యవస్థని కాదని గణతంత్ర వ్యవస్థగా స్థిరపడేందుకు నిర్ణయించుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. ఎంత గొప్ప అంటే, నిజానికి ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైన అహింసా మార్గంలో సాధించుకున్న మన స్వాతంత్ర్యం ఒక ఎత్తైతే, ఈ నిర్ణయం దానికి సరితూగే ఇంకో ఎత్తన్న మాట. ఆలోచించండి. మనువు దగ్గర్నించీ, రకరకాల రాచరికాలు, రాజ వంశాలు. చక్రవర్తులు. రాచఠీవి, రాజుల సాహసౌదార్యాలు, నా విష్ణుః పృథివీ పతిః అని నానుడి కూడాను. ఇంత బలంగా మన చరిత్రలో సంస్కృతిలో వేళ్ళూనుకుని ఉన్న రాచరిక వ్యవస్థని కాదని .. కొత్తగా పుట్టిన ఈ దేశం ప్రగతి వేపు కొత్త చూపే చూస్తోందని తమని తాము గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకోవడం నిజంగా అద్భుతమైన విషయమే. గణతంత్ర దినోత్సవమంటే రాజధానిలో జరిగే కవాతూ, తత్సంబంధ సైనిక ఆయుధ బల ప్రదర్శనమూ కాదు; అందరమూ మన దేశ గణతంత్ర వ్యవస్థని రూపు దిద్దిన మహనీయుల ఆలోచనల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం మంచిది.

హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఈతెలుగు సాధించిన విజయాల్ని పురస్కరించుకుని బ్లాగుల్లోనూ, తత్సంబంధ గుంపుల్లోనూ తెలుగు భాషాభివృద్ధికి మరింత విస్త్రుతంగా పని చేద్దామని కార్యాచరణ ప్రణాళికల రచనకై కొంత చర్చ జరుగుతున్నది. ఇదంతా వ్యక్తిగత స్థాయిలోనూ, సంస్థాగత స్థాయిలోనూ చెయ్యగల పనులను గురించి కాదు. త్వరలో రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఎన్నికల ఎజండాలో భాషాభివృద్ధి కూడా ఒక ముఖ్యాంశం కావాలన్నది ఇక్కడి ప్రధాన ఆశయం. సురేష్ అనే యువబ్లాగరి 7 అడుగుల పథకాన్ని ప్రతిపాదించారు. నరసింహ గారు దానిమీద మరికొంత విస్తరించారు. ఆంధ్రామృతం రామకృష్ణ గారు ఈ పథకాల్ని సమర్ధిస్తూ పద్యమాలిక కూడా రచించారు.


చాలా రోజుల బ్లాగ్విరామం తరవాత కాస్త సమయం చిక్కి బ్లాగ్లోకంలోకి తొంగి చూడగా ఈ ఆణిముత్యం కంట పడింది.

మొన్నీ మధ్యన ఆంధ్రజ్యోతిలో అరుణ గారి కథ చదివినాక ఆ కథలో అదితిలాగా స్త్రీపురుష సంబంధాల పట్ల కొంత తెగువ చూపిన తెలుగు కథానాయికల్ని గుర్తు చేసుకుంటుంటే, మిత్రుడు అక్కిరాజు సృష్టి నందిని గుర్తొచ్చింది. ఆ కథ వచ్చిన కొత్తల్లో సమీక్షిస్తూ "నందిని వంటి యువతి నాకు నిజజీవితంలో తారసపడితే ఆమె నా స్నేహితురాలని చెప్పుకోవడానికి చాలా గర్విస్తాను" అని రాసుకున్నాను. మీరూ నందినిని పరిచయం చేసుకోండి. కథ నచ్చితే (నచ్చకపోయినా) అక్కడే ఓ మాట చెప్పండి, మా మిత్రుడు సంతోషిస్తాడు.

చివరిగా ఒక్క మాట. బ్లాగడం మనందరికీ ఒక గొప్ప శక్తినిస్తోంది. ఒక వేదికనీ ఆ వేదిక మీద మాట్లాడేందుకు గొంతునీ ఇస్తోంది. ఆ శక్తి సామాన్యమైనది కాదు. గొంతులు నొక్కి వెయ్యబడే ఉక్కు పిడికిళ్ళ రాజ్యాల్లో సమయం గడిపి వచ్చిన వారిని అడగండి ఇది ఎంత అపురూపమైన శక్తో! దాన్ని సద్వినియోగం చేసుకుందాం. చర్చ ముఖ్యం .. ఆలోచనలు పంచుకోవడం ముఖ్యం. విభిన్నమైన ఆలోచనలు బయటికి రావడం, నిర్భయంగా స్వేఛ్ఛగా వ్యక్తీకరించ బడటం ముఖ్యం. ఆలోచనల్తో విభేదించడం తప్పు కాదు. అవసరమైతే విమర్శించడం కూడా మంచిదే. కానీ మన మాటలు ఒకరిని కించ పరచరాదు. జుగుప్సా కరమైన భాషా, వ్యక్తీగతమైన దాడులూ, అశ్లీలపు రాతలూ ఎవరికీ ఉపయోగం కావు. పూని ఏదైన ఒక్క మేల్ కూర్చి జనులకు చూపవోయ్ అన్న మహాకవి బోధని మనసులో పెట్టుకుందాం. ఏదన్నా పనికొచ్చే పని చేద్దాం.

Comments

గురువు గారూ..
మీ కబుర్లు బాగున్నాయి.
మీరు చెప్పిన 'నందిని' కథ నాకు కూడా నచ్చింది.
మంచి కథని గురించి తెలియచేసినందుకు ధన్యవాదాలు.
Bolloju Baba said…
ఏదో బ్లాగులో వ్రాసారు
స్వాతంత్రదినమంటే అంటే స్వతంత్రం వచ్చిన రోజు, గణతంత్ర దినమంటే ఆ వచ్చిన స్వతంత్ర్యాన్ని ప్రకటించుకొన్న రోజు అనట.
ఈ నిర్వచనమేదో బాగుందనిపించింది

ఈ రోజు మాకాలేజీలో ఇవ్వబడిన ఆరు స్పీచులలో అంబేద్కర్ పేరు ఉటంకింపబడలేదని ఒక మాస్టారు బాధపడ్డారు. సబబే అనిపించింది.
Anonymous said…
"నందిని"ని పరిచయం చేసినందుకుగాను ధన్యవాదములు.
రాధిక said…
మొన్న డిస్కషన్స్ లో రిపబ్లిక్ డే గురించే మాట్లాడుకున్నాము.అప్పుడొకాయన అన్నారు మీ ఎవరికీ అనిపించట్లేదా మనం ఇప్పుడూ రాచరికం క్రింద బ్రతకడానికే ఇష్టపడుతున్నామని అని.ఇక్కడ రాచరికం అంటే రాజులూ,రాజ్యాల గురించి కాదు.నెహ్రూ- ఇందిరా-రాజీవ్-సోనియా...సరిపోక రాహుల గురించి ఎదురు చూపులు.లేదంటే ఎన్ టీఆర్ ఆయన తరుపు బాలయ్య.ప్రతీ దానినీ వంశపారంపర్యం చేసేస్తున్నాము.సినిమాల్లోకి వెళితే ఒకడు-వాడి కొడుకు[బూతు కాదు]-మనవడు.....
1927 జనవరి 26 న జరిగిన కాగ్రెసు జాతీయ సదస్సులో , "స్వతంత్ర ప్రతిపత్తి" కలిగిన బ్రిటీష్ రాజ్యం కంటే, బ్రిటీష్ వాళ్ళ ఊసేలేని "సంపూర్ణ స్వరాజమే" మా లక్ష్యం అని తీర్మానం చేసారు. అదీ ఆరోజు ప్రత్యేకత. అందుకే రాజ్యాంగాన్ని లిఖించిన తరువాత దాన్ని అమలులోకి తేవటానికి 1950 జనవరి 26 ని ఎన్నుకున్నారు. అలా జనవరి 26 మన రిపబ్లిక్ డే అయింది.

ఇక పోతే మీర్రాసిన ఆఖరిపేరా అక్షర సత్యం.
GIREESH K. said…
చిన్నప్పుడు, గణతంత్రదినోత్సవమంటే, స్కూల్లో జరిగే జెండాపండుగ, ఉపన్యాసాలు ఆ తరువాత పంచే మిఠాయిలు, ఆ రోజు స్కూలుకు యూనిఫారంలో వెళ్ళక్కర్లేదు. ఆ తరువాత కాలేజీలో గణతంత్ర దినోత్సవమంటే, ఒక శలవు దినం. ఆ తరువాత, ఎయిర్ ఫోర్సులో పనిచేసే రొజుల్లో, ఒక సంవత్సరం, డిల్లీలో జరిగే కవాతు(పరేడ్)లో పాల్గొన్నాను. దానికోసం, దిసెంబరు చలిలో, దాదాపు రెండు నెలల పాటు, రోజూ ఉదయం మూడుగంటలకే ప్రాక్టీసు. దెబ్బతో ఆ రోజంటే భయం పట్టుకుంది.

ప్రస్తుతం, గణతంత్ర దినమంటే, ఓ రోజు శలవు, కార్లో పెట్టుకోవడానికి కొనుక్కునే చిన్న జెండాలు, టీవీలో చూసే కవాతు...ఇంతే. దురదృష్టవసాత్తూ, గణతంత్ర దినం ఇంతకుమించి ఏ స్పూర్తినీ రగిలించట్లేదు.

ఆస్ట్రేలియా మీదో, పాకిస్తాన్ మీదో క్రికెట్టు మ్యాచ్ గెలిచినప్పుడు, ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడొ, కాసేపు దేశం గురినిచి పలవరించి, మళ్ళీ మర్చిపోతున్నాం. I am sorry for sounding so pessimistic.


ఇకపోతే, చివరిగా మీరు రాసింది అక్షరసత్యం. Our existance is through co-existance of all అన్న విషయం మరచిపోయి, ఎంతో సమయాన్ని, శక్తినీ వెచ్చించి రాసే వ్రాతలు, ఇలా వ్యక్తిగత దాడులకు, విమర్శలకూ, పంతాలూ, పట్టింపులకూ ఉపయోగించబడడం విచారకరం.
Anonymous said…
’నందిని‘ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు, ఒకమ్మాయి దృష్టి కోణం నుంచి చూసి అక్కిరాజు ఇంత విపులంగా రాయడం నాకు నచ్చింది.
నిజ్జంగా నిజమండి, ఓ ఆణిముత్యాన్ని చూపారు. కృతజ్ఞతలు.
మురళి said…
'నందిని' ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. 'ఈమాట' కూడా ఇప్పుడే చూశా. చదవాల్సినవి చాలా ఉన్నాయి.