కబుర్లు - జనవరి 12

మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు, అసలే ప్రపంచ వ్యాప్త ఆర్ధిక సంక్షోభానికి రెపరెపలాడుతున్న భారతీయ ఐటి పరిశ్రమకి పెద్ద దెబ్బే గత వారంలో బయల్పడిన సత్యం కంపెనీ మోసం. ఇప్పటికే మన బ్లాగర్లు చాలా మంది అనేక విధాలుగా ఈ విషయాన్ని గురించి రాశారు, రాస్తున్నారు, కాబట్టి నేను ఇక్కడ కొత్తగా చెప్పేది ఏం లేదు. సత్యం పేరుతో సంస్కృత జాతీయాల మీద సత్యం వధ, సత్యమేవ భయతే శ్లేషలైతే చమత్కారంగా ఉన్నాయి కానీ, నిజపరిస్థితి మాత్రం భయంకరంగానూ ఆందోళన కరంగానూ ఉన్నదని ఒపుకోక తప్పదు. ప్రపంచ విపణి వీధిలో కంపెనీల దురాశ (corporate greed) కొత్త యేమీ కాదు. కొద్ది సంవత్సరాల క్రితమే ఎన్రాన్‌, వల్డ్‌కామ్‌ ఇంచుమించుగా ఇటువంటి వెధవ పనులు చేసే మునిగి పోయాయి. మదుపు దారుల డబ్బు పోవడం అదొక వంతనుకోండి .. మదుపు పెట్టడంలోనే రిస్కు కూడా ఉందని వాళ్ళకి తెలుసు కనీసం. ఎంతమంది ఉద్యోగుల రిటైర్మెంటు డబ్బులు హుష్ కాకీ కాబోతున్నాయో. ఈ మధ్య అమెరికాలో ఇంటి ఋణాల సముద్రంలో మునిగిన బేంకుల్లో వాషింగ్టన్‌ మ్యూచువల్ బేంకు అతి పెద్దది. తమది కాని తప్పుకి ఉద్యోగాలు పోగొట్టుకున్న వందలాది బేంకు ఉద్యోగులు మొన్ణామధ్య సియాటిల్ నగరంలో .. మునిగిన తమ యజమానికి బై బై చెబుతూ .. పేద్ధ పార్టీ చేసుకున్నారుట. బహుశా సత్యం ఉద్యోగులు కూడా అలాంటి పని చేస్తే పోతుంది. మునిగేది ఎట్టాగూ మునుగుతుంది, దాన్ని గురించి ఏడవడం అనవసరం.

మొన్నటి కబుర్లలో మా సద్గురు బోధ .. దయ ముఖ్యం అని చెప్పాను. ప్రముఖ కవి ఇస్మాయిల్ గారు కూడా కరుణ ముఖ్యం అన్నారు. ఒక్కోసారి మనం ఏదో మనసు దిగజారిపోయిన దిగులు దిగులు గుబుల్లో ఉండగా, ఎక్కడో ఎదురు చూడని మూల నించి, అస్సలు పరిచయం లేని కొత్తవ్యక్తి దగ్గర్నించి మనమీదికి దయ ప్రసరిస్తుంది. ఆ క్షణంలో దయ కురిపించిన వారూ, పుచ్చుకున్న మనమూ .. ఇద్దరమూ మన మానవత్వాన్ని దృఢపరుచుకుంటాం. నిజమే, దయ ముఖ్యం. కరుణ ముఖ్యం.

కానీ ఈ కొత్త సంవత్సరంలో అదే కొరవడినట్టుగా ఉంది. గాజా పేలికలో పాలస్తీనియన్లని ఇజ్రాయెల్ చేస్తున్న మారణ హోమానికి అడ్డూ అదుపూ ఉన్నట్టు కనబడ్డం లేదు. ఇంతలేసి బలవంతులమని చెప్పుకునే ప్రపంచ దేశాలన్నీ మ్రాంపడి చూస్తున్నాయి. ఇదేమని అడిగే వారు లేరు. ఇజ్రాయెల్ ని నిలదీసేవారు లేరు. ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం?

వార్తల్లో విషయాల్ని గురించి కబుర్లు చెప్పాలంటే, బయటెక్కడా కాస్త సంతోషించే వార్తలు కనబడేట్టు లేదు. గుండమ్మ కథలో రమణారెడ్డి అంటాడు కాఫీహోటల్లో పేపరు చదువుతూ, వెధవ పేపరు, అన్నీ చావు కబుర్లే, శుభమా అని నాలుగు పెళ్ళికబుర్లు వెయ్యకూడదూ? అని. పెళ్ళి కబుర్లు కాదుగానీ, మనసుకి ఆహ్లాదం కలిగే కబుర్లు చెబుతా ఈ మిగిలిన భాగంలో.

మాచిరాజు సావిత్రి గారు చిన్నవయసులోనే అమెరికా వచ్చి సెటిలయారు. వృత్తిరీత్యా పర్యావరణ రక్షణ రంగంలో పనిచేస్తుంటారు. మంచి సాహిత్యాభిలాష కలిగినవారు. అమెరికాలో తెలుగు భారతీయ జీవితాన్ని ప్రతిబింబించే చక్కటి రచనలు చేస్తుంటారు. అనేక కథలు కవితలూ ఈమాటలో ప్రచురించ బడినాయి. తరవాణి కేంద్రం అనే ఈ చక్కటి కథని గుర్తు చేసినందుకు మన రానారెకి బోల్డు థాంకులు.

మన అరుణం అరుణ గారు ఆంధ్ర జ్యోతిలో కథ రాసేశారోచ్! సంచలనాత్మకమైన విషయం. చాలా బేలెన్సుతో రాశారు. అభినందనలు. ఒకేళ మొదటి కథ అయితే గనక ప్రత్యేక అభినందనలు. కవర్ స్టోరీగా విజయవాడ పుస్తకోత్సవం గురించి రాశారు, కానీ దానిలో ఈతెలుగు కార్యక్రమం ప్రస్తావన ఏమీలేదు. అఫ్కోర్సు పదకొండు రోజులు నడిచే ఉత్సవంలో ఒక్క రోజు ఒక్క గంట జరిగిన మన కార్యక్రమాన్ని ప్రస్తావించాలనుకోడం అత్యాశే కావచ్చు .. అన్నట్టు, విజయవాళ్ళో మన వాళ్ళందర్నీ కలవడం చాలా సరదాగా ఉందని మా మామగారు చెప్పారు. ఆ దెబ్బతో తనక్కూడా ఓ బ్లాగు మొదలెట్టాద్దామన్నంత ఉత్సాహం వచ్చేసిందనీ, కాకపోతే ఏవన్నా రాయాలంటే ఇదివరకట్లాగు కంప్యూటరు ముందు ఎక్కువసేపు కూర్చోలేక పోతున్నానని చెప్పారు. ఆయనక్కూడా ఈ కింది విషయం చెప్పాలి!

ప్రముఖ కవి కె. శివారెడ్డి ఒక పద్యంలో అంటారు, ఉయ్యాల ఊపు ఎప్పటికీ ఆగనీకు అని. ఇవ్వాళ్ళ పొద్దున్న రేడియోలో విన్న ఓ కథనం నన్ను అమితాశ్చర్యానికి గురిచేసింది. డోరొతీ అనే జపనీస్ అమెరికన్‌ స్త్రీ, 91 ఏళ్ళ వయసులో తన డాన్సు స్టూడియోలో డాన్సు నేర్పుతున్నారని! మరి మీ ఉయ్యాల ఏమిటి?

Comments

Anonymous said…
బ్లాగు! :)
ఉయ్యాల ??? బానే ఉంది ఆలోచన.. అది జరిగేనా??

నిజంగా అరుణ కధ బావుంది. థాంక్స్ ...
బాగున్నాయండీ కబుర్లు :-)
durgeswara said…
91 samvatsaraala lo amdariki opika vumdademo namdi
Anonymous said…
అయ్యా...
ఇది తగునా మీకు?
నేనేదో కథ గుట్టుగా రాసుకుని వేసుకుంటే ఇలా కూడలికెక్కిస్తారా? కొంచెం :) - కొంచెం :(
చాలా ఆశ్చర్యం అనిపించింది.
కథను మనవాళ్లు ఎలా స్వీకరిస్తారో తెలియని సందిగ్థంలో పడి ఎవరికీ చెప్పలేదు. వాళ్ల అభిరుచిని అనుమానించడం కాదు.. కథ మీద నాకున్న నమ్మకం అలా ఉంది మరి. అందుకే నా బ్లాగులో కూడా పెట్టలేదు. ‘శంఖంలో పోస్తే తీర్థం’ అన్నట్టు మీరు బాగుందన్నాక బావున్నట్టే. తొలి కథ కదా, కొద్దిగా సంకోచం, సంశయం వెంటాడుతున్నాయి. ధన్యవాదాలు స్వీకరించండి స్వామీ!!
KumarN said…
భలే వాళ్ళే అరుణ గారూ, ఇలాంటివి దాగుతాయా..అది నెట్ లో పబ్లిష్ అయిన మొదటి గంటలో నేను చదివా.

అది చదివి, మీరు చాలా చెయ్యి తిరిగిన రచయిత్రి అనుకున్నా. అందరికీ మీరు తెలిసిన రచయిత్రి అయ్యి ఉంటారని నేను బ్లాగుల్లో ఎక్కడా కామెంటు కూడా రాయలేదు. మొదటి సారి అలా రాసారంటే, గొప్ప విషయమే.

నా హృదయ పూర్వక అభినందనలు. బాగా రాసారు.

We certainly need writers like you.

Kumar
"బయటెక్కడా కాస్త సంతోషించే వార్తలు కనబడేట్టు లేదు" - ఇందుకే నేను కలతచెందానండి. ఈ కలతే నా సుషుప్తికి కారణం. నాకేదో అస్పష్టమైన సమాధానం దొరికినట్లే వుంది. మెల్లగా బయటికొస్తున్నాను.
Ramani Rao said…
బాగున్నాయండీ కబుర్లు :-)
కబుర్లూ.. అరుణ గారి కథ బాగున్నాయి.
మీకూ మీ కుటుంబానికీ.. సంక్రాంతి శుభాకాంక్షలు..!!
అయ్యా! సంక్రాంతి శుభా కాంక్షలు.
మీకబుర్లతో మమ్మల్ని మై మరపిస్తున్నారండి.
చాలా ప్రయోజనకరంగా వున్నాయి.
నమస్తే
{ఆంధ్రామృతం బ్లాగ్