ఒక పీట ముడి

జ్ఞాన పీఠము తెచ్చినారము అంటూ మొన్నీ మధ్యన చంద్రిమ గారు మంచి మేలుకొలుపు పాడారు. అంతకంటే, పట్టు దారాలు పైన చుట్టిన చెర్నాకోలతో ఒక చరుపు చరిచారంటే సరిగ్గా ఉంటుందేమో.

అసలేవిటి ఈ జ్ఞానపీట కమామిషూ అని వికీని ప్రార్ధించాను.
అనుగ్రహించింది.

కేంద్ర సాహిత్య యెకాడెమీ అంటే సరే పోనీ రాజకీయుల పైరవీలే అని సరిపెట్టుకోవచ్చు. మరి ఈ జ్ఞానపీట సంగతేంటి. అదిచ్చేవాళ్ళేమో ఏదో ప్రైవేటు ట్రస్టు వాళ్ళు. అదీనూ ఒక సారికి ఒక్కరికే ఇస్తారు. కీర్తిశేషులైన వాళ్ళకి ఇవ్వరు. ఆంగ్లం తప్ప భారతీయ భాషల్లో ఏ భాషా రచయితకైనా ఇస్తారల్లే ఉంది. 1982 వరకూ ఏదో ఒక ప్రత్యేక కృతి గొప్పతనాన్ని గుర్తించినట్లుగా ఇచ్చేవారట (విశ్వనాథకి రామాయణ కల్పవృక్షానికి వచ్చిందిట). అటు తరవాత ఏ ఒక్క కృతి కోసమో గాక రచయిత సర్వతోముఖ కృషికి గుర్తింపుగా ఇస్తూ వస్తున్నారట. చంద్రిమ గారి బ్లాగులో చర్చలో చెప్పినట్టు ఈ ఎంపికలో ఒక క్రమం (అంటే సంవత్సరానికి ఒకటి చొప్పున భాషల టైం టేబుల్) ఏదీ ఉన్నట్టు లేదు. 2004 దాకా ఇచ్చిన 42 ఎవార్డుల్లో కన్నడ భాషా రచయితలకి ఏడు సార్లొచ్చింది .. హిందీ తమిళ రచయితలకి కూడా అన్ని సార్లు రాలేదు. 1970లో విశ్వనాథ తరవాత 1988లో సినారెకి ఇచ్చారు. మరి అది జరిగి కూడా ఇరవయ్యేళ్ళు నిండుతున్నాయి.

అసలీ ఎవార్డులన్నీ పైరవీలే అని పక్కకి నెట్టేయ్యొచ్చు. తెలుగు వాళ్ళకి సాటి తెలుగు వాళ్ళని పైకి తీసుకువచ్చే దృష్టిలేదు అని నిస్పృహ ప్రకటించొచ్చు. మనకివ్వని దాన్ని గురించి మనం ఎందుకులే పట్టించుకోవడం అని ఒక నిట్టూర్పు విడిచి మరిచే పోవచ్చు.

కానీ, ఎంత వద్దనుకున్నా, ఇలాంటి ఎవార్డుల వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటి ప్రయోజనం, మన భాషకీ, మన భాషా సాహిత్యానికీ జాతీయంగా ఒక కొత్త గుర్తింపు వస్తుంది. రెండో గొప్ప ప్రయోజనం, కొంతవరకూ మొదటి దాన్ని వెన్నంటి వచ్చే ప్రయోజనం, ఇలా గుర్తింపు పొందిన రచనలు కొన్నైనా ఇతర భాషల్లోకి, ముఖ్యంగా హిందీలోకి (జాతీయ ప్రాచుర్యం కోసం), ఆంగ్లంలోకీ (అంతర్జాతీయ ప్రాచుర్యం కోసం) తర్జుమా అవుతాయి. ఆ అవడం కూడా ఏదో అయ్యాయంటే అయ్యాయి అన్నట్టు కాకుండా, ప్రతిభావంతులైన అనువాదకులతో అనువాదం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన, అవసరమైన పరిణామం. అఫ్కోర్సు, రచయితకి ముట్టే ఐదు లక్షల రూపాయల నగదు కూడా, కనీసం ఆ వ్యక్తికి సంబంధించినంత వరకూ, మంచి ప్రయోజనమే అనుకోండి.

ఈ సంవత్సరం తెలుగుకి ఇచ్చి తీరతారు అనుకుందాం కాసేపు. అర్హులైన వారెవరున్నారు? ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారంటే నాకెంతో గౌరవం, అభిమానం. ఆయన ఎక్కువగా సంస్కృతం నించి తెలుగు వచనంలోకి అనువాదాలు, వివరణలు వంటి రచనలు తప్ప, స్వంత రచనలు ఎక్కువగా చేసినట్టు లేరు. కథకుడైన కాళీపట్నం రామారావు మేష్టారు ఒక పక్క, విస్తృతంగా తనకు తెలిసిన సమకాలీన జీవితాన్ని ప్రతిబింబిస్తూ నవలా రచన చేసిన అంపశయ్య నవీన్ మరొక పక్కా కనిపిస్తున్నారు వచన రచనలో. కానీ ఇద్దరి రచనల్లోనూ తెలుగు సాహిత్యాన్ని మౌలికంగా ప్రభావితం చేసిన అంశాలు ఏవీ కనబడవు. అటువంటి ప్రభావం కోంత వరకూ యద్దనపూడి సులోచనారాణి, ఆ తరవాత యండమూరి వీరేంద్రనాథ్ తెచ్చారనుకోవచ్చు. కేవలం పాపులర్ రచయితలు ఐనందుకు వీళ్ళని తీసి పారెయ్యనక్కర్లేదు. యండమూరి నవల్లు ఈ మధ్యన మళ్ళీ చదవడానికి ప్రయత్నిస్తే, ఒక పక్కన కొంత ఆసక్తి రేగుతున్నా, ఇంకో పక్క చాలా చీదరగా అనిపించింది.

సీనియర్ కవుల్లో కె. శివారెడ్డి, వేగుంట మోహన ప్రసాద్ కనిపిస్తున్నారు (శిఖామణికి అంత లేదు) .. ఇస్మాయిల్, శేషేంద్ర శర్మ అప్పుడే పోవడం ఈ విషయంలో పెద్ద లోటే. సినీ కవులు వేటూరి, సీతారామశాస్త్రి ఉన్నారు.

ఇంకెవరున్నారు? మీ ఉద్దేశాలు చెప్పండి.

Comments

Anonymous said…
ముళ్ళపూడి వెంకటరమణ
చదువరిగారితో నేనూ ఏకీభవిస్తాను. అటు సామాన్యజనం ఇటు సాహితీప్రియులు ఇద్దరినీ అలరించి,పాలించి,బుజ్జగించి,ఎత్తిపొడిచి,హత్తుకుని,అద్భుతమనిపించే శైలి ముళ్ళపూడివారి సొంతం. వారిని జ్ఞానపీఠ అందుకుంటే,అది ఆ అవార్డుకూ ఇటు తెలుగువారికీ గర్వంగా ఉంటుంది.

నేను కర్ణాటకలో చదువుతున్నప్పుడు ఈ చర్చ ప్రతిసారీ వచ్చేది. తెలుగువాడిగా నాకు కాస్త తలకొట్టేసినట్టుండేదిగానీ,అర్థమయ్యిందేమిట్రా అంటే..కన్నడిగులు తమ కన్నడ సాహిత్యాన్ని అంతే హృద్యంగా ఇంగ్లీషులో communicate చెయ్యగలరు. అంటే భాషేతరులకి అర్థమయ్యేభాషలో తమ సాహిత్యాన్ని అర్థమయ్యేలా చెప్పగలరన్నమాట. అది మన దగ్గర కొంత తక్కువేమో..ఇక మన తెలుగువారికి సొంతమైన "వెనకలాగుడు" ఎలాగూ ఉండనే ఉంది.
Bolloju Baba said…
ప్రస్తుతానికి శ్రీ ఆవంత్స సోమసుందర్ కనపడుతున్నారు. 1942 నుంచి కవిగా, విమర్శకునిగా, కధకునిగా, నాటకకర్తగా, పాటల రచయితగా భిన్న రూపాలతో సుమారు ఆరు దశాబ్ధాలుగా సాహితీ సేవ చేస్తున్న 85 సంవత్సరాల పండు ముదుసలి. వారు 2008 లో ప్రచురించిన గ్రంధం పేరు దేశి సారస్వతము-సమాజ వాస్తవికత.

వీరు ఇంతవరకూ 77 పుస్తకాలు రచించారు.

వీరు వ్రాసిన వజ్రాయుధం పుస్తకం అప్పటి తెలంగాణా ఉద్యమ సమయంలో " ఖబడ్దార్ హే నిజాం పాదుషా... అంటూ కోస్తా నుండి గర్జించిన వీరుడు.

వీరు పాత తరానికి కొత్త తరానికి మిగిలిన ఒకే ఒక వారధిగా అనిపిస్తున్నారు.
వీరికి రావలసినంత గుర్తింపు రాకపోవటానికి వీరికి శ్రీశ్రీ కి ఉన్న వైరాలు కొంతవరకూ మరియు ఏ రాజకీయమ్మన్యుల గడపలు తొక్కకపోవటం.

ఇప్పటికైనా వీరి కృషిని ప్రభుత్వం గుర్తిస్తే బాగుండుననిపిస్తుంది.

వీరు రచించిన పుస్తకాల వివరాలతో ఒక పోస్టు వ్రాయబోతున్నాను బ్లాగ్మిత్రులు వీరి శ్రమను గమనించగలరు.

బొల్లోజు బాబా
Anil Dasari said…
కొలకలూరి ఇనాక్. ఈయన గురించి పెద్దగా తెలీదు కానీ నేను ఇంటర్‌మీడియెట్‌లో ఉన్నప్పుడు 'తల లేనోడు' అని ఈయన రాసిన కధ ఒకటి మాకు పాఠ్యాంశంగా ఉండేది. అంత మంచి కధ రాసినాయన ఎన్నో కొన్ని మంచి పుస్తకాలు రాసి ఉంటాడనే అనుకుంటున్నా.
నేను కూడా చదువరిగారితో ఏకీభవిస్తున్నాను. మహేష్ గారు చెప్పినట్లు పండితులను, సామాన్యులను సమానంగా అలరించగల అరుదైన శైలి గలవారిలో ముళ్ళపూడి వారొకరు. ఒకపక్క గిలిగింతలు పెడుతూనే, మరోపక్క గంభీరమైన విషయాలను పాఠకుడి ఆలోచనలోకి చొప్పించగలరు. రామాయణ కల్పవృక్షం సంగతి నాకు తెలీదు కానీ, సినారె ’విశ్వంభర’ మాత్రం సాహిత్య పరిజ్ఞానం ఉన్నవారు తప్ప, మామూలు పాఠకులు చదవలేరు. ముళ్ళపూడివారి పద విన్యాసం సామాన్యులని సైతం మురిపిస్తుంది.
మాలతి said…
సాహిత్యంలో వివిధ ప్రక్రియలలోనే కాక, జానపదసాహిత్యంమీద విశిష్టమైన పరిశోధన చేసిన ఆచార్య నాయని కృష్ణకుమారి గారు జ్ఞానపీఠ ఎవార్డుకి తగినవారు వున్నవారిలో అని నాఅభిప్రాయం.
మాలతి said…
ముళ్లపూడి వెంకటరమణగారికి కూడా నాఓటు వుంది పైన వ్యాఖ్యాతలు నుడివిన పేరులదృష్ట్యా చూస్తే.
Anonymous said…
క్షమించాలి.
రాహుల్ సాంకృత్యాయన్‌కి, శరత్‌కి, కిషన్‌చందర్‌కి, తెన్నేటి సూరికి, పాలగుమ్మి పద్మరాజుకి, కుటుంబరావు‌కి, బెజవాడ గోపాలరెడ్డికి, రావి శాస్త్రికి జ్ఞానపీఠం అవార్డులు వచ్చినవా? మరి వారి సాహిత్యం ఇతర భాషలలోకి ఎందుకని అనువాదాలకి నోచుకున్నవి?
తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ సాహిత్యంలో మిగతా భాషలతో పాటు నిలబెట్టడానికి జ్ఞానపీఠం అవసరం లేదు. అనవసరం కూడా. ఆ పాటి డబ్బు తెలుగు సాహిత్యం మీద అభిమానమున్న పారిశ్రామికవేత్తలేకాదు, ఉద్యోగస్థులు కూడా ఇవ్వగలరు. ఆ మాత్రం ప్రాచుర్యాన్ని మీబొంట్లుకూడా ఇవ్వగలరు. మొన్న డెట్రాయిట్‌లో మీరు చేసినదేమిటి? అదే కదా? మనం చదివి, ఇతరులతో చదివించి, ఓపిక చేసుకుని, చేయగలిగిన వారితో మిగతా భాషలలోకి అనువదిస్తే, ప్రచురించిన పుస్తకాలని మనం ఆదరిస్తే చాలు. అదే పది వేలు.
సినీ కవులు వేటూరి, సీతారామశాస్త్రి ఉన్నారు---
కానీ దయచేసి వీరివురిని కాస్త పక్కనబెడదాం.ఎందుకంటే వీరిది ఏ సినిమాకు ఆ సినిమాగా పీస్ వర్క్ తప్ప ఏకసూత్రతో నడిచే రచనలు దాదాపు గా అదీ అచ్చురూపం లో లేవు.సీతారామశాస్త్రి శివస్తుతులు లాంటివి కొన్ని రాసుకున్నా,కార్పస్ ఆఫ్ లిటరరీ వర్క్స్ కిందకు/కోవకు రావు.
సరే నా జాబితా కాస్త విభిన్నం: ఒక సంస్థగా డాల్టన్ ప్రచురణలు(చందమామ,యువ,విజయచిత్ర,వనిత)
వ్యక్తులు రావూరి భరధ్వాజ,కత్తి పద్మారావు,రావిపూడి వెంకటాద్రి,నామిని,ఏ.బి.కే. ప్రసాద్,అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి(మిసిమి సంపాదకులు,బుద్ధుని దీర్ఘసంభాషణలు వగైరా రచయిత)మాలతీచందూర్,ఇంకా మరికొందరున్నారు
ప్రస్తుతానికి నా ఓటు కూడా ముళ్ళపూడి వెంకటరమణ గారికే. తెలుగు సాహిత్యంలో ఒక ఒరవడి సృష్టించిన రచయిత అంటే ఆయనే (ఇప్పుడున్న వారిలో).

వాడ్రేవు చినవీరభద్రుడు గారి "అంతర్యానం" కూడా మంచి రచన. జ్ఞానపీఠ స్థాయి ఉందో లేదో చెప్పలేను గానీ, సినారె "విశ్వంభర" కంటే బాగుందనిపించింది నాకు.
మీరన్నట్టు "..ఏ ఒక్క కృతి కోసమో గాక రచయిత సర్వతోముఖ కృషికి గుర్తింపుగా ఇస్తూ వస్తున్నారట."

ఇక్కడ చెప్పుకున్నవారిలో ఎంత మంది అర్హులు?
మన ఎలక్షన్ల మాదిరి దొంగవోట్లు వేసేపద్దతేమైనా వుంటే నావి పది వోట్లు శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారికే
@రాజేంద్ర: సినీగేయ రచయితల విషయంలో మీతో నేను కొంత ఏకీభవించినా,సిరివెన్నెల సాహిత్యాన్ని సినిమాకి సంబంధించిన "పీస్ వర్క్" అంటేమాత్రం నేను అంగీకరించలేకున్నాను.

ఏ చిత్రంలో ఎటువంటి సన్నివేశానికి ఇతగాడు పాటలు రాసినా,సినిమా నుంచీ ఆ పాటను విడదీసిచూసినా కూడా దానికొక ప్రత్యేక వ్యక్తిత్వం ఉండేలా రాసే బహుకొద్ది భారతీయ గేయరచయితల్లో సీతారామశాస్త్రి ఒకరు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలా చెయ్యడాన్ని మించిన achievement మరోటి లేదని మనవి.
@మహేష్,మీరు చెప్పిన దానికన్నా కూడా ఇంకా ఎంతో ప్రతిభావ్యుత్పత్తులు సీతారామశాస్త్రికి ఉండొచ్చు.కానీ ప్రాధమికంగా సినిమాగేయరచయిత ఆయన.అసలు సినిమా రచయితలకు జ్ఞానపీఠపురస్కార ప్రదానం ఇప్పటివరకూజరగలేదు.
తెలుగువారిలో ఎవరికి వచ్చినా అది ఆనందకరం.
Anonymous said…
@మహేష్ - సిరివెన్నెల సీతారామశాస్త్రి చేసినది ఇప్పుడున్న సినిమా పరిస్థితుల్లో చాలా కష్టమైన పనే కావచ్చు. కానీ, జ్ఞానపీఠానికి సరిపడానా - ఊహూ, బహుశా కాదేమో!
@రాజేంద్ర - పీస్ వర్క్ అంటే ఏమిటండీ- పెద్ద రచయితలని తీసుకున్నా - ఏ కథకి ఆ కథే అని కాబట్టి పీస్ వర్క్ అని అనేయచ్చుగా... సినిమా పాట అనేదానిని ఒక సాహితీ ప్రక్రియగానే ఒప్పుకోరు చాలామంది. అలాంటి ప్రక్రియని చేపట్టి - సాధారణ సాహిత్యం ద్వారా ఏఏ ప్రయోజనాలను సాధించచ్చో అన్నిటినీ సినిమాపాట ద్వారా కూడా సాధించచ్చు అని నిరూపించిన వేటూరి, సీతారామశాస్త్రిల contribution ని అంతలా తీసిపారేయకండి.

@ కొత్తపాళీ - కథకి సంబంధించి ఒక చిరునామాగా మారిని కారా మాస్టారిని అలా పక్కన పెట్టయటం నాకెందుకో అంతగా రుచించలేదు.
1. కథా నిలయాన్ని స్థాపించి తెలుగు కథ ప్రారంభమైనప్పటినుంచి అన్ని కథలనూ సేకరించడానికి ప్రయత్నిస్తూ - కథ భూతకాలాన్ని సంరక్షించడం,
2. తను స్వయంగా చేసిన సాహితీసృష్టిద్వారా కథ తాలూకూ వర్తమానానికి చేసిన సేవ
3. ఔత్సాహిక కథా రచయితలకు శిక్షణ, మెలకువలు నేర్పటం ద్వారా కథ తాలూకు భవిష్యత్తుకి చేసిన సేవ
ఈ మూడిటినీ కలిపితే ఆయన తెలుగుసాహిత్యానికి ఇచ్చిన మలుపు చిన్నదేమీ కాదు.
జ్ఞానపీఠ్ అవార్డు గురించి మరిన్ని వివరాలకోసం వారి వెబ్ సైటును చూడవచ్చు. లంకె -
http://www.jnanpith.net/index.html
సాహిత్య నేత్రం కిందటి సంచికలో సంపాదకీయం సరిగ్గా దీని మీదే (తెలుగులో జ్ఞానపీఠ్ అవార్డు రాదగినవారు, రావలసినవారు ఎవరెవరున్నారు అనేదానిమీద) రాశారు. మీ టపా చూడగానే అదే గుర్తొచ్చింది. దాన్ని త్వరలోనే ఆన్లైన్లో చదివెదరు గాక!
ఈ చర్చలో పాల్గొన్న మిత్రులందరికీ ధన్యవాదాలు. మంచి మంచి పేర్లే వినబడ్డాయి. ముళ్ళపూడి పేరు అంత బలంగా వినబడ్డం నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది. పాత్రికేయుడిగా, కథా రచయితగా, సినిమా రచయితగా ముళ్ళపూడి బహుముఖప్రజ్ఞ కనబరిచారు - సందేహం లేదు.
నెటిజన్ గారు, మీ అభ్యంతరాలని ఒప్పుకోలేను. డబ్బివ్వగలరు, కానీ ఇవ్వట్లేదు - అదే వచ్చిన బాధ. పద్మరాజు గాలివానకి ఆ యేడు ఇంటార్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పెట్టిన అంతర్జాతీయ కథల పోటీలో రెండో బహుమతి వచ్చింది. ఆ విషయం ఎవరో తెలుగు కథ చరిత్ర గురించి తపన పడే వాళ్ళకి తప్ప ఎవరికీ తెలీదు! ఎక్కడా ఆయన కథకి ఆంగ్లానువాదం కనబడదు. ఏ అంతర్జాతీయ కథా సంకలనాల్లోనూ ఆ కథ చోటు చేసుకోలేదు! ఈ పరిస్థితి మారాలి అని నా తపన.
సిరివెన్నెల పాటలు పీస్ మీల్ ఐతే కారా కథలు పీస్ మీల్ కాదా అని ఎవరో అన్నారు. రెంటికీ ఒక ఫండమెంటల్ భేదం ఉంది. సినిమా పాట దర్శక నిర్మాతల కోరికలకి అనుగుణంగా తయారు చేసే ఒక వ్యాపార ఉత్పత్తి. అక్కడ కళ యాదృఛ్ఛికం, వ్యాపారం ముఖ్యోద్దేశం. కారా రాసే కథ వల్ల వ్యాపారం జరిగితే జరగొచ్చు కానీ అక్కడ కళ ముఖ్యం, వ్యాపారం యాదృఛ్ఛికం.
ఈ తేడా వల్ల, కారా కథలన్నీ సమాహారం చేసి చూసుకుంటే, అందులో రచయిత ఎదుగుదలే కాక, రచయిత లోకాన్ని చూసే ఒక దృక్కోణం, లోకానికి నిర్దేశించే ఒక పథం కనబడతాయి. సినిమా పాటలో అది కనబడే అవకాశం చాలా చాలా తక్కువ.
మాలతి said…
ఆ విషయం ఎవరో తెలుగు కథ చరిత్ర గురించి తపన పడే వాళ్ళకి తప్ప ఎవరికీ తెలీదు! - ఇది చాలా నిజం.
కథకి ఆంగ్లానువాదం ఆయనే చేసి ఎక్కడో ప్రచురించారని విన్నాను.
నిజం మాలతి గారూ. ఆంగ్లానువాదం ఆయనే చేసుకున్నారు. పోటీ జరిగింది అంతర్జాతీయ వేదిక మీద గనుక, కథకి ఆంగ్లానువాదమే పోటీలో పరిశీలనకి వెళ్ళి ఉంటుందని మనం ఊహించవచ్చు. భారత్ లో ఈ పోటీకి హిందుస్తాన్ టైంసు వాళ్ళు నిర్వాహకులుగా వ్యవహరించారు. భారతీయ భాషలనించి జాతీయ స్థాయిలో ఎంపికైన కథలన్నిటి ఆంగ్లానువాదాలతో వాళ్ళొక పుస్తకం వేశారు. మహా యాదృఛ్ఛికంగా ఆ పుస్తకం నాకు ఏనార్బరులో ఒక పాత పుస్తకాల షాపులో దొరికింది. సుమారు పది డాలర్లకి కొని, శ్రీకాకుళంలో కారా మాస్టారు నెలకొల్పి నడూపుతున్న కథానిలయానికి కానుకగా ఇచ్చాను.
మాలతి said…
కొత్తపాళీ, ఓ. మీరు ఆనార్బరులో సంపాదించడం తమాషాగా వుంది. మంచిపని చేసారు. సందర్భం వచ్చింది కనక, పద్మరాజుగారి హెడ్మాష్టరు కథ శారద (ఆస్ట్రేలియా) అనువాదం చేసారు. తూలికలోవుంది.
http://www.thulika.net/2004October/HEADMASTER.html
ముళ్లపూడి వెంకట రమణ గారికి నా తాలూకూ 2వోట్లు(2బ్లాగులు కనుక)పద్ధతి ప్రకారం 2దొంగ వోట్లలో ఒకటి ఆయనకి మరొకటి రావిశాస్త్రి గారికి.అన్నింటి కన్నా దారుణమైనది మన సినీగీత కవులకి జాతీయ అవార్డుల్లో జరుగుతున్న అన్యాయం(సిరివెన్నెల పాటలు కొన్ని అవార్డులు పొందిన పాటల కన్నా గొప్పవి(ఎవరైనా కంపారిటివ్ వర్క్ చేసి నిరూపిస్తే ఆనందిస్తాను)).
kRsNa said…
mee tapallo mee alochana baga kanapadutundandi kottapali garu. :)
చంద్ర మోహన్ said...

ప్రస్తుతానికి నా ఓటు కూడా ముళ్ళపూడి వెంకటరమణ గారికే. తెలుగు సాహిత్యంలో ఒక ఒరవడి సృష్టించిన రచయిత అంటే ఆయనే (ఇప్పుడున్న వారిలో).

వాడ్రేవు చినవీరభద్రుడు గారి "అంతర్యానం" కూడా మంచి రచన. జ్ఞానపీఠ స్థాయి ఉందో లేదో చెప్పలేను గానీ, సినారె "విశ్వంభర" కంటే బాగుందనిపించింది నాకు.
=======
చంద్రమోహన్ గారు వాడ్రేవు చినవీరభద్రుడుగారు వ్రాసింది అంతర్యానం కాదు, 'పునర్యానం'.