ప్రేమా పిచ్చీ ఒకటే!

ప్రేమా పెళ్ళి ఒకటేనా, వేర్వేరా అని ఒక ప్రశ్న.
దాన్ని గురించి ఒక చర్చ.

పెళ్ళిని నిర్వచించడానికి పెద్ద శ్రమ పడనక్కర్లేదు. ఇద్దరి మధ్య ఏదో ఒక మత సంబంధమైన తంతో, లేక చట్టం అంగీకరించిన లౌకికమైన తంతో జరిగితే వాళ్ళిద్దరికీ పెళ్ళైనట్టు లెక్క. ఇది, ఆ సదరు నవదంపతులతో పాటు ప్రభుత్వమూ, ప్రపంచమూ కూడా ఒప్పుకునేదే.

మరి ప్రేమని ఎలా నిర్వచించడం? ప్రేమంటే ఫలానా ఇదీ అని నిర్వచించ లేకపోతే .. పోనీ "నేతి నేతి.." అనైనా నిర్వచించే ప్రయత్నం చెయ్యొచ్చునేమో? ఎటువంటి నిర్వచనం ఇచ్చే ఏ ప్రయత్నమూ నాకీ చర్చలో ధ్వనించలేదు. పోనీ అదేవన్నా అనిర్వచనీయమైనదా? ఏమో? మా కృష్ణమోహన్ లాంటి వాళ్ళు చెప్పాలి ఆ సంగతి. ఆయనెలాగా మూడో భాగం రాస్తానని బెదిరిస్తున్నాడాయెను. బాబ్బాబు, ఈ సంగతేదో కాస్త ఆ మూడో భాగంలో తేల్చి చెప్పండి, మీకు పుణ్యవుంటుంది.

ఒకేళ ప్రేమ అనిర్వచనీయమైనది ఐతే దాన్ని పెళ్ళిలాంటి తంతు తో ఎలా ఒకే త్రాసులో తూస్తాము?

సరే, ఈ అయోమయం ఇలా ఉందా? ఇక చర్చ. ఆ చర్చలో ఇంకేవేవో మాటలు వినిపించాయి.
ఆకర్షణ అన్నారు.
అవగాహన అన్నారు.
నమ్మకం అన్నారు.
బంధం అన్నారు.
మానసిక అనుబంధం అన్నారు.
ప్రేమకీ పెళ్ళికీ మధ్య వారధి ఆకర్షణ అన్నారు.
అవగాహన లేకపోతే పెళ్ళిళ్ళు కూలిపోతాయన్నారు.
మానసిక అనుబంధం బాగా ఉంటే పెళ్ళికి సిద్ధమవుతారన్నారు.
ఆకర్షణ ప్రభావంతో కాక అవగాహనతో పెళ్ళికి దారితీస్తే మంచిదన్నారు.
ఇష్టపడితే కలిసి బతకాలి, లేకపోతే విడిపోవాలి అన్నారు.
ప్రేమిస్తున్నా, మనం గా కలిసి మనలేమేమో నని భయం అన్నారు.
మధ్యలో, మన వివాహ వ్యవస్థ చాలా పటిష్ఠం అని కూడా అన్నారు.

ఇంకా నయం, ప్రేమ త్యాగం కోరుతుంది, అమలిన ప్రేమ, నిస్వార్ధమైన ప్రేమ - ఇలాంటి డయలాగులు ఎక్కడా వినబళ్ళేదు.

అసలు ప్రేమంటేనే ఏవిటో ఒక నిర్ధారణకి రాలేకుండా ఉండగా, ఈ అదనపు మాటల వాక్యాల పరంపర .. పిల్లంటే మార్జాలం .. అంటే బిడాలం అన్నట్టుంది.ఇదంతా నాకెలా ఉందంటే నలుగురు గుడ్డి వాళ్ళు ఏనుగు ఎట్లా ఉంటుందో వర్ణిస్తున్నట్టు ఉంది.

నా దేశ యువజనులారా! ఏవిటీ వృధా చర్చ? ఎందుకొచ్చిందీ రచ్చ?

చాతనైతే ఎవర్నన్నా ప్రేమించెయ్యండి.
ఇంకా చాతనైతే ఎవరిచేతనన్నా ప్రేమించ బడండి.

దాహవేస్తే, చల్లటి మంచి నీళ్ళు తాగితే ఆ దాహం తీరుతుంది గానీ, చల్లటి మంచి నీళ్ళని గురించి ఇదిలా ఉంటుంది కామోసు అని కలలు కంటేనూ, కవిత్వం రాస్తేనూ, లేదా, దాన్ని రసాయన విశ్లేషణ చేస్తేనూ ఆ దాహం తీరదు!

ఈ క్షణమే ఆ చల్లటి నీళ్ళు నా గొంతులో పడాలి అనేంతగా మీ దాహం మిమ్మల్నందర్నీ దహించాలని మనసారా కోరుకుంటున్నాను .. కాదు, కాదు, ఆశీర్వదిస్తున్నాను.

Comments

బాగా చెప్పారండీ కొత్త పాళీగారు. పెళ్ళి అనేది ఎటూ తప్పని తంతు ఇంత కాలం. ఇప్పుడు దేని ప్రభావమో సరిగా తెలియదు కాని ప్రేమ కూడా గాలి, నీరు, కూడు, గూడు, గుడ్డ లాగ బేసిక్ అవసరం అయిపోయింది. తెల్లారితే చాలు, ఎటు చూసినా ప్రేమే... ఐ మాక్స్ లో ప్రేమ, టాంక్ బండ్ మీద ప్రేమ, నెక్లెస్ రోడ్డు అంతా ప్రేమే. ఇంత ప్రేమ ని కడుపు కట్టుకుని వీళ్ళు ఏదో ఉద్ధరిస్తారు అని ఎన్నో ఆశలు పెట్టుకున్న అమ్మ, నాన్న మీద చూపిస్తే ఎంత బాగుండో... కనీసం వాళ్ళకి వృద్ధాశ్రమాలకి వెళ్ళే ఖర్మ తప్పుతుంది.

నా ఈ అభిప్రాయం చాలా మందికి నచ్చకపోవచ్చు. నేను ప్రేమ కి వ్యతిరేకిని కాను, కాని ప్రేమ అనగానే అమ్మాయి-అబ్బాయి-ప్రేమ అనుకునే భావానికి వ్యతిరేకిని. నిజం గా ప్రేమ ని చూడగలిగితే నిత్యం మనకి ఎన్నో రకాలుగా సహాయం చేసే ఎంతో మంది మనల్ని ప్రేమిస్తునట్టే. కాదంటారా?
Anonymous said…
బెదిరించానా?
ఎంతవమానమెంతదుస్సహమెంతదుర్భరమెంతక్రూరమెంతభయంకరమూ!
అయిననూ రాసి తీరవలయు - ప్రేమని తెలిపితీరవలయు -
rākeśvara said…
చాతనైతే ఎవర్నన్నా ప్రేమించెయ్యండి.
ఇంకా చాతనైతే ఎవరిచేతనన్నా ప్రేమించ బడండి.

Objection Your Honour

చాతనైతే ఎవరిచేతనన్నా ప్రేమించ బడండి
ఇంకా చాతనైతే ఎవర్నన్నా ప్రేమించెయ్యండి.
అంటే బాగుంటుంది.

(నా వ్యాఖ్య కూడా జగడమెందుకయ్యేను జంగమ దేవరా అన్నట్టు వుంటే పెద్ద మనస్సుతో మన్నించగలరు)
Anonymous said…
ప్రేమ లో ఏమియునూ లేదు - ప్రేమించుటయన్న భావన తప్ప - కృష్ణశాస్త్రి

Love is the highest form of negative understanding - JK

Love is a state of being - OshO

Hmm...ఇంకా...?? వద్దు....మాస్టారు, తల్నొప్పి మొదలయ్యింది. :-)
ప్రేమని నిర్వచించలేం. కానీ స్త్రీపురుషుల మధ్య ప్రేమ - ఒక అవసరం చుట్టూ అల్లుకున్న భావనల జొంపం. ఇతర ప్రేమలే నిఖార్సైన నిజం.
"ఈ క్షణమే ఆ చల్లటి నీళ్ళు నా గొంతులో పడాలి అనేంతగా మీ దాహం మిమ్మల్నందర్నీ దహించాలని మనసారా కోరుకుంటున్నాను .. కాదు, కాదు, ఆశీర్వదిస్తున్నాను",.....ఏమి దీని భావం మహాశయా!

ఏంటో అందరూ కలిసి మాలాంటివాళ్ళని ఇంకా అయోమయంలో పడేస్తున్నారు!!
Purnima said…
hmm.. got the lesson!
Anil Dasari said…
పెళ్లనేది ఓ ఒప్పందం, అది సత్యం. ప్రేమ మిధ్య - అందుకే మనుషులు కవిత్వాన్ని సృష్టించారు.
Ramani Rao said…
ఎనతసేపు చర్చించినా, ఎంతమంది వాదించినా ఇది తరగని ప్రేమ పిచ్చి. అదో ఆకర్షణ అని తెలేదాక అంతే. ప్రేమా పిచ్చి ఒకటే. అదో ఆకర్షణ, అదో అవసరం అంతె.
"దాహవేస్తే, చల్లటి మంచి నీళ్ళు తాగితే ఆ దాహం తీరుతుంది గానీ, చల్లటి మంచి నీళ్ళని గురించి ఇదిలా ఉంటుంది కామోసు అని కలలు కంటేనూ, కవిత్వం రాస్తేనూ, లేదా, దాన్ని రసాయన విశ్లేషణ చేస్తేనూ ఆ దాహం తీరదు!"

కత్తిలా చెప్పారు!!
:-)
aswin budaraju said…
వయసు కోతి వంటిది మనసు కొమ్మ వంటిది,
ఊపేసి పోతుంది మొదటిది, ఆ
ఊసును మరవనంటుంది రెండవది.

ప్రేమ, సెంట్ పర్సెంట్ తాడేపల్లి వారిది కరెక్ట్
కొత్తపాళీ గారు కొత్త కాన్సెప్ట్ మీదరాశారే :)
కుమ్మేసారు మాష్టారూ! యవ్వనప్రేమను దోషపూరితంగా చూసే ఈ సమాజం సెలెబ్రేట్ చేసే ప్రేమలన్నీ విషాందాంతాలే. దీనిలో పెద్ద conspiracy ఉందని నా ప్రఘాడనమ్మకం.

జీవితంలో యవ్వనప్రేమని అనుభవించనివారుమాత్రమే, ప్రేమా పెళ్ళిని ఒకగాటనకడతారు లేకపోతే ‘ప్రేమకు పర్యవసానం పెళ్ళికావడమే’ అనుకుంటారు.వారితో ఎంత చర్చించినా ఆ అనుభూతిని కనీసం గోరంతకూడా వివరించలేము. Right thing to do is asking them to love, be loved or be in love.
కల said…
కొత్తపాళీ గారు,
ఈ చర్చలో ప్రేమంటే ఏమిటి? పెళ్ళంటే ఏమిటి అనే నిర్వచనం నేనివ్వాలని కూడా ప్రయత్నించలేదు. అస్సలు ఆ చర్చలో నేనస్సలు ఆ విషయమే చర్చించలేదు. కావాలంటే మరలా ఇంకోసారి చదవండి.

ప్రేమ అనిర్వచనీయమైనది లేదా నిర్వచనీయమైనదో కూడా నాకు తెలీదు. నాకు తెలిసినంతవరకూ అదో అనుభూతి అంతే. అది చదివినవారు వారివారి అభిప్రాయాలని అక్కడ చెప్పారు. వారి అభిప్రాయాలని నేను గౌరవిస్తాను. అలా గౌరవించినంత మాత్రాన వాటిని ఒప్పుకొని తీరాల్సిన అవసరమేమీ లేదు.

నా సందేహం ప్రేమని పెళ్ళిని కలిపి చూడటం ఎలా? దీనికి మిగతావారు వారి వారి అభిప్రాయాలని అక్కడే చెప్పారు. ప్రస్తుత నా అభిప్రాయం ప్రకారం రెండూ వేరు. ఆ చర్చలో రెంటిని కలిపి ఒకే త్రాసులో తూచాలని నేను అనుకొన్నా, కాకపొతే అది జీవితం అనే త్రాసు.

ప్రేమలో ఎన్ని రకాలున్నాయో, లేదా పెళ్ళిళ్ళు ఎన్ని రకాలో చర్చించడం కూడా నా ఉద్దేశ్యం కాదు. ప్రేమ విఫలమవడానికి లేదా పెళ్ళి విఫలమవడానికి కారణాలేంటో కూడా నేను చర్చించాలి అని అనుకోలేదు. ప్రేమ విఫలమైతే ప్రేమంటే అంతే, అది ప్రేమ కాదు ఆకర్షణ అనే జనరలైజ్ స్తేటుమెంట్లు కూడా నేనివ్వను, ఇవ్వలేను. బయటి నుంచి చూసేవారికి అది అలానే కనిపించవచ్చేమో. ఇలానే పెద్దలు చేసిన పెళ్ళి కూడా విఫలమైతే పెద్దలు చేసేవన్నీ ఇలానే అని కూడా చెప్పలేం. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు ఏది విఫలమైనా దానికి కూడా అన్నే కారణాలుంటాయి అనేది నా నిశ్చిత అభిప్రాయం.

ప్రేమ త్యాగం, అమలిన ప్రేమ, నిస్వార్ధ ప్రేమ, ప్రేమకు మరణం లేదు ఇలాంటివన్నీ సినిమాల్లో మాత్రమే బావుంటాయి. అదే నిజజీవితంలో?

ప్రేమంటే ఒక నిర్ధారణకి ఎవ్వరూ, ఎప్పుడూ రాలేరు. ఒక తల్లిని ప్రేమంటే ఏమిటో అడిగితే తన బిడ్డ మీద తనకుండే వాత్సల్యం అంటుంది. అదే ఒక యువకుణ్ణి అడిగితే తన గర్ల్ ఫ్రెండు మీద ఉండే ఆకర్షణ అంటాడు. కొత్తగా పెళ్ళయిన జంటని అడిగితే మా మధ్య ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్న అనుభంధం అంటారు. ఇరువది ఏళ్ళు కాపురం చేసిన జంటని అడిగితే మా ఇద్దరి మధ్యనున్న నమ్మకం, అవగాహన అని అంటారు, అదే నన్ను అడిగితే మా నాన్న మీద నాకుండే గౌరవం ప్రేమ అంటాను. ఇలా ఎవర్ని ప్రశ్నించినా ఏదో ఒక రకమైన ద్వైదీభావంలోనో, విరుద్దభావంలోనో ఉన్న సమాధానం వినిపిస్తుంది. కాబట్టి ప్రేమంటే ఏమిటో తెలుసుకోవడం అనవసరం, ప్రేమని అనుభవించడం మేలు అనేది నా అభిప్రాయం.

దాహం తీరాలంటే నీళ్ళు తాగాలని ఎవరిని అడిగినా చెబుతారు. అదే దాహం అంటే ఏమిటి అని అడిగితే?
ప్రేమంటే ఏమిటో తెలుసుకోవాలంటే ప్రేమలో దిగాలా? లోతెంతో తెలుసుకోవాలంటే ఏటిలో దిగాల్సిందేనా?
ఇక్కడ నా ప్రశ్న దాహం తీరాలంటే ఏమి చెయ్యాలి అని కాదు, దాహం అంటే ఏమిటి? దానికి అందరూ వారి వారి అభిప్రాయాలని (అంటే ఇది వరకు దాహం వచ్చినప్పుడు వారికేం అనిపించిందో, లేదా వారి ప్రక్కన ఉన్నవారికి దాహం వేసినప్పుడు ఎలా ప్రవర్తించారో చెప్పి, దాని వల్ల ఒక అంచనాకి రమ్మన్నారు.) చెప్పారు. ఇది చర్చ అని నేననుకోవడం లేదు. నా ఆలోచనా పరిధిని కొంచెం పెంచుకొనే ప్రయత్నం చేశాను అంతే. ఇది మీలాంటి వారికి వృధా అనిపిస్తే అది కూడా మీ అభిప్రాయమే అని నేననుకొంటాను. అలానే ఆ అభిప్రాయాన్ని గౌరవిస్తానే కానీ విమర్శించను.
Bolloju Baba said…
i was split somewhere between ....... (where i dont know). :-)

bollojubaba
laxmi - ఇక్కడ నేను మాట్లాడింది కచ్చితంగా స్త్రీపురుషుల మధ్య ప్రేమ గురించే.
రాకేశ్వర - నేను చెప్పిన వరుసే సరైనదని నా అనుమానం.
రవి - ఎవరో మహానుభావులు ఏం చెప్పారో తెలుసుకోడం కొంత వరకే ఉపయోగిస్తుంది.
తాడేపల్లి - కానీ మాస్టారూ, ఇతర ప్రేమలు (తలిదండ్రులు, పిల్లలు, తోబుట్టువులు) ఎల్లకాలం మనతో ఉండవు. స్త్రీపురుషుల మధ్య ప్రేమ వెనుక కలిసి ఒక సహజీవనం నిర్మించుకోవాలనే ఒక పాజిబిలిటీ ఉంది, అది బతి బట్ట కట్టినా, కట్టక పోయినా.
సిసిము - మంటల్ మంటలు మంటలు :)
Purnima - did you?
అబ్రకదబ్ర - అయ్యా ఉన్న అనిర్వచనీయాలతోనే ఇక్కడ ఛస్తుంటే మీరు ఇందులోకి కవిత్వాన్ని కూడా కలుపుతారూ?
రమణి - అంతేనంటారా?
aswin - మీకు నిజజీవితంలో షైలాబాను ఎదురయ్యే వరకే.
కత్తి - మధ్యలోఈ యవ్వన ప్రేమేవిటి? మీరు గనక లవ్ మినిష్టరు ఐతే .. పాతికేళ్ళు దాటితే ప్రేమకి రిటర్మెంట్ అనేట్టున్నారే?
కల - అలాగే అభిప్రాయాల్ని గౌరవిస్తూ ఉండండి, మంచిదే. మీ ఆలోచనా పరిధి విస్తరించిందని ఆశిస్తాను.
బాబా - There is no in between - either you drown or don't put your foot in :)
నమస్కారం! మీ రచనలు చాలా బాగున్నాయి.నా కలం పేరు "శ్రీసత్య".నేను నా బ్లాగుల ద్వారా "కవితలు,అందం నా హక్కు.... అనే అంశంతో కూడిన చిట్కాలు,మొదలైనవి ప్రచురించనున్నాను".మీ అందరి ఆశీసులు నా పైన ఉండాలని కొరుకుంటున్నాను.
http://sreesatya.blogspot.com

ధన్యవాధములు...
@కొత్తపాళి: నిజమే..మిస్టేక్ జరిగిపోయింది. అయినా, ప్రేమలో ఉన్నవాళ్ళెప్పుడూ నిత్యనూతనులేకదండీ! అడ్జెస్టైపోవచ్చు.
gaddeswarup said…
Kottapali garu,
My two cents. I think that the questions are vague and difficult.
Perhaps, instead of trying to define love, one can try to see what we commonly think of love does, and then see whether we can define it. You have not really specified, except in comments, whether you meant short time or long time love and what age group you are considering.
If it is long term love, it is definitely connected to family. I have seen cases of rivalry of husband and son for a woman's love. I have also seen cases of infidelity of spouses (husband, wife, and sometimes both) again coming back together with what seemed like love when children's welfare is threatened, and continuing their lives in close affection.
If it is short term love, it may be more sexual at younger ages and more frindship like in older ages.
It is not clear to me what is so unique about one person to fall in love to the exclusion of others. Perhaps at certain ages people are prone to some attachments related to sex outside the family (apparently, those who grow up together at a very young age are not sexually attracted to each other) and fall in love with more or less the first person with a group of characteristics outside the immediate family. They may marry a different person depending on the circumstances, but I have heard of cases where this old love is rekindled in meetings after several years.
Moreover, there seem to be lot of cultural influences. In countries like India where opposite sexes do not mix that much (in my days) the first loves seem more intense.
In the old days, before modern medicines, many had teeth and skin problems. There are claims that some of the intense poetry in old days is due to unrequitted love(sex?).
I personally think that the intense feeling that one gets when one is mentally and physically close to another person has some of the characteristics of love. This of course is difficult to sustain over long periods, even in marriages. But we are also creatures of habits and perhaps after some age not attractive to others and marriages survive to some extent.
People of my age tend to have what is called 'chadastam' in Telugu (though my wife and children say that I am improving) and I may have completely misunderstood you and have gone on with my 'sodi'.
Anonymous said…
>>>"దాహవేస్తే, చల్లటి మంచి నీళ్ళు తాగితే ఆ దాహం తీరుతుంది గానీ, చల్లటి మంచి నీళ్ళని గురించి ఇదిలా ఉంటుంది కామోసు అని కలలు కంటేనూ, కవిత్వం రాస్తేనూ, లేదా, దాన్ని రసాయన విశ్లేషణ చేస్తేనూ ఆ దాహం తీరదు!"
kottapaligaaru,
ఒక చిన్న సందేహం. ఇదే లాగిక్ ని అనుసరించి జీవితాన్ని జీవించండి...దానికో నిర్వచనం వెతికడం కంటే అని కూడా అనవచ్చు ఎమో...దీని పై మీ స్పందన ఏంటి?
Anonymous said…
"వలపెరుంగక బ్రతికి, కులికి మురిసేకంటే
వలచి విఫలమ్మొంది విలపింప మేలురా..''
అని పెద్దలు చెప్పారు. మీదీ అదే దారి.
అనుభవసారాన్ని కాదనడం ఎందుకు..
ప్రేమిస్తే పోలే..! :)
kavya said…
అనాది కాలం నుంచీ ఇప్పటివరకు ఒక డిబేట్ కోసం టాపిక్స్ సూచించమంటే మొదటి మూడింట్లో "ప్రేమంటే ఏమిటి" అన్నది తప్పకుండా ఉంటుందేమో!పది మందిని ప్రేమగురించి మీ అభిప్రాయం చెప్పండి అంటే ఇరవై రకాలుగా చెప్తారు.మొత్తమ్మీద మీరన్నట్టు అనంతమైన ప్రేమ పూర్వోత్తరాల గురించి ఆలోచించడం కంటే,ప్రేమని ప్రేమించి,ప్రేమచే ప్రేమించబడడమే అన్నింటికైనా ఉత్తమమైన,ఉన్నతమైన పద్ధతి..
Anonymous said…
Love, being manifold, does not lend itself to a single definition. All I can sum up is that it is perhaps a state of inoffensive mindset, continuing as such, as long as it can retain its inoffensive-ness. It may not always be an enduring feel.