అమ్మ 3: అంతర్ధానమైన రోజు

అనుభూతి

(1)
పురందరదాసు కీర్తనేదో
ఒక మధ్యాహ్నం
బయటెక్కడో కాస్తూన్న ఎండలోకి
చూస్తూ నాదస్వరంలో విన్నప్పుడు

ఆ మేఘాలు కదలాడినై
గాలి పిచ్చిగా పర్వెట్టింది
గగన నీలం పల్చబడింది .. చైతన్యం లోని విస్తృతమై
నా మేనంతా ఏవో పులకలు
కనులు తడి
ఆపుకోలేని అనంత జ్ఞాపకాల వెలుతురు
ఎప్పుడో చచ్చిపోయిన అమ్మ గుర్తుకి
ఆదిశక్తి తనువంతా విద్యుత్తులా ప్రాకి

ఎన్ని గమకాలు ఆ నాదంలో
జగత్తంతా శుభంలో పూచి
మన గుమ్మానికి కట్టిన తోరణాలు అల్లాడినట్లు
ఎంత విసుగు ఆ జాజ్ మ్యూజిక్
వాల్ట్జ్ ఇవ్వ గలదా
ఈ పురా చైతన్యానుభూతి?
ఆ బూర వూదినవాడు
ఇదిగో ఇప్పుడు మేఘంలో
అడుగో సూర్యుడి మీద పడుకుని
మరో తౄటి తారల చుట్టూ దోబూచులు
మరో లిప్త మన ఇంట్లో, నీడలో, హృదయంలో
సాగర సంగీతాన్ని నిశ్శబ్దం చేసి
సాగరాన్ని నిస్తబ్ధం చేసి
ఎన్నో యోజనాలు వెళిపోతున్నాడు.

ఆ సుస్వరం వెళిపోయిన దారినే వెళితే
అక్కడ అమ్మ
నాదం నిండా వాత్సల్యం పొంగి పొరలి
పురా బాల్య స్మృతలతో తలంటు పోసి
స్వఛ్ఛ ప్రేమతో సాదు బొట్టు పెట్టి
సర్వ జగత్శరీరాన్ని ధవళవస్త్రంతో తుడిచి

ఒకటే నాదం
ఆనంద నినాదం
నాదస్వరంలో
ఆది స్వరంలో

(2)
గగన నీలాన్ని
గాలి పొరలు పొరలుగా చీల్చుతోంది
రెండూ అదృశ్యములే
దిక్కులు ఊహా జనితాలు
దిక్కులు లేవు
కృష్ణుడు దిగంబరుడు
కృష్ణుడు శ్యామం
ఏమీ లేనిది నీలం
ఆకసం ఏమీ లేనిది

(3)
ఇది నాది
ఈ సంగీత సంప్రదాయం నాది .. ఇది అనాది
అమ్మలా ఇది ఆదిశక్తి

పురందరదాసుతో బాటూ నేను
అక్కడ చంద్రుని చుట్టూరా నేను
చుక్కల్లో తప్పటదుగులు వేస్తూ నేను
నాతో బాటూ రండి

అదుగో ఆకాశం మన కోసం గీచిన హాస రేఖ.
అదుగో ఎండలో ఇంకా మెరుస్తోంది
ఏ సాయంత్రానికో వెళ్తాం మనం
జడం నుంచి చైతన్యానికి
నాదస్వరం గాలి మూలల్లోకి పాకుతోంది
మన గుమ్మాల తోరణాలు కదలాడుతున్నై
గగన నీలం పల్చబడుతోంది
ఎవరో పిలుస్తోన్నారు
ఆ మండిపోతున్న మేఘాల కొసనుండి.
వేగుంట మోహనప్రసాద్ మాటల్లో అమ్మకి నివాళి
*** *** *** *** ***
వేంపటి అన్నపూర్ణ
1936 - 1998

సంగీతం వినడం నేర్పిన అమ్మకి .. సదా కృతజ్ఞుడనై

Comments

ప్రతి వ్యక్తి జీవితంలో అమ్మ పాత్ర అనుపమానం.. మీకు జీవితపు విలువలు నేర్పడంతో పాటు ఒక ఉత్తమాభిరుచి అలవడడానికి కారకులైన మీ అమ్మగారికి మీరు అర్పించిన నివాళి ఎంతో హృద్యంగా ఉంది! ఫోటో పై నించి చూపు మరల్చలేకున్నాను!!

కవితలన్నీ అద్భుతంగా ఉన్నాయి.. సంగీతాన్నీ, అమ్మనీ ఎంత బాగా అనుసంధించారో అనిపిస్తుంది! ఈ సంకలనం పేరేమిటి?
Anonymous said…
ఈ కవిత మీరు రాసినది కాదా? అద్భుతమైన అనుభూతి కలుగుతూంది ఈ కవిత చదువుతుంటే. ఎన్ని సార్లో చదువుకుంటూ అలాగే ఉండిపోవాలనుంది. అందరితో ఈ కవితని పంచుకున్నందుకు ఎంతో కృతజ్ఞులం.
Anil Dasari said…
కవితలు నాకు పెద్దగా ఎక్కవు కానీ ఈ కవిత పూర్తిగా చదివించింది. ఎక్కడ నుండి పడతారు ఇలాంటివి? చాలా బాగుంది.
Anonymous said…
మీ అమ్మగారి జ్ఞాపకాలు నా కళ్ళను కూడా తడి చేసింది. చాలాసేపు పట్టింది ఆ అనుభూతినుండి తేరుకోవడానికి. అద్భుతమైన కవిత!
Bolloju Baba said…
మో ఇంత సరళంగా వ్రాసారా? ఆశ్చర్యంగా ఉందే?
బహుసా అమ్మదగ్గరకు వచ్చేసరికి అస్ఫష్టత, సంక్లిష్టత ఉండవు కదా అందుకేనే'మో.

బొల్లోజు బాబా
Anonymous said…
పురంధరదాసుని, పురా జ్ఞాపకాలను, పుడమితల్లిని, కన్న తల్లిని అన్నింటిని మాలకట్టిన కదంబమాల ఇది. వారందరికి నా అంజలి.

కల్పనారెంటాల
పోస్టులోనే చెప్పినట్టు ఈ పద్యం రాసింది ప్రసిద్ధ కవి వేగుంట మోహన ప్రసాద్ గారు. ఇక్కడి వ్యాఖ్యాతలు చాలామంది గమనించినట్టు, అమ్మకి, కర్ణాటక సంగీతానికి, కమ్మని జ్నాపకాలకి కలుపుతూ కట్టిన చక్కని మాటల వారధి ఈ పద్యం.
ఈ పద్యం నాకు ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు సమకూర్చిన యువ నించి యువదాకా అనే సంకలనంలో దొరికింది.
రాఘవ said…
"సంగీతం వినడం నేర్పిన అమ్మకు... సదా కృతజ్ఞడనై" -- ఆహా అనిపించింది.
మాలతి said…
మోహనప్రసాద్ గారి పేరు వినడమే కానీ కవితలు చూడలేదు. నేను కూడా స్పందించగలిగిన అద్భుతమైన కవిత.
అందించినందుకు థాంక్స్, కొత్తపాళీగారూ.
- మాలతి
ramya said…
అద్భుతం
Ramani Rao said…
అమ్మ ఆవిర్భవించిన రోజు అని మొదలు పెట్టి అమ్మ అంతర్ధానమైన రోజు అంటూ ఎంతో హృద్యంగా ముగించారు, అప్పుడే అయిపోయిందా? అన్న ఫీలింగ్ కలగజేసారు.

మీకు ఒక ఉత్తమాభిరుచి అలవడడానికి కారకులైన మీ అమ్మగారికి, మీరిచ్చిన నివాళి, ఎంతో హృద్యంగా ఉన్న ఈ కవితా కంట తడి పెట్టిస్తోంది. తేరుకొని వ్యాఖ్య రాయడానికి ఇంత టైం పట్టింది.

అమ్మగారి రూపం పాత సినిమా హీరోయిన్లను తలపుకు తెస్తోంది.
rākeśvara said…
పురంధర దాసు, ఆదిశక్తి, నాదవాద్యం - ఈ మధ్య నా బుఱ్ఱలో కూడా ఇవే తిరుగుతున్నాయి. "దాసర పదగళ" వ్యామోహం పట్టుకుని మూడు సీడీలు కొనడం, వాటిని అర్థం చేసుకోవడానికి కన్నడ "కళితుకో"వడం.. ఒక కీర్తనకి తెలుగానువాదం చేసి ఇంకా ఎక్కువ మందికి వినిపించాలనే ప్రయత్నం... అన్ని అయిపోయాయి.

అలానే మొన్న ఆది వారం లేవగానే ఎవరో వీధిలో ఏదో బూర వాయిస్తూంటే, అలానే మంచం మీద కూర్చుని వింటూంటే, ఇంతే ఇంక చాలు జీవితం అని అనిపించింది.

విశ్వంలో ఎంత గొప్ప అంశాన్నైనా/వస్తువునైనా ఒక బూర చేసే లిప్త పాటు శబ్దంలో బంధించవచ్చగదా అనిపించింది ...
రాకేశ్వర, నిన్ననే చూశాను నీ బ్లాగులో పురందరదాసుని తెలుగులో అనువదించే పరిశ్రమారంభం. మంచి ప్రయత్నం .. విజయోస్తు!

ఇలా పొద్దున్నే కంటికి కనబడకుండా బూర ఊది మన మన్సుని జోలెలో వేసుకుని తీసుకెళ్ళిపోయే ఒక వీధి పాటకుడి గురించి శ్రీరాముడు అప్పుడెప్పుడో ఓ మాంఛి టపా రాశాడు.

నేను అనుకుంటూ ఉంటా .. గొప్ప అనుభూతిని మాటల్లో చెప్పగలిగిన వాళ్ళు కవులవుతారు. ఆ చెప్పాల్సిందేదో మాటలకి అందనిదీ అతీతమైనదీ ఐన అనుభూతిని పొందిన వాళ్ళు వాగ్గేయకారులవుతారు అని.

మా అమ్మ జ్నాపకాన్ని నాతోపాటు పంచుకున్న మిత్రులందరికీ ధన్యవాదాలు.
ఏమి చెప్పుదుఁ గురునాధా...అమ్మ టపాలు బాగున్నాయి.
ఎంతో ఆనందం కలిగింది మీ టపా చూశాక. ఇంత కాలం మీ టపాలు అంత శ్రద్ధగా చూడకపోవడం నాకు వెలితి అనిపించింది. తెలుగు పొయిట్రీ translation బాగుంది.

మీరు నేను వ్రాసిన "విజయ విశ్వనాథం" చూసి నా బ్లాగులో వ్యాఖ్యానించినందుకు నెనెర్లు. మీరు నవతరంగం గురించి చెప్పారు. చూశాను. అందులో ఏమయినా రీవ్యూస్ వ్రాయాలంటే ఎలాగో కాస్త చెప్పగలరా?

నేను ఆ బ్లాగుని ప్రారంభించటానికి కొంత సమయం పడుతుంది. నిజంగా నేను వ్రాసినది అంత బాగా కుదిరితే తప్పక నవతరంగం లో పెడుతాను.
pi said…
I love my pasta & wine! But at the end of the day nothing satisfies me more than carnatic music & curd rice.
మీ అమ్మగారి గురించి వ్రాసిన మూడు టపాలు బావున్నాయండీ. మంచి కవితలని పొందు పరచారు.
SaiBharadwaj said…
చాలా బాగుంది....