అక్షర ఈగ కుట్టింది

టైటిల్లోని రాక్షస సమాసాన్ని మన్నించండి.

ఆనందమో, విభ్రాంతో, చిన్నపాటి గర్వమో, కొద్దిపాటి విషాదమో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను.
సంగతేంటంటే .. ఇప్పుడే స్పెల్లింగ్ బీ (spelling bee) చూసి వస్తున్నా.

వీళ్ళసలు పిల్లలా, పిడుగులా .. డిక్షనరీలని నమిలి మింగి జీర్ణించేసుకున్న అక్షర రాక్షసులా.

నేను చూడ్డం మొదలు పెట్టేప్పటికి ఫైనల్సులో పదో ఆవృతం జరుగుతోంది. సుమారు పన్నెండు మంది పిల్లలు ఉన్నారు. అందులో కనీసం ఐదుగురు భారతీయ సంతతి వారు (సామియా నవాజ్ పాకిస్తానీ కుటుంబం నించి ఐనా కావచ్చు). దానికే నేను వింత పడుతుండగా .. ఇక మాటలు పలికే ప్రొఫెసరు గారు ఒక్కొక్క మాటా పలకడమూ, ఈ పిల్లకాయలు కాస్త పస్తాయించి, ఇంకొన్ని ప్రశ్నలడిగి, అటూ ఇటూ చూసి, .. ఇంతా చేసి ఏమాత్రం తడబాటు లేకుండా ఆ మాటకి స్పెల్లింగు చెప్పెయ్యడం చూసి విభ్రాంతిలోనే పడిపోయా. నేను చూడ్డం మొదలెట్టిన తరవాత ఒకటి రెండు రౌండ్లు పృఛ్ఛకుడు మాటని పలగ్గానే నేను కళ్ళు మూసుకుని నేనూ ఒక స్పెల్లింగు చెప్పా .. నేను చెప్పిన వాటిల్లో సగానికి సగం తప్పు :-)

అక్కణ్ణించి నేను ప్రయత్నించడం మానేసి, ఈ పిల్ల అక్షర రాక్షసుల ప్రతిభని చూస్తూ, విస్మయం చెందుతూ ఉండిపోయా.

ఎక్కడా కనీ వినీ ఎరగని మారుమూల పదాలకి స్పెల్లింగులు చెప్పడం .. అదలా ఉంచితే .. తమ కుటుంబ సభ్యుల ఎదుట, తదితర అతిథులు, పృఛ్ఛకులు, న్యాయ నిర్నేతల ఎదుట, ముఖ్యంగా తమ ముఖంలో ప్రతి కవళికనీ పట్టుకుని దేశవ్యాప్తంగా ప్రసారం చేసే కెమెరాల ఎదుట నిలబడి, అంతటి వత్తిడిలోనూ ఏ మాత్రం తొణక్కుండా, తాము విజయం సాధించినప్పుడు అతిగా ఉప్పొంగి పోకుండా ఈ పనెండు పధ్నాలుగేళ్ళ పిల్లలు సంయమనంతో వ్యవహరించిన తీరు చూస్తే ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నా! ఏదన్నా ఒక మాటకి తప్పు చెప్పడం (ఒక్కోసారి కేవలం ఒక్క అక్షరం తేడా) వల్ల వైదొలగి పోయిన పిల్లలు కూడా ... సహజంగా కోంత నిరుత్సాహ ప్రదర్శన ఉంటుంది, కానీ కంట నీరైనా కనబడనియ్యకుండా పెద్దతరహాగా వ్యవహరించిన తీరు నిజంగా నన్ను విస్మయ పరిచింది. ఇంకో తమాషా, ఈ సారి పోటీలో మొదటి 12 స్థానాలు ఆక్రమించిన పిల్లల్లో ఎక్కువ శాతం ఆంగ్లం మాతృ భాష కాని తలిదండ్రులకి పుట్టినవారు!

చిట్టచివరి రౌండ్ కి మిగిలిన ముగ్గురిలో ఇద్దరు భారతీయ అబ్బాయిలు, ఒక తెల్ల అమ్మాయి. కేలిఫోర్నియా నివాసి, టియా థామస్ .. ప్రతీ ఆవృతంలోనూ .. కొద్దిగా ఆలోచించినా, చాలామట్టుకూ వెనువెంటనే సరైనా జవాబు చెప్పేసి చిలకలా చిరునవ్వు చిందిస్తూ ఉంది. చివర్లో ఆమె తప్పు చెప్పిన మాటేవిటో నాకిప్పుడు గుర్తు లేదు.

మా వూరి (నిజ్జంగా!) బుల్లాడు, సిద్ధార్థ చంద్ .. బొద్దుగా ముద్దుగా ఉన్నాడు .. porsopopeia అన్న మాటలో i మిస్సై, ఛాంపియన్ అయే ఛాన్సు కోల్పోయాడు పాపం. రెండో స్థానం లో నిలిచాడు.

పసుప్పచ్చ టీషర్టు వేసుకుని .. మొదటి రౌండ్లలో యమా సీరియస్సుగా మొహం పెట్టుకున్న ఈ ఇండియానా నివాసి, సమీర్ మిశ్రా .. రౌండ్లు గడుస్తున్న కొద్దీ .. కొద్ది కొద్దిగా ఆత్మవిశ్వాసం కనబరుస్తూ, చిరునవ్వులు రువ్వుతూ, ఆఖరి రౌండ్లో guerdon కి స్పెల్లింగ్ సరిగ్గా చెప్పి ట్రోఫీ గెల్చుకున్నాడు.

నా దృష్టిలో మాత్రం .. ఈ పిల్లలందరూ విజేతలే!
విజేతలకి అభినందనలు.

Comments

Anonymous said…
మన తెలుగు పిల్లలుకూడా ఉన్నారండోయి!
బుడ్డిగ సుబ్బరాయాన్ గారి మనవడు, ప్రత్యుష్ బుడ్డిగ, 2002 లో Spelling Bee లో మొదటి బహుమతి కొట్టేసాడు.
Anonymous said…
సాయి గుంటూరి కూడ మన తెలుగు అబ్బాయే! 2003 లో గెలిచాడు.
Anonymous said…
అవును. ఇది అంచనాకి కూడా అందని విషయం. చూస్తే కాని తెలీదు. ఈ చిన్నారులు గాలిలో, చేతిలో వ్రాసుకుంటూ ఠక్కున సమాధానం చెప్పేయటం. కరక్ట్ ఆన్సర్ చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఇవన్నీ వింత లోకంలో విహరింపజేస్తాయి. ఇందులో భారతీయ సంతతిదే పై చేయి అవటం గమనార్హం. రెండు మూడేళ్ళనుండి ఈ ప్రోగ్రామ్ ని చూస్తున్నాను. అయితే ఈ ప్రోగ్రామ్ ని స్పోర్ట్స్ ఛానల్ ప్రసారం చేయటం వల్ల అందరి దృష్టీ పడటం లేదు.
rākeśvara said…
మన వారు (ప్రవాస భారతీయులు) ఈ స్పెల్లింగు బీని పిల్లల నెత్తి మీద ఎంత ఎక్కువ రుద్దుతారంటే. చూసి వాటే బంచ్ ఆఫ్ నెర్డ్స్ అనిపిస్తుంది.

ఒక సారి ఇలాంటి పోటి ఒక దానిలో నేను మా అన్నయ్యా వెళ్ళాం. అనుకున్నాం రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదని.

భారతంలో లెక్కలు ఆంగ్లమూ మాత్రమే రుద్దుతారు. అక్కడ ఇంకా గొప్ప గొప్ప విధానాలు కనుగొని. పనికిమాలిన ఆంగ్ల నిఘంటువునే బట్టీ వేయిస్తారు.

అదేదో సీరియల్ చూస్తుంటే ఒక జోకు వచ్చింది.
"There is no diversity in my son's school, the only diversity they got is the Indian kid. And he too comes out once a year for the spelling bee" ఎవరో తెల్ల ఆవిడ అంటుంది అలా.
అంత చెండాలపు అభిప్రాయం చేసి పెట్టారు మన వారు.
శ్రీ said…
నేను ఇపుడే ఆ వార్త చదివి కూడలికి రాగానే మీ "అక్షర ఈగ" చూసాను. సిద్ధార్థ ఈ పోటీకి 50000 పదాలు నేర్చుకుని వెళ్ళాడట. స్పెల్లింగ్ బీలలో మన వాళ్ళదే పై చేయి, ఎపుడు చూసినా మన వాళ్ళు చాలా మంది ఉంటారు పోటీ లో.
Ramani Rao said…
రాకేశ్వరరావుగారి వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తున్నాను. ఈగ వాలడమే సహజసిద్దం. కుట్టడమంటే తట్టుకోడం కొంచం కష్టమేమో
గొప్ప ధారణశక్తిని కలిగివుండటం గొప్పసంగతే కానీ, స్పెల్లింగులను గుర్తుపెట్టుకోవడంలో ఆ పిల్లలు తమ శక్తినీ సమయాన్నీ ఉపయోగించడం సద్వినియోగమేనా అని నాకూ సందేహం.

ఆలోచిస్తే - చిన్నప్పుడు నాతో భగవద్గీతలోని ఒక అధ్యాయపు శ్లోకాలను భట్టీవేయించారు మా బళ్లో. చిన్మయానంద ఆశ్రమంలో ఏదో పోటీ కోసం. పోటీ తరువాత శ్లోకాలన్నీ త్వరగా మరచిపోయాను. దానివల్ల నాకు ఒరిగిందేమిటంటే చాలా పదాలు పరిచయమయ్యాయి. శ్లోకాలు నేర్చుకొనేటప్పుడు కొద్దోగొప్పో అర్థాలు కూడా తెలుసుకోవడంవల్ల ఈ కొత్తపదాలు మరెక్కడైనా కనబడితే వాటిని గుర్తించడం సాధ్యపడింది. వీటివల్ల తెలుగు భాషపైన కొంత మెరుగైన పట్టు దొరికిందనే చెప్పగలను.

అయితే - పిల్లల్లోని ధారణశక్తిని గుర్తించి, దాంతో వారిని రాచి రంపానపెట్టడం మాత్రం సవ్యమైన ఫలితాలనివ్వదు. పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారంటే స్పెల్లింగుల భట్టీయంలో ఏదో మజాననుభవిస్తున్నట్టే అనుకోవాలేమో!

ఇంకోసంగతి - విజయం ఎప్పుడూ ఉత్సాహాన్నిస్తుంది. కష్టంలోని ఆనందాన్ని తెలియజేస్తుంది. కష్టసాధ్యమైన మరో కార్యాన్ని సాధించేందుకు తగిన ఓపికను విజయం అందిస్తుంది. ఎవరో గుర్తు చేసేదాక ఆంజనేయుడు తన శక్తిని తానెరుగడంటారు. అలాగ, చిన్నతనంలోనే స్వశక్తిని గుర్తుచేసి స్వీయసామర్థ్యంపై నమ్మకం నింపేందుకు ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయనుకుంటాను. విజయమంటే పోటీల్లో ప్రథమస్థానం పొందడమొక్కటే కాదు కదా!
మీరు "అకీలా అండ్ ద బీ" చూశారా? మీకు నచ్చుతుంది చూడండి
ఒక గమనిక. స్పెల్లింగ్ బీలో పోటీ చెయ్యడానికి కేవలం పదాల స్పెల్లింగుల్ని భట్టీయం వేస్తే సరిపోదు. ఉచ్చరించే తీరుని బట్టి స్పెల్లింగుని గుర్తించడానికి కొన్ని మెళకువలు ఉన్నాయి. ఆ పద్ధతులు నేర్చుకుని ప్రయోగించడం ఇందులో ముఖ్యం.

విజయం సాధించడం లేకపోవడం పక్కన పెడితే, అంత గొప్ప వత్తిడిని తట్టుకుని పోటీలో పాల్గోవడమే ఒక గొప్ప సాధన. కేవలం వేల కొలదీ పదాల స్పెల్లింగులు భట్టీయం వెయ్యడమే గొప్ప అని ఆ పిల్లలు కానీ, వారి తలిదండ్రులు కానీ అనుకోలేదని నాకు నమ్మకమే.
Anonymous said…
స్పెల్లింగ్ అనేది రాతకే గాని, మాట కి వర్తించదు. అలాటిది మరి ఈ స్పెల్లింగ్ బీ కాంపిటీషన్లు (ఓరల్) పెట్టి ఉద్ధరించేది ఏమిటో అర్థం కాదు.
Srinivas said…
ఈ పోటీలో గెలవడంలోని గొప్పదనం దానికే పరిమితం అనుకుంటాను. ఇన్నేళ్ళూ గెలిచిన ఈగలు విద్యలో గొప్ప ఫలితాలు సాధించినట్లేమీ కనపడదు.

Spellbound పేరుతో ఒక డాక్యుమెంటరీ వచ్చింది ఈ పోటీదారులమీద కొన్నేళ్ళక్రితం. ఆసక్తికరంగా ఉంటుంది. మనకి తెలియని కోణాలూ చూపెడుతుంది.
Change Maker said…
అవసరమా అనవసరమా అని చూస్తే ఒలింపిక్స్ ని కూడా ప్రశ్నించాల్సి వస్తుంది.
బీ ఒక పోటి , పాల్గొనటం అందరి వల్ల కాదు. ఆ తల్లి తండ్రుల, పిల్లల ఇష్టం, కష్టం, త్యాగం వారిని గెలుపు బాటలో నడిపించింది.
rākeśvara said…
ఈ ఎస్ పి ఎన్ లో వస్తుంది ఈ బీ ఇప్పుడు.
మొదట చూస్తే ఇదేదో భారత దేశంలో జరుగుతుందా అనుకున్నాను.
ఆ తరువాత కొంత సేపటికి అమ్మో చాలా గట్టి పల్లలే అనుకున్నాను.
మధ్యలో ఒక చైనీసు సంతతి పిల్లాడికి సత్యాగ్రహ అనే పదంలో పోవడం చూసి బాధవేసింది. వాడికి ఇక గాంధీగారు జీవితాంతం గుర్తుంటారు.

ఆ తరువాత ఏదో ఫుటుబాలు టోర్నీ వచ్చింది. అప్పుడనుకున్నా, బీలో వెళ్ళే ప్రతి 10 మంది భారతీయ పిల్లలకీ ఒక్కడైనా సాకర్ లోకి వస్తే ఎంత బాగుంటుంది అని !
హూఁ...