భలే మంచి రోజు

రేపు అమెరికాలో ఒక ప్రత్యేకమైన రోజు. మెమోరియల్ డే అంటారు. జ్ఞాపకాల రోజు .. గుర్తు చేసుకునే రోజు.

చాలామందికి ఇది కేవలం ఇంకో సెలవురోజు. కొంతమందికి పొడుగు వారాంతపు రోజు .. ఎప్పుడూ మే నెల చివరి సోమవారం నాడే జరుపుకుంటారు. కొద్దిమందికి కాలి జోళ్ళ దగ్గిర్నించీ మోటరు కార్ల దాకా సకల వస్తువులూ "సేల్" లో దొరికే రోజు.

అసలు విషయం .. అమెరికా కోసం యుద్ధంలో ప్రాణాలర్పించిన సైనికులని గుర్తు చేసుకోవటానికి నిర్దేశించిన రోజిది.

ఎన్ని యుద్ధాలు .. మొదట స్వాతంత్ర్య సమరం .. అటుపైన సివిల్ వార్ .. మొదటి ప్రపంచ యుద్ధం .. రెండో ప్రపంచ యుద్ధం .. కొరియన్ వార్ .. వియెత్నాం వార్ .. ఆపరేషన్ డెజెర్ట్ స్టార్మ్ .. 2003 లో ఇరాక్ ఆక్రమణ .. ఇంకా రగులుతున్న రావణ కాష్టం ..

పోయినోళ్ళందరూ మంచోళ్ళు .. వాళ్ళనేమీ అంటవు. మిగిలి ఉన్న వారికే .. జ్ఞాపకాలైనా .. కోరికలైనా. యుద్ధ భూమి మీద బుల్లెట్ గాయం తగిలి .. బాంబర్ విమానం కూలిపోయి .. యుద్ధ నౌకని సబ్మరిన్ ముంచేసి .. మృత్యువుదేముంది, చిటికేసి పిలిస్తే .. ఒక్కోసారి పిలవకుండానే వస్తుంది. ఆ పోయినవాడు ధైర్యసాహసాల్తో పోరాడుతూ పోయాడని సర్ది చెప్పుకుంటాం .. మన ఆత్మ తృప్తికోసం.

ఒక మనిషిలో ఎంతో మెచ్చుకోవలసిన, ఆరాధించదగిన గుణాలు .. ధైర్యం, సాహసం .. ఇంత గొప్ప గుణాలూ, మానవ చరిత్రకే కళంకం తెచ్చే యుద్ధమనే అతి జుగుప్సాకరమైన ప్రక్రియలోనే గుర్తింపుకి రావడం .. మానవులుగా మనందరం నిజంగా సిగ్గుతో తలదించుకోవలసిన విషయం కాదూ? ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం ..

ఈ జ్ఞాపకాల రోజున ఒక ప్రతిజ్ఞ చేద్దాం. రేపు, ఎల్లుండి, పదేళ్ళ తరవాత .. సైనికులై అకాల మృత్యువు వాత పడకుండా .. మన పిల్లల్ని బతికించుకుందాం. యుద్ధం అవసరం లేకుండా చేద్దాం. అది సాధించిన రోజు .. అదీ నిజంగా గుర్తుంచుకో దగిన రోజు. భలే మంచి రోజు.
***
ఈ టపాకి ప్రేరణ ఈ రోజు CBSలో సీనియర్ జర్నలిస్ట్ ఏండీ రూనీ వ్యాఖ్య.

Comments

కొత్తపాళీగారూ
బావుంది.గమనిస్తే,అనేక తత్వ వేత్తలు,సైనికులనూ సైన్యాన్ని విమర్శిస్తారు.కానీ,వారి త్యాగాలే మనల్ని రక్షిస్తాయి.వాళ్ళు పశువులయి,మానవత్వం మరచి శతృవును చంపటం వల్లనే మనం భద్రంగా ఇళ్ళలో వుండగలుగుతున్నాము.అందుకే ప్రాణాలర్పించిన సైనికులకంత మర్యాద.ఏ మేరె వతన్ కే లోగో అన్న పాటలో'జబ్ హం బైఠేథె ఘరోమె వో ఝేల్ రహేథే గోలీ'అని వస్తుంది.ఇదే భావం!
Ramani Rao said…
"No one would remember on Memorial Day that Eddie G. had promised to marry Julie W. the day after he got home from the war, but didn’t marry Julie because he never came home from the war. Eddie was shot dead on an un-American desert island, Iwo Jima."

సైనికుల వ్యక్తిగత జీవితాలకి ఆటంకము కలిగించి, దేశాన్ని/ప్రపంచాన్ని కాపాడుకే ఈ జై జవాన్ల సంస్మరించూకొంటుంటే మాత్రం వారి కుటుంబాల బాధలు తీర్చగలమా అనిపిస్తుంది. వారి, వారి కుటుంబాలకి మాత్రమది తీరని లోటే అన్న బాద కంట నీరు తెప్పిస్తుంది. నిజమే పోయినోళ్ళు అందరూ మంచోళ్ళే! హు! ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులే?? ఎంతవరకు అలా పాపం చేదు అనుభవాలని నేమరేసుకొంటూ.. ఎంటో ఎంతో బాధాకరమైన రోజిది. అమెరికన్లకి ముఖ్యంగా సైనికుల కుటుంబాలకి. ఏది ఏమైనా వారికి, ఇక్కడ మన ఇండియా ప్రజల తరుపున మా అందరి నివాళులు.
మేధ said…
నా కామెంట్ రాలేదేంటి...?!
మేధ గారూ .. ఏమో మరి. మీ కామెంటు నా కంట బడలేదు.
లతా మంగేష్ కర్ పాడిన అద్భుతమైన " యే మేరె వతన్ కే లోగోం" పాటను గుర్తు చేసారు.
Naga said…
పొద్దున సైకిల్ ప్రయాణంలో ఎదురైన ఇద్దరు చిన్నారులు హాపీ మెమోరియల్ డే అని అంటే ఇందులో హ్యాపీ ఏముందో అనే ఆలోచన వచ్చింది. ఈ టపా, లింకులను చదివే దాకా నాకు అసలు విషయం తెలియదు. నెనర్లు.
కొత్తపాళీ గారు,
మనకూ ఉందిగా ఒక మెమోరియల్ డే! (అమర వీరుల సంస్మరణ దినం జనవరి 30 న! ) ఆ రోజున అమెరికాలో చేసినంత హడావుడి ఇక్కడ కనపడదు. అది కూడా ఒక సెలవు రోజు , మిగిలిన జాతీయ సెలవు దినాల్లాగానే, ఆదివారం కాకుండా ఉంటే మంచిది,శుక్రవారమో, సోమవారమో వస్తే మరీ మంచిది. మరో రోజు సెలవు పెట్టి ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు! చాలా మందికి అది కేవలం గాంధీ వర్ధంతి గా తప్ప అమరవీరులు సంస్మరణ దినంగా తెలీయక పోవడం బాధ కలిగించే విషయం!

అనుకోకుండా ఒక జనవరి 30న ఢిల్లీ లో ఇండియా గేటు వద్ద నిలబడి, ఆ ద్వారం మీద లిఖించబడి ఉన్నా అమరవీరుల పేర్లన్నీ చదవడం నాకు మర్చిపోలేని అనుభవం!
.. ధైర్యం, సాహసం .. ఇంత గొప్ప గుణాలూ, మానవ చరిత్రకే కళంకం తెచ్చే యుద్ధమనే అతి జుగుప్సాకరమైన ప్రక్రియలోనే గుర్తింపుకి రావడం ...

Lions for Lambs అనే సినిమాలో సరిగ్గా ఇలాంటి విషయమే చర్చకు వస్తుంది. ఇందులోనే 'పొలిటికల్ సైన్సులో సైన్సేమిటి, సెన్స్ ఎంత' అంటూ ఒక చురుకైన మరియు ఆలోచనాపరుడైన యువకుడు తన ప్రొఫెసరుతో జరిపే సంభాషణ కాస్త ఆలోచింపజేసేదిగా వుంది.
థాంక్సుగివింగ్ తర్వాత నామటకు బాగా అర్ధవంతమైన శెలవు దినం మెమోరియర్ డేనే. రెండూ కళ్ళుచెమర్చే రోజులే. ఒకరోజు ఆనందభాష్పాలు, మరో రోజు విషాద స్మృతులు.
యుద్ధ వ్యతిరేకులంత రొమాంటిక్కు కాదుగానీ నేను ఖచ్చితంగా శాంతికాముకున్నే :-)
rākeśvara said…
గాజా పిరమిడ్ల తలదన్నే నేటి ఎకనమీ అనే మహోద్యమానికి, మహా జగన్నాథ రాథానికి, మహా భవనానికి కాపలాగా నిలచే జీవితాలు, వ్యవస్థలు, పండుగలు నంటి వివిధ వంకలలో ఒకటైన మన 'మెమోరియల్ డే' కి ...
నేను సైతం ౧౫౦ డాలర్లు ఆహుతిచ్చాను.
Sale లో ఒక not-at-all-recyclable electronic good, which promises a lot of utility and hence happiness, ని కొన్నాను !
నేను సైతం.