శ్రీపాద

ఓ కథక చక్రవర్తీ
ఓ తెలుగు వచన రచనకి రారాజా
ఆచంద్రతారార్కమూ తెలుగు సుధావృష్టి కురిపించే శరన్మేఘమా
దండాలు స్వామీ దండాలు

తెలుగు సరస్వతికి ముద్దుబిడ్డవి కాదుటయ్యా
నీ పాదాలు తాకి కళ్ళకద్దుకునే అదృష్టం లేకపోయింది, కానీ
నీ కథల్ని చదివి మనసుకు హత్తుకునే అదృష్టం .. అంతకన్నా గొప్పది కదూ!

తెలుగువాడిగా పుట్టినందుకు, నాలుగు అక్షరాలు చదవ నేర్చినందుకు .. జన్మ ధన్యమైంది!
***
శ్రీపాద వారి కథలు విని ఉండకపోతే తెలుగుల ఉనికి అయోమయం. చదువరులకే చదువు చెప్పగలిగినది ఆయన రచన. తీయందనపు తీయందనము చవులిచ్చినదాయన శైలి. ఆయన రచనలు మరో భాషకు లొంగవు. తెలుగువారైన వారికే శ్రీ శాస్త్రిగారి కథలు చదివి ఆనందించే అదృష్టము .. అన్నది మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి అంచనా.

ఫ్యూడల్ సంస్కృతి నుంచి వచ్చిన శాస్త్రిగారు ఆ సంస్కృతి పాత్రల చేత ఫ్యూడల్ సంస్కృతి భాషను మాట్లాడించినట్లు మరెవరూ మాట్లాడించ లేరన్నది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి కథల గురించి కొడవటిగంటి కుటుంబరావుగారి అభిప్రాయము.
అచ్చమయిన వ్యావహారికాంధ్రం వ్రాసిన వారిలో ప్రథమ గణ్యులు శ్రీపాద వారు .. అన్నది పిలకా గణపతిశాస్త్రిగారి బేరీజు.
సర్వదా తమరీనాటి యాంధ్ర వ్యావహారిక భాషా నిర్మాతృగణ ప్రథమ గణనీయులు అన్నారు విశ్వనాథ సత్యనారాయణగారు.
***

తీరా చూస్తే ఇందులో ఏమీ కథ లేదు. అంటే, ప్లాటూ, ట్విస్టులూ, సస్పెన్సూ .. ఇలాంటివి. అసలు నిజానికి జరిగే పెద్ద సంఘటనా ఏవ్హీ లేదు.

అట్లాంటి దాన్ని 50 పేజీల కథ రాశారా? అయితే పరమ బోరు కొడ్తుందన్న మాట. ఈటీవీ వాళ్ళా డెయిలీ సీరియల్లాగా సాగదీసి వొదిలి పెట్టుంటారు.

ఏవిటీ, అస్సలు బోరు కొట్టదా? పైగా కథ పూర్తయ్యే దాకా కింద పెట్టబుద్ధి కాదంటారా? విచిత్రంగా ఉందే?
***

పదహారేళ్ళొచ్చిన నరసమ్మ తొలిమాటుగా కాపరానికి వెళ్ళింది రాజమహేంద్రవరానికి. ఆమె అలా వెళ్ళి ఇంకా పక్షం రోజులు కూడా కాలేదు, ఇక్కడ మహేంద్రవాడలో తల్లి రాజమ్మకీ తండ్రి సోమసుందరానికీ మనసు మనసులో లేదు, వొంట్లో అసలే లేదు. ఇది లాభం లేదని తెల్లారు జాము బండి పట్టుకుని ఇద్దరూ రాజమహేంద్రవరం చేరుకున్నారు. అల్లుడు ఆశ్చర్య పడుతూనే సాదరంగా ఆహ్వానించాడు. ఒంటి చేత్తో చాకచక్యంగా సంసారం దిద్దుకుంటూన్న కూతురి సామర్ధ్యం చూసి మురిసిపోయినారా దంపతులు. ఇహ ఇంటికి తిరిగి వెళదామనుకునేప్పటికి మళ్ళీ కూతుర్ని వదల్లేక ఒక్క నాలుగు రోజులు కూతుర్ని కూడ తమతో పాటు తీసుకెళ్ళాలని ఉంది. అల్లుణ్ణడిగితే ఏమనుకుంటాడో. నరసమ్మకీ వెళ్ళాలనే ఉంది కానీ మొగుణ్ణి విడిచి వెళ్ళడమంటే ఏమీ బావులేదు మళ్ళీ. తీరా ఇటుతిరిగి చూస్తే మరునాడు ఆదివారం శలవే అతని ఆఫీసుకి. అయినా అత్తారింటికి అల్లుడు పిలవకుండా రాడు కదా. అంటే తన తల్లిదండ్రులతో ఇప్పుడు తన మొగుణ్ణి ఆహ్వానింప చెయ్యాలి. అదీ తన కోరిక మీద కాక, ఆ ఆలోచన వారికే పుట్టినట్టు భ్రమింప చెయ్యాలి. చతురమైన గడుసు సంభాషణని కోనసీమ గాలితోనే తనలో నింపుకున్న నరసమ్మకి ఇది అరచేతిలోంచి తీర్ధం పుచ్చుకున్నట్టు కాదూ. మహేంద్రవాడ వచ్చారు. ఆ ఆదివారమంతా అక్కడి సకల భోగాలూ, మధ్యలో కొన్ని గంటల విరహమూ అనుభవించారు. మళ్ళీ సోమవారం పొద్దు పొడిచేటప్పటికి పల్లకీ ఎక్కి మొగుడి వెంట రాజమహేంద్రవరానికి తిరుగు ప్రయాణమైంది నరసమ్మ.
***

ఆహా, ఏవిటా సంభాషణల చాతుర్యం, ఆ గడుసు పోకడలు, ఆ సన్నాయి నొక్కులు, ఆ వయ్యారాలు.

ఆహా ఏవిటా తలిదండ్రుల ఆప్యాయత, ఆ దాంపత్యంలో నిండైన శృంగారం, అనురాగం, ఇరుగు పొరుగువారి ప్రేమలేవిటి, ఆ హాస్యాలేవిటి, ఎత్తిపొడుపులేవిటి.

ఆ పాత్రల మనోభావాల చిత్రణేవిటి? ఒక్కొక్కరినీ ఒక నిల్వెత్తు బొమ్మగా చెక్కి ప్రాణం పోసి మనముందు నిలబెట్టినట్లున్నాయి కదా .. ముఖ్య పాత్రలే కాదు, పాలికాపు సూరిగాడు, పక్కింటి లచ్చమ్మ పిన్నీ, వారు వీరు అననేల?

శ్రీపాద వారి మాటల్లోనే .. భర్త వెనక పల్లకిలో వెళ్తున్న నరసమ్మ ..

ఇటు సిగ్గు, అటు బిడియం; ఇటు మురిపెం, అటు ముచ్చట; ఇటు వుత్సాహం, అటు వుల్లాసం; ఇటు దిటవు, అటు సాహసమున్నూ అయి, తెరమీద ఫిలింరీలు నడుస్తున్నట్టు తమ అంతఃపురిక విలాసాలున్నూ స్ఫురించాయి, వెంటనే. ముగ్ధమోహనమైన ఆమె మొగం ఆనంద ముగ్ధం అయిపోయింది దీంతో.
***

గూడు మారిన కొత్తరికం - కథ
శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి కథలు .. మొదటి సంపుటం
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్.

Comments

Nagamurali said…
అద్భుతంగా రాశారు.
pi said…
manchi pustakaanni parichayam chesinanduku thanks! Maa parents ee pustakam temmantaanu.
Giri said…
ఈ మధ్య హైదరాబాదు వెళ్ళనప్పడు "పుల్లంపేట జరీచీర" అని శ్రీపాద వారి నలభైఒక్క కధలు ఉన్న పుస్తకం ఒకటి కొన్నాను..అందులో గూడు మారిన కొత్తరికం లేదు..
@pi - Visalandhra published 3 volumes of his short stories, one volume autobiogrpahy (అనుభవాలూ జ్ఞాపకాలూనూ), two volumes of novelettes and plays. Moreover, another publishing house published a collection of all uncollected works under the title పుల్లంపేట జరీ చీర. ALl of them are worth possessing.

నాగమురళి - ధన్యవాదాలు.

గిరి - ఈ కథ టపాలో చెప్పినట్టు విశాలాంధ్ర వాళ్ళు వేసిన మొదటి సంపుటంలో ఉంది.
S said…
గూడుమారిన కొత్తరికం... భలే ఉంటుంది కథ... ఎన్నిసార్లు చదివానో గుర్తు లేదు... శ్రీపాదవారి స్టైలే వేరు అసలు... :) హి రాక్స్ రాక్స్ రాక్స్... ఇక మీ పరిచయం చాలా బాగుంది... మీరు కూడా రాక్ అసలు ! :p
అన్యాయమండీ... ఈయన కథలపై నేనే ఈ నెల ఓ పోస్టు రాద్దామనుకున్నాను; మీరు రాసేసారు.
సౌమ్యా .. :)

ఫణి - తప్పకుండా రాయండి. శ్రీపాద కథల గురించి ఎంత మాట్లాడుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. ఇందులో నేను మీ ఉరుముల్ని దోచేసిందేవ్హీ లేదు.
venkat said…
నాక్కూడా ఈ కథ చాలా ఇష్టం. అన్నింటికంటే శ్రీపాద కథల్లో నచ్చింది నోరూరించే పిండివంటలు, బుట్టల నిండా. కానీ మొదటి సంపుటంలో నా ఫేవరేట్ ’అన్నంత పనీ జరిగింది’. ఈ కథ గురించి కూడా రాయండి
padma i. said…
వెంకట్ గారు, మీరన్నది బహుశా "అనకున్నంత పనీ జరిగింది" అయి ఉండాలి. ఈ కథని గురించి బాపా రావు గారు "శ్రీపాద కథల్లో స్త్రీలు, స్వయం నిర్ణయత్వం" అన్న వ్యాసంలో చర్చించారు.
ఆ కథ సరైన పేరు అన్నంతపనీ జరిగింది - యే.
iddaru said…
మూడవ సంపుటి మాత్రమే దొరికింది. మీ వ్యాసం చదివాక పుస్తకం చదవాలనే ఉత్సాహం వచ్చింది.
leo said…
ఈటీవీ వ్యాఖ్య ఎవరిది ఎక్కడిది?
@iddaru - మీ బ్లాగు పరిచయం కావడం సంతోషం.
@ leo - ఈ టపాలో శ్రీపాద గురించి ఆనాటీ పెద్దలు వెలిబుచ్చిన అభిప్రాయాలు మాత్రమే పుస్తకం అట్ట మీదినించి తీసుకున్నా. మిగతాదంతా సొంతమే.
పద్మ said…
బాగా రాశారండీ.
శ్రీపాద వారి వడ్లగింజలు చదివారా?
Purnima said…
Kotha paali gaariki:

Sripaada vaari pustakaalu gurinchi adugutunte Hyderabad lo dorakatam ledu. pustakaala mudranale jaragatam ledu ani chepparu visaalandra vaaru. :-(

ee pustakaalu inkekkada dorukutaayo cheppagalaru..please!!
శ్రీపాద గారివి ఏ కథ తీసుకున్న అన్నీ ముత్యాలే కాని మేలిమి ముత్యం మాత్రం "మార్గదర్శి "