నిశాంత మహీజ ...

ముందొక సారి సంగీతంతో .. అటుపై సాహిత్యంతో నన్నొకటికి రెండుసార్లు పల్లిటీ కొట్టించిందీ పాట.

భాగ్యనగరంలో పని చేస్తుండగా నా సహోద్యోగి బల్ల దగ్గర నిల్చుని ఏవో కాయితాలు చూస్తున్నాను. అతని కంప్యూటర్ స్పీకర్లలోంచి సన్నగా వస్తున్నదీ పాట. ముందు పాటలో అంతర్గతంగా ఉన్న బలమైన లయ నన్ను ఆకర్షించింది. నా కాయితాలు నేను చదువుకుంటూ నా ప్రమేయం లేకుండానే దానికి తల ఊపుతున్నాను. పాట ముగిశాక అతన్నడిగాను, ఏవిటది, మళ్ళీ పెట్టమని. సఖి సినిమాలోదని చెప్పి మళ్ళీ పెట్టి సౌండు పెంచాడు. ఆ పేరు విని నాకేమీ స్ఫురించలేదు. ఇప్పుడు స్పష్టంగా వినబడే కానడ రాగం వినగానే నాకర్ధమైంది .. ఇది అలై పాయుదే అని ఊతుక్కాడు వేంకట సుబ్బయ్యర్ గారి కర్ణాటక సంగీత కృతి. ఇదేవిటి మరి ఏవో తెలుగు మాటల్లా వినబడుతున్నాయే .. అదే పేరుతో మాధవన్ షాలిని జంటగా తీసిన తమిళ చిత్రంలో ఈ కర్ణాటక కృతిని యథాతథంగా ఉపయోగించారు. ఓహో, ఈ సఖి అనే సినిమా దానికి తెనుగు సేత అన్న మాట! తమిళ సినిమాలో ఉన్న కర్ణాటక కృతిని కూడా తెలుగులో అనువదించి అదే బాణీలో వాడారే .. భలే ఉందే అని కొద్దిగా ఆశ్చర్య పోయాను .. అంతే .. అంత కంటే పెద్దగా పట్టించుకోలేదు.

ఇదంతా జరిగి ఐదేళ్ళు కావస్తోంది.

మొన్నీమధ్యన మన కల్హార స్వాతికుమారి గారు ఉన్నట్టుండి నిశాంత మహీజ శకుంత మరంద మెడారి గళాన వర్షించవా అన్నారు. ఒక్కసారి తాగుతున్న టీ కొరబోయి నోరు కాల్చుకుని .. అదేంటండీ బాబూ అట్లా జడిపిస్తే ఎలాగన్నాను. అమాయకంగా మొహం పెట్టి ఏదో మీలాంటి వాళ్ళు అర్ధం చెబుతారేమో నన్న ఆశతో అన్నారు. చూడు తల్లీ, ఏదో తెలిసిన నాలుగు తెలుగు ముక్కలు చెప్పుకుని కాలం గడుపుతున్నాను, ఇలా నిలదీయటం భావ్యమా అన్నాను. దయతల్చి ఆవిడే అర్ధం చెప్పారు. నిశాంత అంటే .. రాత్రి ముగిసింది అనగా ఉషోదయ వేళ .. మహీజ .. హమ్మ్ ఇది కొంచెం కొరకరాని కొయ్యే ...(భూమికి పుట్టినది - చెట్టు - థాంక్యూ వికటకవిగారూ) .. శకుంత .. చిన్నప్పుడు చదూకోలా? శకుంత పక్షులు పెంచుట చేత ఆమెకి శకుంతల అని పేరు వచ్చెను అని .. అవొక జాతి పక్షులన్న మాట. మరందం అంటే తేనె. ఎడారి గళాన వర్షించవా అనేది నాకూ అర్ధమైంది, తెలుగేగా! అంటే .. ఓ స్వామీ, తెల్లారు ఝాఁవున ఫలానా లాంటీ తేనెని ఎడారిలాగా ఎండిపోయిన నా గొంతులో కురిపించూ అని కవిహృదయం. అరె, భలేగా రాశాడే, ఎక్కడిదీ గీతం అనడిగా .. సఖి సినిమాలో పాట, అలై పొంగెరా అని సమాధానం. నాకు బల్బు కాదు కదా, ట్యూబులైటు కూడా వెలగలా!

అప్పుడిక లాభం లేదని ఆమె పాట సాహిత్యం మొత్తం పంపారు. చదువుతున్నా .. ఎక్కడో ఏదో జ్ఞాపకాల వీచికలు కదులుతున్నాయి.
అనంత మనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా
నిశాంత మహీజ శకుంత మరంద మెడారి గళాన వర్షించవా ...
అరెరే!
తరాన ననాన బిరాన వరాల .. ఇదేదో తెలిసినట్టు ఉందే?
అలై పొంగెరా? ఓ అలై పోంగెరా .. అలై పాయుదే .. కణ్ణా .. అలై పొంగెరా కన్నా .. భలే భలే..

ఏళ్ళ తరబడి కర్ణాటక సంగీతం వినివిని ఉన్న నాకు ఈ కృతి చిరపరిచయం. ఎందరో మహానుభావుల గళాన ఈ పాట వినే భాగ్యం నాకు దక్కింది. దీని తెలుగు అవతారం ఇలా తమాషాగా సాక్షాత్కరించడమే నాకు గొప్ప ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది.

ఊతుక్కాడు వేంకట సుబ్బయ్యర్ త్యాగరాజ స్వామికి ముందటి వాడు. ఆయన జీవితాన్ని గురించి మనకి ఎక్కువ తెలీదు గానీ బాహ్య ప్రపంచాన్ని మరచి సదా బాలకృష్ణ ధ్యానంలో కృష్ణ లీలల్ని గానం చేస్తుండేవారని ప్రతీతి. ఆయన కృతులు అద్భుతమైన లయ విన్యాసంతో నిజంగా బాలకృష్ణుడే నర్తిస్తున్నట్టు ఉంటాయి. ఆ గతి కూడా తిన్నగా ఉండదు, పసి పిల్లవాడి చిందుల్లాగే ప్రతి రెండు వాక్యాలకీ గతి మారి పోతుంటుంది. ఇహ వాటిలోని లిరికల్ బ్యూటీని చెప్పటానికి నా తమిళ జ్ఞానం చాలదు. అన్నట్టు మార్నింగ్ రాగా అనే తెలింగ్లీషు సినిమాలో షబనా అజ్మీ పాత్ర చివరకి తోడి రాగంలో పాడే పాట తాయే యశోద ఉందన్ ఆయర్ కులత్తు దిత్తన్ కూడా వీరి కృతే.

మొత్తానికి ఈ నిశాంత మహీజ నన్నొక ఊపు ఊపి వొదిలి పెట్టింది. ఏవిట్రా దీనిలో ఉన్న పస అని పట్టి చూశా .. మీరూ గమనించండి, ఒక్క నిమిషం మాటల్ని మరిచి పోయి .
లలాల లలాల లలాల లలాల - IUI అనే వరుస పదే పదే పునరావృతమవుతోంది.
దీన్ని ఛందస్సులో జ - గణం అంటారు. జ గణంతో జగడం కోరగా తగదు అన్నాడూ శ్రీశ్రీ సిరిసిరిమువ్వ పద్యాల్లో. అది సరే .. ఒకటే జ గణం ఇన్ని సార్లు రెపీటవడమెందుకూ?
పదండి, మా నిఘంటువు చూద్దాం .. కవిరాజ విరాజితము .. ఈ పద్యమునందు ప్రతి పాదమునను ముందు ఒక న గణమును, దాని పిదుప ఆరు (ఏకంగా ఆరే!) జ గణములును, అంత్యమున ఒక వ గణమును ఉండ వలయును. ఈ నిఘంటువు రాసిన మహానుభావుడు ఉదాహరణ ఇవ్వలేదు. ఇవ్వక పోతే మన సొంత తెలివి లేదా? డవిరెక్టుగా .. తెలుగు లెస్స అన్న తెలుగు వల్లభుడు శ్రీకృష్ణదేవరాయలవారి ఆముక్త మాల్యద నించే ఎగ్జాంపిలు తెచ్చి దాఖలు చేస్తున్నా ..

క.వి. జయ జయ చంద్ర దినేంద్ర శతాయుతసాంద్ర శరీర మహా ప్రసరా ..
ఓయబ్బో, ఇంతదానికి సాహితీసమరాంగణ సార్వభౌమ అని బిరుదొకటి, ఇంతకన్న మా వేటూరే గొప్పగా రాశాడులే పోవయ్యా.

చూడండి మళ్ళొక్కసారి .. అసలు ఎంత ముద్దొస్తున్నదో .. లేచి ఆ లయలో లీనమై చిందెయ్యాలనిపించటంలేదూ?
అనంత మనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా
నిశాంత మహీజ శకుంతమరంద మెడారి గళాన వర్షించవా
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిల్లు బిగించవా
సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిల్లు బిగించవా
కడలికి అలలకు కధకళి కలలిడు శశి కిరణము వలె చలించవా
చిగురు సొగసులను కలిరుటాకులకు రవికిరణాలె రచించవా
కవిత మదిని రగిలి ఆవేదనా
ఇతర భామలకు లేని వేదనో
కవిత మదిని రగిలి ఆవేదనా
ఇతర భామలకు లేని వేదనో
ఇది తగునో యెద తగవో ఇది ధర్మం అవునో
ఇది తగునో యెద తగవో ఇది ధర్మం అవునో
కొసరి ఊదు వేణువున వలపులే చిలుకు
మధుర గాయమిది గేయము పలుకగా
అలై పొంగెరా కన్నామానసమలై పొంగెరా
నీ ఆనంద మోహన వేణుగానమున .. ఆలాపనే .. కన్నా.. కన్నా..

ఆ మహా వాగ్గేయకారునికి దీటైన ప్రతి సృష్టి తెలుగులో చేసిన వేటూరికి జోహార్లు!
ఈ అద్భుతమైన కవిత్వాన్ని నాకు చూపించిన స్వాతి కి స్నేహపూర్వక కృతజ్ఞతాంజలులు!!
*** *** *** *** *** ***
కొసమెరుపు - పాట గురించి నా పైత్యంతా తీరిగ్గా చదివాక అసలు పాట వినకుండ ఎలా?
తమిళం లో
తెలుగు లో
తమిళం పాట ఒకబ్బాయి నోట

Comments

గురువు గారూ,

వ్వావ్, ఇంత కథ ఉందా ఈ పాట వెనకాల? నాకు బాగా నచ్చిన టపాల్లో ఇదొకటి అని చెప్పగలను. పాట ఇదివరకెన్నో సార్లు విన్నదే, ఇప్పుడు వింటే ఇంకా బాగుంటుందనిపిస్తోంది. ధన్యవాదాలు.
cbrao said…
ఎక్కువమందికి తెలియని పదాలలో ఖైదీ ఐన,వేటూరి అద్భుత సాహిత్యం,మీ టపా ద్వారా స్వతంతృరాలయ్యింది. రెహ్మాన్ పాటలు కాల పరీక్షకు నిలవవనే అపఖ్యాతి, ఇలాంటి పాటలతో తొలగ గలదు. ఈ పాట హరిణి, కల్యాణి, మహాలక్ష్మి కలిసి పాడిన బృందగానం.ఒక్కరే పాడినట్టుగా వినవస్తుందా? అదే ఈ పాటలో అందం.ఈ పాటను ఎలాంటి వాణిజ్య ప్రకటనలు లేకుండా ఇక్కడ వినండి. http://www.desimusic.com/music/telugu/songs/1427/sakhi.html
గిరిధరరావ్ said…
కొత్తపాళీ గారు,

Simply superb!
అభినందనలు.

గిరిధరరావ్
nagamurali said…
క్షమించాలి. ఈనాటి తెలుగు సినిమా పాటలమీద చాలా తక్కువ అభిప్రాయం కలవాళ్ళలో నేనొకణ్ణి. ముఖ్యంగా డబ్బింగ్ పాటలంటే నాకు చిర్రెత్తుకొస్తుంది. సెప్టెంబర్ మాసం, సెప్టెంబర్ మాసం, పాత గాజులు పుటుక్కుమన్నాయి అంటూ నేను పాడే పేరడీలకి మా ఇంట్లో తెగ నవ్వుకుంటారు. అలై పొంగెరా పాటలో ఒక మంచి ట్యూన్ ఉన్నది అని ఒప్పుకుంటాను. అయితే వేటూరి సాహిత్యం మాత్రం ఆ ట్యూన్ కి అనుగుణంగా దొర్లించిన పదాలే తప్ప అర్ధవంతమైన భావం అందులో ఉందని నేననుకోవడం లేదు. ఏవేవో పదాలు ట్యూన్ కి అనుగుణంగా గుప్పించడం, ఒక రొమాంటిక్ భావాన్ని కిట్టించడం గొప్ప విద్యయే కావచ్చు. కానీ పాట వింటున్నంతసేపూ అది చాలా ఎబ్బెట్టుగా ఉందన్న బాధ నన్ను తొలిచేస్తూ ఉంటుంది. ఈ డబ్బింగ్ పాటల్లో (ముఖ్యంగా ఉరికే చిలకా లాంటి పాటలు) సాహిత్యం మొత్తం తీసేసి కేవలం రహమాన్ సంగీతం మాత్రం స్వరాలతో ఉంటే బాగుండునని అనిపిస్తుంది. ఒక భాషగా తెలుగు మొత్తం దివాళా తీసేసిన భావం కలుగుతుంది నాకు ఈ డబ్బింగ్ పాటల మూలంగా...
nagamurali said…
ఇంకో మాట. వేటూరి సాహిత్యంలో నాకు అంత చిరాకు తెప్పించేది ఏమిటని మీరడగచ్చు. దుష్ట సమాసాలు. అంటే తెలుగు పదాల్నీ, సంస్కృత పదాల్నీ ఒకే సమాసంగా కలిపెయ్యడం. వాటిల్ని దుష్ట సమాసాలు అంటారు. ఉదాహరణ: ఎడారి గళం. అలాగే ’సాగర సంగమం’ లోని అద్భుతమైన మరొక పాటలో ’ప్రమిదే లేని ప్రమథాలోక హిమదీపం’ అన్న ప్రయోగం. అర్ధం చేసుకోకుండా ఆస్వాదించగలిగితే అద్భుతంగా ధ్వనిస్తుంది. అర్ధం తెలిస్తే చాలా ఎబ్బెట్టుగా, అతకని పదాలతో చేసిన పెద్ద ఆడంబరంగా అనిపిస్తుంది. అలాగని నేనేమీ పండితుణ్ణి కాను. అయినా ఏమిటో భాష మీద అభిమానం కొద్దీ చిరాకు, అంతే.
రాధిక said…
మహీచ అంటే ఎవరూ అర్ధాలు చెప్పనేలేదు.పాట విన్న కొత్తలో నేను అయితే ఈ లైన్లకు అర్ధం ఇలా చెప్పుకున్నాను. "రాత్రి అంతమయిపోతున్నవేళ భూమిపై ఉన్న శకుంత అనే తేనెను ఈ ఎడారి గళం లో వర్షించవా" అని.
మురళి గారి వేదన కొంతవరకు సబబే, కానీ డబ్బింగు పాటలకి రాజశ్రీ గారు అటుపై వేటూరి పరిమితుల్లో బాగా రాస్తారు. ఆ మధ్య ఈమాటలో "అరణ్య కవితలు" అన్నారని ఈ విమర్శే వచ్చింది.

ఇకపోతే, కొత్తపాళీ గారూ, ఓ చిన్న అక్షరదోషం ఉంది, దానితో కొంచం ఆ వాక్యం కుదరలేదు. దోషం సవరించినా పూర్తిగా కుదరలేదన్నది వేరే సంగతి.

అనంత మనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా
నిశాంత మహీచ శకుంత మరంద మెడారి గళాన వర్షించవా

పైన మహీచ కాదు అది మహీజ. మహీజ(మహీ=భూమి(పై) జ=జనించినది, చెట్టు)

వేకువఝామున చెట్టుపై గల శకుంతం వంటి తేనెను ఎండిపోయిన గొంతులో వర్షించు. నిజానికి, ఈ అర్ధం ఇలా కుదరలేదు.

బహుశా శకుంత పక్షి కోకిల లాగా అద్భుతంగా కూస్తుందేమో. అంచేత అలాంటి తేనె అని చెప్పినట్లున్నాడు. అప్పుడైతే కుదురుతుంది.
శభాష్ నాగమురళి. డబ్బింగ్ పాటల తెలుగు వింటే చెవుల్లో సీసం పోసినట్టుంటుంది. వేటూరి చేసిన పిచ్చి ప్రయోగాలు చాలా ఉన్నాయి. తల తోక లేకుండా lip sync కోసం ఎన్నో వ్యర్థ గీతాలు రాశాడు. సఖి చిత్రంలో ’స్నేహితుడా’ అన్న పాట one of rahaman's best. పాట సాహిత్యం మొత్తం నిరర్థకం. చరణంలో ’ఆవు వెన్న పూసి’ ఇంకా ఏంటో పిచ్చి పిచ్చిగా ఉంటుంది. కొత్తపాళీ గారు ! వేటూరి కొన్ని మంచి పదబంధాలు కూడా రాశాడు. కానీ 90 % చెత్తే రాశాడు.

p.s.: చెత్త డబ్బింగ్ పాటల రారాజు లు మరికొందరు : రాజశ్రీ (సుధలే చిలికెనే , మధువే పొంగెలే , తద్దినం పెట్టెనే ఇలాంటి పదాల నిపుణుడు)
ఎ ఎం రత్నం/ శివగణేశ్ : (ఫిఫ్టి కేజీ తాజ్ మహల్ నాకే నాకా : విన్నవెంటనే భళ్ళున వాంతి చేసుకోవాలనిపించే పాటల రచయితలు వీళ్ళు).

ఈ మధ్య పాటలు రాస్తున్న వాళ్ళలో ’వనమాలి’ ఒక్కడే చక్కగా రాస్తున్నాడు. అతనికి మంచి భవిషత్తు ఉంది. వేటూరి తకణం పాటలు రాయటం ఆపేస్తే మంచిది.
పర్సనల్ టేస్టు గురించి వాదించలేం. ఈ పాట మీకు నచ్చకపోతే ఆ విషయం చెప్పడానికి మీకు పూర్తి అర్హత ఉంది. దానికి క్షమాపణలు అనవసరం. ఐతే వ్యాఖ్యలు విషయానికి వొదిగి ఉంటే బాగుంటుంది.
దుష్ట సమాసాలు - నిజమే. ఐనా కొన్ని కొన్ని నప్పుతాయి, కొన్నైతే సాధుత్వాన్ని సంతరించుకుంటాయి కూడా. కవులు ఈ విషయంలో ఏ కాలంలోనూ మడి కట్టుకు కూర్చోలేదు, లాక్షణికులు నాలికలు పీక్కుంటే పీక్కున్నారు గానీ కవులు తమకి నచ్చిన ప్రయోగాల్ని ఎప్పుడూ కొత్తగా సృష్టిస్తునే ఉన్నారు.
వికటకవి - మహీజ గురించి మీరు చెప్పింది సమంజసంగా ఉంది. మారుస్తాను.
తెలుగు అభిమాని - వనమాలి గురించి ఇంకొన్ని వివరాలు ఎప్పండి ..ఏయే సినిమాల్లో ఏయే పాటలు రాశారు?
ఎంచేతో "జగణాలు" చాలా ఇంపుగా "ధ్వనిస్తాయి". :)
-------
ఈ పాట అర్థం నాకు తెలీదు. అంచేత అది అర్థవంతమైనదో కాదో తెలీదు. లయ బాగుంది. ఈ జగణాల సంగతి తెలియజెప్పినందుకు కొత్తపాళీ గారికి నెనరులు.

పోతే..
వేటూరిపై విమర్శ మరీ నిర్దాక్షిణ్యంగా ఉన్నట్టనిపించింది. డబ్బింగంటే ముఖ్యంగా కావాల్సింది పలికే పెదాలతో కదిలే పదాలు రాయడం -అంతే! అర్థం కోసం వెతకటం వృధా. ఒకవేళ అర్థవంతమైన పాటలూ, మాటలు ఎక్కడైనా కనబడితే అది ఆ కవి గొప్పదనమయ్యుండాలి. లేక కేవలం యాదృచ్ఛికమైనా అయ్యుండాలి.
మంచి టపా. మంచి పాట(లు). విడుదలైనప్పుడు ఈ పాట వినగానే చాలా చాలా బాగుందనిపించింది కానీ ఎందుకో కొంచెం చేదుగా కూడా అనిపించింది. ఆ చేదుకు అలవాటుపడటానికి కొంత సమయం పట్టింది. రహమాన్ పాటల్లో చాలావరకూ ఇదే సమస్య. ఆపాటలోని పదాల అమరికలో వున్న విశేషం తెలియజెప్పినందుకు కృతజ్ఞతలు.

వనమాలి వృత్తిరీత్యా జర్నలిస్టు. జన్మతః తమిళుడు. మరో మంచి యువరచయిత. ఇతని అసలు పేరు మణిగోపాల్ అనుకుంటాను. మొదటిసారిగా ఇతనిపేరును 'పితామగన్' సినిమాకు తెలుగు అనువాదమయిన 'శివపుత్రుడు' పాటలు విడుదలైనప్పుడు విన్నాను. ఇళయరాజా సంగీతం కూర్చిన పితామగన్ తమిళ పాటలను అర్థం కాకున్నా ఇష్టంగా వింటూవుండేవాణ్ణి. నేను ఉద్యోగం వెతుక్కుంటూ వున్న రోజులవి. ఉద్యోగం వచ్చాక ఈ పాటలు తెలుగులో వచ్చాయి. అవే బాణీలకే ఆర్పీపట్నాయక్ సంగీతం కూర్చారు. ఆ సినిమాలోని పాటల్లో నాకు అత్యంత ప్రియమైన పాటను తెలుగులో 'చిరుగాలి వీచెనే' అంటూ అనువదించారు వనమాలి. 'వెదురంటి మనసులో రాగం వేణువూదెనే' అంటూ పల్లవి ముగుస్తుంది. చాలా బాగుందనిపించింది. పాటంతా బాగుంది. చరణాల్లో ఒకచోట "తుళ్లుతున్న చిన్ని సెలయేరు - గుండెలోన పొంగి పొలమారు" అన్న పంక్తి నాకు చాలా చాలా నచ్చింది. 'పొలమారడమ'నే తెలుగుపదాన్ని తెలుగుపాటల్లో వినడం నాకదే మొదలు ఆతరువాతెపప్పుడూ మరేపాటలోనూ ఈ పదాన్ని ఎవరూ వాడినట్లు నాకు తెలీదు. ఎవరయ్యా ఈ పాట రాసింది - సిరివెన్నెలే అయ్యుంటాడనుకుంటూ కవరు చూశాను. వనమాలి. ఆ సినిమా తెలుగు డబ్బింగు కూడా హిట్టయిందంటే పాటల ప్రభావం తప్పకుండా ఒక ముఖ్యకారణం అయుండాలి. ఈమధ్య వచ్చిన 'హ్యాపీడేస్' సినిమా కోసం కూడా వనమాలి పాటలు రాశారు. తన సినిమాలకు వేటూరితోనే రాయిస్తూవచ్చిన శేఖర్ కమ్ముల మొదటిసారిగా వేటూరిని విడిచి, వనమాలిని ఎంచుకున్నారు. "అరెరే అరెరే మనసే జారే", "ఓ మై ఫ్రెండ్" ఈ పాటలు వనమాలివే.
cbrao said…
శివపుత్రుడు చిత్రానికి సంగీత దర్శకుడు ఇళయ్‌రాజా.ఆర్.పి.పట్నాయక్
"చిరుగాలి వీచెనే..చిగురాశ రేపెనే..
చిరుగాలి వీచెనే..చిగురాశ రేపెనే..
వెదురంటి మనసులో రాగం వేణు ఊదెనే..
మేఘం మురిసి పాడెనే"
అనే పాట పాడారు.
Anurup said…
కొత్తపాళీ గారు, టపా కెక ;) చాల బాగుంది. ఆ పాటలో అంత మదురత్వం వుందన్ని ఇప్పుడే గమనించ.
రవి said…
వావ్...టపా చదివిన తర్వాత అనిపించిన ఫీలింగ్. బొమ్మలు చూసిన తర్వాత...ఓహ్...

నిశాంత మహీజ శకుంత మరంద మెడారి గళాన వర్షించారు...మా మనసుల్లో..
వావ్... టపా, కామెంట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి.
Manipravalam said…
అద్భుతమైన టపా!
మంచి పాట విన్నా,వేటూరి కవిత్వం చదివినా మానసం అలై పొంగటం లో ఆశ్చర్యమేముంది?
లయ భంగం కాకుండా ,భావం చెడకుండా గొప్ప కవిత్వాన్ని పొదిగి పాటలు వ్రాయటం చక్కటి ప్రతిభ.వేటూరి గొప్ప కవిత్వం వ్రాయటం ,చెత్తపాటలు వ్రాయటం రెండూ నిజమే.కవితా విమర్శ లో హంసలలాగా క్షీర ,నీర న్యాయం చేయటం అవసరం.
అన్నట్లు సంస్కృతం లో ద్రవిడభాషను కలిపి కవిత్వం రాయటం బహుశా మధ్య యుగం నుంచే ఉంది.కన్నడ ,మళయాళ భాషలలొ ఈ పద్ధతి లో కవిత్వం వ్రాసిన ప్రసిద్ధ కవులు ఉన్నారు.ఈ శైలికి,పద్ధతికి మణిప్రవాళం అని పేరు.
కెంపుల్ని పగడాలతో పొదిగినట్లు!!

వెన్నెల
manipravalam-vennela.blogspot.com
టపా మరియు స్పందనలు బాగున్నాయి. వేటూరి .. తన ఇంట్లో కూర్చొని రాస్తే అవి మంచి పాటలు. ఫైవ్ స్టార్ హోటల్ లో కూర్చొని, అమ్మాయి డాన్స్ వేస్తుంటే రాసేవి అన్ని చెత్త పాటలు (పాత జ్యోతి చిత్ర సినీ వార పత్రిక సౌజన్యం తో ). వీటూరి, ఆత్రేయ గార్లకు ఫైవ్ స్టార్ హోటల్స్ అంటే కొంచం పిచ్చి లెండి.
manipravalam said…
చిన్నసవరణ.
కన్నడం కాదు.మళయాళం,తమిళ భాషలలో మణిప్రవాళ పద్ధతిలో కవిత్వం వ్రాయటం జరిగింది.

వెన్నెల
www.manipravalam-vennela.blogspot.com
వెన్నెల గారూ, మణిప్రవాళం వేరు లెండి. నాగమురళి అభ్యంతర పెట్టేది దుష్టసమాసాల గురించి.
మాని ప్రవాళం మాహారాజా స్వాతి తిరునాళ్ గారి కృతుల్లో ఎక్కువ కనిపిస్తుంది. త్యాగరాజ కృతుల్లోనూ ఉంది. ఇటీవల ఈ బ్లాగులోనే ఉదహరించిన మేరు సమాన అనే కృతి మంచి ఉదాహరణ మణిప్రవాళానికి
కధకళి కలలిడు ... కళలిడు అనుకుంటా
(typing mistake)... if possible please explain the whole song.
కధకళి కళలిడు .. కావచ్చు. బాగా నప్పుతుంది.
ధన్యవాదాలు శ్రీకాంత్ గారూ .
పాటలకి పూర్తి వివరణలు రాయడంలో సిద్ధహస్తుడైన ఒక బ్లాగర్ ఉన్నారు - ఆయన రాస్తే బావుంటుంది .
http://uniqcyberzone.com/svennela/
అందరమూ ఇక్కడ విన్నవిద్దాము, ఆయన ఆలకిస్తారేమో?
ఊసుపోక రెండు పాటలకు నాకు తోచిన భాష్యాన్ని గిలికితే సిద్దహస్తుడిని అయిపోయానా మాస్టారూ - అందులోనూ పాటని పూర్తిగా మగానుభావులంతా మధించినతరువాత మా బోటి చిల్లర వ్రాతగాళ్ళకి ఏమి మిగుల్తుంది? అయినా గురువాజ్ఞ. కాదంటామా? వేటూరి వారి పద బంధాలు మల్ల యుద్ధములో గజ బంధాలు. ఆయన శ్రోతలు రెండే రకాలు. కొమ్ము కాసే పాండవులు. కొమ్ము విసిరే కౌరవులు. ఇరు పక్షాలకీ వారి వారి వాదనలు కరక్టుగానే అనిపిస్తాయి. అలాంటి ఇద్దరి మధ్య నన్ను తోసేసి తమాషా చూద్దామని గురువర్యుల ఆకాంక్ష అయితే కాదనేముంది. కొద్ది రోజులలోనే పాటకి నా భాష్యముతో... మీ ముందు హాజరవుతానని విన్నవించుకుంటూ..

గత కొద్ది రోజులుగా అంతర్జాలపు జాలము నుంచి కొంచెం దూరంగా ఉన్నాను. అందుకే సమాధానమివ్వటంలో ఆలస్యమయింది. క్షంతవ్యుడిని.
కృ.మో. ఎంత మాట! పాటల సాహిత్యాన్ని విశ్లేషించడంలో, విశ్లేషించిన దాన్ని మళ్ళీ ఆసక్తి కరంగా విప్పి చెప్పడంలో మీ నైపుణ్యం అమోఘం. మీ టపా కోసం ఎదురుచూస్తుంటాం, కురుపాండవులం ఇద్దరమూ.
మీ పోష్టు చదివిన తరువాత సఖి లోని ఈ పాట విన్నాను
కొత్తగా, లొతుగా ద్వనించింది. ఇదివరకు ట్యూను డామినేట్ చేసినట్టుండేది. ఇప్పుడు అర్ధం కూడా అవుతుంది.
థాంక్స్.

బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/
Purnima said…
ఈ పాటను మీకు పరిచయం చేసినందుకు స్వాతి గారికి, మీరు మాకు పరిచయం చేస్తూ టపా చేసినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు.

మార్నింగ్ రాగా సినిమా నాకు చాలా నచ్చుతుంది. ఆ సినిమాలోని సంగీతం మాత్రం నాకు అందనంత దూరం. వీలు చూసుకుని ఆ చిత్రం పై కానీ, అందులో సంగీతం పై కానీ ఓ టపా రాయండి.. వీలు చిక్కినప్పుడు.
Sanath Sripathi said…
కొత్తపాళి గారూ !
టపా కూడా గుండెకు హత్త్తుకుంది. అక్కడ కొన్ని వ్యాఖ్యలు చివుక్కుమనిపించాయి... అనువాదం అంటేనే కత్తి మీద సాము. ఎందుకంటే ఒక్కో భాషకీ కొన్ని వాడుకలు, వ్యావహారికాలూ ఉంటాయి. అల్లాంటివాటిని ఒక బాణికి అనుగుణంగా, స్వర, రాగ భావాల సమ్మేళనంగా పలికించాలి అంటే కొంచం కష్టమే. ఈ విషయాన్ని అవధానాలు చేసేవారు ధృవీకరిస్తారు.

ఉదాహరణకి ఒకసారి మాడుగుల వారిని పోతన గారి పద్యానికి సంస్కృతానువాదం చెయ్యమన్నరు.

ఓయమ్మ నీకుమారుడు
మాయిండ్లను పాలు పెరుగు మననియడమ్మ,
పోయెదమెక్కడికైనను
మాయన్నల సురభులాన మంజులవాణి"

ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే మా అన్నల ఇళ్ళల్లోని ఆవుల మీద ఒట్టు అన్నది తెలుగు వారికే సొంతమైన వాడుక. సంస్కృతంలో ఇల్లా ఒట్లు పెట్టుకోవటం లేదట. అయినా సరే భావాన్ని ఒడిసిపట్టి అనువదించారు నాగఫణి (నాగ్గుర్తున్నత వరకూ ఆ శ్లోకం ఇదీ)

హే మాతస్తవ పుత్రః
కతిపయి ఆద్యాహరతి చ గేహస్థం
గచ్చామః కమపిస్థల మాహో
ప్రమాణ అత్ర సురభయహార !!

ఏతావాతా నేన్చెప్పోచ్చేదేమిటంటే ఒక క్రికెటర్ సామర్ధ్యం, పాటవం తెలియాలంటే టెస్టు మ్యాచుల్లో అతని ప్రతిభ, ఆట చూడాలంటారు కదా అట్లా ఒక కవి (ప్రస్తుతం వేటూరి గారి) తెలుగు సాహిత్య సేవని ఆకళింపు చేసుకోవాలంటే అనువాద సాహిత్యం లో వారి కృషిని చూసే కన్నా సందర్భోచితం గా స్వభాషా సాహిత్యాన్ని రుచి చూడాలి. ఉ.దా. "భైరవద్వీపం" చిత్రంలో "శ్రీతుంబురనారదనాదామృతం" అనే పాట.
ఈ రోజు మీ బ్లాగ్ చూడటం మూలాన చాల విషయాలు తెలుసుకున్నాను... మీ పోస్ట్ పైన ఇంచ చర్చ జరగడం బావుంది ..అందరు పండితులుగానే ఉన్నారు... కృతజ్ఞతలు
కొత్త పాళీ గారు.