Thursday, November 8, 2007

దీపావళి

జాతి మత వర్ణ స్థాన భేదాలకి అతీతంగా భారతీయుల జీవితాలతో ఈ దీపావళి పండుగ ముడివేసుకు పోయింది. నేను పుట్టి పెరిగిన ఇల్లు విడిచి బయటి ప్రపంచంలో పడ్డాక ఎక్కడ ఉన్నా తప్పకుండా జరుపుతూ వస్తున్న పండుగలు రెండే - ఒకటి వినాయక చవితి, రెండోది దీపావళి. వినాయక చవితి నా మట్టుకు నాకు వ్యక్తిగతం. ఊళ్ళో పందిళ్ళు వెయ్యడం, ముంబాయి స్టయిల్లో పెద్ద ఎత్తున వీధుల్లో ఉత్సవాలు చెయ్యడం మన ఊళ్ళల్లో కూడా ఈ మధ్యన ఎక్కువగా జరుగుతున్నా, నాకీ పండుగ ఇంట్లో చేసుకునే ఒక పవిత్రమైన సందర్భంగానే అనిపిస్తుంది ఇప్పటికీ.

దీపావళి విషయం అలాక్కాదు. అసలు ఆ పండుగ స్వభావమే అలాంటిది. ఎవర్నీ వొదిలి పెట్టదు, అందరూ కలిసి చేసుకోవలసిందే. అతి చిన్న పరిధిలో మనింటి చుట్టూపక్కల వారైనా కలుస్తారు. పూర్వకాలం పల్లెటూళ్ళలో ఊరు ఊరంతా కలిసే వారట. ఆర్యీసీలోనూ అయ్యయ్‌టీలోనూ హాస్టల్లో మధ్యాన్నం మంచి విందుభోజనం పెట్టి రాత్రికి మెస్సు మూసేసే వాళ్ళు. పండగ పూట పస్తులు మాకు. రెండు చోట్లా నాకు ఆచార్యుల కుటుంబాల్లో కొంచెం పలుకుబడి ఉండటంతో ఎవరో ఒకరు రాత్రి భోజనానికి పిలిచే వారు. నా తోటి అతిథిగా వచ్చే అవకాశం కోసం నా స్నేహితులు వంతులు వేసుకునే వాళ్ళు.

అమెరికా వచ్చాక జరిగే ఒక పరిణామం ఏ పండగనైనా ఆ దగ్గరి వారాంతంలో జరుపుకోవడం. పెద్ద నగరాలన్నిట్లోనూ తెలుగు సాంస్కృతిక సమితులూ సంఘాలూ ఉన్నాయి. వీళ్ళు సంవత్సరంలో ఏం చేసినా చెయ్యకపోయినా, దీపావళికి మాత్రం తమ శక్తికి తగినట్టు ఒక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తారు. టపాకాయల ప్రసక్తి లేదు ఈ కార్యక్రమాల్లో (ఇక్కడ అగ్నిమాపక నియమాలు ఖచ్చితంగా అమలు చేస్తారు) - భోజనం చెయ్యడం, స్టేజి మీద కాసేపు పిల్లలు వేసే తైతక్కలు చూడ్డం ..ఎవరన్నా మన విహారి లాంటి ఔత్సాహిక వీరులుంటే ఒక చిన్న నాటిక వెయ్యడం .. అంతే. పూర్వకాలంలో జనాలు జూలై 4 (అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం) కి కొన్న టపాకాయల్లోంచి కొన్ని కాకరపువ్వొత్తులు దాచుకుని దీపావళి నాడు ఇంటి వెనకాల దొడ్డిలో పిల్లల్తో కాల్పించే వాళ్ళు.

ఇప్పుడు రోజులు మారినై. కాస్త డబ్బూ పలుకుబడి ఉన్న వాళ్ళు స్థానిక అగ్నిమాపక అధికారి నించి ప్రత్యేక అనుమతి తెచ్చుకుని బంధుమిత్రులని కూడగట్టుకుని పెద్ద యెత్తున టపాకాయల దహనకాండల్ని సాగిస్తున్నారు. ఇటీవలే మొదటి సారిగా అమెరికన్ కాంగ్రెస్ దీపావళి పండుగని విలువైన సాంస్కృతిక సందర్భంగా గుర్తిస్తూ ఒక తీర్మానం చేసింది. ఇది అమెరికాలో ప్రవాసమున్న భారతీయులకి చెప్పుకోదగిన విజయం.

అట్లా చూస్తే దీపావళి గత కొన్ని సంవత్సరాలుగా ఏదో ఒక సామాజిక సాందర్భానికి కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. టపాకాయల్ని పెద్ద యెత్తున తయారు చేసే శివకాశీ కర్మాగారాలు అధిక సంఖ్యలో బాల కార్మికులని ఉపయోగిస్తున్నాయనీ, అక్కడ వారు పని చేయాల్సిన పరిసరాలు అమానుషంగానూ, వారి జీవితాలు దుర్భరంగానూ ఉన్నాయని అనేక వార్తా కథనాలు వచ్చాయి. దానికి స్పందించి కొంత బలమైన సృజనాత్మక సాహిత్యం వచ్చింది. ఐనా ఇప్పటికీ ఈ దారుణమైన పరిస్థితి కొనసాగుతున్నదని తెలుస్తోంది. తొమ్మిదవ దశకం మధ్యలో అప్పటికే విపరీతంగా పెరిగిపోయిన నగర వాతావరణ కాలుష్యాన్ని నిరోధించే ప్రయత్నంలో భాగంగా ఢిల్లీ నగరంలో పిల్లలందరూ ఈ ఏడు మేము టపాకాయలు కాల్చము అని శపథం పట్టి అమలు చేశారు. టపాకాయలకి వెచ్చించే సొమ్ముని పోగు చేసి కొన్ని సంస్థల ద్వారా పేదవారికి సహాయ పడేందుకు వినియోగించారు. ఈ పద్ధతి తరవాతి సంవత్సరాల్లో కొనసాగిందో లేదో తెలియదు గాని, ఆ మొదటి సంవత్సరం మాత్రం చాలా విజయవంతమైందని వార్తల్లో చదివాను.

వ్యాపారస్తులకి దీపావళి అంటే లక్ష్మీ పూజ. వ్యాపారస్తులం కాకపోయినా మిగతావారిక్కూడా లక్ష్మి లేకపోతే పని జరగదు కాబట్టి ఆ దేవిని ప్రసన్నంగా ఉంచుకో వలసిందే. ఈ సందర్భం తలుచుకున్నప్పుడల్లా కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి మార్గదర్శి కథ గుర్తొస్తుంది నాకు. ఆ కథలో దీపావళి పండుగ నేపథ్యంలో రెండు అద్భుతమైన పిట్ట కథలు చెబుతారు శాస్త్రి గారు. ఈ కథ విశాలాంధ్ర వాళ్ళు ప్రచురించిన శాస్త్రిగారి కథల సంపుటాల్లో రెండో సంపుటంలో ఉంది. ఈ మధ్యనే మళ్ళీ చదివాను .. చదివిన ప్రతి సారీ నాకు వొళ్ళు గగుర్పొడుస్తుంది. మీరూ చదవండి.

వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం ..
అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

Wednesday, November 7, 2007

ఇల్ పొస్టీనో (తపాలా బంట్రోతు)

కాల్పనిక కథతో రూపొందిన సినిమాలో ఇటీవల జీవించిన నిజం మనుషులు పాత్రలుగా కనపడ్డం అరుదుగా జరుగుతూ ఉంటుంది. గాంధీ, ఛాప్లిన్ లాంటి జీవిత కథల సినిమాల సంగతి వేరు, వాటిని గురించి కాదు నేను మాట్లాడుతోంది. సరే, మధ్యలో ఒక చిన్న పిడకల వేట. అతి ఎక్కువసార్లు సినిమా కథల్లో పాత్రగా తెర మీద చూపించబడిన నిజం మనిషి ఎవరో తెలుసా? తెలిస్తే చెప్పండి చూద్దాం. పిడకలవేట ముగిసింది.

94లో మెగ్ రయన్, టిం రాబిన్సులతో ఐక్యూ అని సినిమా వచ్చింది .. అందులో మెగ్ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత ఆల్బెర్ట్ ఐన్స్టీన్ గారి మేనకోడలు. ఒక కారు మెకానిక్ ఐన టిం, మెగ్ ని పిచ్చగా ప్రేమించేసి, అంత తెలివైన అమ్మాయితో తనకి ఛాన్సులేదని నిరాశపడుతుంటే, ఆయనా, ఆయన తోటి ప్రొఫెసర్లూ కలిసి టిం ప్రేమ పురాణానికి శ్రీకారం చుడతారు. తమ తెలివినంతా ఉపయోగించి శుభం అని భరతవాక్యం కూడా పాడిస్తారు. చాలా సరదాగా ఉంటుంది సినిమా, కాస్త హై లెవెలు ఫిజిక్సూ లెక్కలూ పరిచయం ఉన్నవాళ్ళైతే అందులో జోకులు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు.

అదే సంవత్సరం ఒక ఇటాలియను సినిమా వచ్చింది ఇంకో నోబెల్ గ్రహీత పాత్రతో. అద్భుతమైన ప్రేమ కవిత్వానికి పెట్టింది పేరుగా ప్రసిద్ధి కెక్కిన స్పానిష్ భాషా కవి, చిలీ దేశవాసి పాబ్లో నెరుడా తన మాతృదేశంలో ఉన్న రాజకీయ అల్లకల్లోలం వల్ల కొంత కాలం ఇటలీలో ఒక చిన్న బెస్తవాళ్ళ ద్వీపంలో ప్రవాసముంటాడు. ఆయన ఉన్న ఇల్లు ఒక గుట్ట మీద ఉంటుంది. ఆయనకోసం ప్రపంచం నలుమూలల్నించీ వచ్చే ఉత్తరాలని రోజూ ఆ గుట్ట ఎక్కి ఆయనకి చేర్చలేక ఆ ద్వీపపు పోస్టుమాస్టరు ఒక కుర్ర అసిస్టెంటుని పెట్టుకుంటాడు. ఆ అసిస్టెంటే మన హీరో.

కవిత్వానికీ జీవితానికీ కూడా కొన్ని మంచి అర్థాలున్నై ఈ సినిమాలో. ఏ మాత్రం హడావుడీ, కంగాళీ లేకుండా హాయిగా నింపాదిగా సాగిపోతుంది సినిమా. అలాగని బోరుకొడుతుందనుకుంటే పొరబడ్డారు.
ఈ సినిమా గురించి చాలా చెప్పాలనుంది గానీ ..ఇది చూసి తీరాల్సిన సినిమా .. అందుకని కథ చెప్పి మీ అనుభవాన్ని పాడు చెయ్యను. తప్పక చూడండి .. నచ్చకపోతే నాదీ హామీ.

మగవారికి ఒక సలహా .. మీకు ఒక లడకీ దోస్తో, ఉత్తమార్ధమో ఉంటే ఆమెతో కలిసి చూడండి. ఆమె మీ సినిమా టేస్టుని మెచ్చుకుంటుంది. క్రెడిటంతా మీరే పుచ్చుకోవచ్చు నిరభ్యంతరంగా! :-)

Sunday, November 4, 2007

ఆకురాలు కాలం

ఆహా ఎట్టకేలకు మా ఊరికి వసంతమొచ్చిందని మురుసుకున్నది మొన్ననే అన్నట్లుంది .. చూస్తుండగానే వేసవి కూడా ఆ దారినే వెళ్ళిపోయింది.

కార్తీక మాసపు పేరంటాలకి వెళ్ళడానికి రంగు రంగుల పట్టుచీరలు కట్టి ముస్తాబవుతున్న ముత్తైదువల్లాగా చెట్లన్నీ సింగారించుకుంటున్నాయి. ఈ క్షణంలోని అందాన్ని అనుభవించి ఆనందించలేని నేనేమో .. అయ్యో ఇంకొన్ని రోజుల్లో ఇవన్నీ మోడులైపోతాయి గదా అని విచార పడుతుంటాను.

పాశ్చాత్యులకి నాలుగే ఋతువులు .. స్ప్రింగ్, సమ్మర్, ఆటం, వింటర్ .. వెరసి ఫోర్ సీజన్స్. వివాల్డి అనే వెనీషియన్ తుంబురుడు ఆ పేరిట ఒక అద్భుత సంగీత మాలికని రచించి ప్రకృతిమాతకి అలంకరించాడు. స్ప్రింగ్ అంటే వసంతం, సమ్మరంటే గ్రీష్మం లేదా వేసవి, వింటరంటే చలి కాలం. గొడవంతా ఆటం దగ్గరే వస్తుంది. నెలల ప్రకారం చూస్తే మన ఊళ్ళలో ఇప్పుడు శరదృతువు. ప్రకృతి పరిణామాల ప్రకారం చూస్తే ఇక్కడ ఇది శిశిర ఋతువు (ఆకురాలు కాలం). విపరీతంగా చేమంతి పూలు కూడా పూస్తాయి కాబట్టి హేమంతం అనికూడ అనుకోవచ్చు. మన ఊళ్ళో చలికాలం ఐపోయాక రాబోయే వసంతానికి సూచనగా శిశిరంలో వేపలాంటి కొన్ని చెట్లు ఆకులు రాలుస్తాయి. ఇక్కడ కోనిఫర్ జాతి వృక్షాలు తప్పించి మిగతావన్నీ, ఆఖరికి మొక్కలూ పొదలూ కూడా, భయంకరమైన చలికాలానికి సన్నద్ధమయే ప్రయత్నంలో ఆకులు రాలుస్తాయి. ఈ ఆకురాలు కాలం, లోలోపలి రక్తనాళాల్ని కూడా గడ్డకట్టించే చలికి చోపుదారు, వెచ్చబరిచే వసంతానికి కాదు.

ఈ అమెరికా వాళ్ళది ఎడ్డెమంటే తెడ్డెమనే వ్యవహారం కాబట్టి ఇంగ్లీషువాళ్ళు "ఆటం" అని పెట్టుకున్న పేరుని కాదని వీళ్ళు సొంత బుర్రతో ఆలోచించి దీనికి "ఫాల్" (fall) అని నామకరణం చేశారు .. ఎందుకంటే ఆకులు రాలతాయి కాబట్టి! సంవత్సరానికి మొదలు కాదు. ఋతువుల్లోనూ మొదటిది కాదు. కానీ బడులూ విశ్వవిద్యాలయాలూ ఫాల్ సెమిస్టరుతోనే ప్రారంభమవుతాయి. అనేక కళాసంస్థల ప్రదర్శన సీజను ఫాల్‌తోనే మొదలవుతుంది.

సాధారణంగా సెప్టెంబరు చివరికల్లా చిరు చలి మొదలవుతుంది ఒక స్వెటరో పల్చటి కోటో వేసుకుంటే బాగుండు అనిపిస్తుంటుంది. చెట్ల ఆకులు మెల్లగా ఆకుపచ్చ నించి పసుపు, నారింజ, ఎరుపు రంగులు పులుముకుంటూ ఉంటాయి. ఉన్నట్టుండి ఒక రాత్రి ఉత్తరాన్నించి ఒక గాలివాన వస్తుంది. దాని విసురుకి మొదటి విడత ఆకులు రాలిపడతాయి. నిన్నటికంటే ఇవ్వాళ్ళ ఉష్ణోగ్రత ఒక ముప్ఫై డిగ్రీలు (మేం ఫారెన్ వాళ్ళం కదా, మాది ఫారెన్‌హీటు లెండి :)) పడిపోతుంది. దాంతో అధికారికంగా ఫాల్ ప్రవేశించినట్లే!

అట్లా రంగు మారటం మొదలు పెట్టిన ఆకులు నాలుగైదు వారాల పాటు వర్ణార్ణవ తరంగాలవుతాయి. తమాషా చెయ్యటానికి అన్నట్టు సృష్టికర్త ఒక కుంచె పట్టుకుని కొద్ది సేపు మోనే వేషం వేసుకుంటాడు. నేనేం తక్కువ తిన్నానా అని సర్వసాక్షి పడమటి నింగిపై సిందూరం చల్లుతుంటాడు. ప్రకృతి మొత్తం ప్రదర్శనకి సిద్ధమౌతున్న మహానటిలా అలంకారం చేసుకుంటూ ఉంటుంది. ఆ అలంకారమే అసలు ప్రదర్శన అని మనం గ్రహించే లోపలే ఒక అద్భుతమైన రంగులవల మనమీద పరుచుకుని సమ్మోహితుల్ని చేసేస్తుంది.

చూస్తూ చూస్తూ ఉండగానే .. ప్రదర్శన ముగిసిపోతుంది. రంగుల ప్రపంచం మీద ఒక తెల్లటి మంచు తెర కప్పబడుతుంది.
దాని అందాలు .. మరోమాటు .. సందర్భోచితంగా ..


***********************
(వివాల్డి వికీ పేజీ చివర ఫోర్ సీజన్స్ సంగీతపు తునకలు ఉన్నాయి వినవచ్చు.)