జాతి మత వర్ణ స్థాన భేదాలకి అతీతంగా భారతీయుల జీవితాలతో ఈ దీపావళి పండుగ ముడివేసుకు పోయింది. నేను పుట్టి పెరిగిన ఇల్లు విడిచి బయటి ప్రపంచంలో పడ్డాక ఎక్కడ ఉన్నా తప్పకుండా జరుపుతూ వస్తున్న పండుగలు రెండే - ఒకటి వినాయక చవితి, రెండోది దీపావళి. వినాయక చవితి నా మట్టుకు నాకు వ్యక్తిగతం. ఊళ్ళో పందిళ్ళు వెయ్యడం, ముంబాయి స్టయిల్లో పెద్ద ఎత్తున వీధుల్లో ఉత్సవాలు చెయ్యడం మన ఊళ్ళల్లో కూడా ఈ మధ్యన ఎక్కువగా జరుగుతున్నా, నాకీ పండుగ ఇంట్లో చేసుకునే ఒక పవిత్రమైన సందర్భంగానే అనిపిస్తుంది ఇప్పటికీ.
దీపావళి విషయం అలాక్కాదు. అసలు ఆ పండుగ స్వభావమే అలాంటిది. ఎవర్నీ వొదిలి పెట్టదు, అందరూ కలిసి చేసుకోవలసిందే. అతి చిన్న పరిధిలో మనింటి చుట్టూపక్కల వారైనా కలుస్తారు. పూర్వకాలం పల్లెటూళ్ళలో ఊరు ఊరంతా కలిసే వారట. ఆర్యీసీలోనూ అయ్యయ్‌టీలోనూ హాస్టల్లో మధ్యాన్నం మంచి విందుభోజనం పెట్టి రాత్రికి మెస్సు మూసేసే వాళ్ళు. పండగ పూట పస్తులు మాకు. రెండు చోట్లా నాకు ఆచార్యుల కుటుంబాల్లో కొంచెం పలుకుబడి ఉండటంతో ఎవరో ఒకరు రాత్రి భోజనానికి పిలిచే వారు. నా తోటి అతిథిగా వచ్చే అవకాశం కోసం నా స్నేహితులు వంతులు వేసుకునే వాళ్ళు.
అమెరికా వచ్చాక జరిగే ఒక పరిణామం ఏ పండగనైనా ఆ దగ్గరి వారాంతంలో జరుపుకోవడం. పెద్ద నగరాలన్నిట్లోనూ తెలుగు సాంస్కృతిక సమితులూ సంఘాలూ ఉన్నాయి. వీళ్ళు సంవత్సరంలో ఏం చేసినా చెయ్యకపోయినా, దీపావళికి మాత్రం తమ శక్తికి తగినట్టు ఒక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తారు. టపాకాయల ప్రసక్తి లేదు ఈ కార్యక్రమాల్లో (ఇక్కడ అగ్నిమాపక నియమాలు ఖచ్చితంగా అమలు చేస్తారు) - భోజనం చెయ్యడం, స్టేజి మీద కాసేపు పిల్లలు వేసే తైతక్కలు చూడ్డం ..ఎవరన్నా మన విహారి లాంటి ఔత్సాహిక వీరులుంటే ఒక చిన్న నాటిక వెయ్యడం .. అంతే. పూర్వకాలంలో జనాలు జూలై 4 (అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం) కి కొన్న టపాకాయల్లోంచి కొన్ని కాకరపువ్వొత్తులు దాచుకుని దీపావళి నాడు ఇంటి వెనకాల దొడ్డిలో పిల్లల్తో కాల్పించే వాళ్ళు.
ఇప్పుడు రోజులు మారినై. కాస్త డబ్బూ పలుకుబడి ఉన్న వాళ్ళు స్థానిక అగ్నిమాపక అధికారి నించి ప్రత్యేక అనుమతి తెచ్చుకుని బంధుమిత్రులని కూడగట్టుకుని పెద్ద యెత్తున టపాకాయల దహనకాండల్ని సాగిస్తున్నారు. ఇటీవలే మొదటి సారిగా అమెరికన్ కాంగ్రెస్ దీపావళి పండుగని విలువైన సాంస్కృతిక సందర్భంగా గుర్తిస్తూ ఒక తీర్మానం చేసింది. ఇది అమెరికాలో ప్రవాసమున్న భారతీయులకి చెప్పుకోదగిన విజయం.
అట్లా చూస్తే దీపావళి గత కొన్ని సంవత్సరాలుగా ఏదో ఒక సామాజిక సాందర్భానికి కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. టపాకాయల్ని పెద్ద యెత్తున తయారు చేసే శివకాశీ కర్మాగారాలు అధిక సంఖ్యలో బాల కార్మికులని ఉపయోగిస్తున్నాయనీ, అక్కడ వారు పని చేయాల్సిన పరిసరాలు అమానుషంగానూ, వారి జీవితాలు దుర్భరంగానూ ఉన్నాయని అనేక వార్తా కథనాలు వచ్చాయి. దానికి స్పందించి కొంత బలమైన సృజనాత్మక సాహిత్యం వచ్చింది. ఐనా ఇప్పటికీ ఈ దారుణమైన పరిస్థితి కొనసాగుతున్నదని తెలుస్తోంది. తొమ్మిదవ దశకం మధ్యలో అప్పటికే విపరీతంగా పెరిగిపోయిన నగర వాతావరణ కాలుష్యాన్ని నిరోధించే ప్రయత్నంలో భాగంగా ఢిల్లీ నగరంలో పిల్లలందరూ ఈ ఏడు మేము టపాకాయలు కాల్చము అని శపథం పట్టి అమలు చేశారు. టపాకాయలకి వెచ్చించే సొమ్ముని పోగు చేసి కొన్ని సంస్థల ద్వారా పేదవారికి సహాయ పడేందుకు వినియోగించారు. ఈ పద్ధతి తరవాతి సంవత్సరాల్లో కొనసాగిందో లేదో తెలియదు గాని, ఆ మొదటి సంవత్సరం మాత్రం చాలా విజయవంతమైందని వార్తల్లో చదివాను.
వ్యాపారస్తులకి దీపావళి అంటే లక్ష్మీ పూజ. వ్యాపారస్తులం కాకపోయినా మిగతావారిక్కూడా లక్ష్మి లేకపోతే పని జరగదు కాబట్టి ఆ దేవిని ప్రసన్నంగా ఉంచుకో వలసిందే. ఈ సందర్భం తలుచుకున్నప్పుడల్లా కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి మార్గదర్శి కథ గుర్తొస్తుంది నాకు. ఆ కథలో దీపావళి పండుగ నేపథ్యంలో రెండు అద్భుతమైన పిట్ట కథలు చెబుతారు శాస్త్రి గారు. ఈ కథ విశాలాంధ్ర వాళ్ళు ప్రచురించిన శాస్త్రిగారి కథల సంపుటాల్లో రెండో సంపుటంలో ఉంది. ఈ మధ్యనే మళ్ళీ చదివాను .. చదివిన ప్రతి సారీ నాకు వొళ్ళు గగుర్పొడుస్తుంది. మీరూ చదవండి.
వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం ..
అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

Comments
మీకు దీపావళి శుభాకాంక్షలు :)
"Kotta Paalee" anna paeru choodagaanae...naaku "Tataaji" gurtochchaaru. I came here expecting something and I am not disappointed.