నవంబరు సినిమాలు

నెట్‌ఫ్లిక్స్ వాళ్ళ పుణ్యమాని గత రెణ్ణెల్లుగా కొన్ని మంచి సినిమాలు చూస్తున్నాను. ఈ కాలంలో ఒక ఆంగ్ల నవల పూర్తిగానూ ఒక పాత తెలుగు నవల సగమూ చదివాను. ఒక విహంగ వీక్షణం:

యిన్ షి నన్ ను (Eat Drink Man Woman) తాయ్‌వాన్, 1994
ఆంగ్ల చిత్ర సీమలో సెన్స్ అండ్ సెన్సిబిలిటీ వంటి చిత్రాలతో ఘన విజయం సాధించిన తాయ్‌వానీస్ దర్శకుడి తొలి చిత్రాల్లో ఒకటి. భార్య చనిపోయిన ఎగ్జిక్యూటివ్ ఛెఫ్ మిస్టర్ చు తాయ్‌పెయ్ నగరంలో ఎదిగిన ముగ్గురు కూతుళ్ళతో ఉంటూంటాడు. ముగ్గురివీ మూడు రకాల మనస్తత్వాలు. ముగ్గురికీ తాము ఇల్లు విడిచి వెళ్ళిపోతే వృద్ధుడౌతున్న తండ్రి ఎలా ఒంటరితనాన్ని తట్టుకో గలడు అన ఆలోచన పీడిస్తూనే ఉంటుంది, కానీ వాళ్ళ చేతిలో ఏవీ లేనట్టు ముగ్గురి జీవితాలు అనుకోని మలుపులు తిరుగుతాయి. ఈ మార్పులతోనే వాళ్ళు సతమతమవుతుండగా మిస్టర్ చు చేసిన నిర్ణయం వాళ్ళందర్నీ నిర్ఘాంత పరుస్తుంది. చిక్కటి కుటుంబ బాంధవ్యాలకీ, బలమైన పాత్ర వ్యక్తీకరణలకీ ఈ చిత్రం చక్కటి రంగం కల్పించింది. చిత్రంలోని ముఖ్యమైన సందర్భాలన్నిటికీ, ఒక్కొక్క చోటైతే పాత్రల మనోభావాలకీ, నేపథ్యంగా తాయవానీయ సాంప్రదాయ వంటకాలు ఒక అవిఛ్ఛిన్నమైన ప్రతీకల స్రవంతిలా సాగుతుంటాయి. పాత్రల మనోభావాలని రూపించడంలోనూ, ఒక్కొక్క దృశ్యాన్ని రూపొందించడంలోనూ దర్శకుని అసాధారణ ప్రతిభ కనిపిస్తుంది. అవటానికి ఒక చిన్న కుటుంబ కథే అయినా, సినిమా ముగిశాక ఏదో మహాభారత గాథని చూసిన అనుభూతి మిగులుతుంది.
ఒక హెచ్చరిక: ఖాళీ కడుపు మీద మాత్రం ఈ సినిమా చూడకండి - అడుగడుగునా కనిపించే వంటకాల దృశ్యాలకి పిచ్చెక్కుతుంది.


ఒన్ ఫ్లూ ఓవర్ ది కుకూస్ నెస్ట్ (1975)
కెన్ కేసీ నవలకి దర్శకుడు మిలోస్ ఫోర్మన్ కల్పించిన చిత్రరూపం. జాక్ నికొల్సన్ కి మొదటి ఆస్కార్ వచ్చిందనుకుంటా. చాలా మంది సినిమా పండితులు ఈ చిత్రాన్ని ఆకాశనికెత్తేస్తారు. అందుకని పని గట్టుకుని చాలా జాగ్రత్తగా చూశాను. అంత గొప్పేంటో నాకర్ధం కాలేదు. చిన్న సైజు దొంగ మెక్మర్ఫీ (నికొల్సన్) ప్రవర్తన మరీ దుడుకుగా ఉన్నదని సాధారణ జైలు నించి అతన్ని ఒక మెంటల్ వార్డులో వేస్తారు. అక్కడి పేషెంట్లు, ఒకరిద్దరు తప్ప, తామ బాగు కోసం తామే అక్కడ ఉన్నవాళ్ళు. ఆ వార్డు ని నర్సు రేచెద్ (లోయిస్ ఫ్లెచర్) పటిష్ఠమైన క్రమశిక్షణతో శాసిస్తూ ఉంటుంది. వాళ్ళంతా స్వఛ్ఛందంగానే ఆ జులుంని భరిస్తూ అదే తమకి మంచిదనే మనఃస్థితిలో ఉంటారు. ఆ వార్డులోకి మెక్మర్ఫీ రాక ..కొలనులో చిన్న రాయి కాదు .. ఏకంగా ఒక మందర గిరినే వేసి ..చిలికినట్టు ..ఇహ అల్లకల్లోలం మొదలవుతుంది.
ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరమూ మనం సృష్టించుకున్న మన ప్రపంచానికీ మన భయాలకీ బందీలం, దీంట్లోంచి తప్పించుకోవాలన్నా తప్పించుకోలేం అనే ప్రతీక కథ ఆద్యంతమూ ఉన్నదా అనిపించింది నాకైతే. ఫ్రాయిడియన్ ఎనలిస్టులూ, యంజియన్ ఆర్క్‌టైపు వాదులూ ఈ సినిమా చూసి పండగచేసుకునుంటారు. స్వతస్సిద్ధంగా అధికార ధిక్కారం అంటే మొగ్గు చూపే నాకు మెక్మర్ఫీ పాత్ర మొదట్లో నచ్చినా .. రాను రాను, తగినంత లోతు లేకుండా .. ఊరికే గడ్డి బొమ్మల్లే తీర్చినట్టు అనిపించి చిరాకేసింది, పాత్ర మీదా, సినిమా మీదా కూడా. ఐనా కేవలం నికొల్సన్ నటన కోసమే చూడవచ్చు ఈ సినిమా. నిజ జీవితంలోనూ నట జీవితంలో తాను ధరించిన పాత్రల్లోనూ డెవిల్ మే కేర్ నిర్లక్ష్యాన్ని నిర్వచించిన జాక్ నికొల్సన్ కోసమే ఆ పాత్ర సృష్టించబడిందా అన్నట్టు నటించాడు. అన్నట్టు ఈ మధ్యనెప్పుడో 24 ఫ్రేముల వెంకట్ చెప్పినట్టు .. జీవితంలో ఏ ఆనందమూ ఏ సుఖమూ ఎరగని కుర్రాడి కోసం మందు బాటిళ్ళనీ, అమ్మాయిల్నీ ఆస్పత్రిలోకి స్మగుల్ చేసి వార్డులోనే పెద్ద పార్టీ ఏర్పాటు చేసే దృశ్యం .. మున్నాభాయ్ లోనూ, శంకర్ దాదాలోనూ చాలా జనాల్ని ఆకర్షించింది .. దానికి ప్రేరణ ఈ సినిమా నించే .. ఐతే, ఈ సినిమాలో ఆ దృశ్యం గుండెల్ని కలచి వేస్తుంది.
తాజా కలం: ఈ టపా మొదటి వెర్షను ప్రచురించేశాక ఈ సినిమా గురించి మళ్ళీ కుతూహలం రేగి గూగుల్లో కాస్త వెతికితే తెలిసిన విషయం .. కెన్ కేసీ రాసిన నవల్లో కథనం దృక్పథం పూర్తిగా వేరేగా ఉందిట. సినిమా వాళ్ళు హక్కులు కొనేసుకున్నాక .. ఏవో గొడవలవుతున్న సమయంలో కథని తమకిష్టమొచ్చినట్టు మార్చి .. ఆఖరి స్క్రిప్టుకి కేసీ అనుమతి లేకుండా .. సినిమా తిశారుట .. అంటే, నేనిప్పుడు ఆ పుస్తకం చదవాలి .. ఆంగ్ల సావెజ్జెప్పినట్టు .. ఇప్పుడు ఈ సమస్య పూర్తిగా కొత్తకాంతిలో కనిపిస్తోంది!
మరింత తాజా కలం: ఈ సినిమా టైటిలు కూడా నన్ను కొంత చికాకు పెడుతూ ఉంది .. గూగులమ్మ దానికీ సమాధానం చెప్పింది. ఇది మదర్ గూస్ పేరిట ప్రాచుర్యం పొందిన ఒక నర్సరీ రైం లోని చివరి వాక్యం

త్వరలో ..
చిల్డ్రెన్ ఆఫ్ పేరడైజ్
పియానిస్ట్
సెవెన్ సమురాయ్

Comments

అయ్యా,చాలా మంచి విషయాలు చెప్పారు.ఫ్రాయిడియను అనలిష్టులు తెలుసు కానీ ఈ ఎంజిఎం ...ఎవరు?త్వర లో సమురాయ్ అన్నారు,అంటే కొంపదీసి వచ్చే సం వత్సరమా?ఆ చేత్తోటే రషొమను కూడా.పియానిష్టు ఆస్త్రేలియా సినిమానా? అది వట్టి పియానో అనుకుంటాను.ఇంకో అనుమానం ఈ రామనాధం గారెవరు?నేను ముందు చూసి కేలూ చరణ్ మహాపాత్రో అనుకున్నాను.మీ సినిమా హాలు ముందరే నిలుచున్న
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
@బ్లాగేశ్వర .. see netflix.com
It is a web based DVD rentng business.

@రాజేంద్ర..ఎం జి ఎం కాదు Carl Jung! Famous psychologist who proposed the concept of archetypes. Jungian అనే పదాన్ని తెలుగులో రాసేప్పటికి అలా వచ్చింది. జె ని య అని పలుకుతారు. పియానిస్టు ఇటీవలి సినిమా. మీరు చెప్పేది సుమారు పదేళ్ళ క్రితం హాలీ హంటర్ హీరోయినుగా వచ్చినది. రామనాథం ఎవరు? ఓహో, మా సరస్వతీ పుత్రులా? నాకు బహు ఇష్టమైన కర్ణాటక సంగీత గాయకులు, కీర్తిశేషులు. త్వరలో అంటే .. త్వరలోనే .. వేరే ఏ అర్ధాలూ లేవు :)
pi said…
Pianist meeda ee aasalu pettukokandi. Naaku aa chitram peddaga nacchaledu. Naaku Polanski ante ishtam kaani. Eee chitram naaku pedda ga ruchinchaledu. Holocaust cinemalu choosi visupu raavadam oka karanam.
నేను బ్లాక్ బస్టర్ వాడి పుణ్యమా అంటూ, ఈ మధ్య చాలానే చూసాను. బెస్ట్ అమెరికన్ సినిమాలని గూగులమ్మనడిగి వరసపెట్టి చూశా. Shawshank Redemption సినిమా చూశాక ఎంతగొప్పగా తీశారనిపించింది. మీరెళ్ళినంత వెనక్కు వెళ్ళి చూసే ధైర్యం లేదుగానీ, ఈ సినిమా చాలా చాలా నచ్చింది. పియనిస్ట్ నా లిస్ట్ లో కూడా ఉంది.
@pi - పియానిస్ట్ ఆల్రెడీ చూడ్డం ఐపోయింది. అంచేత ఆశ పెట్టుకోవడం పెట్టుకోకపోవడం ప్రసక్తి లేదు.
@vikaTakavi - http://www.imdb.com/chart/top
లో వాడి వాడుకదారులు ఇచ్చిన వోట్ల ప్రకారం 250 ప్రసిద్ధ సినిమాల లిస్టు ఉంది. దాన్ని ఫాలో అవ్వండి. ఆంగ్ల చిత్రాలే కాక ప్రపంచ భాషల చిత్రాలు కూడ ఉన్నాయి ఈ లిస్టులో. షాషాంక్ రెడెంప్షన్ ఈ లిస్టులో రెండో స్థానంలో ఉంది. మంచి సినిమా.