వనజ సినిమా గురించి ఏం రాయాలో తెలియకుండా ఉంది. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో మరీ మారుమోగటం వల్లనో, ఎప్పుడొస్తుంది, అసలొస్తుందా రాదా అని ఆదుర్దాగా ఎదురు చూడడం వల్లనో, ఈ సినిమా మీద ఆశలు ఎక్కువగా పెట్టుకున్న మాట నిజమే. సరే ఆశలు తీరకపోవడం మాట అటుంచండి, కొన్ని కనీస కథా మర్యాదలు పాటించక పోవడం చూస్తే చిరాకే పుట్టింది. అలాగని పూర్తిగా తుడిచిపెట్టెయ్యాల్సినదీ కాదు .. చూడాల్సినవీ, చూసి మెచ్చుకోవలసినవీ పుష్కలంగానే ఉన్నయ్యి ఈ సినిమాలో.
అమెరికాలో వివిధ నగరాల్లో నియమిత విడుదలతో వెలువడుతోంది. కొన్ని వివరాలు ఇక్కడ చూడచ్చు. మీకు అందుబాటులో ఉంటే తప్పక చూడండి. పెద్దగా ఆశలు పెట్టుకోకుండా చూస్తే ఆనందిస్తారు.
ఎందుకు చూడాలి?
అమితాభ్కి నైజీరియాలోనూ, రజనీకి జపాన్‌లోనూ విసనకర్రలు విరివిగా ఉంటే ఉండొచ్చు కానీ అంతర్జాతీయ తెరమీద ఈ మధ్య కాలంలో భారతీయ చిత్రమేదీ మెరవలేదు.
మనవాడు మనభాషలో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించే సినిమా తీశాడు .. అందుకోసమైనా మనం చూడాలి.
మనం చూస్తే, తద్వారా సినిమాకి కొంత ఆర్ధిక బలం చేకూరితే, మన యువదర్శకులు ధైర్యం చేసి ఇంతకంటే మంచి సినిమాలు తీసే సాహసం చెయ్యచ్చు .. అందుకని కూడా చూడాలి.
చిర్రెత్తించే విషయాలు:
కథ బలహీనం. ఎవరు ఏ పని ఎందుకు చేస్తారో అర్ధం కాదు. పాత్రల ప్రవర్తనకి మనం అర్ధం చేసుకోగల కారణాలేవీ ఉండవు.
కథన పద్ధతి కొంత సేపు సమయమంతా తన దగ్గరే ఉన్నట్టు నింపాదిగా సాగుతుంది, ఉన్నట్టుండి ఏదో హడావుడిగా ఉరుకులు పరుగులు పెడుతుంది. కళ్ళు మూసి తెరిచే లోగా ఆరునెల్లు గడిచిపోతై. గడిచినయ్యని మనకి ఐదు నిమిషాల తరవాత కానీ అర్ధం కాదు.
కొన్ని చోట్ల ఎడిటింగ్ వదులుగా ఉంది.
ఈ కథ పలాన చోట జరుగుతోంది అని ఖచ్చితంగా ఎక్కడా చెప్పరు గానీ అన్ని సూచనలూ తెలంగాణానే సూచిస్తున్నై. భాష విని నేనైతే నల్లగొండ, మెదక్ ప్రాంతాలు అనుకున్నా. కాసేపయ్యేప్పటికి సముద్రపుటొడ్డు కనిపిస్తుంది, వనజ తండ్రి సముద్రంలో చేపలు పడుతుంటాడు. అతను చెర్లో చేపలు పట్టినా కథకొచ్చే నష్టమేం లేదు. ఎందుకు ఇట్లాంటి పిచ్చ పన్లు చెయ్యటం?
అన్నిటికంటే ఒళ్ళు మండించేది సినిమా తీసిన దృష్టి. తెలుగు వాళ్ళెవరికైనా ఈ సినిమాలోని అసహజత్వాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తై. అవి ఏవైనా కళాత్మక ప్రయోజనం నెరవేరిస్తే పోనీ అనుకోవచ్చు. అదేవీ లేదు. ఇవన్నీ పాశ్చాత్య దృష్టికి ethnic గా exotic గా కనిపిస్తాయి. అంతే దర్శకుడికి కావలసింది, కథా పాత్రలూ ఏ తెలంగాణా సముద్రంలో కలిసినా అతనికి పట్టదు అనిపించి మండిపోయింది.
సినిమాలో మెచ్చదగిన విషయాలు:
సంగీతం .. అద్భుతం! వచ్చే ఏడు డీవీడీ, సౌండ్ ట్రాక్ విడుదల చేస్తారుట. నేను లైనులో ముందరే నిలుచుంటా.
ఛాయాగ్రహణం .. సున్నితంగా, అందంగా ఉంది. ఒక్కొక్క రంగం (scene) ని రూపొందించిన తీరు కళాత్మకంగా ఉంది. చాలా సున్నితమైన లైటింగ్ ఉపయోగించారు. ఔట్ డోర్ దృశ్యాలు కూడా ఎక్కడా కఠినత్వం లేకుండా తీశాడు.
నటులు .. ఈ సినిమాకున్న ముఖ్యమైన బలం నటులే. చాలా బాగా చేశారు. మన వృత్తి స్టార్లు వీళ్ళు చేసిన దాంట్లో పావు వొంతు చేసినా మన సినిమాలు ఇంత ఘోరంగా ఉండవు. ఇది బాల నటీమణుల యుగమల్లే ఉంది. ఈ మధ్యనే ఇవానా బాఖరో, శ్రియ శర్మల గురించి బ్లాగాను. ఆ మధ్య వచ్చిన హేరీ పాటర్ సినిమాలో కూడా ఎమ్మా వాట్సన్ బాన్నీ రైట్ల ద్వయం ఆకట్టుకుంది. వనజగా మమత, ఆమె సావాసగత్తె లచ్చిగా భవానీ మన మనసునాకట్టుకుంటారు. సహాయ పాత్రల్లో జమీందారిణిగా ఊర్మిళ, రాధమ్మగా క్రిష్ణమ్మ బాగా నప్పారు. మిగతా వాళ్ళు కూడ పరవాలేదు. జమీందారిణి కొడుకుగా కరణ్ సింగ్ విగ్రహపుష్టిగా బానే ఉన్నాడు గానీ ఈ అబ్బాయికి నటన అస్సలు చేతకాదు. అందులో ఊర్మిళ హుందాతనం ముందు, మమత కొంటె తెలివి తేటల ముందు ఇతను పూర్తిగా వెలవెల పోయాడు.
మొత్తమ్మీద సినిమాకి ఒక visual poetry లాంటి ఒక texture ఉంది. కనుల విందు వీనుల విందు జరుగుతుంది, అంత వరకూ గేరంటీ. కథ సహజంగా ఉండాలి, పాత్రలు సహజంగా ఉండాలి ఇట్లాంటి వెర్రి మొర్రి ఆశలు పెట్టుకోకపోతే బానే ఆనందించొచ్చు.
అమెరికాలో వివిధ నగరాల్లో నియమిత విడుదలతో వెలువడుతోంది. కొన్ని వివరాలు ఇక్కడ చూడచ్చు. మీకు అందుబాటులో ఉంటే తప్పక చూడండి. పెద్దగా ఆశలు పెట్టుకోకుండా చూస్తే ఆనందిస్తారు.
ఎందుకు చూడాలి?
చిర్రెత్తించే విషయాలు:
సినిమాలో మెచ్చదగిన విషయాలు:
మొత్తమ్మీద సినిమాకి ఒక visual poetry లాంటి ఒక texture ఉంది. కనుల విందు వీనుల విందు జరుగుతుంది, అంత వరకూ గేరంటీ. కథ సహజంగా ఉండాలి, పాత్రలు సహజంగా ఉండాలి ఇట్లాంటి వెర్రి మొర్రి ఆశలు పెట్టుకోకపోతే బానే ఆనందించొచ్చు.
Comments
ఇలాంటి సినిమాలను చూసి యువ దర్శకులకు ధైర్యం ఇవ్వడం ఎంత ముఖ్యమో, ఇలాంటి విమర్శలు పత్రికల్లోను, టీవీల్లోను రావడం కూడా అంతే ముఖ్యమండి. సమీక్షలు చూసాక, ఆపై సినిమాకు వెళ్ళడమో మానడమో చేసే రోజు రావాలి.
I agree with every word of Chaduvari.
కే స రి!
మా ఊర్లో రాలేదు. ఇక డి.వి.డి నే శరణ్యం. ఇంతకీ మీరు కథ ఏమిటో చెప్పలేదు, ఆ కాస్తా చెపితే అసలు చూడరనా, ఏమిటీ? కొన్ని శాఖలని స్పృశించి, కథని దాచేశారు.
re: అసహజత్వాలు: ప్రత్యేకించి "వనజ" గురించి కాదు కానీ, అసలు "తెలుగు సినిమా", "సహజత్వం" అన్న మాటలు ఒక వాక్యంలో ఇముడుతాయా!
@ padma I.. కావచ్చు. సహజం అంటే ఇక్కడ నిజ జీవితంలో జరిగేది అనే కాదు. పాత్రని నిర్వచించాక ఆ పాత్ర ప్రవర్తన ఆ నిర్వచనానికి తగినట్టు ఉండాలి అని. Self-cinsistent. రెండు ఉదాహరణలు చెబుతాను. నాకు జూ ఎంటీయార్ సింహాద్రి సినిమా అంటే చాలా ఇష్టం. ఆ సినిమాలో ఏదీ "సహజంగా" జరగదు. కానీ ప్రధాన పాత్రలకి దర్శకుడు సినిమా మొదట్లో ఇచ్చే నిర్వచనాల్ని మనం అంగీకరిస్తే దానికి తగినట్టే ఉంటాయి సినిమా అంతా. రెండోది ఈ మధ్య చూసిన యాత్రా. అందులో కూడా నానాపటేకర్ పాత్ర చేసే చాలా పనులు బుద్ధి ఉన్నవాడెవడూ చెయ్యడు. ఇక్కడ అది ఆ పాత్ర నిర్వచనమే కాక సినిమాలో ఒక నిర్దిష్టమైన ప్రతిపాదనకి ఉపయోగ పడుతుంది.
అన్నట్టు సినిమాలు నిజజీవితంలా సహజంగా ఉంటే ఇంకా సినిమా చూడ్డమెందుకూ, మన మొహాలు మనమే చూసుకోవచ్చు :-)
ఈ మాటలు నా మనోభావాన్ని చాలా చక్కగా తెలిపాయి. సినిమా చూసాకా, నాకు ఏదో తెలియని అసంతృప్తి మిగిలిపోయింది. అది ఏమిటి? ఎందుకు? అన్నదానికి నాకు ఇన్నాళ్లూ సమాధానం సరిగ్గా దొరకలేదు. మీ టపా చదివాక కొంత అర్థమయ్యింది . సినిమాలో కొని సన్నివేశాలు మరీ పచ్చిగా ఉన్నాయేమో అనిపించింది.... అయితే, మూసలో తీసే తెలుగు, భారతీయ సినిమాలు చూసీ చూసీ అలా అనిపిస్తోందేమో అని సరిపెట్టుకున్నాను. Western ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీసుండచ్చు అని ఇప్పుడు అర్థమయ్యింది....
అయితే, ఆ సినిమా తీయటం వెనుకు ఉన్న దీక్ష, పట్టుదల, no-compromise attitude కి జోహార్లు
హైదరబాదులో ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా చూసాను. ఆ ఆట కి దర్శకుడు, మమత(వనజ) ఇతర నటీనటులు, తెక్నీషియన్లు కూడా వచ్చారు.
ఇక పొతే నాకు నచ్చనివి సంభాషణలు. నటులు తడుముకుంటూ మాట్లాడినట్టు అనిపించింది. యాసలో consistancy లేదు. characterization సహజం గా లేదు.
emainaa thankyou very much
AKKARA
1. వ్యాఖ్యలు మాడరేషన్ ఉండటం వలన నేను చూసి ఆమోదిస్తే కానీ మళ్ళీ బ్లాగులో కనబడవు. అంచేత, మీరు ప్రచురించు బొత్తాం నొక్కినంత మాత్రాన వెంటనే వ్యాఖ్య కనబడకపోతే కంగారు పడనక్కర్లేదు. కనీసం ఒక రోజు (24 గంటలు) టైమివ్వండి, బ్లాగరి మీ వ్యాఖ్య చూసి ఆమోదించడానికి.
2. ఏదో ఒకటి రెండు వాక్యాలైథే ఇటువంటి తెంగ్లీషులో చదవచ్చు గానీ, ఇంత పొడుగు ఆవేశాన్ని ఈ మిశ్రమ భాషలో చదివి హరాయించుకోవడం చాలా కష్టం. దయచేసి ఇక మీదట తెలుగులో రాయండి. చాలా సులభం
3. అయినా, మీ ఆవేశాన్ని అర్ధం చేసుకుని మీరు రాసిందంతా చదివాను. కథ విషయంలో మీరు చాలా వరకూ కరక్టే. దీన్ని గురించి ఇంకా విపులంగా మాట్లాడాలి అంటే ఇది వేదిక కాదు. నాకు మెయిల్ చెయ్యండి, తీరిగ్గా మాట్లాడుకుందాము.
kottapali at gmail dot com
thankingyou once again,
AKKARA
AKKARA
http://lekhini.org కి వెళితే అక్కడ ఒక పలక ఉంటుంది. పలక పైభాగంలో మీరు ఆంగ్లంలో టైపుచేస్తే కింది పెట్టెలో తెలుగు లిపిలో వస్తుంది. అక్షరాలు ఎలా రాయాలి అని కూడా పక్కనే ఒక పట్టిక ఉంటుంది. ఆ తెలుగు లిపిని మీరు కాపీ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ పేస్టు చెయ్యొచ్చు.
ఇంకా వివరాలకి ఇది కూడా చూడండి. ఇక మీదట తెలుగులో రాస్తారని ఆశిస్తాను.