ఘోష "యాత్రా"

గౌతం ఘోష్ నిర్మించిన ఆధునిక దృశ్యకావ్యం యాత్రా

ఈ సినిమా చూసేసి అప్పుడే రెండు వారాలు కావస్తోంది. చూసిన రాత్రే ఈ సమీక్ష రాయడం మొదలు పెట్టాను. మనసులో ఎన్నో ఆలోచనలు సుడిగాలుల్లా. వాటిని ఒక రూపంలోకి కుదించడానికి చాలా కష్టమైంది. ఈ సినిమా ఎన్నో తలాలలో పని చేస్తుంది. (It works in many different planes). ఆలోచింపచేసే సినిమాలు చూసే ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ సినిమా తప్పక చూడాలి. సరదాగా టైంపాస్ గా చూసే సినిమా కాదు.

యాభయ్యవ పడిలో ఉన్న ముఖ్యపాత్రలతో ఉన్న ఒక తెలుగు సినిమా చెప్పండి? పోనీ కన్నడ, తమిళం, హిందీ - భారతీయ సినిమా ఏదైనా సరే? గబుక్కుని ఏవీ గుర్తుకి రావట్లేదు కదూ? ప్రపంచంలో ట్వెంటీ సంథింగ్‌లు తప్ప ఇంకెవరూ లేనట్టూ, నలభై యాభై వయస్కులు ఈ ట్వెంటీ సంథింగ్‌లకి అపార్ధం చేసుకునే తలిదండ్రులుగానో, అర్ధం కాకపోయినా వెన్నుతట్టి ప్రోత్సహించే అంకుల్ ఆంటీలుగానో తప్ప వాళ్ళకి వేరే అస్తిత్వం వ్యక్తిత్వం లేనట్టు ఉంటాయి మన సినిమా పాత్రలు. ఈ నేపథ్యంలో నడివయసు ముఖ్యపాత్రలతో గౌతం ఘోష్ నిర్మించిన యాత్రా కనీసం ఈ విషయంలో విభిన్నమైనది. ఇంకా చాలా విషయాల్లో కూడా.

ఒక రచనే కల్పన అయినప్పుడు అందులో నిజం ఏది, కల్పన ఏది? ఈ కథ ఇలా జరిగింది అని రచయిత చెబుతున్నాడు కదా .. రచయిత గొంతు నించి వస్తే నిజమూ, పాత్ర గొంతు నించి వస్తే కల్పనా అవుతుందా? మరి రచయిత కూడా కథలో పాత్ర అయినప్పుడు? నిజానికీ కల్పనకీ మధ్య ఉన్న అస్పష్టమైన విభజన రేఖ మరింత అస్తవ్యస్తమై చెరిగి పోతుంటే? స్వాప్నిక జగత్తులో ఊహించినది నేడు నిజమై నిజ జీవితంలోకి ప్రవహిస్తుంటే? నేను నేనేనా? లేక నా కథలోనే నేనొక పాత్రనా?

హిందీ నవలా రచయిత దశరథ్ జోగ్లేకర్ (నానా పటేకర్) కొత్త నవల "జనాజా" గొప్ప సంచలనం సృష్టించింది. ఒక పెద్ద స్టీలు కంపెనీ సౌజన్యంతో జాతీయ సాహితీ పురస్కారం అతనికిస్తున్నామని ప్రకటించారు. తన కుటుంబంతో ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళి అక్కడి దృశ్యాలు చూడ్డంతోనే కొత్త నవల "బాజార్" కి నాంది పలుకుతాడు. పురస్కారం అందుకోవడానికి ఒంటరిగా హైదరాబాదు నించి ఢిల్లీకి ప్రయాణమయ్యాడు. అతని ఆరోగ్యం గురించి భార్య స్మిత (దీప్తి నావల్) ఒకటే తల్లడిల్లుతోంది. రైల్లో కొత్త నవల రాసుకుందామని ప్రయత్నిస్తాడు కానీ సహ ప్రయాణికుడు మోహన్ అనే యువ చిత్ర దర్శకుడి సంభాషణతో జనాజా కథని వ్యాఖ్యానిస్తుంటాడు. ఆ వ్యాఖ్యానాలు అతన్నీ, మనల్నీ గతంలోకి తీసుకెళ్ళిపోతాయి.

ఆదిలాబాద్ జిల్లాలో ఒక దొర ఉంచుకున్న నర్తకి లాజవంతి (రేఖ) ఒక రాత్రి తన నాట్యంతో ఆ దొర అతిథుల్ని అలరిస్తుండగా అతిథులు అసభ్యంగా ప్రవర్తిస్తే, ఉంచుకున్నవాడే తనని వాళ్ళకి తారుస్తుంటే భరించలేక అక్కణ్ణించి పారిపోయింది. దొర మనుషులు ఆమెని చెరువు వొడ్డున పట్టుకుని దారుణంగా హింసించి అక్కడే వొదిలేసి వెళ్ళిపోయారు. తెల్లవారి బడికి వెళుతున్న పంతులు సతీశ్ శర్మ ఆమెని చూసి తన ఇంట్లో ఆశ్రయమిచ్చాడు. దొర మనుషులు తనకోసం మళ్ళీ వెతుకుతున్నారని తెలిసి, తన రక్షకుని కుటుంబానికి ఆపద రావటం ఇష్టం లేక, సతీశ్ సహాయంతో లాజవంతి హైదరాబాదు చేరుకుని పాత బస్తీలో సెటిలైంది. సతీశ్ అప్పుడప్పుడూ ఆమెని చూసి వస్తుంటాడు.

జనాజా నవల ఎలా ముగిసిందో మనకి (సినిమా ప్రేక్షకులకి) తెలీదు. రచయిత దశరథ్ మాత్రం ముగిసిన నవలని మరిచి పోయి కొత్త నవల మీద దృష్టి కేంద్రీకరించాలి అనుకుంటూ ఉంటాడు. కథ వింటున్న మోహన్ అంటాడు "మీ భ్రమే కానీ, ఒక సారి సృష్టించిన పాత్రలు అంత తొందరగా మిమ్మల్ని విడిచి పోవు". అంతేనా? రచయితకి ఆ మాత్రం స్వేఛ్ఛ లేదా? ఏమో! ఈ సినిమా చూస్తుండగా ఇలాంటి ప్రశ్నలు చాలానే తలెత్తుతాయి. చూడ్డం ఐపోయాక దేనికీ సరైన సమాధానం దొరక్కపోగా ఇంకొన్ని కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తాయి. అందుకే ఈ సినిమాని వొళ్ళు దగ్గరపెట్టుకుని శ్రద్ధగా చూడాలి.

కథనంలో చిత్రీకరణలో దర్శకుడు కొన్ని అమోఘమైన పద్ధతులు ఉపయోగించాడు. కొన్ని కొన్ని దృశ్యాలు సినిమా ఐపోయిన తరవాత కూడా మన కంటి రెప్పల్ని అంటి పెట్టుకుని పదే పదే కళ్ళముందు మెదుల్తుంటాయి. మూడు ముఖ్య పాత్రలకీ నటులు అతికినట్టు సరిపోయారు. నానా పాటేకర్ మరీను .. నాకు విపరీతంగా నచ్చేశాడు. కొన్ని కొన్ని డైలాగులు అతను చెప్పిన పద్ధతి సింప్లీ మార్వలస్. రేఖని గురించి చెప్పేదేముంది .. ఎనభైల్లో రేఖని ఉమ్రావ్ జాన్ గా చూసిన వాళ్ళకి ఆ జ్ఞాపకాలు రాక మానవు. ఆ చిత్రానికి సంగితం సమకూర్చిన ఖయ్యాం ఈ చిత్రానికి కూడా కొన్ని పాటలు స్వరపరిచారు. పాటలు విడిగా వింటే బాగున్నట్టు ఉన్నాయి, సినిమాలో సందర్భోచితంగానూ ఉన్నాయి, కానీ పాడిన గాయనీ మణుల గొంతులు రేఖకి నప్పలేదు. నాకున్న ఒక్క ముఖ్యమైన ఫిర్యాదు .. చివరి పదిహేను నిమిషాలు లేకుండా ఉంటే సినిమా ఇంకా బలంగా ఉండేదని. నా దృష్టిలో ఇది దర్శకుడి పైత్యం.

Comments

cbrao said…
చాలా బాగుంది రివ్యూ.
varalaanand said…
its a good review, you are nearer the film maker, pl see it once again
I hope u will see some more dimentions. any way congrats
Anand Varala